e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home బతుకమ్మ తెలంగాణ సినిమా కవులు యాసే..శ్వాసగా!

తెలంగాణ సినిమా కవులు యాసే..శ్వాసగా!

తెలంగాణ సినిమా కవులు యాసే..శ్వాసగా!

‘బందూక్‌’ సినిమాలో ‘ఇది చరిత్ర, ఇది పవిత్ర జనవిముక్తి సమరం’ అంటూ దోపిడిదారుల అరాచకపు చీకట్లకు ఎదురొడ్డి, వారి పాలిట సింహస్వప్నాలై నిలిచిన కొమ్రం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి మొదలైన త్యాగధనుల శౌర్య ప్రతాపాల గురించి ఈ పాటలో కలమెత్తి నినదించారు సిధారెడ్డి.

నందిని సిధారెడ్డి పాట తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. పల్లెప్రజల యాసే ఆయన శ్వాస. అందుకే ‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ.. నా తెలంగాణ’ అంటూ తెలంగాణ ఆర్తిని, ఆకాంక్షను, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిండు. తన పాటల్లో తెలంగాణ పౌరుషాన్ని పలికింపజేసి, తెలంగాణ ఇజాన్ని సగర్వంగా నిలబెట్టిండు.

కవిగా, పాటల రచయితగా, సాహిత్య పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా నందిని సిధారెడ్డి చిరపరిచితులు. మెదక్‌ జిల్లా బందారం గ్రామంలో నర్రా బాల సిధారెడ్డి, రత్నమాల దంపతులకు 1955లో జన్మించారు. బందారం, వెల్కటూరు, సిద్దిపేటలలో సిధారెడ్డి విద్యాభ్యాసం సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ‘ఆధునిక కవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై 1981 లో ఎం.ఫిల్‌ చేశారు. ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి, 1986లో డాక్టరేట్‌ పట్టా పొందారు. మెదక్‌, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. అనేక కథలు, కవితలు రాశారు. భూమి స్వప్నం, ప్రాణహిత, నీటి మనసు, నది పుట్టువడి, దివిటీ, అనిమేష మొదలైన సంకలనాలు వెలువరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా విశేష కృషి చేశారు. 

ఉద్యమానికి ఊతం..

సినీ గేయ రచయితగానూ నందిని సిధారెడ్డి ప్రతిభ విశిష్టమైంది. ఆయన రాసిన ‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ.. నా తెలంగాణ.. నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ.. నా తెలంగాణ’ పాట తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊతమిచ్చింది. పల్లెనుంచి పట్నం దాకా ప్రజలను ఉర్రూతలూపింది. బతుకమ్మ పండుగ, ఆటపాటలు, బోనాలు, యక్షగానాలు, ఒగ్గు కళారూపాలు.. ఇలా తెలంగాణ కళాస్వరూపం మొత్తాన్నీ ఈ ఒక్క పాటలోనే చూపించారు. 1997లో షేక్‌బాబా అనే గాయకుడి కోరిక మేరకు సిధారెడ్డి ఈ పాటను రాశారు. ఆ తర్వాత సినీ దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి 2010లో తన ‘వీర తెలంగాణ’ సినిమాలో దీనిని వాడుకున్నారు. బహుళ జనాదరణకు నోచుకున్న ఈ పాటకు 2010లో ‘ఉత్తమగీతం’గా నంది పురస్కారం లభించింది. ‘పారేటి నీల్లల్ల, పానాదులల్ల, పూసేటి పువ్వుల్ల, పునాసలల్ల కొంగు సాపిన నేల నా తెలంగాణ’ అనే వాక్యాలు తెలంగాణలోని ప్రతీ వ్యక్తి గుండెలో ఆత్మగౌరవమై నిలబడ్డాయి.

ప్రేమ.. సంస్కృతి

2011లో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమాలో నందిని సిధారెడ్డి ఓ ప్రణయగీతం కూడా రాశారు. ‘ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా.. ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా’ అనే పాటలో అద్భుతమైన ప్రేమ సౌందర్యం ధ్వనిస్తుంది. అటు ప్రేమ, ఇటు సంస్కృతి ఉట్టి పడేలా రాసిన ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అభ్యుదయం, జానపదం ప్రతిఫలించే గీతాలనే కాదు, ప్రణయ సౌందర్యం ప్రతిబింబించే పాటల్నికూడా సిధారెడ్డి అలవోకగా రాయగలరనడానికి ఈ పాటే నిదర్శనం.

పండుగలు.. పోరాటాలు..

‘బందూక్‌’ (2015) సినిమాలో రాసిన ‘ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం.. సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం’ అనే పాట తెలంగాణ కీర్తిని నలుదిక్కులా చాటింది. తెలంగాణ రైతాంగం తెగువను సదా స్మరించమంటుంది. ‘కొలిమి’ సినిమాలో ‘పుడమి పండుగ పువ్వుల జాతర మగువల పండుగ మమతల జాతర’ అంటూ బతుకమ్మ పండుగను వర్ణిస్తూ ఓ పాట రాశారు. బతుకమ్మను పుడమి పండుగగా, పూలజాతరగా వర్ణిస్తూ, మమతల చిహ్నంగానూ కీర్తించిన తీరు ఎంతో ప్రశంసనీయం. 

తెలంగాణ ఖ్యాతి..

‘నా భూమి’ సినిమాలో రాసిన ‘నా భూమి ననుగన్న నా భూమి గిరీ హార ఝరీ తార విరీ సిరీ పరివృతం’ అనే పాటలో తెలంగాణ నేల వైశిష్ట్యాన్ని, చారిత్రక వైభవాన్ని మహోన్నతంగా కీర్తించారు. వీరాధివీరులను, మహనీయులను తలచుకొంటూ, వీరతెలంగాణ ఖ్యాతిని సమున్నత భావ సముజ్వల గీతికగా వినిపించారు. ‘2 కంట్రీస్‌'(2017)లో ఆయన రాసిన విరహగీతం కూడా ప్రత్యేకమైంది. ‘చెలియా చెలియా విడిపోకే కలలా కడలే విడిచి మనలేనే అలలా’ అంటూ ప్రేయసీ ప్రియుల విరహవేదనను వివరించిన తీరు బాగుంది. ఇంతటి సాహిత్యసేవ చేసిన నందిని సిధారెడ్డిని 1987లో ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు, 1988లో దాశరథి అవార్డు, 2016లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లాంటి అనేక అవార్డులు, సన్మానాలు వరించాయి. తెలంగాణ జాతి గొప్పదనాన్ని తెలియజెప్పిన నందిని సిధారెడ్డి పాట తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక.

-తిరునగరి శరత్‌ చంద్ర

6309873682

Advertisement
తెలంగాణ సినిమా కవులు యాసే..శ్వాసగా!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement