e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home బతుకమ్మ నేడే మళ్లీ చూడండి!

నేడే మళ్లీ చూడండి!

నేడే మళ్లీ చూడండి!

ఓటీటీ జోరులోనూ ఆ చిత్రరాజాలు ఇంటింటా తొంగిచూస్తున్నాయి.టీవీల్లో ఠీవిగా ఆడుతున్నాయి.యూట్యూబ్‌లో లెక్కకు మించి స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.సెర్చింగ్‌లో టాప్‌లిస్ట్‌లో ఉంటున్నాయి.అంతా కరోనా మాయ! ఆంక్షల నేపథ్యంలో ఇల్లంతా ఒక్కచోట చేరిన వేళ కనువిందు చేస్తున్న సినీహేల.

కరోనా కాలంలో మనుషులు బయట తిరగకుండా కాపు కాస్తున్న ఘనత సినిమాలదే. టీవీ, ఓటీటీ.. మాధ్యమం ఏదైతేనేం, సినిమా రెండున్నర గంటలు కదలకుండా చేయగలదు. మనసుండాలేగానీ, శుభం కార్డు పడ్డాక కూడా మరో రెండు గంటల చర్చకు తెర తీయగలదు. ఇప్పుడు వస్తున్న సినిమాల సంగతి ఇంకెప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ, ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడో మిస్సయిన ‘నోస్టాల్జియా’ని మళ్లీ వెతికి పట్టుకునే మహద్భాగ్యం కరోనాతో కలిగింది. మనసు పొరల్లో చెరగని ముద్ర వేసిన సినిమాలను వెతికి వెతికి చూసేస్తున్నారు పబ్లిక్‌. మంచికథతో తయారై, హేమాహేమీల నటనతో ముస్తాబైన చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌ గ్రీనే! ఆ జాబితాలో తరతరాలుగా మొదటి వరుసలో నిలుస్తున్న చిత్రరాజం ‘మాయాబజార్‌’. తెలుగుభాషకు వెయ్యి వీరతాళ్లు వేసిన ఈ అపురూప చిత్రం ఆ తరానికి అద్భుతం. మధ్యతరానికి అత్యద్భుతం. ఈ తరానికి మహాద్భుతం. మరదలు శశిగా సావిత్రి సోయగాలు, మాయాశశిగా ఆమె చూపిన నయగారాలు నటనకు నిర్వచనం చెబుతాయి. అందుకే ‘మాయాబజార్‌’ ఎప్పుడొచ్చినా జనం టీవీలకు అతుక్కుపోతారు. ఈసారి వచ్చినప్పుడు మీ పిల్లలకూ చూపించండి. చిన్నన్న ఆధ్వర్యంలో లంబూజంబూల గారడీలకు పేరడీలు చేయకుండా ఉండలేరు. తానశాస్త్రి, తందాన శర్మల కవిత్వానికి వంత పాడకుండా ఉండలేరు. కొన్ని తెలుగు పదాలైనా వంట బట్టించుకుంటారు.

వెండితెర మల్లిక..
సినిమాకు స్వర్ణయుగంగా పేర్కొనే ఆ రోజుల్లో క్లాసిక్‌ చిత్రంగా పేరొందిన ‘మల్లీశ్వరి’ని మరొక్కమారు చూడండి. సినిమా చూస్తున్నంత సేపూ మనసున మల్లెలూగుతాయంటే నమ్మండి. నాట్యం, గాత్రం, శిల్పం కళలన్నీ ‘మల్లీశ్వరి’ని కలకాలం నిలిచిపోయేలా చేశాయి.

మిస్‌ కాకండి..
‘మిస్సమ్మ’ దగ్గరికొస్తే కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌. ‘ఎమ్టీ’ఆర్‌ మొహమాటం, డిటెక్టివ్‌ రాజు నిరంతర అన్వేషణ, మిస్సమ్మ చిరుబుర్రులు, చెల్లెమ్మ కారాలు-
గారాలు, దేవయ్య తైల సంగ్రహణం వెరసి మిస్సమ్మ చిత్రానికి ఎవర్‌గ్రీన్‌ సినిమాల లిస్ట్‌లో చెరిగిపోని స్థానాన్ని కట్టబెట్టాయి. వినసొంపైన పాటలు అదనపుబలం. ముఖ్యంగా ‘ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే’ అన్న పింగళి వారి తత్వం ఈ తరానికీ బోధ పడుతుంది.

కోలు కోలోయన్న..
‘గుండమ్మ కథ’ గురించి ప్రత్యేకంగా చెప్పాలా! చూడకపోతే గుండక్క ఊరుకుంటుందా? తొంటి చేత్తో రెక్క పట్టుకుని టీవీ ముందుకు లాక్కురాదూ! ఇటు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, అటు సావిత్రి-జమున, ఓ పక్క ఎస్వీఆర్‌.. వీరిందరినీ మరోపక్కకు లాగేసి సినిమా అంతా ఆక్రమించేసిన సూర్యకాంతం నటనకు తారీఫ్‌ చెప్పకుండా ఉండలేరు. ఒకటికి నాలుగుసార్లు చూడాల్సిందే.

నోస్టాల్జియా..
ఈ మాటలేం కానీ, ఒకటా రెండా, ఎన్ని సినిమాలో! అన్నిటినీ వెతికి వెతికి వీక్షిస్తున్నారు సినీప్రియులు. మనసు గెలిచిన నలుపు-తెలుపు మూవీలు, కండ్లను కట్టి పడేసిన అప్పటి ఈస్ట్‌మన్‌ కలర్‌ పిక్చర్లను సెర్చించి మరీ చూస్తున్నారు. వీటిలో అమ్మ కొంగు పట్టుకొని టూరింగ్‌ టాకీస్‌లో చూసిన సినిమాలు కొన్నయితే, నాన్నకు చెప్పకుండా రెండో ఆటకు చెక్కేసిన చక్కని చిత్రాలు ఇంకొన్ని. టీనేజ్‌లో ఉండగా హీరో కాలరెగరేసిన ప్రతిసారీ కాగితాలు ఎగిరేసిన చిత్రాలను గుర్తుకు తెచ్చుకొని మరీ చూస్తున్నారు. ఆ చిత్రాల సంగతులను తమ పిల్లలతో పంచుకుంటున్నారు.

పురాణ పాఠాలు
ఈ తరం పిల్లలకు పురాణేతిహాసాలపై బొత్తిగా పట్టు లేకుండా పోతున్నదని వాపోతున్నారా! బాపు ‘సంపూర్ణ రామాయణం’ ఒక్కసారి చూపించండి. దానికి కొనసాగింపుగా ‘లవకుశ’
ప్లే చేయండి. రామాయణంపై పట్టు రాకుండా ఎలా ఉంటుంది? ఇక ‘మహాభారతం’పై అవగాహన కోసం ముందుగా ‘శ్రీకృష్ణపాండవీయం’తో మొదలుపెట్టి ‘పాండవ వనవాసం’, ‘నర్తనశాల’ ..ఆనక ‘దానవీరశూర కర్ణ’ రోజుకొకటి చొప్పున వీక్షింపజేయండి. పంచమవేదం గొప్పదనం వారికి తెలిసొస్తుంది. మరింత లోతుగా అవగాహన రావాలనుకుంటే ‘భీష్మ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ ఈ లిస్ట్‌లో చేర్చండి.

క్లాసిక్‌ టచ్‌
ఇలా చెప్పుకొంటూ పోతే తెలుగు సినీవినీలాకాశంలో ధ్రువతారల్లాంటి చిత్రాలెన్నో! శాస్త్రీయకళలపై మమకారం రగిల్చిన కళాతపస్వి విశ్వనాథ్‌ ‘శంకరాభరణం’, ‘స్వర్ణకమలం’, ‘సాగర సంగమం’, సాహిత్యపు వెలుగులు పంచిన దర్శకరత్న దాసరి నారాయణరావు సృష్టి ‘మేఘసందేశం’, నవ్వుల పువ్వులు పూయించిన జంధ్యాలవారి ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘అహ నా పెళ్లంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, తెలుగు సినిమాను కొత్త కోణంలో చూపించిన వంశీ ‘సితార’, ‘అన్వేషణ’, ‘లేడీస్‌ టైలర్‌’.. ఇలా ఎన్ని సినిమాలో! ఇంటర్నెట్‌లో దొరకనిదంటూ లేదు. వీటిలో కొన్ని ఓటీటీల్లోనూ అందుబాటులో ఉన్నాయి. దర్శకుల వారీగా సినిమాల లిస్ట్‌ సిద్ధం చేసుకొని చూడటం మొదలుపెట్టండి. హీరోల జాబితాను సిద్ధం చేసుకొని ఒక్కో సినిమానూ నేటి నుంచి మళ్లీ చూడండి. ఆద్యంతం ఆస్వాదించండి. లాక్‌డౌన్‌లో ఇంతకు మించిన కాలక్షేపం ఉండదు కదా మరి.. ‘శుభం’!

