వ్యవసాయానికి, మనిషి దానగుణానికి ముడిపెట్టి జాన పదులు చెప్పిన సామెత ఇది. ఏ పనైనా తెలుసుకొని చెయ్యాలని.. తెలిసీ తెలియక చేస్తే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించడానికి ఈ సామెత ఉపయోగిస్తారు. భూమి సారాన్నిబట్టి, అనుకూల వాతావరణాన్నిబట్టి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసుకుని, ఆ పంటే వేయాలి. అలా కాకుండా తొందరపడి వ్యవసాయం చేస్తే నష్టాల పాలవుతారు. అదేవిధంగా, యాచకుని పరిస్థితి తెలుసుకొని మాత్రమే దానం చెయ్యాలి. ఆ డబ్బుతో అతను తాగితందనాలాడి ఏ అకృత్యానికో పాల్పడితే. ఆ పాపఫలంలో మీకూ వాటా ఉంటుంది. అందుకే, డబ్బూదస్కం కన్నా కడుపు నింపే భోజనాన్ని ఇవ్వడమే ఉత్తమం. అతను యోగ్యుడైతే ఏదైనా పని ఇప్పించడం అంతకన్నా శ్రేయస్కరం.
కల్లబొల్లి మాటలు చెప్పేవారిని కడిగేసే సామెత ఇది. ఈ తరహా వ్యక్తులు అన్ని కాలాల్లోనూ కనిపిస్తుంటారు. ఎదుటివారిని మోసం చెయ్యడమే పనిగా తిరుగుతుంటారు. తమ ఎత్తుగడలో భాగంగా ప్రఖ్యాతుల పేర్లనూ వాడుకుంటారు. ఆ పేరు వినగానే నిజమా? అబద్ధమా? అనేది ఆలోచించకుండా గుడ్డిగా మోసపోతుంటారు కొందరు. కంపెనీల లోగోలను మార్ఫింగ్ చేసి, నకిలీ ఉత్పత్తులనూ విక్రయిస్తుంటారు. అలాంటి సమయాల్లో.. ఏది అసలు, ఏది నకిలీ అనేది తెలుసుకోకుండా మనమూ మోసపోతుంటాం.
ఈ పదబంధంలో ‘అల్లుపట్టడం’ గురించి నేటి తరానికి తెలియకపోవచ్చు. పూర్వం మన జానపదులు దొంగలను పట్టుకోవాలన్నా, తప్పిపోయిన పశువులను వెతకాలన్నా, చేతబడి, బాణామతి వంటివి కనిపెట్టడానికైనా అల్లుపట్టడంపైనే ఆధారపడేవారు. తెలంగాణలో అల్లుపట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఆరోగ్యం బాగాలేక పోయినా, అనుకున్న పని అవుతుందో, లేదో అన్న అనుమానం ఉన్నా, వెంటనే అల్లుపట్టడం ఆనవాయితీ. కొత్తపనికి అయితే చిన్నసర్వలో బియ్యంపోసి, దానిని రెండు చేతుల మధ్యపెట్టి ఒక్కో అనుమానం గురించి అడుగుతూ వెళ్తారు. తర్వాత రెండు నిర్ణయాలు తీసుకొని.. చిన్నపిల్లలను ఒక వేలు పట్టుకోమని అడుగుతారు. పిల్లలు ఏది పట్టుకుంటే అదే దైవ నిర్ణయమని భావిస్తారు. ఇక చేటలో బియ్యం పోసి, చేట అంచుకు పట్టుకొని ఒక్కో అనుమానం, ఒక్కొక్కరిపేరు చదువుకుంటూ ఊపుతారు. చేట ఆగిన సమయంలో వినిపించిన పేరులోనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆరోగ్యం బాగాలేకపోతే కొందరు అల్లుపట్టిస్తుంటారు. దిక్కులు చూపిస్తూ ‘దేవుని కోడె’ పేరుతో అల్లుపడుతారు. ఏ దిక్కునైతే ఆగుతుందో ఆ దిక్కున్న ఉన్న దేవుడికి మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పటికీ ‘ఎములాడ రాజన్న కోడె’, ‘అంజన్న కోడె’, ‘శ్రీశైలం మల్లన్న కోడె’ వంటి పదబంధాలు వాడుకలో ఉన్నాయి.
నిద్దెకల్లు = స్వచ్ఛమైన కల్లు (నువ్ తాగే ఉద్దెరకు కూడా.. నిద్దెకల్లు పోయాల్నా? పైసలిస్తేనే నిద్దెకల్లు.. లేకుంటే సద్దికల్లే!)
దీర్గం దీసుడు = ఏ విషయమైనా సాగదీసి చెప్పడం (ఏమ్రా.. ఎందుకట్ల దీర్గం దీసి చెప్తున్నవ్? సరిగా చెప్పలేవా ఏంది?)
నోరుకట్టుకోవడం = పథ్యం చెయ్యడం, మితంగా తినడం (నీకొచ్చింది మాచెడ్డ రోగమట. నోరు కట్టుకోకపోతే కష్టమట. అందుకే కొంచెం ఆచితూచి తినాలె.. ఎర్కయిందా బిడ్డా!)
తిర్గుడురోగం = తిరుగుబోతు (ఆ సత్తిగానికి తిర్గుడురోగం ఎక్కువ. పొద్దస్తమానం వాడి సోపతికి పోతవ్? తిన్నా తిరం పడ్తలేదా?)
ఏలుపెట్టుడు = కలుగజేసుకోవడం, జోక్యం చేసుకోవడం (ఎందుకురా ప్రతిదాంట్ల ఏలుపెట్టుడు. తిన్నగా ఉండలేవా?)
-డప్పు రవి