గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jun 13, 2020 , 23:22:38

BOOK REVIEWS

BOOK REVIEWS

బతుకు చిత్రం.. ఒక హిజ్రా ఆత్మకథ

గౌరవంగా బతకాలి, ఉన్నతంగా జీవించాలి, బాగా సంపాదించాలి, భవిష్యత్‌ బాగుండాలి... ఇలా భిన్న ఆశలు, విభిన్న ఆశయాలతో మనుషులందరిదీ ఒకే పోరాటం. కానీ కొందరు ఓ మనిషిగా గుర్తింపు పొందేందుకు కూడా పోరాటం చేయాల్సిందే. వీరిని మూడో రకం వ్యక్తులుగా పిలిచినా.. తొమ్మిదో నంబర్‌ అని సంబోధించినా.. ఒక్కొక్కరి మనసును తరచి చూస్తే ఒక్కో కన్నీటి కథ, అడుగడుగునా అంతుపట్టని వ్యథ. ‘ఒక హిజ్రా ఆత్మకథ’ పుస్తకంలో రేవతి తన జీవితంలో ఎదుర్కొన్న ఘటనల గురించి మాత్రమే చెప్పదు. మగవారిగా పుట్టి ఆడవారిలా మారాలనుకునే, మారే ఎందరో ఈ కథలో మనకు తారసపడుతారు. ‘కొందరికి ఆడవాళ్లలా ఆభరణాలు ధరించాలని ఉంటుంది. పనులు చేయాలని ఉంటుంది. అంతే సౌకుమార్యం ఉంటుంది... కానీ వారికి ఎందుకు దేవుడు మగ రూపమిస్తాడో అంతుచిక్కని ప్రశ్న’... ఇదే సమస్య దొరైస్వామి (రేవతిగా మారకముందు) ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడు ఆడవాళ్లను అనుకరిస్తూ, వాళ్లు చేసే పనులు చేస్తూ.. తరగతి గదిలో పిల్లలతో వెక్కిరింపులు ఎదుర్కొని.. చివరికి తన శరీరంలో జరిగే మార్పుల్ని గమనించుకుంటాడు. తనలాంటి వారికోసం వెదుకుతాడు. వారితో స్నేహం చేస్తాడు. ఇంట్లో దొంగతనం చేసి ఊరొదిలి పారిపోతాడు. చివరికి దొరైస్వామి కాస్తా రేవతిగా మారిపోతుంది. ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. తనకు ఇష్టం లేని శరీర భాగాన్ని తొలగించుకొని, అందుకు డబ్బు సాయం చేసిన మరో హిజ్రా వద్దకు  చేరడం, దుకాణ సముదాయాల్లో తిరిగి డబ్బు వసూలు చేసి గురువుకు ఇవ్వడం లాంటి అనుభవాలను ఎదుర్కొంటుంది. గురువుకు నానాచాకిరీ చేసి హిజ్రాగా సమాజంలో ఎలా బతకడం, ఎవరితో ఎలా మెదలడం నేర్చుకోవడం ప్రతి చేలా (శిష్యురాలు) ఎదుర్కొనే సమస్యే. రెండో దశలో అందంగా ముస్తాబై సెక్క్‌ వర్కర్‌గా మారి గురువుకు డబ్బులివ్వడం వంటి ఎన్నో ఘటనలు నిజ జీవితంలో లింగమార్పిడి చేయించుకున్న ఎందరో జీవితాల్ని ప్రతిబింబిస్తాయి. మొత్తానికి గుండెల్ని పిండే రచన ఇది.

