e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home బతుకమ్మ ఆ వాచ్‌మన్‌ ఐఐఎమ్‌ ప్రొఫెసర్‌!

ఆ వాచ్‌మన్‌ ఐఐఎమ్‌ ప్రొఫెసర్‌!

మట్టిగోడలు. పైకప్పుగా టార్పాలిన్‌ కవర్‌. తలుపుల్లేవ్‌. ఇవేవో పడావుబడ్డ పాతగోడలు కావు. ఐదుగురు నివసించే ఇల్లు. ఆ ఇంటిని చూస్తే వాళ్ల పేదరికమేంటో తెలుస్తుంది. అలాంటిది, ఆ ఇంట్లో ఒకరు ఐఐఎం ప్రొఫెసర్‌ అయ్యారు!

ఆ వాచ్‌మన్‌ ఐఐఎమ్‌ ప్రొఫెసర్‌!

..ఆ ప్రొఫెసరే రంజిత్‌ రామచంద్రన్‌. కేరళలోని కసర్‌గడ్‌ జిల్లా పనాథూర్‌ గ్రామం అది. రంజిత్‌ పేదరికంలో పుట్టాడు. తండ్రి బట్టలు కుట్టేవాడు. తల్లి కూలీ పనికి వెళ్తుండేది. బట్టల గిరాకీ రోజూ ఉండేది కాదు. తల్లికి కూడా కూలీ రోజూ దొరికేది కాదు. రంజిత్‌కు తోడుగా ఇద్దరు తమ్ముండ్లు. తిండికే కష్టమున్నచోట ఇక చదువుకు ఆస్కారమెక్కడిది?

చదువుకోసం వాచ్‌మన్‌గా..
రంజిత్‌ రామచంద్రన్‌కు బాగా చదవాలని బలమైన కోరిక. తల్లిదండ్రులకూ చదివించాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. పాఠశాల విద్యవరకు కిందామీదా పడుతూ వచ్చారు. కానీ, ఆపై మాత్రం కష్టమైంది. ‘ఇక మనవల్ల కాదురా! చదువు బంద్‌ చెయ్‌’ అని చెప్పేశారు. దీంతో రంజిత్‌ ఇంట్లోనే ఉండాల్సివచ్చింది. ‘ఇలా ఇంట్లో ఉండే దానికన్నా ఏదైనా పని చేస్తూ చదువుకుంటే అయిపోతుంది కదా?’ అనుకున్నాడు. ఎంత వెతికినా పని దొరకలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఆఫీసులో పార్ట్‌టైమ్‌ కొలువు సంపాదించుకున్నాడు. నైట్‌ వాచ్‌మన్‌ ఉద్యోగం అది. నెలకు నాలుగు వేలు ఇచ్చేవారు.

పీహెచ్‌డీ సాధించాడు
బీఎస్‌ఎన్‌ఎల్‌ వాచ్‌మన్‌గా చేస్తూనే రంజిత్‌ రాజాపురంలో ఎకనామిక్స్‌తో బీఏ చేశాడు. తర్వాత కాసర్‌గోడ్‌లోని కేరళ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీజీ చదివాడు. ఆరేడేండ్లు వాచ్‌మన్‌ కొలువు వదిలి పెట్టలేదు. పి.జి. తర్వాత ఐఐటీ మద్రాస్‌నుంచి పీహెచ్‌డీ పొందాడు. రంజిత్‌ వాళ్లది మరాఠీ మాట్లాడే షెడ్యూల్‌ తెగ. ఇంగ్లిష్‌ విషయంలో బాగా ఇబ్బంది ఉండేది. ఆంగ్ల భాషపై పట్టు లేకపోవడంతో ఒకానొక దశలో పీహెచ్‌డీని వదిలేయాలని అనుకున్నాడు. కానీ, ‘ఇంత కష్ట పడింది వదిలేయడానికా?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకొన్నాడు. అదే సమయంలో గైడ్‌, ప్రొఫెసర్‌ అయిన సుభాష్‌కు తన మనసులోని మాట చెప్పాడు. అతనూ వారించడంతో పరిశోధన కొనసాగించాడు.

కల సాకారమైన వేళ..
గతేడాది పీహెచ్‌డీ పూర్తి చేశాడు రంజిత్‌. తర్వాత బెంగళూరు క్రైస్ట్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశాడు. అప్పుడే ఐఐఎంలో ప్రొఫెసర్‌ కావాలని కల గన్నాడు. ఈ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు రేయింబవళ్లు కష్ట పడ్డాడు. వాచ్‌మన్‌గా పని చేసిన అనుభవంతో పేదరికంపై యుద్ధం చేశాడు. ఇటీవల జరిగిన నియామకాల్లో రాంచీ ఐఐఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అసలు చదవడానికే అవకాశం లేని కుటుంబంలో పుట్టి, చాలాసార్లు చదువు వదిలేద్దామనుకున్న రంజిత్‌, ఏకంగా ఐఐఎం ప్రొఫెసర్‌ అయ్యాడంటే తొలుత ఎవరూ నమ్మలేదు. ఇంట్లోవాళ్లే ఆశ్చర్యపోయారు.

ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో వైరల్‌
లక్ష్యసాధనలో తాను ఎదుర్కొన్న కష్టాలను రంజిత్‌ ఫేస్‌బుక్‌ వేదికగా పంచుకున్నాడు. తన ఇంటి ఫొటోను పోస్ట్‌ చేసి ‘ప్రతి ఒక్కరూ కలలు కనండి. వాటిని సాకారం చేసుకునేందుకు పోరాడండి!’ అనే క్యాప్షన్‌ జోడించాడు. ‘ఒక ఐఐఎం ప్రొఫెసర్‌ ఇక్కడ జన్మించాడు’.. తనపేరు ట్యాగ్‌ చేశాడు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రంజిత్‌ సక్సెస్‌ స్టోరీని తెలుసుకొని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ‘టాలెంట్‌కు పేదరికం అడ్డు రాదని రంజిత్‌ నిరూపించాడు’ అని కొందరు, ‘వాచ్‌మన్‌ ఉద్యోగం చేస్తూ ప్రొఫెసర్‌ అయ్యాడు’ అని మరి కొందరు రంజిత్‌ గొప్పదనం గురించి పదిమందికి చాటిచెప్పారు.

ఎందరికో ఆదర్శం
ఈ పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో వేలకొద్దీ లైక్స్‌, షేర్లు కామెంట్లు వచ్చాయి. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ కూడా అభినందనలు తెలిపారు. ‘రంజిత్‌ నేటి యువతకు ఆదర్శప్రాయుడు. ఒకానొక సమయంలో ఓడిపోయానని భావించి కూడా జీవితాన్ని మలుపు తిప్పి విజయం సాధించి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలిచాడు. కష్టాలకు ఎదురీది విజయం సాధించిన కేఆర్‌ నారాయణన్‌ వంటి గొప్ప వ్యక్తులు రంజిత్‌ వంటి వాళ్లరూపంలో మన ముందు ఉన్నారు’ అని థామస్‌ చేసిన పోస్ట్‌కూడా వైరల్‌ అయ్యింది. ఇలాంటి విజేతల కథలే కావాలిప్పుడు.

ఇంత స్పందనా?

  • రంజిత్‌ రామచంద్రన్‌
    ఐఐఎం రాంచీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరాను. నా గతం గురించి పెట్టిన పోస్ట్‌కు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు. నా జీవితం కొందరికైనా స్ఫూర్తిగా నిలుస్తుందనే పోస్ట్‌ చేశాను. ప్రతి ఒక్కరూ ఓ లక్ష్యాన్ని పెట్టుకొని తమ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి. ఆ ఘన విజయం తర్వాత, ఇతరులూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.
Advertisement
ఆ వాచ్‌మన్‌ ఐఐఎమ్‌ ప్రొఫెసర్‌!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement