e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home బతుకమ్మ మనసా…తెలుసా?

మనసా…తెలుసా?

మనిషి సాటి మనిషిని చూసిన దగ్గరనుంచీ అతనితో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. తనను తాను తెలుసుకోవాలనే ప్రయత్నం ప్రారంభించాడు. తన ప్రవర్తనకు, వ్యక్తిత్వానికి కారణాలు అన్వేషించాలనే తపన ఆరంభమైంది. కానీ మనసంటే ఏమిటో, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియని రోజుల్లో అంతా అయోమయమే! తాత్వికుల బోధనలు కొంత ఉపశమనం కలిగించినా.. క్రమంగా విజ్ఞానం కూడా బలపడింది. కందకం లాంటి ‘సెరబ్రోస్పైనల్‌ ఫ్లూయిడ్‌’లో తేలుతూ ఉండే మెదడే మన స్పందనలకు కీలకమని తెలుసుకొన్నారు. కోట్లాది న్యూరాన్లు, అనేకానేక హార్మోన్లు
మన ప్రవర్తనకు కారణమని గ్రహించారు. అక్కడితో ఆసక్తి ఆగిపోలేదు. వివిధ సందర్భాల్లో మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఆశ, నిరాశలు అతడి మీద ఎలా పనిచేస్తాయి? నైతికత విషయంలో ఎంతవరకు కట్టుబడి ఉంటాడు?

  • ఇలాంటి అనేక సందేహాలకు జవాబులు కనుగొనే ప్రయత్నం చేశారు. వాటి సమాహారమే ఈ కథనం..

‘కారులో షికారు వెళ్లే.. అని పాడుకుంటూ వర్షంలో ప్రయాణం చేస్తున్నారు. ఇంతలోనే బస్టాప్‌ దగ్గర ఓ ముసలావిడ, ఓ పడుచుపిల్ల, ఓ స్నేహితుడు కనిపించారు. అప్పుడు మీరేం చేస్తారు?’ తరహా ప్రశ్నలు వినే ఉంటాం. కొన్నిసార్లు సహేతుకంగా, విచక్షణకు మెరుగుపెట్టేలా… ఇంకొన్నిసార్లు తలతిక్కగా, విసిగించేలా అనిపించే మనోవిజ్ఞాన శాస్త్ర ప్రశ్నలు ఓ మంచి కాలక్షేపం కావచ్చు. కానీ, మానవ స్వభావాన్ని అంచనా వేయడానికి ఇలాంటి చిన్నపాటి ప్రశ్నలు సరిపోవు. నిజమైన పరిస్థితుల మధ్య ప్రయోగాలు జరగాలి. ఈ తరహా ప్రయోగాలకు ఆద్యుడిగా విల్హెమ్‌ ఉండ్‌ పేరు వినిపిస్తుంది. తనను తాను సైకాలజిస్టుగా పిలుచుకొన్న తొలి వ్యక్తి విల్హెమ్‌. ఈయన మనస్తత్వ శాస్త్రం ప్రకారం మనసు లోతులు తెలుసుకొనేందుకు తొలి ప్రయోగశాలను నిర్మించి.. జ్ఞాపకశక్తి, భావోద్వేగాల మీద అనేక పరిశోధనలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ మనస్తత్వశాస్త్రం చాలా ప్రయాణించింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర ప్రయోగాలు ఇవి..

- Advertisement -

ఆదిలోనే వివాదం
1904లో పావ్‌లోవ్‌ అనే శాస్త్రవేత్తకు నోబెల్‌ బహుమతి దక్కింది. కుక్కలమీద చేసిన ఓ అనూహ్యమైన ప్రయోగం నోబెల్‌ కిరీటాన్నే కాదు, అరుదైన కీర్తినీ సంపాదించి పెట్టింది. ఆహారాన్ని చూసినప్పుడే కాదు, రోజూ వాటిని అందించే వ్యక్తులను చూసినప్పుడు కూడా కుక్కల నోటిలో లాలాజలం ఊరడాన్ని గమనించాడు పావ్‌లోవ్‌. క్రమంగా ఆహారం అందించే సమయంలో గంట కొట్టడం మొదలుపెట్టాడు. కుక్కలు ఆ గంట శబ్దానికి ఎంతలా అలవాటు పడ్డాయంటే.. ఆహారం అందకపోయినా, కేవలం గంట శబ్దానికే వాటి నోట్లో లాలాజలం ఊరడం మొదలైంది. ‘క్లాసికల్‌ కండిషనింగ్‌’గా పిలిచే ఈ ప్రయోగం ఒకరి స్వభావాన్ని ఎంత నేర్పుగా, కచ్చితంగా మార్చవచ్చో నిరూపించింది.

