కొందరు ముచ్చట్లు భలేగా చెబుతారు. అవి ఎంతసేపు విన్నా.. అస్సలు విసుగే పుట్టదు. ఏదైనా ఒక అంశాన్ని చెప్పదలుచుకుంటే పుట్టు పూర్వోత్తరాల దగ్గరి నుంచి ప్రస్తుత పరిస్థితి వరకూ అంతా వివరంగా చెబుతుంటారు. అటువంటి వారిని ఉద్దేశించి చెప్పిన సామెత ‘ఇడంపెట్టిన కాణ్నుంచి ఇడిశిపెట్టేదాక చెప్పుడు’. ఈ తరహా వ్యక్తులు తెలిసిన విషయాన్ని వీనుల విందుగా, పసందుగా రక్తికట్టిస్తూ చెబుతారు. ఈ సామెత వివరణ ఏంటంటే.. పూలుపండ్లు దగ్గర్నుంచి విడాకుల వరకూ సాగిన జీవితాన్ని పూసగుచ్చినట్లు చెప్పడం. ఇడంబెట్టుడు అంటే వధువుకు పెండ్లికి ముందు పూలు పండ్లు మొదలైనవి పెట్టడం. మొత్తంగా నిశ్చితార్థం అన్నట్లు. ఇడిశిపెట్టుడు అంటే విడాకులు తీసుకొని విడిచిపెట్టడం. లగ్గం కుదిరిన దగ్గరి నుంచి పెండ్లి, కొత్త కాపురం, పిల్లలు, కొట్లాటలు, చివరికి విడాకులు.. ఈ కథనంతా చెప్పడం. ‘అగో.. మల్లయ్య మామైతే ఇడం పెట్టిన కాణ్నుంచి
ఇడిశిపెట్టేదాక చెబుతడు’ అంటారు.
ఉన్న సమస్యలతోనే సతమతమై ఇబ్బందులు పడుతున్న వేళ.. కొత్తగా పెను సమస్యలు వచ్చిపడితే ఆ బాధలు వర్ణనాతీతం. సరిగ్గా అటువంటి పరిస్థితులను ‘సొట్టకాళ్లోడు సుట్టమైరాంగ.. రొయ్యకాళ్లోడు రోలెక్కి తన్నిండు’ వంటి సామెతతో పోల్చుతారు. ఈ సామెత ప్రస్తుత పరిస్థితులకు సరిపోలుతుంది. అప్పటికే ఉన్న సమస్యలతో పోరాడుతూనే కరోనా మహమ్మారితో ప్రజలు ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తుంటే.. ఒమిక్రాన్ రూపంలో మరో ముప్పు వచ్చిపడింది. ఈ
సామెతను చాలా సందర్భాలకు అన్వయిస్తారు జానపదులు. వాన వచ్చేవేళ పెనుగాలి వీస్తే.. బీభత్సమే. నష్టం కూడా అపారం. ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ అనే సామెతా ఈ కోవలోకే వస్తుంది.
‘బాపూ.. నాచేతులు చూడు మస్తు మెరుస్తున్నయ్’, ‘రేయ్ శీనుగా కాకిబంగారం అద్దిన నా అరచేతులు ఎట్లున్నయ్రా..?’ అంటూ ఒకప్పుడు కాకిబంగారంతో మెరిసిన చేతులు ఇప్పుడు చిన్నబోతున్నాయి. మన తాత, ముత్తాతలు ఎక్కువగా వాడిన ఖనిజం ఏదైనా ఉందంటే అది కాకి బంగారమే. ఈ తరానికి చెందిన పెద్దలు మినహా.. పిల్లలకు అందుబాటులో లేకుండాపోయిన ఖనిజం ఇది. కాకి బంగారం అంటే కొన్ని ప్రాంతాల్లో రోల్డ్గోల్డ్గా పిలుస్తారు. కాకి బంగారం అంటే అభ్రకం అనే ఖనిజం. దీనినే మైకా అనీ అంటారు. చవుడు, ఒండ్రు మట్టిలో మెరుస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ‘మెరుపు కాయిదం’ అంటారు. దీనిని ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడుతారు. ఇది పొరలు పొరలుగా ఉంటుంది. దానిని నలిపి అరచేతులకు రుద్దుకుంటే తళుక్కున మెరిసేవి. ఆ మెరుపులను సోపతిగాళ్లకు చూపెట్టి మురిసిన సందర్భాలెన్నో. ఈ కాకి బంగారం ఏపీలోని నెల్లూరు జిల్లాలో
విపరీతంగా దొరుకుతుంది.
–డప్పు రవి