శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 12, 2020 , 03:38:39

బుజ్జగింపులు షురూ

బుజ్జగింపులు షురూ



సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఎన్నికలు అంటే రాజకీయ పార్టీలకు అన్ని రకాల టెన్షన్లు ఉంటాయి. ప్రజలు పార్టీల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది... ఎన్నిక ల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉంది... టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య ఎంత... అభ్యర్థుల ఎంపిక... ప్రజల్లో మంచి పేరు... డబ్బు ఖర్చు చేయగల ఆర్థిక స్థోమత ఉన్న వారిని పట్టుకోవడం... పైరవీలతో వచ్చే వారిని చూడడం... ఇలా అనేకం ఉంటాయి. తీరా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని అంతా సవ్యంగానే ఉందని నామినేషన్ల వరకు వస్తే రెబల్స్‌ బెడద ఉంటుంది. అదే నేడు మున్సిపల్‌ నామినేషన్లు... స్క్రూట్నీ పూర్తయిన తరువాత జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో ఉపసంహరణల కోసం బుజ్జగింపుల కార్యక్రమం కొనసాగుతోంది. ఇది టీఆర్‌ఎస్‌కు పెనుభారమే కాగా విపక్షాలకు సైతం కొంతమేర తప్పడం లేదు. అయితే అన్ని మున్సిపాలిటీల్లో నామినేషన్లు అధికంగా పడడానికి కారణం పార్టీ అవకాశం ఇస్తుందన్న ఆశతో కొంతమంది వేయగా నామినేషన్లు వేస్తే ఉపసంహరణల కోసం తృణమో ఫలమో వస్తుందని మరి కొంతమంది వేయడం పరిపాటిగా వస్తుంటుంది.

ఉపసంహరణల కోసం ఆయా మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, సూర్యాపేటలో మంత్రి సూచనల మేరకు రంగంలోకి దిగిన నాయకులు అందరినీ శుక్రవారం సాయంత్రం నుంచే ఒక్కో వార్డు చొప్పున పిలిపించి మాట్లాడుతూ ఉపసంహరించుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా వినని పక్షంలో నేరుగా మంత్రే రంగంలోకి దిగి కాస్త ఘాటుగానే మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ సారి పార్టీకి కట్టుబడి ఉండకపోతే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం ఖాయమని, ఒకవేళ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి గెలిచినా తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద ఉపసంహరణలకు ఈ నెల 14వరకు గడువు ఉండగా అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు వెళ్లడించనున్నారు. మరి ఏఏ పార్టీల్లో ఎవరెవరు ఉపసంహరించుకుంటారు... ఎవరెవరు రంగంలో ఉంటారో వేచి చూడాల్సి ఉంది.


logo