బాలీవుడ్‌ గుర్తులు
సెర్చింజన్ల సమాచారం ప్రకారం తెలుగులోనేకాదు, హిందీలోనూ నోస్టాలిజా జాదూ చేస్తున్నది. బాలీవుడ్‌ క్లాసిక్స్‌ను వెతికి మరీ చూస్తున్నారు. కరోనా బాధితులు సైతం దవాఖాన బెడ్ల మీదుండి కూడా అపురూప చిత్రాలను వదలడం లేదు. ‘మొఘల్‌-ఎ-ఆజమ్‌’, ‘పాకీజా’, ‘మధుమతి’ వంటి యాభై దశకంలోని చిత్రాలను ఆస్వాదిస్తున్నారట. అరవై-డబ్భు దశకాల్లో సూపర్‌హిట్స్‌గా ముద్ర పడిన షోలే, డాన్‌, అమర్‌ అక్బర్‌ ఆంటోనీ, పడోసన్‌ తదితర సినిమాలు ఆసక్తిగా తిలకిస్తున్నారట. క్లాసిక్‌ మూవీలకు కేరాఫ్‌గా పేరున్న షామెరోమీ ఓటీటీలో సినిమాల స్ట్రీమింగ్‌ దాదాపు 200 శాతం పెరగడం ఇందుకు ఉదాహరణ. ఇతర ఓటీటీల్లోనూ పాత చిత్రాలను వెతికి చూస్తున్నారు. తొంభై దశకానికి వచ్చేసరికి ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌!’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలు ఈ తరానికి ఎక్కువగా చేరువవుతున్నాయి.

నేడే మళ్లీ చూడండి!

దగ్గరైన దూరదర్శన్‌
నడి వయసుకొచ్చిన సగటు తెలుగువాడిని నీ బాల్యస్మృతులు ఏమైనా చెప్పమని అడిగితే, ఆదివారం దూరదర్శన్‌లో ‘రామాయణం’ చూడటం దగ్గర మొదలు పెట్టి మహాభారతం, చిత్రలహరి, అంజుమన్‌ ఇలా చెబుతూనే ఉంటాడు. దూరదర్శన్‌పై ఆనాటి వీక్షకుడికి ఉన్న గురి అలాంటిది మరి. ఆ తరం వారిని మళ్లీ అలరిస్తూ, ఈ తరం వారికి చేరువ కావాలని దూరదర్శన్‌ యూట్యూబ్‌ కెక్కింది. ఇందులో కిక్కేముంది అంటారేమో! ఒక్కసారి ఆ ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చూడండి.. ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచిన ఆనందోబ్రహ్మ, భమిడిపాటి రామగోపాలం కథలు, మల్లాది కథలు, మునిమాణిక్యం వారి కాంతం కథలు.. ఇలా మనలను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ఓ పాతికేండ్ల కిందట చూసి మురిసినవే కావచ్చు! అయినా, వీటికున్న క్రేజ్‌ తెలుసుకొనే గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో దూరదర్శన్‌లో రామాయణం, మహాభారతం పునఃప్రసారం చేశారు. ఇప్పుడూ వాటిని చూస్తూ, అప్పటి అనుభవాలను గుర్తు చేసుకోవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేడే మళ్లీ చూడండి!

ట్రెండింగ్‌

Advertisement