పావ్‌లోవ్‌ ప్రయోగం విజయవంతమైన తర్వాత మనస్తత్వాల గురించి శోధించేందుకు, నేరుగా మనుషుల మీదే పరిశోధనలు మొదలయ్యాయి. వాటిలో లిటిల్‌ ఆల్బర్ట్‌ ప్రయోగం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. పావ్‌లోవ్‌ కుక్కలమీద చేసిన ప్రయోగాన్నే మనుషులమీదా చేయాలనుకున్నారు జాన్‌ వాట్సన్‌ అనే శాస్త్రవేత్త. ఇందుకోసం ఆల్బర్ట్‌ అనే 11 నెలల పిల్లవాడిని ఎంచుకొన్నారు. అతనికి ఓ ప్రమాదరహితమైన తెల్ల ఎలుకను చూపించారు. ఆల్బర్ట్‌ ఆ ఎలుకను ముట్టుకొనే ప్రయత్నం చేసినప్పుడల్లా, ఆ పసివాడి వెనుక భయానకమైన శబ్దాలు చేశారు. దాంతో ఆ ఎలుకపట్ల తెలియని భయం ఏర్పడిపోయింది. క్రమంగా తెల్ల ఎలుకను తలపించే కుందేలు, ఉన్ని టోపీ లాంటి వస్తువులను చూసినా కూడా ఆల్బర్ట్‌ ఏడుపు మొదలుపెట్టాడు. పావ్‌లోవ్‌ తన ప్రయోగాన్ని నిరూపించేందుకు, ఓ చిన్నపిల్లవాడి జీవితంతో ఆడుకున్నందుకు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రయోగం శాస్త్రీయబద్ధంగా జరగలేదనే ఆరోపణలూ ఉన్నాయి. అయితే ఇదే ప్రయోగాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగించి… మనసులో ఉన్న భయాలను తొలగించే ప్రయత్నం చేశారు మేరీ కవర్‌ జోన్స్‌ అనే శాస్త్రవేత్త. వేటికైతే మనం భయపడుతూ ఉంటామో, వాటిని నిదానంగా అలవాటు చేయడం ద్వారా (డైరెక్ట్‌ కండిషనింగ్‌) మనలో భయాలను పోగొట్టడమే ఈవిడ పద్ధతి. దీంతో ప్రవర్తనాపరమైన లోపాలను సరిచేసే ‘బిహేవియరల్‌ థెరపీ’ అనే చికిత్సకు ఆద్యురాలిగా మారారు మేరీ.

మందలో మానవత్వం
అది మార్చి 13, 1964. అమెరికాలోని న్యూయార్క్‌ నగరం. పట్టపగలు. కిట్టీ జెనోవీస్‌ అనే 28 ఏండ్ల అమ్మాయిని అపార్టుమెంటు బయటే చంపేశారు. కిట్టీ అరుపులను, హత్యను దాదాపు 38 మంది ప్రత్యక్షంగా చూశారు. కానీ ఎవరూ సాయానికి ముందుకు రాలేదు. మనసు ను కదిలించే ఈ సంఘటనను పరిశోధకులు ‘బైస్టాండర్‌ ఎఫెక్ట్‌’ అనే స్వభావానికి ప్రయోగశాలగా మార్చుకొన్నారు. గుంపులో ఉన్నప్పుడు ఏదైనా నేరం లేదా ప్రమాదం జరిగితే మనుషులు ఎందుకు ముందుకు రారో నిరూపించే ప్రయత్నం చేశారు. పదిమందీ చూస్తున్నప్పుడు, రక్షించాల్సిన బాధ్యత పలుచబడిపోతుందని తేల్చారు. అంతేకాదు! అవతలివారు ఏం చేస్తే అదే చేయవచ్చనే ఆలోచన బలపడుతుంది. పైగా అనూహ్యమైన సంఘటనతో అయోమయంలో పడిపోతాం. ఇన్ని కారణాలవల్ల ప్రమాదంలో ఉన్న మనిషిని కాపాడాలనే విచక్షణని కోల్పోతామని తేల్చారు. నలుగురూ వెనుకడుగు వేసే చోట, అదే గుంపును ప్రోత్సహించేలా అడుగు ముందుకు వేయాలని సూచించారు.

వ్యక్తిగా మనిషి ప్రభావానికీ, పదిమందిలో తన ప్రవర్తకూ చాలా తేడా ఉంటుందని నిరూపించేందుకు ఇలాంటి ప్రయోగాలు చాలానే జరిగాయి. వాటిలో కాస్త విచిత్రమైంది.. ‘స్మోక్‌ ఫిల్డ్‌ రూమ్‌’ ప్రయోగం. ఇందులో భాగంగా ఓ వ్యక్తిని ఒంటరిగా కూర్చోపెట్టి, ఆ గదిలోకి పొగను వదిలారు. సహజంగానే సదరు మనిషి, ఒకటి రెండు నిమిషాల్లోనే ఏదో కాలిపోతోందంటూ బయటికి వచ్చేశాడు. రెండోసారి, హాలునిండా మనుషులతోపాటు ఇద్దరు నటులను కూడా కూర్చో
బెట్టారు. ‘ఎంత పొగ వచ్చినా, ఏమీ జరగనట్టే ప్రవర్తించమని’ ఆ నటులను పురమాయించారు. ఆశ్చర్యం! ఇద్దరు నటులలో ఎలాంటి స్పందనా లేకపోవడం చూసి, మిగతావాళ్లుకూడా పొగను బలవంతంగా ఓర్చుకున్నారు. ఇరవై నిమిషాల గడువు పూర్తయ్యేదాకా కండ్లు మండుతున్నా, దగ్గు వస్తున్నా ఉగ్గబట్టుకున్నారే కానీ, నోరు తెరిచి ‘ఏదో తగులబడిపోతోంది’ అని చెప్పే సాహసం చేయలేదు. పదింట తొమ్మిది మంది తీరు ఇలాగే సాగింది. గుంపులో ఉన్నప్పుడు ఇతరుల స్పందనమీద ఎంతలా ఆధారపడిపోతామన్నది గుర్తుచేస్తుందీ ప్రయోగం. ఇంతకంటే చిత్రమైంది ‘యాష్‌ కన్‌ఫర్మిటీ ఎక్స్‌పెరిమెంట్‌’.

సొలొమన్‌ యాష్‌ అనే మనస్తత్వ నిపుణుడు 1951లో తలపెట్టిన ప్రయోగమే ఇది. ఇందులో భాగంగా ముందు ఓ గీతను చూపించారు. తర్వాత మూడు గీతలున్న కాగితంలో, ఆ లైన్‌ ఎక్కడ ఉందో చూపించమన్నారు. అతి సులువైన ఈ ప్రయోగంలో మూడోవంతు మంది తప్పు చెప్పారు. కారణం, వాళ్ల పక్కన ఉన్నవారు కావాలని తప్పుడు జవాబు ఇవ్వడమే! మన మనసులో నిజం పట్ల స్పష్టత ఉన్నా, నలుగురితోపాటే నడవాలనుకునే మంద మనస్తత్వాన్ని ఈ ప్రయోగం నిరూపించింది.
మనిషి సంఘజీవి. కాబట్టి పదిమందితో కలిసి నడవాలనుకోవడంలో తప్పులేదు. కానీ తన విచక్షణను సైతం పక్కన పెడితే, నిజాన్ని సైతం తోసిరాజంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అది మన జీవితంతో పాటు ఒకోసారి పక్కవారి ప్రాణాల్ని సైతం బలితీసుకొనే స్థాయికి దిగజారిపోవచ్చు.

అధికారానికి విచక్షణ ఉంటుందా!
ఎన్నో కష్టాలను దాటినవాడు, జీవితాన్ని దగ్గరగా చూసినవాడు… తీరా అధికారం మత్తు తలకెక్కితే క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. అతను ఓ ఉన్నతాధికారి కావచ్చు, దేశాధ్యక్షుడూ కావచ్చు… అధికారం చేతికి అందగానే అదోలా మారిపోవచ్చు. అందరూ అనుమానించే ఈ విషయాన్ని ప్రయోగాల ద్వారా నిరూపించే ప్రయత్నాలు జరిగాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘స్టాన్‌ఫర్డ్‌ ప్రిజన్‌ ఎక్స్‌పెరిమెంట్‌’. యాభై ఏండ్ల క్రితం ఫిలిప్‌ జింబార్డో అనే సైకాలజీ ప్రొఫెసర్‌ ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టారు. ఖైదీలకు, జైలు అధికారుల మధ్య ఉండే సంబంధాన్ని గమనించడమే వీరి ఉద్దేశం. ఇందుకోసం స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోకి కొందరు అభ్యర్థులను చేర్చారు. వారిలో కొందరిని ఖైదీలుగా, మరికొందరిని గార్డులుగా ఉండమని నియంత్రించారు. విచిత్రం! గార్డు అనే హోదా దక్కగానే, అది ప్రయోగం అన్న విషయం కూడా మర్చిపోయి క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు అభ్యర్థులు. అలాగే ఖైదీ అన్న పేరు తగిలించుకోగానే, ఎంతటి హింసను అయినా భరించేంత విధేయతలోకి జారిపోయారు మిగతా అభ్యర్థులు. ఈ పీడన ఏ స్థాయికి చేరుకుందంటే, ఆరు రోజులు గడిచేసరికి ఈ ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కానీ అధికారం, విధేయత… ఈ రెండూ మనిషి మీద ఎంత ప్రభావాన్ని చూపుతాయో స్పష్టంగా వెల్లడించింది.

