గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 10, 2020 , 10:37:11

కారు జోరు..

కారు జోరు..

నల్లగొండ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ : పురపాలక సంస్థలపై జెండా ఎగరేసేందుకు జరుగుతున్న ఎన్నికల పోరులో తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సాహంగా పని చేస్తోంది. 2018డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన నాటి నుంచి వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఇలా ప్రతి బ్యాలెట్ వార్‌లోనూ జిల్లాలో టీఆర్‌ఎస్ ఏకపక్ష విజయాలు నమోదు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం 162వార్డు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో సాధారణంగానే ఆ పార్టీ అభ్యర్థులు ఉత్సాహంగా పని చేస్తున్నారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూర్.. మున్సిపాలిటీలను తిరుగులేని మెజార్టీతో గెలుచుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పని చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ కంటే టీఆర్‌ఎస్ నుంచే ఇప్పటి వరకు అత్యధిక మంది అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించారంటే టీఆర్‌ఎస్ పని తీరును అర్థం చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలుకు ఈ రోజే ఆఖరు తేదీ కాగా.. ఇప్పటికీ కొన్ని పార్టీలు ఒక్కరంటే ఒక్క అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించకోవడం ఆయా పార్టీల పని తీరును తెలుపుతోంది. అభ్యర్థులను ప్రకటిచండంలోనే కాకుండా.. టీఆర్‌ఎస్ మిగిలిన విషయాల్లోనూ మిగిలిన అన్ని పార్టీల కంటే ముందుంది. నామినేషన్ల దాఖలుతోపాటు ప్రచారంను సైతం ఇప్పటికే మొదలు పెట్టింది. ఎమ్మెల్యేలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు.

చైర్మన్ అభ్యర్థుల ప్రకటనతో లాభం కంటే నష్టమేనా..
మరోవైపు నియోజకవర్గాలకే మొహం చాటుతున్న ముఖ్య నేతలు.. అభ్యర్థుల ఖరారు విషయంలోనూ దాటవేత ధోరణినే అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. విజయం సంగతి దేవుడెరుగు.. పరాజయం పాలైతే మళ్లీ పరువు పోతుందన్న భయంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు చాలా మంది ముందే చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే.. టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని కొంత వరకైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో హస్తం పార్టీ నేతలు వ్యూహాత్మకంగా చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడలో బత్తుల లకా్ష్మరెడ్డి, నల్లగొండలో బుర్రి శ్రీనివాస్‌రెడ్డి వంటి ముఖ్య నేతలను చైర్మన్ అభ్యర్థులుగా ఖరారు చేయడం వెనుక ఇదే సూత్రం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ సూత్రం కాంగ్రెస్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందనే వారూ లేకపోలేదు. ముందే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడంతో సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు రాజుకుంటాయని.. అవి పార్టీని ఓడించేందుకు కారణం అవుతాయని పలువురు గత అనుభవాలను వెల్లడిస్తున్నారు.


logo