ఏ పనిచేసేవారైనా, ఆ రంగంలోని అనుభవజ్ఞుల మాటలను పెడచెవిన పెట్టకూడదు. అనుభవాన్ని మించిన గురువు లేడు. కాబట్టి, ఎదుటి మనిషి మాటల్లో మంచిని గ్రహించి, చెడును విడిచిపెట్టాలి. ఇక ఎంత చెప్పినా వినకుండా.. చేసేపని సక్రమంగా చేయకుండా నష్టాల్లో కూరుకుపోతుంటారు కొంతమంది. అలాంటి మూర్ఖులను ఉద్దేశించిన సామెత ఇది. ఆ నష్టాన్ని సరదాగా ‘క్షవరం’తో పోల్చారు పెద్దలు. ‘సవరం అయితేగాని ఇవరం రాలేదు.. వద్దు రా అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎంత నష్టమో’ అంటూ సున్నితంగా హెచ్చరిస్తుంటారు. జుట్టు కత్తిరింపు, గుండు కొట్టించడం, గడ్డం గీయడాన్ని.. క్షవరం అంటారు. ఇలాంటి అర్థాన్నిచ్చే సామెతలు జానపదులు ఎన్నో చెప్పారు. వాటిలో ఒకటి ‘చెప్పంగ విననప్పుడు.. చెడంగ చూడాలంట’. ఎంత చెప్పినా విననప్పుడు.. చేసేదేమి ఉండదు. చెడిపోతుంటే చూడటం తప్పించి. కాబట్టి, పెద్దల మాట వినరా సుమతీ!
సింగనాదం జీలకర్ర
ఏదో ఉందనుకొని.. ఎక్కడికో వెళ్తే.. చివరికి ఏమీ లేకపోతే ఆశ్చర్యంతో అనే మాట ఇది. ఈ పదబంధం గురించి తెలుసుకోవాలంటే ముందు సింగనాదానికి, జీలకర్రకు ఉన్న సంబంధం తెలుసుకోవాలి. పూర్వం మనదేశంలో వర్తకులు సుదూర ప్రాంతాలకు వెళ్లి మసాలా దినుసుల వ్యాపారం చేసేవాళ్లు. ఈ క్రమంలో ముందుగా గ్రామం నడిబొడ్డున కొమ్ముబూరతో పెద్ద శబ్దం చేసేవారు. ఆ శబ్దం వచ్చిందంటే మసాలా దినుసులు వచ్చాయని అర్థం. ఆ కొమ్ముబూర శబ్దాన్ని ‘శృంగనాదం’ అనేవారు. అది వాడుకలో శుంగనాదం.. సింగినాదం, సింగనాదంగా మారింది. ఆ శబ్దం విని ఎంతో ప్రయాసపడి వెళ్లింది ఒకావిడ. ఎంతో కష్టపడి వెళ్లినా జీలకర్ర ఒక్కటే ఉండటంతో ‘సింగనాదం జీలకర్ర’ అనుకుంటూ వెనుదిరిగిందట. అలా.. పెద్దగా ఆర్భాటం చేసినా, చివరికి విషయమేమీ లేనప్పుడు ‘సింగనాదం జీలకర్ర’ అనే పదబంధాన్ని ప్రయోగిస్తుంటారు.
చచ్చిన పామును కొట్టడానికి అందరూ మగాళ్లే!
కష్టమైన పనికి వెనకాడుతూ.. కష్టంలేని పనికి మాత్రం ముందుకొచ్చే సోమరులను ఉద్దేశించిన సామెత ఇది. ఈ తరహా వ్యక్తులు కష్టాన్ని ఇష్టపడరు. ఏ పనిలో అయినా సుఖాన్నే కోరుకుంటారు. కష్టపడి చెమటోడ్చే పని చేయాలంటే మాత్రం ముఖం చాటేస్తారు. ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదనుకునే పనిలో తమని తాము నిరూపించుకునేందుకు ‘నేను ముందంటే.. నేను’ అంటూ రంకెలేసుకుంటూ వస్తారు. జనం ముందు తాము కూడా శక్తిమంతులం అని నిరూపించుకోవడానికి నానా తంటాలూ పడుతుంటారు. ఇలా సుఖమైన పనులకే అలవాటుపడటం వల్ల ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అన్న చందంగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్నచోటనే ఉంటారు. పాము బతికి ఉన్నప్పుడు చంపినోడే ధైర్యవంతుడు.. చచ్చిన పామును చంపడానికి పిరికివాళ్లు ఎందరొస్తే ఏం?
అర్థ వివరణ
1. రెండు మూతుల పాము = అవకాశవాది, ద్వంద్వ స్వభావం కలిగినవాడు, గోడమీద పిల్లి
(ఆ రెండుమూతుల పామోనితో నీకెందుకు రా.. వాడు ఎటు అవకాశం ఉంటే అటు అడుగేస్తడు)
2. కొంచపడుడు = వెలితిపడటం (ఎందుకు రా వట్టొట్టిగనే అన్నింటికీ కొంచపడ్తవ్.. కొంచెం ఆగరాదా)
3. రంపాట్కం = ఒక సమస్య తలనొప్పిగా మారడం (చిన్నబిడ్డ పెండ్లి రంపాట్కమైంది)
4. మురుసుడు = సంతోషం, మురిపెం, ఆనందం (కొత్త కోడలొచ్చిందని మస్తు మురుస్తున్నవ్లే.. జర జాగర్త మల్ల)
5. గౌరాంతం = గర్వం (వానికి బాగా గౌరాంతం.. చెప్పినమాట అస్సలినడు)
బొమ్మలు:మృత్యుంజయ్
-డప్పు రవి