ఒక హిజ్రా ఆత్మకథ

రచన: రేవతి,   

అనువాదం: పి.సత్యవతి

పేజీలు: 156 వెల: రూ.130

ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

 ‘కుంతి’ భారతం

మహాభారతంలో కుంతి పాత్ర విశిష్టమైనది. అలాంటి కుంతి అంతరంగ కోణంలోంచి మహాభారత కథని ‘పృథ తెరచిన పుటలు’  శీర్షికతో రాశారు. కన్నడ సాహిత్య ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఈ నవలను వేలూరి కృష్ణమూర్తి తెలుగులోకి అనువదించారు.  సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన కుంతి అడుగడుగునా ఎదుర్కొన్న అడ్డంకుల్ని, వాటిని తట్టుకుంటూ నిలబడిన ఆమె స్థయిర్యాన్ని..  అంతరంగ సంఘర్షణల నేపథ్యంలోంచి మహాభారతాన్ని సృజించారు. ఇలా ఒక స్త్రీ కోణంలోంచి మహాభారతాన్ని చెప్పినతీరు ఆకట్టుకుంటుంది. ఈ నవలలో కుంతితోపాటు గాంధారి, మాద్రి, ద్రౌపది, సుభద్ర, హిడింబి, ఉత్తర వంటి ఇతర మహిళా పాత్రల వైశిష్ట్యాన్ని  కూడా సముచితంగా చిత్రించారు. పుట్టగానే తనవారికి దూరమై జీవిత కాలంలో ఎన్నో కష్టాలకు గురైన కుంతి ఆసాంతం ధర్మమార్గంలో నడుస్తూ అత్యంత ధైర్యంతోనూ, సహనంతోనూ జీవితం గడిపిన తీరును రచయిత్రి తీర్చిదిద్దిన విధానం అనుపమానం.

పృథ తెరచిన పుటలు (నవల)

కన్నడ మూలం: విజయా చంద్రమౌళేశ్వర్‌, 

తెలుగు అనువాదం: వేలూరి కృష్ణమూర్తి 

పేజీలు: 352, వెల: రూ. 150

ప్రతులకు: 9848787284 
థానిక విమర్శలో వైవిధ్యం 

ఇందులో కొందరు కథకుల గురించిన వ్యాసాలు, వారి పుస్తకాలకు సంబంధించిన పరామర్శలు ఉన్నాయి. ముప్పయి మందికి పైగా కథకుల ఒక్కొక్క కథానికని తీసుకొని వాటి మంచీచెడుల్ని విశ్లేషించారు. డాక్టర్‌ ధేనువకొండ శ్రీరామమూర్తి ‘విస్ఫోటనం’, సి.ఎస్‌.రాంబాబు ‘పసిడి మనసులు’, బి.ఎస్‌.రాములు ‘స్వేచ్ఛ నుండి విముక్తి’, బి. మురళీధర్‌ ‘నెమలినార’, తరానా ‘పనామా బీచ్‌లో’ కథల గురించి విహారి రాసిన వ్యాసాలు చదివితే ఆయా కథలు చదవాలన్న ఉత్సుకత కలుగుతుంది. ఎంచుకున్న ఇతివృత్తానికి తగిన శైలీ శిల్పాలతో కథగా రూపుదిద్దిన సంవిధానం గురించి ఈ వ్యాసాల్లో వివరిస్తారు విహారి. వస్తుశిల్పాల రీత్యా సాఫల్యం సాధించిన కథల్ని పరిచయం చేస్తున్నందున.. మంచి కథలు చదవాలన్న పాఠకుల దాహాన్ని తీరుస్తుంది ఈ ‘కథాకృతి’. కథానిక ప్రక్రియ పైన మమకారాన్ని ఇనుమడింపజేసే రీతిలో, సానుకూల దృక్పథంతో రాయడం విహారి విమర్శలోని ప్రత్యేకత. అందుకే  విహారి వ్యాసాలను చదవడం అనేది, మంచి కథలను చదివినంత చక్కటి అనుభవం పాఠకులకు. 

కథాకృతి (పరిచయాలు పరామర్శలు)

రచన: విహారి, పేజీలు: 136, 

వెల: రూ. 150 ప్రతులకు: 98480 25600


logo