మేడమ్! నా వయసు 28 ఏండ్లు. బి.ఎడ్ చేశాను. నాకు ఈ మధ్యే పెండ్లయింది. అయితే, నా భార్య వక్షోజాలు వదులుగా ఉన్నాయి. పెండ్లికాని అమ్మాయిల వక్షోజాలు స్టిఫ్‌గా ఉంటాయంటారు కదా! అది నిజమేనా? వయసును బట్టి వక్షోజాలు ఉంటాయంటారా? ఆమెకు పెండ్లికి ముందు వేరే సంబంధాలు ఉన్నాయంటారా? నా అనుమానం నివృత్తి చేయగలరు?- ఓ సోదరుడు
నువ్వు బి.ఎడ్ చేశానని చెబుతున్నావు. కానీ, నీ అనుమానాలు చదువుతుంటే… నీకు విద్యా జ్ఞానం, స్త్రీలను గౌరవించే సంస్కారం కొంతైనా లేవనిపిస్తున్నది. కనీస పరిజ్ఞానం లేకుండా నువ్వు క్షోభ పడుతూ, నీ భార్యనూ అనుమానిస్తున్నావు. వక్షోజాల్లో కండరాలు ఉండవు. కొవ్వు కణాలు, గ్రంథులు, పాలను చనుమొనల ద్వారా తీసుకెళ్లే నాళాలు (మిల్క్ డక్ట్స్) ఉంటాయి. అవన్నీ మెత్తని అనుసంధాన కణజాలంతో బంధించబడి, దగ్గరగా ఉంటాయి. అలాగని వక్షోజాలు బిగించి ఉండాలని ఏమీ లేదు. వ్యక్తికీ, వ్యక్తికీ ఈ వక్షోజాల అంతర్గత అమరికలో తేడా ఉంటుంది. వివాహానికి ముందు స్త్రీలు సెక్స్‌లో పాల్గొంటే వక్షోజాలు సాగినట్లు అవుతాయన్నది మూర్ఖమైన అపోహ మాత్రమే! అయితే, తల్లయ్యాక బిడ్డకు పాలిచ్చే సమయంలో అంటే గర్భధారణ, పిల్లలు పుట్టిన తర్వాత వక్షోజాల బిగువులో మార్పు వస్తుంది. ఈ సమయంలో అంతర్గత కణజాలం మెత్తబడుతుంది. పరిమాణమూ మారుతుంది. అంటే కొద్దిగా పెద్దగా అవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొలాక్టివ్ అనే హార్మోన్ల స్థాయిలో పెండ్లికి ముందు, తర్వాత దశల్లో చాలా తేడాలు ఉంటాయి. ఈ హార్మోన్లు వక్షోజాల పరిమాణంలో మార్పునకు దోహదం చేయడంతోపాటు చనుమొలలు పగలకుండా కాపాడుతాయి.
మేడమ్! నా వయసు 29 ఏండ్లు. ప్రస్తుతం గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నా. మరో రెండేండ్లలో పెండ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. నా స్నేహితులు మాత్రం 30 ఏండ్లు దాటిన తర్వాత పెండ్లి చేసుకుంటే సెక్స్ పరమైన సమస్యలు వస్తాయంటున్నారు. నిజమేనా?- ఓ సోదరుడు
30 ఏండ్లు దాటిన తర్వాత పెండ్లి చేసుకుంటే సెక్స్ సమస్యలు రావు. కాకపోతే మరీ తక్కువ వయసున్న అమ్మాయిని చేసుకోవద్దు. 32 సంవత్సరాల అబ్బాయి, 28 నుంచి 29 ఏండ్ల మధ్య వయసున్న అమ్మాయిని చేసుకోవచ్చు. వయసులో పది, పన్నెండేండ్ల వ్యత్యాసం ఉన్న అమ్మాయిని చేసుకుంటే.. దాంపత్యంలో సమస్యలు, భావోద్వేగాల్లో చికాకులు వస్తాయి. నీ వయసుకు తగ్గ సంబంధం చేసుకోవచ్చు. అలాగే అమ్మాయి వయసు నీకన్నా ఐదేండ్లు ఎక్కువగా ఉన్నా చేసుకోవచ్చు ఏమీ కాదు.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్,
హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com