స్టాన్‌ఫర్డ్‌ ప్రిజన్‌ కంటే తీవ్రమైంది మిల్‌గ్రామ్‌ ప్రయోగం. ‘మేం ఓ ప్రయోగాన్ని చేస్తున్నాం. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మీరు చేయాల్సిందల్లా… మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఏదైనా ప్రశ్నకు తప్పుడు జవాబు చెబితే, అతనికి కరెంట్‌ షాక్‌ ఇవ్వాలి’ అంటూ 1961లో కొందరు అభ్యర్థులను ఆహ్వానించారు మిల్‌గ్రామ్‌ అనే సైకాలజిస్ట్‌. ఇక్కడి నుంచీ అసలు ప్రయోగం మొదలైంది. అవతలి గదిలో జవాబులు చెప్పేవారు కావాలనే తప్పుడు సమాధానాలు ఇచ్చారు. దాంతో వారికి షాక్‌ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అభ్యర్థులు. తమ ఎదురుగా కనిపించే కరెంట్‌ మీటరును పెంచుతూ, ఒక్కో తప్పునకూ తీవ్రమైన షాక్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. అవతలి వ్యక్తి నొప్పితో విలవిల్లాడుతున్నట్టు కనిపించినా కనికరం చూపలేదు. విద్యుత్‌ మోతాదును పెంచుకొంటూ పోయారు. నిజానికి ఆ పరికరం ఎలాంటి విద్యుత్తునూ సరఫరా చేయలేదు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే, చాలామంది అభ్యర్థులు 450 వోల్టుల విద్యుత్‌ వరకూ షాక్‌ ఇచ్చారు. అంటే దాదాపుగా మనిషిని చంపేంత! ‘నిబంధనలను పాటిస్తున్నాం’ అనే నమ్మకంలో ఉన్నవారు, ఎదుటివ్యక్తి ప్రాణాలను తీయడం కూడా విద్యుక్తధర్మమే అనుకుంటారు. నాజీలు అంత క్రూరంగా ప్రవర్తించడానికి కారణం ఇదే అని వాదించారు మిల్‌గ్రామ్‌.

నాజీల క్రూరత్వాన్ని మిల్‌గ్రామ్‌కు దీటుగా తన విద్యార్థులకు వివరించాలని అనుకున్నాడు జోన్స్‌ అనే ఉపాధ్యాయుడు. ‘మనం సరదాగా ఓ ప్రయోగం చేద్దాం, దీని కోసం నేను కొన్ని నిబంధనలు చెబుతాను’ అంటూ అనూహ్యమైన క్రమశిక్షణ పద్ధతులు చెప్పాడు. ఆశ్చర్యంగా విద్యార్థులంతా కిమ్మనకుండా ఆయన ఆదేశాన్ని పాటించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే వీరవిధేయులుగా మారిపోయారు. క్రమంగా ఇతర తరగతులవారు కూడా, జోన్స్‌ను అనుసరించడం మొదలుపెట్టారు. అయిదు రోజుల్లోనే విద్యార్థులు ఎలాంటి హింసకైనా తెగించే వ్యక్తులుగా మారారు. ‘ఇదంతా ఓ ప్రయోగం’ అంటూ వారిని శాంతింపచేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అధికారం మనిషిని ఎంతలా లోబరుచుకుంటుందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలు ఏముంటాయి.. నిజజీవితంలో తప్ప!

అంచనాలు నిజమవుతాయి
‘యద్భావం తద్భవతి’ అని ఉపనిషత్‌ వాక్యం. ‘మన గురించి మనం ఏమనుకుంటామో.. అచ్చంగా అలానే మనం తయారవుతాం’ అని దీని అర్థం. వినడానికి సహేతుకంగానే ఉంది కానీ, మన మీద ఇతరుల అంచనాలు కూడా ప్రభావం చూపిస్తాయా? అంటే, ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రభావితం చేస్తాయని తేల్చాయి అనేక పరిశోధనలు.

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ హత్యానంతరం, అమెరికా మొత్తం జాతి వైషమ్యాలతో అట్టుడికిపోతున్న రోజులు. ఈ పరిస్థితుల మధ్య, తన పిల్లలకు వివక్షవల్ల కలిగే నష్టాలను వివరించాలని అనుకొన్నారు జేన్‌ ఎలియట్‌ అనే ఉపాధ్యాయురాలు. ఇందుకు తన మూడో తరగతి పిల్లలకు ఓ ప్రయోగం నేర్పించారు. దీనికోసం వాళ్లను ‘గోధుమరంగు కళ్లు’, ‘నీలిరంగు కళ్లు’ అంటూ రెండు బృందాలుగా విభజించారు. మొదటి రోజు నీలికళ్ల పిల్లలకు ‘మీరు తెలివైనవారు, గొప్పవాళ్లు’ అంటూ నూరిపోశారు. గోధుమరంగు పిల్లలను వేరుగా చూడటానికి, వాళ్ల మెడలో రుమాళ్లు కూడా చుట్టారు. ఈ దెబ్బతో నీలికళ్ల పిల్లలు నిజంగానే తెలివిగా వ్యవహరించారు. క్లాసులో త్వరత్వరగా జవాబులు చెప్పారు. పరీక్ష బాగా రాశారు. ఇందుకు విరుద్ధంగా గోధుమ రంగు పిల్లలు డీలాపడిపోయారు. క్లాసులో వెనుకబడిపోయారు. ఈ ప్రయోగం ఇక్కడితో ఆగలేదు. రెండో రోజు
‘గోధుమరంగు కళ్లు ఉన్న పిల్లలే సమర్థులు’ అంటూ ప్రయోగాన్ని తిరగేశారు జేన్‌. అందుకు అనుగుణంగా ఫలితాలు కూడా తారుమారు అయ్యాయి. ప్రోత్సాహం లేదా వివక్ష మన సామర్థ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయన్న విషయాన్ని ఓ పాఠంగా లోకానికి నేర్పారు ఈ క్లాస్‌ టీచర్‌.
1939లో వెండెల్‌ జాన్సన్‌ అనే అమెరికన్‌ సైకాలజిస్టు చేసిన ప్రయోగం ఇదే విషయాన్ని మరింత కఠినంగా నిరూపించింది.

ఈ ప్రయోగం కోసం జాన్సన్‌ 22 మంది అనాథలను ఎంచుకొన్నారు. వారిని ‘నత్తి ఉన్నవాళ్లు’, ‘నత్తి లేనివాళ్లు’ అంటూ రెండు బృందాలుగా విభజించారు. నిజానికి నత్తి ఉన్నవారి బృందంలో ఆ సమస్య లేని పిల్లలు కూడా కొందరున్నారు. కానీ నిరంతరం ఆ బృందంలో పిల్లలను ‘మీకు నత్తి ఉంది’, ‘మీరు జాగ్రత్తగా ఉండాలి’, ‘మీ మాటల్ని గమనించుకోవాలి’ లాంటి సూచనలు చేస్తూ ఉండటం వల్ల, కొన్నాళ్లకు ఆ సమస్య లేని పిల్లలకు కూడా నత్తి వచ్చేసింది. దురదృష్టవశాత్తు కొందరిలో అది జీవితకాలం పాటు ఉండిపోయింది. ఈ ప్రయోగం పిల్లలమీద చూపిన దుష్ఫలితాలను గర్హిస్తూ, దీన్నో ‘రాక్షస పరిశోధన’గా అభివర్ణించారు. ఈ ప్రయోగానికి వేదికగా ఉన్న ‘అయోవా విశ్వవిద్యాలయం’ అప్పట్లో మానవాళికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. రాబర్ట్‌ రాసెంతాల్‌ అనే శాస్త్రవేత్త నిరూపించిన ‘పిగ్మీలియన్‌ ఎఫెక్ట్‌’ అనే ప్రయోగాన్ని చెప్పుకొని ఈ అంచనాల ప్రభావానికి ముగింపు చెబుదాం. గ్రీస్‌లో పిగ్మేలియన్‌ అనే శిల్పి ఉండేవాడు. ఒకసారి తను చెక్కిన స్త్రీ శిల్పంతో తనే ప్రేమలో పడ్డాడు. దాన్నే వరిస్తానంటూ దేవతలను వేడుకున్నాడు. చివరికి వాళ్ల మనసును కరిగించి, శిల్పానికి ప్రాణం పోయించి పెండ్లాడాడు కూడా. తల్చుకొంటే శిలను సైతం అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించిన కథ పిగ్మేలియన్‌ది.

ఇదే సూత్రాన్ని అనుసరించారు రాసెంతాల్‌ అనే పరిశోధకుడు. క్యాలిఫోర్నియాలోని ఓ స్కూలుకు వెళ్లి, అక్కడి పిల్లలకు ఐక్యూ పరీక్షలు చేశారు. వాటిలో అసలు ఫలితాలను మరుగున పెట్టి, ఉపాధ్యాయులతో ‘ఫలానా పిల్లల ఐక్యూ చాలా ఎక్కువగా ఉంది. వాళ్లు త్వరలోనే అద్భుతాలు సృష్టిస్తారు’ అంటూ ఊదరగొట్టారు. విచిత్రంగా కొన్నాళ్లకు అసలైన ఐక్యూ మార్కులతో సంబంధం లేకుండా, రాసెంతాల్‌ ఎవరికైతే ఐక్యూ ఎక్కువ ఉంది అని అబద్ధం చెప్పాడో వారు నిజంగానే మంచి ఫలితాలు అందుకున్నారు. కారణం స్పష్టమే! ఐక్యూ ఎక్కువ ఉందని భావించిన పిల్లలపట్ల, ఉపాధ్యాయులు తెలియకుండానే ఎక్కువ శ్రద్ధ చూపారు, ప్రోత్సాహాలను అందించారు.

అదే చేస్తారు


పిల్లలమీద పరిసరాల ప్రభావం గురించి తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. విచక్షణ, పెంపకం ఎంత ముఖ్యమో, పరిసరాలు కూడా అంతే ప్రభావం చూపుతాయంటూ అనేక అధ్యయనాలు నిరూపించాయి. అలాంటి ఓ ప్రయోగమే ‘బోబో డాల్‌ ఎక్స్‌పెరిమెంట్‌’. దీనికోసం కొంతమంది పిల్లలను ఎంచుకొన్నారు. వారిలో ఓ బృందం ముందు నిలబడిన పెద్దలు ఓ బొమ్మను కొడుతూ కనిపించారు. మరో బృందం ముందు నిలబడినవారు ఆ బొమ్మతో సరదాగా ఆడుకొంటూ కనిపించారు.
ఆశ్చర్యంగా పెద్దలు తప్పుకొన్నప్పుడు, వారి వ్యవహారాన్నే అనుసరించారు పిల్లలు. మీడియా, సెల్‌ఫోన్లే పిల్లల ప్రపంచంగా మారిపోయిన ఈ రోజుల్లో ఈ ‘బోబోడాల్‌ ప్రయోగాన్ని’ కాస్త గుర్తుంచుకోవాల్సిందే!

సహనమే శ్రీరామరక్ష
ఓ పిల్లవాడు. అతని ముందు నోరూరించే చాక్లెట్‌. ఓ పావుగంటపాటు దాన్ని తినకుండా ఉంటే, ఇంకో చాక్లెట్‌ ఇస్తాననే ఒప్పందం. వినడానికి బాగానే ఉంది. పావుగంట ఓపికపడితే రెండో చాక్లెట్‌ కూడా దొరుకుతుంది కదా! కానీ అదేమంత తేలిక కాదని, ఈ ప్రయోగంలో పాల్గొన్న పిల్లలకు అర్థమైపోయింది. దాని వంక చూడకుండా కండ్లు మూసుకున్నా, బల్లమీద దరువేస్తూ మనసును మళ్లించే ప్రయత్నం చేసినా… కొంతమంది ఉగ్గబట్టలేకపోయారు. పావుగంటలోపే ఆ చాక్లెట్‌ను తినేశారు. ఇంకొంతమంది ఎలాగోలా ఆ పరీక్షాసమయాన్ని దాటి, బహుమతిని అందుకొన్నారు. అనూహ్యంగా సహనంతో ఉన్న పిల్లలు పెద్దయ్యాక చదువు, ఆరోగ్యం, కెరీర్‌ లాంటి విషయాల్లో మెరుగ్గా ఉన్నట్టు తేలింది. జీవితంలో సహనం ఎంత విలువైందో నిరూపించిందీ ప్రయోగం.

అందిన పండ్ల్లు పుల్లన
ఒక వస్తువు అర్హతకూ.. దానికి పెట్టే ఖర్చుకూ పొంతన ఉండనక్కర్లేదు. మనిషికి కూడా ఇదే వర్తిస్తుందేమో! ఓ విద్వాంసుడు భారీ ప్రచారం మధ్య, ఆడంబరమైన హాలులో ప్రదర్శన ఇస్తే వచ్చే స్పందన వేరు. అదే విద్వాంసుడు మెట్రో స్టేషన్‌లో అనామకుడిలా ప్రదర్శిస్తే లభించే ఆదరణ వేరు. ఈ విషయాన్ని నిరూపించడానికి పూనుకున్నాడు జాషువా బెల్‌ అనే వయొలిన్‌ విద్వాంసుడు. నిజానికి, తన కచేరీ టికెట్లను వందలకొద్దీ డాలర్లకు కొని మరీ దక్కించుకుంటారు. తను ఉపయోగించే వయోలినే ఎనిమిది కోట్లు విలువ చేస్తుంది. కానీ, జాషువా ఓరోజు వాషింగ్టన్‌లోని మెట్రో స్టేషన్‌లో ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టగానే దారినపోయేవారు ఆయన స్థాయిని గమనించలేకపోయారు. 45 నిమిషాల పాటు అద్భుతమైన బాణీలు పలికించినా చూసీచూడనట్టు వెళ్లిపోయారు. మైమరచిన పిల్లలు ఒక్క క్షణం అక్కడ ఆగగానే, తల్లిదండ్రులు వారిని ఈడ్చుకు వెళ్లిపోయారు. ఓ వ్యక్తి ప్రతిభతో పాటుగా, దాన్ని ప్రదర్శించే నేపథ్యం కూడా ముఖ్యమేనని ఈ ప్రయోగం నిరూపించింది. సాటి మనుషులు మన అర్హతతోపాటు ఆడంబరానికీ విలువనిస్తారని తేలిపోయింది.

ఆత్మవంచన అతి తేలిక
సరే! పదిమందిలో.. మొహమాటంతోనో, మెహర్బానీ కోసమో స్వేచ్ఛగా ప్రవర్తించలేకపోవచ్చు. కానీ కళ్లెదుట జరిగిన నిజాన్ని సైతం గుర్తించలేమా? అంటే, అవుననే అంటున్నాయి కొన్ని పరిశోధనలు. అవతలి వ్యక్తి జాగ్రత్తగా ప్రయోగించే మాటలు, చేతలతో అయోమయంలోకి జారిపోతామని హెచ్చరిస్తున్నాయి. అందుకు నాలుగు ప్రయోగాలే ఉదాహరణలు…

కార్‌ క్రాష్‌ ప్రయోగం: న్యాయవాదులు సాక్షులను మాటల గారడితో కంగారుపెట్టి, తమకు కావాల్సిన విషయాన్ని చెప్పించే సన్నివేశాలు చాలానే చూసి ఉంటాం. ఇదీ అలాంటి ప్రయోగమే! దీనికోసం కొందరికి రెండు కార్ల ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూపించారు. ‘ఫలానా కారు రెండో కారును ఢీకొనే సమయంలో ఎంత వేగంతో వెళ్తోంది?’ అన్నది ఊహించమన్నారు. అయితే ఇక్కడో మెలిక ఉంది ఈ ప్రశ్నలో ‘ఢీకొనే’ అనే మాటకు బదులు, తీవ్రతను సూచించే ఇతర మాటలని ఉపయోగించారు. ఉదా : తాకే, నాశనం చేసే, గుద్దుకునే, తగిలే లాంటి క్రియా పదాలతో అభ్యర్థి నిర్ణయాన్ని తెలియకుండానే ప్రభావితం చేశారన్నమాట. ఊహించినట్టుగానే ‘తాకే’ లాంటి పదాలు వాడినప్పుడు కారు చాలా నిదానంగా వెళ్తోందనీ, ‘నాశనం చేసే’ లాంటి పదాలు వాడినప్పుడు కారు అతి వేగంతో దూసుకుపోతోందనీ చెప్పారు అభ్యర్థులు. మనసుకు సంబంధించినంత వరకూ ఇదో మైలు రాయి లాంటి ప్రయోగమే.

ఇన్‌విజిబుల్‌ గొరిల్లా: ఓ ఆరుగురు కుర్రవాళ్లు గదిలో ఆడుకుంటున్న వీడియో. అందులో ముగ్గురు తెల్ల టీషర్టులు, మిగతా ముగ్గురు నల్ల టీషర్టులు వేసుకొన్నారు. వాళ్లు బాస్కెట్‌బాల్‌ ఆడుతున్నారు. ‘వాళ్లలో తెల్ల టీషర్టు వేసుకొన్నవారు ఎన్నిసార్లు బాస్కెట్‌ బాల్‌ను ఇచ్చిపుచ్చుకున్నారో గమనించి చెప్పండి’ అంటూ ఓ సులువైన పరీక్ష పెట్టారు. చాలామంది ఆ సంఖ్యను సరిగ్గానే అంచనా వేశారు. అయితే, ఈ బాస్కెట్‌బాల్‌ను చూసే క్రమంలో సగానికి సగం మంది వీడియో మధ్యలోకి దూసుకువచ్చి వెక్కిరించే గొరిల్లాని అసలు గమనించనేలేదు.

కాగ్నిటివ్‌ డిసొనెన్స్‌: 1959లో లియోన్‌ ఫెస్టింగర్‌ అనే శాస్త్రవేత్త చిత్రమైన ప్రయోగం చేశారు. కొంతమంది అభ్యర్థులకు కొన్ని బోరు కొట్టే పనులు అప్పగించారు. అయితే అవి తమకు కాలక్షేపం కలిగించాయంటూ అబద్ధం చెప్పమన్నారు. అలా అబద్ధం చెప్పినందుకు కొందరికి 1 డాలరు, మరికొందరికి 20 డాలర్లు ప్రతిఫలంగా ఇచ్చారు. విచిత్రంగా 1 డాలరు పొందినవారిలో మరింత అసంతృప్తిని వ్యక్తం చేయకపోగా, ఆ పనులు నిజంగానే కాలక్షేపాన్ని అందించాయని చెప్పారు. కారణం! కాలక్షేపం దక్కిందనే భ్రమతో, వారు తమ ఆర్థిక నష్టాన్ని మర్చిపోయే ప్రయత్నం చేశారు.

లాస్ట్‌ ఇన్‌ ద మాల్‌: ఓ తెలుగు సినిమాలో ప్రతినాయకుడిని, తను చిన్నప్పుడు తప్పిపోయిన కవల పిల్లవాడంటూ నమ్మించే ప్రయత్నం చేస్తారు. వినోదంగా అనిపించే ఇలాంటి భ్రమలూ సాధ్యమే అంటున్నారు సైకాలజిస్టులు. ఇందుకోసం ఓ కుర్రవాడికి తన చిన్నప్పుడు షాపింగ్‌ మాల్‌లో తప్పిపోయాననే భ్రమ కల్పించారు. ఆ కుర్రవాడు దాన్ని నమ్మడమే కాకుండా, క్రమంగా దాని చుట్టూ తనవైన జ్ఞాపకాలు అల్లుకున్నాడు. ఓ భ్రమను నిజం అనుకుంటే, క్రమంగా దాన్ని బలపరిచేందుకు నిజమైన అనుభవాలను కూడా జోడిస్తామని అంటున్నారు పరిశోధకులు.

ఇదీ విషయం! ఒక్కోసారి మన కళ్లు, చెవులు, జ్ఞాపకాలు.. అన్నీ మనల్ని మోసం చేయవచ్చు. మన అభిప్రాయాలను ప్రభావితం చేసేలా ఎవరైనా ప్రయత్నించవచ్చు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త నిదానించాలి. పరిస్థితులను ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకొని,
అనుభవాలను ఆకళింపు చేసుకొని అడుగు ముందుకేయాలి.

ఇవే కాదు, మనస్తత్వ శాస్త్రంలో మనుషులను చదివే ప్రయత్నం చేసిన ప్రయోగాలెన్నో కనిపిస్తాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కలిసి పరిష్కరించుకొంటేనే ఐకమత్యం మెరుగుపడుతుందని నిరూపించే ‘రాబర్స్‌ కేవ్‌ ప్రయోగం’, మనం ఏమనుకొంటున్నామో సమాజమూ అదే అనుకుంటుందన్న భ్రమను నిరూపించే ‘ఫాల్స్‌ కన్సెన్సస్‌ ప్రయోగం’, ఓ వ్యక్తిలో మనం ఒక స్పష్టమైన లక్షణాన్ని చూస్తే, మిగతా స్వభావాన్ని పట్టించుకోమని చెప్పే ‘హేలో ఎఫెక్ట్‌’, కష్టం నుంచి బయటపడటానికి విఫలయత్నాలు చేసిన తర్వాత ‘నా తలరాత ఇంతే’ అనుకొని నిర్లిప్తంగా ఉండిపోయే ‘లెర్న్‌డ్‌ హెల్ప్‌లెస్‌నెస్‌’… లాంటి ప్రయోగాలు చాలానే జరిగాయి. మనస్తత్వం పైకి కనిపించేంత పారదర్శకంగా ఉండదనీ మన అభిప్రాయాలు, ప్రవర్తనను ప్రభావితం చేసే అనూహ్యమైన కారణాలూ ఉంటాయనీ ఈ ఉదంతాలు హెచ్చరిస్తున్నాయి. అందుకని విచక్షణకు మెరుగుపెట్టకపోతే, వ్యక్తిత్వం గాలివాటంగా మారిపోయే ప్రమాదం ఉంది. సామాజిక మాధ్యమాల్లో మంచిచెడులు వెల్లువెత్తుతున్న ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana