eదిగో గ్రంథాలయం


Sun,April 19, 2015 03:14 AM

E-బుక్స్
ఇప్పుడు బయట ఉన్నది కాదు, ఇంటర్నెట్లో ఉన్నదే లోకం. సమాజం అంటే అంతర్జాలమే. సోషల్ నెట్‌వర్క్ ఇప్పుడు మనుషుల్ని సంఘటితం చేస్తున్న తీరు ఒక విప్లవం. అందులో పుస్తకం ఇప్పుడు రెపరెపలాడటం లేదు. నిశ్శబ్దంగా డౌన్‌లోడ్ అయిపోయి స్క్రీన్‌పై తెరుచుకుంటుంది. మౌస్‌తోనో, మన వేలి టచ్‌తోనో కమ్మలు తిరిగి పోతున్నయ్. నిజం. ఇది ఇంటర్నెట్ యుగం. ఇప్పుడన్నీ అంతర్జాల సంబంధ పుస్తకాలే. స్టడీ మెటీరియల్ కానీ, సబ్జెక్ట్ సంబంధ పుస్తకాలు కానీ, సాహిత్యం గానీ-చివరికీ న్యూస్‌పేపర్లు కానీ- ఏవైనా ఇప్పుడు ఇంటర్నెట్‌లో చదివేయవచ్చు. రాత బుక్స్, ప్రింట్ బుక్స్ దశ మారిపోయిన e -తరంలో ఉన్నాం. అందుకే ఈ వారం కవర్‌స్టోరీ, e-బుక్స్ పైనే!E-Books

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నంత వేగంగా మనిషి అఫ్‌డేట్ అవుతుండాలి. ఒకప్పుడు చేతి రాత ప్రతులే ఉండేవి. ఫ్రింట్ బుక్స్ వచ్చాయి. తర్వాత్తర్వాత సీడీలలో నిక్షిప్తం చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పూర్వకాలంలోనే తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులు, ఫ్రింట్ ప్రతులు సరిగా నిల్వచేయకపోవడం మూలంగా అనేక చారిత్రిక ఆధారాలు కనుమరుగయ్యాయి. దీంతో ఇప్పుడున్న తరానికి ఎన్నో వాస్తవాలు తెలియని చరిత్రగానే మిగిలిపోయాయి. ఈ పొరపాటు వచ్చే తరానికి రాకుండా ఉండాలంటే నేటి చరిత్ర నూరేళ్లపాటు సజీవంగా ఉండాలి. అందుకోసం కూడా నేటి చరిత్రను డిజిటలైజ్ చేసే ప్రక్రియ మొదలైంది. కారణాలెన్నో. కానీ, అనివార్యమైన ప్రస్థానంలో e-బుక్స్ ఇప్పటి ప్రాధాన్యం.

E-Books4

e-బుక్స్ ఒక్కసారిగా ఉప్పుడున్న రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి దీన్ని గూగుల్ వంటి సంస్థలేం కనిపెట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నట్లు కాకపోయినా ఎంతో కొంత అందుబాటులోకి తెచ్చింది మాత్రం సాంకేతిక నిపుణులే. వారికి అవసరమైన సాంకేతిక విశేషాలను, వివరాలనూ ఒక పుస్తక రూపంలోకి మార్చి వాటిని నిక్షిప్తం చేసుకుని, ఇతరులతో పంచుకునేందుకు వీటిని ఉపయోగించారు. ఒక రకంగా ఇవి టెక్నికల్ మాన్యువల్స్. అవే ఇప్పుడు e- బుక్‌గా వాడుకలో ఉన్నాయి. ప్రయాణాల్లో, ఖాళీ సమయాల్లో e-బుక్స్‌ను చదవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని చదువుకోవడానికి లేదా చూడటానికి వాడే డేటా ఫార్మటే పిడిఎఫ్. పిడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అని అర్థం. పిడిఎఫ్ ఫైల్స్‌ను విండోస్, లినక్స్, మాక్ ఇలా ఎలాటి ఆపరేటింగ్ సిస్టం మీదనైనా చదువుకోవచ్చు. అడోబ్ అక్రోబాట్ రీడర్ ఉంటే చాలు. పుస్తకం ఓపెన్ అవుతుంది. అంతే మరి.

E-Books5

తొలి e-బుక్ 1971లో వచ్చింది. దీనికి ఇల్లినాయిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన మైఖేల్ హార్ట్ ఆద్యునిగా చెప్పుకుంటారు. ప్రాజెక్టు ఆఫ్ గూటెన్‌బర్గ్ అనే ప్రాజెక్టు కింద 2000 క్లాసిక్స్‌ను తొలిసారి ఆన్‌లైన్‌లో తెచ్చే కార్యక్రమం ఆరంభమైంది. 1990లో వాయేజర్ కో అనే సంస్థ కేవలం పర్సనల్ కంప్యూటర్‌పై చదువుకునేలా e-బుక్స్‌ను తెచ్చింది. అయితే, వీటిని సీడీలలో మాత్రమే నిల్వచేసుకునే వీలుండేది. ఇలా వచ్చిన వాటిలో జురాసిక్ పార్క్, ఆలీస్ ఇన్ వండర్ లాండ్ బాగా పాపులరయ్యాయి. కానీ, సీడీల పబ్లిషింగ్ ఎక్కువ కాలం నిలువలేకపోయింది. దీంతో e-బుక్స్ కోసం ప్రత్యేకంగా రీడర్స్‌ను రూపొందించాల్సి వచ్చింది. ఫామ్ ఓఎస్ వాడి కొన్ని రీడర్స్‌ను సృష్టించారు కూడా. ఈ దశలో వచ్చిందే ఎంపి 3 ఫార్మట్.

E-Books3

దీంతో మ్యూజిక్ ఎడతెరపి లేకుండా ప్రపంచాన్ని చుట్టేసింది. అప్పటికే కనీసం 100 మిలియన్ల పైగా పుస్తకాలను పిడిఎఫ్‌ల రూపంలోకి మార్చి e-బుక్స్‌లో ప్రవేశపెట్టారు. ఒకవైపు e-బుక్స్ విప్లవం కొనసాగుతుండగానే మైక్రోసాఫ్ట్ సంస్థ ఓఇబి- అంటే ఓపెన్ ఈ-బుక్ స్టాండర్డ్ అనే దాన్ని తీసుకువచ్చింది. కానీ అది ఎక్కువకాలం నిలువలేదు. ఆ తర్వాత వచ్చిన హెచ్‌టిఎంఎల్, ఓఇబిలకన్నా పిడిఎఫ్ కాలానికి తట్టుకుని నిలిచింది. తొంభైవ దశకంలో ఇంటర్నెట్ సౌకర్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో ఈ బుక్స్ సౌకర్యం కూడా ప్రపంచవ్యాప్తమైంది. అమెజాన్, బార్న్స్ అండ్ నోబుల్, ఈబే, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ బుక్‌సెల్లర్స్ కూడా ఈ బుక్స్ మార్కెట్ రంగంలోకి ప్రవేశించారు.

E-Books6

కిండిల్ ప్రవేశం: పాఠకుల అభిరుచి, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని e-బుక్స్‌లో మరిన్ని ఫీచర్లను జోడిస్తున్నారు. ప్రస్తుతం వీటిలో అత్యంత ఆదరణ పొందింది మాత్రం అమెజాన్ వారి కిండిల్. కిండిల్ అంటే ప్రేరణ కల్పించడం అని అర్థం. ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ అమెజాన్ డాట్‌కాంరూపొందించిన వైర్‌లెస్ డిజిటల్ e-బుక్ రీడర్ ఇది. ఇవి మామూలు పుస్తకాల సైజ్‌లోనే లభ్యమవుతున్నాయి. కంప్యూటర్ అవసరం లేకుండానే డిజిటల్ పుస్తకాలు, మ్యాగజైన్లను ఇందులోకి డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఇందులోకి పుస్తకాలను ఎక్కించడం, చదువుకోవడం సులువుగా వుంటుంది. ఇదో మామూలు పుస్తకం అనే భావన కల్పించేందుకు తగినట్లుగా, పలక మాదిరి దీన్ని రూపకల్పన చేశారు.

ముఖ్యంగా అక్షరాలను కావాల్సిన సైజులో పెంచుకోవచ్చు. ముఖ్యమైన వాక్యాలను ఒకచోట కాపీ చేసి పెట్టుకోవచ్చు. అంగ్ల పదాలకు అర్థాలను తెలుసుకొనేందుకు డిక్షనరీ సౌలభ్యం వుంది. దీనిలో మూడున్నరవేల పుస్తకాల వరకు పడతాయని అమెజాన్ తన సైట్‌లో పేర్కొంది. నచ్చిన పుస్తకాలను చదువుకొంటూ. పాటలను వినే సౌలభ్యం కూడా వుంది. దీన్ని ఉపయోగించి పత్రికలు, బ్లాగ్‌లను సైతం చదువుకోవచ్చు. కిండిల్‌తో పాటు సోనీరీడర్, కూల్-ఇఆర్, ఎలోనెక్స్ ఇ-రీడర్, అడోబ్ ఈ-బుక్ రీడర్, మైక్రోసాఫ్ట్ రీడర్, యాపిల్ ఐప్యాడ్‌లతో పాటు దేశీయంగా తయారైనఫై వంటి రీడర్‌లు కూడా వున్నాయి. వీటి ధర కూడా సుమారు ఏడెనిమిది వేలుంటుంది!

గూగుల్ సంస్థ కొంత ఆలస్యంగానే e-బుక్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకోవచ్చు. అవికూడా గత ఏడాదే అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ ద్వారా 30 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు పుస్తకాల కోసం దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాఫీరైట్ వంటి సమస్యలు ఉత్పన్నమవ్వవు. ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే అరచేతిలోనే సెల్‌ద్వారా గూగుల్ ఈ బుక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలుగులో e- బుక్స్: తెలుగులో ఈ బుక్స్ దశాబ్దంన్నర నుంచి ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. e-బుక్‌గా వచ్చిన తొలి బుక్ ఏది అని చెప్పలేంగానీ కినిగె అనే సంస్థ 2010 నుంచి e-బుక్స్ సౌకర్యాన్ని కల్పించింది. kinige.com ద్వారా ఆన్‌లైన్ ద్వారా e-బుక్స్‌ను విక్రయించడం, అద్దెకివ్వడం వంటి ప్రక్రియను కినిగె సంస్థే ప్రారంభించింది. తెలుగు వారికి e-బుక్‌ని వాణిజ్య పరంగా పరిచయం చేసిన క్రెడిట్ కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కే చెందుతుంది. ఈ సంస్థను చావ కిరణ్ ప్రారంభించారు.

అనిల్ అట్లూరి చాలాకాలం సంపాదకులుగా వ్యవహరించారు. దీనిద్వారా తెలుగులో ముద్రితమైన అనేక పుస్తకాలను ఆన్‌లైన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చు. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలు, లేదా వ్యక్తిగతమైన పుస్తకాలను కూడా ఈ సంస్థ విక్రయిస్తోంది. e-బుక్స్‌ని కొనుగోలు చేయవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు. ఇక్కడ కాపీరైట్స్ ఇబ్బందులు లేకుండా పుస్తకాలు కొనుక్కోవచ్చు. అయితే ఒకరు కొని పదిమందికి కాపీ ఇచ్చేసుకోవడానికి వీలు లేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ పుస్తకాలు చదివే వీలు కల్పించారు. అట్లే, ఈ సాఫ్ట్‌వేర్ కాపీ చేసుకోవడానికి వీలు కల్పించదన్నమాట.

ఒక పుస్తకం అద్దెకు తీసుకుంటే అప్పటి వరకే అవకాశం ఉంటుంది. నెల రోజుల తరువాత అది మన కంప్యూటర్ నుండి చదవడానికి ఇక వీలవకుండా చేయగల సాంకేతికత ఇందులో ఇమిడి ఉంది. తెలుగులో e-బుక్స్ వినియోగం సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉన్నవారందరిలోను ఉన్నది. అంతర్జాలంతో పరిచయం, డెస్క్‌టాప్ కంప్యూటర్, ఫాబ్‌లెట్, టాబ్‌లెట్, స్మార్ట్‌ఫోన్‌లతో పనిచేసుకోవడం బ్రాడ్‌బాండ్తో కూడ చేసుకోగలిగిన వారు e-బుక్స్‌నే ఆకాంక్షిస్తున్నారు. ఆయా వర్గాలలో వినియోగం, అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి కూడా! నివేదికల ప్రకారం సుమారుగా ప్రతి సంవత్సరం 5 నుంచి 10 శాతం దాకా e-బుక్స్ అమ్మకాలలో అభివృద్ధి కనపడుతోంది.

ప్రచురణ సంస్థలూ దూరం: ఆంగ్లంలో ప్రచురణ సంస్థలే e-బుక్స్‌ను అందుబాటులోకి తెస్తుండగా తెలుగులో మాత్రం అందుకు భిన్నం. తెలుగు పుస్తకాలను ప్రచురించే పలు సంస్థలు నేరుగా పుస్తకాల విక్రయానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని e- బుక్స్‌కు ఇవ్వడం లేదు. దీనికి ప్రత్యేక కారణాలు ఏం లేక పోయినా పుస్తకాలు నేరుగా చదివే పాఠకులు ఉండగా e- బుక్ అవసరం ఏమున్నదన్నది వారి అభిప్రాయం. నేషనల్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, తెలుగు అకాడమీలతో పాటు వాసిరెడ్డి పబ్లికేషన్స్ వంటి సంస్థలు కూడా సొంతంగా e- బుక్స్‌ను విక్రయించడంలేదు. అయితే, కొన్ని రకాల పుస్తకాలను మాత్రం kinige.com ద్వారా విక్రయిస్తున్నారు. విదేశాల్లో ఉన్న తమ ఎన్‌ఆర్‌ఐ పాఠకుల కోసం మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే సొంతంగా e- బుక్ సౌకర్యాన్ని కల్పించే ఆలోచన కూడా ఆయా సంస్థలు చేయడం లేదు.

ఇవే కాదు విద్యాసంబంధ ముద్రాణ సంస్థలు కూడా e- బుక్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఫీజీ వంటి తరగతులకు అవసరమైన సబ్జెక్ట్స్ పుస్తకాలను ముద్రించే తెలుగు అకాడమీ కూడా ఈ బుక్స్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో తప్పనిసరిగా టెస్ట్‌బుక్స్ కొని చదువుకోవలసిందే. భవిష్యత్తులో అత్యధికంగా e-బుక్స్‌రూపం సంతరించుకునేవి పాఠ్యపుస్తకాలు. ఆ తరువాత ఫిక్షన్ మనం అనుకునే సాహిత్యం. దానితో పాటు నాన్-ఫిక్షన్. నివేదికలు, విజ్ఞాన శాస్ర్తానికి సంబంధించినవి.

e-బుక్ తర్వాతే ఫ్రింట్: ఒకప్పుడు ఒక బుక్ ప్రింట్ చేయాలంటే ప్రచురణ సంస్థల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. టైప్ చేసుకునే దగ్గరి నుంచి ఫ్రూఫ్ రీడింగ్, డిజైనింగ్ అన్ని కూడా ఒకరే చేయగలుగుతున్నారు. అంతేకాక స్వంతంగా ఫ్రింటింగ్ కూడా చేసుకుంటున్నారు. అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి బుక్ ప్రింట్ చేసుకోవడానికి ఆర్థిక వనరులు లేనివారు కూడా ఆన్‌లైన్‌లో తన బుక్‌ను e- బుక్‌గా పెట్టి విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులతో ఫ్రింట్ చేసుకుంటున్నారు. ఒక రకంగా ఇది మంచిదే అయింది. ఒకప్పటి ప్రచురణ సంస్థల ఆధిక్యత ఇప్పుడు e-బుక్స్ మీద లేని స్థితి ఏర్పడింది. ఇందుకు ప్రధమ కారణం సాంకేతిక విజ్ఞానం. రచయిత తను రాసింది తనే ప్రచురించుకోవడం వల్ల స్వకీయ ప్రచురణలు (ఇండి పబ్లిషింగ్) ఎక్కువ కావడమూ విశేషం.

చదవడం ఎలా: e-బుక్స్ చదవాలంటే ప్రత్యేక e-రీడర్లే అవసరం లేదు. స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, బ్లాక్‌బెర్రీ, విండోస్... వాడుతున్న ఓఎస్ ఏదైనా తగిన ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. e-బుక్స్ చదవడానికి కిండిల్ వంటి బుక్ రీడర్లతో పాటు టాబ్లెట్స్ అనువుగా ఉంటాయి. కొన్నిరకాల స్మార్ట్‌ఫోన్లలోనూ e-బుక్స్‌ను చదువుకోవచ్చు. టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్లలో e-బుక్స్ రీడింగ్ కోసం కిండెల్ యాప్‌ను గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ నుంచి పొందవచ్చు. ఈ అప్లికేషన్ ఉంటే పుస్తకాలతోపాటు అంతర్జాతీయంగా వున్న మ్యాగజైన్లు, పత్రికలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం e-బుక్స్ ప్రాచుర్యం పెరుగుతుండడంతో పుస్తకాల ప్రచురణలో పబ్లిషర్స్ మధ్య పోటీ వున్నట్లే ఇ-బుక్ రీడర్స్ తయారీ సంస్థల మధ్య కూడా పోటీ మొదలైంది. ఒకదాన్ని మించి ఒకటి అధునాతన ఫీచర్లతో కొత్తకొత్త గాడ్జెట్స్‌తో ముందుకొస్తున్నాయి.

