e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home బతుకమ్మ వినిపించని రాగాలే.. పుస్తక సమీక్ష

వినిపించని రాగాలే.. పుస్తక సమీక్ష

వినిపించని రాగాలే.. పుస్తక సమీక్ష

లోకాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి మనిషినీ పరిచయం చేసుకోవాల్సిన పనిలేదు. నాలుగు మంచి పుస్తకాలను చదివి, అందులోని విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు! 

వినిపించని రాగాలే..

వినిపించని రాగాలే.. పుస్తక సమీక్షమొదట పాత్రల పరిచయం, వాటి తీరితెన్నులను తెలియపరుస్తూ సాగుతుంటాయి కొన్ని నవలలు. కథనంతో పాటు పాత్రలను అందంగా ఆవిష్కరించే నవలలు కొన్నుంటాయి. అలాంటి నవలలకు పాఠకాదరణ తప్పకుండా లభిస్తుంది. ‘మౌనరాగాలు’ నవల అలాంటిదే! కథానాయిక పాత్ర చుట్టూ సాగే అందమైన రచన ఇది. వినికిడి శక్తి లేని నాయిక, ఆమె కనబడితే గానీ మనసు కుదుటపడని నాయకుడు.. నవల చదువుతున్నంత సేపూ మన కండ్ల ముందు కనిపిస్తూ ఉంటారు. వీరిద్దరి ప్రేమకావ్యంగా మొదలయ్యే ‘మౌనరాగాలు’ చివరకు వచ్చేసరికి ఓ అద్వితీయమైన లక్ష్యాన్ని చేరుకుంటుంది. కథలోకి వెళ్తే లాస్యకు వినికిడి శక్తి ఉండదు. అయితేనేం, తల్లి ప్రోత్బలంతో ఎదుటివారి పెదాల కదలికతో వాళ్లేం మాట్లాడుతుంటారో తెలుసుకోగలుగుతుంది. మరెన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తుంది. తనకు వినపడని రాగాలను అందమైన రూపాలుగా చిత్రీకరించే నేర్పును సంపాదిస్తుంది. ఇదంతా కథే కావచ్చు, నిజంగా జరుగకపోవచ్చు. కానీ, కథనంలో సహజత్వం మనసును కట్టిపడేస్తుంది. ‘మౌనరాగాలు’లో ఓ తల్లి పోరాటం కనిపిస్తుంది. ఓ తండ్రి ఆరాటం ఉంది. ప్రియుడి నివేదన ఉంది. అంతిమంగా ఓ ఆడకూతురు విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది.

మౌనరాగాలు

రచన: సలీం

పేజీలు: 148 ధర: రూ.150

ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌, books.acchamgatelugu.com

కథాకదంబం

వినిపించని రాగాలే.. పుస్తక సమీక్షఅందమైన కథ చదివినప్పుడు మనసుకు ఊరట కలుగుతుంది. నాలుగైదు మంచికథలు చదివితే, ప్రతి కథలో ప్రత్యేకత పలుకరిస్తే పాఠకుడికి పండుగే! అలాంటిది ఒకే సంకలనంలో వందకుపైగా వైవిధ్యమైన కథలు అందుబాటులో ఉంటే, పుస్తక ప్రియులకు ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు ఉంటుంది. ‘కథాకేళి’ ఓ అద్భుతమైన ప్రయోగం. 111 మంది మహిళా రచయితలు కలిసి చేసిన కథాయజ్ఞం ఇది. డి.కామేశ్వరి, జ్ఞానప్రసూన, శారదా అశోకవర్ధన్‌ లాంటి మొన్నటి తరం రచయిత్రులు, పొత్తూరు విజయలక్ష్మి, మథా భానుమతి, రాజేశ్వరి శివుని వంటి నిన్నటి తరం రచయిత్రులు, ఈ తరం కొత్త రచయిత్రులు ఇలా తరతరాలకు చెందిన కథకుల మనోఫలకంపై కదలాడిన మరపురాని గాథల సమాహారంగా రూపుదిద్దుకున్న అందమైన సంకలనం ‘కథాకేళి’. ఫేస్‌బుక్‌లో ‘ప్రమదాక్షరి’ వేదికగా కలిసిన రచయిత్రులు తమ కలాలు విదిల్చి చక్కని కథలను అందించారు. ఈ వినూత్న ప్రక్రియ ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన ఈ ప్రయోగాత్మక సంకలనం పాఠక లోకంలో సంచలనం సృష్టిస్తున్నది. విభిన్న రచయిత్రులు రాసిన కథలు కావడంతో దేనికదే ప్రత్యేకమైందిగా అనిపిస్తుంది.

కథాకేళి

సంకలనం: జేవీ పబ్లికేషన్స్‌

పేజీలు: 456, ధర: రూ.300

ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌, books.acchamgatelugu.com

అడవి కాచిన యాస

వినిపించని రాగాలే.. పుస్తక సమీక్షనెమనెమ (అనుమానం), గిదగిద (తొందర), జినజిన (ఆగకుండా).. తెలంగాణ యాసలో ఇలాంటి ప్రయోగాలెన్నో. తెలుగు భాష అక్షయ పాత్రయితే అందులో అమృత గుళిక తెలంగాణ యాస. యాసతో భాషకు ప్రత్యేక సౌందర్యం వస్తుంది. మారుతున్న కాలం అన్ని భాషలనూ కలగాపులగం చేస్తున్నది. కానీ, ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో ఆ తరం మనుషుల నోట అందమైన యాస కదం తొక్కుతూనే ఉంటుంది. కాలపరీక్షకు తట్టుకొని, పట్నం పోకడలకు తలొగ్గని అందమైన ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా. అడవుల నెలవుగా పేరున్న ఆదిలాబాద్‌లో వాతావరణం కలుషితం కాలేదు. ఈ అడవితల్లి ఒడిలో పుట్టి పెరిగిన బిడ్డల భాష, యాస కలుషితం కాలేదు. వారు పలికే మాటలు, వాటి అర్థాలను ఏర్చి కూర్చి ‘మన భాష- మన యాస’ (ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యావహారిక పదకోశం) నిఘంటువును తీర్చిదిద్దారు రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మడిపల్లి భద్రయ్య. దాదాపు వెయ్యి పుటల్లో పదివేల పదాలను నిక్షిప్తం చేశారు. వాటికి అర్థాలు, ప్రయోగించే తీరునూ వివరించారు. 75 ఏండ్ల వయసులో రచయిత చేసిన కృషి అభినందనీయం. మన భాషను, యాసను భవిష్యత్‌ తరాలకు అందజేయాలనే ఆయన సత్సంకల్పం ఈ నిఘంటువుతో తప్పక నెరవేరుతుందని ఆశిద్దాం.

మన భాష-మన యాస

రచన: మడిపల్లి భద్రయ్య

పేజీలు: 976 ధర: రూ.450

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు, [email protected]

Advertisement
వినిపించని రాగాలే.. పుస్తక సమీక్ష
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement