ఇంటికి ముఖ్యమైంది రోడ్డు.. తప్పకుండా దాని ఎత్తుపల్లాల ప్రభావం మన నివాసం మీద ఉంటుంది. కొందరు దక్షిణం రోడ్డు ఎత్తుగా ఉంటే మంచిదని ఇంటి ఫ్లోరింగ్ తక్కువ పెట్టుకుంటారు. అలాగే ఫ్లోరింగ్‌ని ఇతరుల ఇంటి కన్నా ఎక్కువ చేసి కడుతుంటారు. అవన్నీ వదిలి ముందు మన రోడ్డు హెచ్చు తగ్గులు చూసుకొని దానికన్నా కనీసం మూడున్నర అడుగులు ఎత్తు ఉండేలా ఫ్లోరింగ్ వేయాలి. ఇంటి ఈశాన్యం వైపు ఉన్న రోడ్డు ఎత్తును ప్రధానంగా తీసుకొని తూర్పు ఇల్లు కట్టాలి. పడమర రోడ్డు అనేది.. స్థలం కన్నా ఎత్తు ఉంటే పడమర నుంచి వెళ్లే విధంగా కూడా సెల్లారు ప్లాను చేసుకోవచ్చు. అప్పుడు తప్పక ఇంటి ఫ్లోరింగ్ రోడ్డు కన్నా ఎత్తుగానే వస్తుంది. సెల్లారు పెట్టకున్నా పడమర రోడ్డు కన్నా ఇంటి ఫ్లోరింగ్ ఎత్తుగానే ఉండాలి. అలాగే దక్షిణం వైపు కూడా.. ‘ఇల్లు ఎప్పడు రోడ్లను మింగినట్టే ఉండాలి’. రోడ్డు మన ఇంటిని తలెత్తి చూసినట్టు కూడా ఉండకూడదు. అన్నీ జాగ్రత్తగా చూసుకొని కట్టుకోవాలి.
ఇంటికి వచ్చే మెట్లు ఓపెన్‌గానే ఉండాలి. సాధారణంగా ఇంటి మెట్లు ఆగ్నేయం లేదా వాయవ్యంలో అధికంగా కడుతారు. ఆయా దిశల్లో దానిని చుట్టూ అద్దాలతో మూయటం వల్ల ఇంటికి ఒక మూల.. అది నైరుతి, ఆగ్నేయం ఏదైనా సరే మూసుకు పోతుంది. తద్వారా దానికి వెనుక ఉన్న గది కిచెన్ కావచ్చు బెడ్రూమూ కావచ్చు. చీకటిగా మారిపోయి ఆ మూల నెచర్కి దూరంగా మారమవుతుంది. కొంతకాలం బాగానే అనిపించినా.. ఆ మూల మూత వల్ల కొన్ని కొన్ని సమస్యలు తలెత్తుగాయి.
కాబట్టి ‘ఎలివేషన్’ విషయంలో గాలి, వెలుతురును అడ్డుకొనే విధంగా కాక, ఓఎపెన్గా ఉండాలా చూస్తూ ఆ మూల చీకటి కాకుండా చూడాలి. ముఖ్యంగా మెట్ల భాగాన్ని నేల మీద నుంచి పై వరకూ అద్దాలతో మూయవద్దు. పై నుంచి పైకి ఎలవేషన్ చేసుకోవాలి.
ఇంట్లో భాగమైన అన్ని మూలలూ ఉండాల్సిందే. అప్పుడు ఏ దిక్కును కూడా ‘సహాయకుల గది’గా ఇవ్వలేం. చాలా అపార్టుమెంట్లలో ఈశాన్యం, నైరుతి మూలలు సర్వెంట్ రూమ్ అని కట్టి దానికి బయట నుంచి, లోపలినుంచి ద్వారాలు పెట్టి ఇస్తున్నారు. ఇది చాలా దోషం. తద్వారా ప్రధాన గృహం దెబ్బతింటుంది. ఫ్లాట్ నిర్మాణాల ప్లానులోనే యజమాని నివాసం జోలికి వెళ్లకుండా.. ‘మెట్ల వద్ద, లిఫ్టుల వద్ద’ కొంత స్థలం సర్వెంట్లకు కేటాయించాలి. ఒక అపార్ట్మెంట్ కట్టేటప్పుడు జిమ్రూమ్, ఆటస్థలం, పార్టీహాలు ఏర్పాటు చేసినట్టే స్టాఫ్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయాలి. అవి నివాసాలను బట్టి కట్టించాలి. మీ ప్లాట్‌లో ఏ స్థానాన్ని ఇచ్చినా అది మీ గృహ వ్యవస్థను దెబ్బతీస్తుంది. లేదా మీ ఇంట్లో సభ్యులుగా పెట్టుకోగలిగితే ఒక చిన్నగదిని ఇంట్లోనే ఏర్పాటు చేసి ఇవ్వండి నైరుతి, ఈశాన్యంలో కాకుండా.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678