అమెజాన్ ఆధిక్యత: ప్రస్తుతం ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ అమెజాన్ అత్యధికసంఖ్యలో e-బుక్స్‌ను అమ్ముతోంది. తన ప్రచురణల నుంచి వచ్చే ఆదాయంలో 8శాతం e-బుక్స్ ద్వారానే పొందుతోంది. వీటిని చదువుకోవడానికి ఉచితంగా దొరికే సాఫ్ట్‌వేర్లు చాలా ఉన్నాయి. అడోబ్ రీడర్, మైక్రోసాఫ్ట్‌రీడర్, సుమిత్రా రీడర్, నైట్రో వంటి సాఫ్ట్‌వేర్లు ఉచితంగా దొరకుతాయి. బ్లాక్‌బెర్రీ టచ్ స్క్రీన్ వాడేవారైతే పేజీలను సులువుగా తిరగేస్తూ చదువుకునేందుకు వీలుగా ప్లే ఈ పబ్ బుక్ రీడర్ ఆప్‌ని ఉపయోగిస్తే బాగుంటుంది. e-పబ్, మోబి, పిడీఎఫ్ ఫార్మట్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్‌లు ఐబుక్స్ సర్వీసుకు ప్రత్యేకం. ఇందులో బుక్ స్టోర్ నుంచి కావాల్సిన పుస్తకాల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇది e-పబ్, పీడిఎఫ్ ఫార్మెట్‌లను సపోర్ట్ చేస్తుంది. 18 భాషల పుస్తకాల్ని బ్రౌజ్ చేసి చదువుకోవచ్చు. ఆప్‌లోడ్ డౌన్‌లోడ్ చేసిన పుస్తకాల్ని అన్ని పరికరాల్లో (ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, మ్యాక్‌బుక్...) సింక్ చేసుకునే వీలుంది. ఆండ్రాయిడ్ వాడితే యూనివర్సల్ బుక్ రీడర్ ఆఫ్‌ని వాడొచ్చు. e-పబ్, పీడిఎఫ్ ఫార్మెట్‌లను సపోర్ట్ చేస్తుంది. హోం పేజీలోని e-బుక్ స్టోర్ నుంచి పుస్తకాల్ని డౌన్‌లోడ్, చేసుకోవచ్చు. స్టోర్‌లో సుమారు 6,50,000 పుస్తకాల్ని నిక్షిప్తం చేశారు. 12 భాషల్లో పుస్తకాల్ని పొందొచ్చు. విండోస్ ఫోన్ యూజైర్లెతే e-పుస్తకాల్ని బ్రౌజ్ చేసుకుని చదివేందుకు లెగిమి e-బుక్ రీడర్ అనువుగా ఉంటుంది. వీటిని విండోస్ ఫోన్ ఆప్ స్టోర్ నుంచి ఆప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వినిపించే బుక్స్: e-బుక్‌ను ఇంకా బలమైన ఉపకరణంగా రానున్న రోజులలో చూస్తాం. e-బుక్స్ చదివి వినిపించే పరికరాలు విఫణిలో ఇప్పటికే ఉన్నవి.

కొన్ని ఉచితంగా స్మార్ట్‌పోన్‌లలోకి కూడా వచ్చేశాయి. కాబట్టి అక్షరాలతో పాటు దృశ్య శ్రవణ మాధ్యమాలతో తయారయ్యే మల్టీ మీడియా ఇబుక్స్ త్వరలోనే ప్రపంచాన్నిఅలరించనున్నాయి. భారతీయ భాషలలోకి ఇంకా రాలేదు కాని ఇతర భాషలలో ఇవి లభ్యమే. మరీ ముఖ్యంగా ఆంగ్లంలోను, యురోపియన్ భాషలలోను దొరుకుతున్నాయి. అన్నట్టు, e-బుక్స్‌కు ఇప్పుడు ఇంటిపోరు తప్పడం లేదు. దీనికి ఒక చెల్లెలు పుట్టుకొచ్చింది. బ్లాగుల సమాచారాన్ని, పుస్తకరూపంలో ప్రచురిస్తే అది బ్లూక్ అవుతుంది. బ్ల్లాగ్ అనే మాటలోంచి మొదటి రెండక్షరాలు, బుక్ అనే మాటలోంచి చివరి మూడు అక్షరాలు కలిస్తే బ్లూక్ అయింది. ఈ రూపంలోనూ ఇప్పుడు బుక్స్ వస్తున్నాయి.

తెలుగు e-బుక్స్ సైట్లు, లింకులు!


ప్రస్తుతం ఈ రెండు సంస్థలు తెలుగులో e బుక్స్‌ని వాణిజ్య పరంగా పాఠకులకు అందిస్తున్నాయి.
http://kinige.com (mobiles, computers, tablets)
http://newshunt.com (only on mobiles)
అలాగే ఈ కింది లింక్స్ చూడండి. తెలుగులో ఉచితంగా e-బుక్స్ అందుబాటులోకి తెచ్చిన సంస్థలు. వాటి వివరాలున్నాయి.

- ఆర్కైవ్స్‌కు సంబంధించి విలువైన పుస్తకాలను ఈజీగా ఈ లింక్స్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: https://archive.org/ details/texts
+
- డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (DLI) వారి వెబ్‌సైట్ ఇది: http://www.dli.ernet.in/ దీన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కొన్ని సంస్థల సహకారంతో నిర్వహిస్తోంది.

- సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారి వెబ్‌సైట్లోనూ చాలా మంచి పుస్తకాలు e-బుక్స్‌గా లభిస్తున్నాయి: http://sundara yya.org/svs

- ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాయంలోని e బుక్స్ కోసం ఈ లింక్ చూడండి: http://oudl.osmania.ac.in/
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి ప్రెస్ అకాడమీ కూడా ఆర్కైవ్స్‌ను ఇంటర్నెట్‌లో అందుబాటులో వుంచింది. ఆ సంస్థ చాలా పత్రికలను డిజిటలైజ్ చేసింది. వాటికోసం చూడండి: http://www.pressacademyarchives.ap.nic.in/archives.aspx

- కాళీపట్నం రామారావు కృషివల్ల ఏర్పడిన కథా నిలయం సాహిత్యానికి చేస్తున్న మేలు ఇంతా అంతా కాదు. లింక్: http://kathanilayam.com/

- హైదరాబాద్, తార్నాకలోని ఏపీ స్టేట్ అర్కివ్స్ సంస్థ చాలా విలువైన పుస్తకాలను డిజిటలైజ్ చేసింది. కైపియతులు వంటివి వీటిలో ఉన్నాయి. అయితే, ఇవి అందరికీ అందుబాటులో వుండవు.

- ఎల్‌బీనగర్ కొత్తపేటలోని గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్‌వారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రాచీన తాళపత్ర గ్రంథాలను e-బుక్స్‌లో పెట్టే పనిచేస్తున్నారు. అలాంటి బుక్స్ వివరాలతో కూడిన క్యాటలాగ్ వారి వద్ద అందుబాటులో ఉంది.

- అఫ్జల్‌గంజ్‌లో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం సుమారు 50,000కు పైగా పుస్తకాలను డిజిటలైజ్ చేసింది. అయితే, ఇవి కూడా ప్రస్తుతానికి సామాన్యులకు అందుబాటులో లేవు. ప్రభుత్వ సంస్థల వారు తాము డిజిటలైజ్ అయితే చేస్తున్నారు గానీ వారివద్ద ఏయే బుక్స్ లభిస్తున్నాయనే సమాచారం తెలిపే క్యాటలాగ్‌లను ప్రచురించి అందరికీ అందుబాటులోకి తేవడం మంచిది.

- ఇవన్నీ కాకుండా ఉదయ్‌కుమార్, అరుణ కాట్రగడ్డ వ్యక్తులుగా మొదలుపెట్టి సంస్థగా నిర్వహిస్తున్న వికాస ధాత్రి సాహిత్యాన్ని e బుక్స్ రూపంలో పెట్టేందుకు కృషి చేసింది. వారి కృషి అభినందనీయం. లింక్: http://www.vikasadhatri.org

- తెలుగులో మరికొన్ని ఈ బుక్స్ లభించే లింక్స్: www.malle poolu.com, www.rare-e-books.blogspot.com, www.any1dl.com, http://www.gruhashoba.blogspot.com
ఆంగ్ల e-బుక్స్ లభించే సైట్లు, లింకులు!

- e-బుక్స్ అందించడంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్న వెట్‌సైట్ ప్రాజెక్ట్ గుటెన్‌బర్గ్. దాని లింక్: http://www.gutenberg.org/ (మరింత సమాచారం కోసం ఈ లింక్‌ను ఉపయోగించుకోవచ్చు: http://ebookfriendly.com/free-public-domain-books-sources/)

- గూగుల్ వారి గూగుల్ e బుక్స్: https://play.google. com/store/books

- అమేజాన్ వారి కిండిల్ e బుక్స్, భారతదేశ భాషలన్నింటిలోను ఇంకా రాలేదు. సమీప భవిష్యత్తులో వచ్చే సూచనలు కూడ లేవు. కానీ ఇంగ్లీషు పుస్తకాల కోసం: http:// www.amazon.com/Kindle-eBooks/b?node=154606011

- కోబో e బుక్స్ - Kobo eBooks - ప్రస్తుతం కొన్ని అంతర్జాతీయ భాషలలో మాత్రమే లభ్యమవుతున్నాయి. http:// store.kobobooks.com

- నూక్ e బుక్స్ కూడా కొన్ని అంతర్జాతీయ భాషలలో మాత్రమే ప్రచురణకి నోచుకుంటున్నవి. అందులో ప్రముఖంగా ఆంగ్లం లో మాత్రమే. http://www.barnesandnoble. com/

- సఫారి బుక్స్ ఆన్‌లైన్ టెక్నికల్ e బుక్స్ సంస్థ ప్రచురణ రంగంలో అగ్రగాముల సరసన నిలబడుతున్నది: https:// www.safaribooksonline.com/ technical books
అచ్చు పుస్తకం చచ్చిపోదు!

ఇప్పటి వరకు అనేక రకాల పుస్తకాలు వచ్చాయి. e-బుక్స్ పరిస్థితీ మూన్నాళ్ల మురిపెమేనా? అనే అనుమానం చాలా మందికి ఉంది. అయితే బౌకర్స్ గ్లోబల్ ఈబుక్ మానిటర్ అనే సంస్థ మన దేశంతో పాటు మరో పది దేశాల్లో పరిశోధన చేసింది. ఇండియాలోని పుస్తక ప్రియుల్లో 20శాతం మంది ఈ-రీడర్లేననీ, భారత్‌లో 25మిలియన్లకు పైగానే e-బుక్స్ అమ్ముడయ్యాయని ఆ సర్వే వెల్లడించింది.

అంటే ముందు ముందు ఈ బుక్స్ వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గదన్నది నిజం. e-బుక్స్‌కి ప్రత్యామ్నాయం ప్రస్తుతం ఏమీ లేదనే చెప్పవచ్చు. అయితే, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే, చాలామంది అంటునట్టు అచ్చులో ఉన్న పుస్తకం చచ్చిపోదు. దాని విలువ దానికే ఉంటుంది. అలాగని e-బుక్‌ని నిర్లక్షం చెయ్యలేం అని రైట్ వరల్డ్ అధినేత, కినిగె.కాం పూర్వ సంపాదకులు అనిల్ అట్లూరి అన్నారు. ఆయన అంటారు, నా వరకు నేను రెండూ, ఇబుక్-అచ్చుపుస్తకం చెట్టాపట్టాలేసుకునే మన పాఠక ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాయని నమ్ముతాను అని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే, ఆన్‌లైన్ బుక్స్ ఎన్‌ఆర్‌ఐలకు ఎక్కువగా అవసరం. అలాగే ప్రింటెడ్ పుస్తకాలను కొని చదవడానికి సమయం దొరకని సాఫ్ట్‌వేర్ టెక్కీలు e-బుక్స్ పట్ల ఆసక్తి చూపుతున్నారు అని వాసిరెడ్డి పబ్లికేషన్స్ అధినేత వేణుగోపాల్ అన్నారు. అయితే, కథలు, సాహిత్యం కంటే న్యూస్, ఇతర ఆసక్తికర అంశాలు చదవడానికే వారు ఆసక్తి చూపుతున్నారు అని కూడా ఆయన వివరించారు. ఈ సంస్థ ఇప్పటి వరకు ముద్రించిన పుస్తకాలు కొన్నింటిని కినిగె ద్వారా ఈ బుక్స్‌గా ఉంచడం జరిగింది.

కాగా, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అధినేత గీతా రామస్వామి కూడా తమ ప్రచురణలను ఆన్‌లైన్‌లో e-బుక్స్‌గా పెట్టడం లేదని అన్నారు. ఈ బుక్స్ వల్ల ఇబ్బంది ఉంది. సౌకర్యం ఉంది. పిడిఎఫ్ ఫార్మిట్‌లో చదవడం ఎక్కువమందికి అలవాటు కాలేదు. కాకపోతే విదేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐ లకు మాత్రం ఇది చాలా ఉపయోగం అన్నారు. ఇప్పటి వరకు మేం 400 వరకు బుక్స్ ప్రింట్ చేస్తే అందులో వంద లోపు ఈ బుక్స్‌గా వచ్చి ఉంటాయి. అవి కూడా కినిగె వంటి సంస్థల ద్వారానే అన్నారు. దీన్నిబట్టి ప్రచురణ సంస్థలు ఆన్‌లైన్లో పుస్తకాల విక్రయంపై ఇంకా దృష్టి పెట్టలేదనే చెప్పవచ్చు.

ఒక హెచ్చరిక
రానున్న రోజుల్లో ప్రచురణ తీరుతెన్నులైతే మారిపోనున్నాయి,. కాకపోతే, ఈ-బుక్స్ వల్ల జరిగే హాని గురించీ కొందరు హెచ్చరిస్తున్నారు. ఒడిశాకు చెందిన ప్రఖ్యాత నవలా రచయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రతిభా రే e-బుక్స్ పిల్లల్లో సృజనాత్మకతను చిదిమేయడంతో పాటు వారిలో నేర్చుకోవాలనే జిజ్ఞాసను చంపేస్తాయి అని చెబుతున్నారు. ఓ చిన్నారి మామూలు పుస్తకం చదివితే, తాను చదివిన దాని గురించి మనసులో తను ఓ చిత్తరువును రూపొందించుకుంటుంది. అదే, e-బుక్స్ పరిజ్ఞానంతో కంప్యూటర్లోనో, ఫోన్ లోనో పుస్తకం చదివితే, ఓ సినిమా చూసినట్టుగానే అనుభూతి చెందుతుంది అని ప్రతిభ పేర్కొన్నారు. ఈ విషయమూ ఆలోచించాలి మరి!

రాదుగ ప్రచురణలు - e - బుక్స్
రష్యన్ సాహిత్యానికి సంబంధించి, ముఖ్యంగా రాదుగ ప్రచురణాలయం వేసిన పుస్తకాలు ఉచితంగా అందించే వెబ్‌సైట్లు లేవు గానీ మన దగ్గర అనిల్ బత్తుల చాలా మంచి కృషి చేశారు. తన బ్లాగు http: //sovietbooksintelugu.blogspot.in/ చూడండి. అందులో రష్యన్ సాహిత్యాన్ని స్కాన్ చేసి పి డి ఎఫ్‌కి మార్చిన పుస్తకాలు లభిస్తాయి. ఈ బ్లాగ్‌లో 250కి పైగా సోవియట్ తెలుగు ట్రాన్స్‌లేషన్ e-బుక్స్ సమాచారం తాను అందుబాటులో వుంచారు. ఇందులో మనకు కావలసిన ఏ పుస్తకాన్నైనా చదువుకోవచ్చు. ఈ పుస్తకాలు కావాలనుకున్నవారు fualoflife@gmail.com, mailto:oflife @gmail.comకు సంబంధిత బుక్ పేరు చెప్పి మెయిల్ చేస్తే వారు e-బుక్ మెయిల్ చేస్తారు. ఇదంతా స్వచ్ఛందంగా చేస్తున్న కృషి.

మంచి పుస్తకం అనే సంస్థ రాదుగ వారు తెలుగులో ప్రచురించిన బాల సాహిత్యాన్ని అందిస్తున్నారు. మంచి పుస్తకం వారి సాహిత్యం e-బుక్స్ గానూ అచ్చులోను kinige.com లో లభిస్తున్నాయి.
(కవర్‌స్టోరీ ఇన్‌పుట్స్- అనిల్ ఆట్లూరి, అనిల్ బత్తుల సౌజన్యంతో...)

7281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles