e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు. కానీ, రాజ్యంలో మాత్రం అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ సన్నాహాలు.

కాలే వర్షతు పర్జన్యా
పృథివీ సస్యశాలినీ
దేశోయం క్షోభ రహితో
బ్రాహ్మణాస్యంతు నిర్భయః
సర్వేజనాఃస్సంతు నిర్భయః

పచ్చటి పొలాలమధ్య నిలబడి చుట్టూ చూశాడు రామభట్టు. ‘ఊరు ఊరంతా అక్కడే ఉన్నదా’ అన్నట్టు జనసందోహం. రెండు రోజులుగా నడక సాగిస్తూ.. ఊరికి చేరుకున్నాడు. ఆయన రాకకోసం ఎదురుచూస్తూ ఉన్న గ్రామస్తులంతా ఊరి పొలిమేరలోనే స్వాగతం పలికారు. గ్రామాధికారి భద్రయ్య చేతులు జోడించి వినయంగా నిలబడి ఉన్నాడు. రామభట్టు సతీమణి జానకమ్మ నిస్తేజంగా చూస్తున్నది. అసలేం జరిగిందో, ఏమి జరగనున్నదో పాపం ఆ ఇల్లాలికి ఏమీ అర్థం కావడం లేదు.
“స్వామీ.. ఏమైనా ఆహారం తీసుకున్నారా?” అదే ప్రశ్నను అయిదోసారి అడిగింది.
చిరునవ్వే సమాధానం!
“అయ్యగారూ.. ఏం జరిగింది? మిమ్మల్ని కోటలో నిర్బంధించారని, అవమానించారని రకరకాల వార్తలు వినవచ్చాయి. ఏదేమైనా మీరు క్షేమంగా వచ్చారు. చాలా సంతోషం. చూడండి, అమ్మగారి పరిస్థితి. మీరు కోటకు వెళ్లినప్పటి నుండి ఆందోళనతో ఎలా అయిపోయినారో చూడండి. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు..” భద్రయ్య చెప్తున్నదంతా విన్నాడు రామభట్టు.
“భద్రయ్యా! నా సంగతి విడిచిపెట్టు. ఊరంతా క్షేమమే కదా?” అంటూ ముందుకొచ్చి, దూరంగా కనిపిస్తున్న కొండకు దండం పెట్టుకున్నాడు.
“ఓం నమో శ్రీ లక్ష్మీ నారసింహా..”
జానకమ్మ భర్తకేసి ఆర్తిగా చూసింది. పూజాదికాలు నిర్వహించకుండా ఆయన ఎప్పుడూ ఆహారం స్వీకరించడు. మరి కోటనుండి ఈ ఊరికి రావాలంటే రెండు రోజులు పడుతుంది. ఇంతకూ ఈయన అన్నం తిన్నారా లేదా?
“స్వామీ! ఏమైనా ఆహారం తీసుకున్నారా?” మళ్లీ అడిగింది.
“జానకీ! ఈ శరీరానికి ఎంత ఆహారం కావాలి? స్వచ్ఛమైన నీరు, ప్రకృతి మాత ప్రసాదించే ఫలాలు సరిపోవా మనకు? దైవ ధ్యానం నిరంతరం మనను ఆవరించుకొని ఉంటే ఆహారం అవసరమనిపిస్తుందా? నారు పోసిన వాడికి నీరు పోయడం తెలియదా?” అంటూ భద్రయ్య కేసి చూశాడు.
“భద్రయ్యా..”
“అయ్యగారూ!”
“నేను చెప్పిన శ్లోకానికి అర్థం తెలుసుగా..” అడిగాడు రామభట్టు.
మౌనం..
“ఈ ఊరు నా కన్నతల్లి. మీరంతా నా ఆత్మబంధువులు. ఈ వృద్ధుని క్షేమ సమాచారం కోసం మీరంతా.. ఈ ఊరు ఊరంతా తల్లడిల్లి పోతున్నదంటే.. అది నా పూర్వజన్మల పుణ్యఫలం! నాయనలారా! మనది వ్యవసాయ రాజ్యం. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. నేను చెప్పిన శ్లోకానికి అర్థం అదే! ‘కాలే వర్షతు పర్జన్యా..’ అంటే సకాలంలో మేఘాలు వర్షాలను కురిపించాలి. ‘పృథివీ..’ భూమితల్లి ప్రసాదించే పంటలతో ప్రతి ఇంట సిరులు పండాలి. కరువు కాటకాలు, నివారణ లేని వ్యాధులు, బాధలు లేకుండా దేశం క్షోభ రహితంగా ఉండాలి. బ్రహ్మజ్ఞానులు, సజ్జనులు, సకల జనులు నిర్భయంగా, ప్రశాంతంగా జీవించే సౌభాగ్యాన్ని స్వామి మనందరికీ ప్రసాదించుగాక..” రామభట్టు చెప్పిన మాటలు విన్న గ్రామీణులందరూ సంతోషంతో పొంగిపోయారు. పరిపరి దండాలు పెట్టుకున్నారు.
“అయ్యాగారూ.. మీరొచ్చిన్రు. ఊరికి దైర్నం వచ్చింది” ఆనందంగా అన్నాడొక రైతు.
అక్కణ్నించి అందరూ రామాలయానికి వెళ్లారు. ఆ ఊరి రాములవారి గుడి చాలా పురాతనమైంది. రామభట్టు పూర్వీకులు అక్కడే పూజలు చేసేవారు. రామభట్టు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే తండ్రిగారు పిల్లవాణ్ని శ్రీరామచంద్రుడి పాదాలవద్ద ఉంచి.. “రామా.. వీణ్ని నీకు అర్పిస్తున్నాను” అన్నాడు. ఏ క్షణాన ఆయన అలా అన్నాడోగానీ, రామభట్టుకు రామాలయంతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆ ఊళ్లో పెండ్లిళ్లూ, పేరంటాలు, శుభకార్యాలన్నీ ఆయన చేతిమీదుగానే జరుగుతాయి. ఎవరి దగ్గరా చేయి చాచడు. తనే తనకున్నంతలో వారికి ఎంతో కొంత సాయం చేస్తాడు. అందుకే.. ‘పూజారి వరమిస్తే చాలు, దేవుడు వరమిచ్చినట్టే’ అని అనుకుంటారు ఆ గ్రామస్తులు.
తెలవారక ముందే స్వామివారికి దీపారాధన చేసి, తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటాడు.
“అయ్యగారూ.. మీకెందుకు ఈ దుక్కి దున్నే పనులు? మేము లేమా..? మిమ్మల్ని పోషించుకోలేమా?” అని ఎందరు ఎన్నిసార్లు అన్నా ఆయన పట్టించుకోలేదు.
“స్వామి అనుగ్రహం ఉంది. నా పని నేను చేసుకుంటూ, నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్తూ, జీవనం గడిపితేనే కదా.. నా రాముడు నన్ను దయ చూసేది..”
అదే ఆయన సిద్ధాంతం!
రామాలయంలో తెర తొలగించి, దీపం వెలిగించగానే శ్రీ రాముడి వదనమే కాదు, ఊరందరి మొహాలు వెలిగిపోయాయి.
అందరికీ తీర్థ ప్రసాదాలు పంచాడు.
ప్రసాదం.. జానకమ్మ అంతకు ముందే సిద్ధం చేసి ఉంచింది.
వేడిగా నిప్పులమీద వండిన పొంగలి.
అందరితోపాటు తనూ ఇంత తిన్నాడు.
అది చూసి ముసిముసిగా నవ్వుకున్నది
జానకమ్మ.
అర్ధాంగి నవ్వు చూసి తనూ నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నారు స్వామీ?”
“నువ్వెందుకు నవ్వావు జానకీ?”
“నిరాహారంగా ఉన్న తన భక్తుడికి రామచంద్ర ప్రభువే తన ప్రసాదాన్ని ఇచ్చి ఆకలి తీర్చాడు కదా అని..”
“దేవుడికి నైవేద్యం కన్నా భర్త ఆకలి తీర్చడానికే ప్రసాదాన్ని వండిన నా ధర్మపత్ని అమాయకత్వాన్ని రాముడు క్షమిస్తాడులే అని నాకు నవ్వొచ్చింది”
వీళ్లిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, కొంతమంది వ్యక్తులు హడావిడిగా వచ్చారు.
“స్వామీ! చాలా సంతోషం. మీరు ఊళ్లోనే ఉన్నారు. మా అదృష్టం” అంటూ ఆయనకు నమస్కరించారు.
“రామానుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికీ శుభం జరుగుగాక..” ఆశీర్వదించాడు రామభట్టు. తన ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి ఒకింత ఆశ్చర్యపోయాడు.
“పద్మనాభయ్యా.. అంతా క్షేమం కదా?” అని మళ్లీ అడిగాడు.
ఆ పలకరింపునకు ఎంతో సంబుర పడిపోయాడు ఆ పెద్దమనిషి.
“అయ్యగారూ.. నేను మీకు గుర్తున్నానా? ఇదిగో ఈమె నా భార్య లక్ష్మమ్మ”
లక్ష్మమ్మ ముందుకొచ్చి రామభట్టు దంపతులిద్దరికీ పాదాభివందనం చేసింది.
“దీర్ఘ సుమంగళీభవ! ఇష్టఫల సిద్ధిరస్తు”
“లక్ష్మమ్మా.. ఎట్ల ఉన్నడు నీ కొడుకు? నాకు గుర్తుంది, మీరిద్దరూ ఓనాడు మా ఇంటికి వచ్చారు. కొడుకుకు మనసు బాగ లేదని, మతి చెడి పోయిందని, కోడలుతోని పడుత లేదని చెప్పుకొని బాధపడ్డరు. ఎట్లున్నరు ఇప్పుడు?” ఆప్యాయంగా అడిగాడు రామభట్టు.
ఆ పరామర్శకే కదిలిపోయింది లక్ష్మమ్మ.
ఆమె కండ్లలో నీళ్లు తిరిగినయ్‌. రెండు చేతులూ జోడించింది.
“మీరు, అమ్మగారు.. ఆ రోజు మాకు ధైర్యం చెప్పారు. చెట్టంత కొడుకు పిచ్చివాడై పోయిండు. అది తట్టుకోలేక మా కోడలు మమ్మల్ని ఇంట్లనుండి వెళ్లగొట్టింది. ఆ పరిస్థితులలో మీరు మాకు ఎంతో ధైర్యం చెప్పారు. మీకు కలలో కనబడిన స్వామి శ్రీలక్ష్మీ నారసింహుని శరణు కోరమని చెప్పారు” దుఃఖంతో ఆమె గొంతు వణికింది.
జానకమ్మ ఆమెను దగ్గరకు తీసుకొంది.
“బాధ పడకమ్మా.. అంతా మంచిగయితది. ఏం బాధ లేదు”
ఆమె మాటలు పూర్తి కాకుండానే అన్నాడు పద్మనాభయ్య.
“అమ్మా.. అంతా మంచిగయిందమ్మా.. ఆనాడు మీరు చెప్పినట్టు నరసింహస్వామి కోసం అడివిల పడిపోయినం. కొండ ఎక్కినం. నాకేమో నమ్మకం లేకుండేది. కానీ, తల్లిప్రాణం ఊరుకోదు కదా.. నా భార్య దేవునిపైన భారం వేసింది. అక్కడ ఇద్దరు మహాపురుషులు కనిపించారు. యాదర్షి అడుగు పడిన శిలను చూపించారు. అందులో ఒకడు చిన్న పిల్లవాడు. సాక్షాత్తూ ప్రహ్లాదుడే ఆ రూపంలో వచ్చాడా అనిపించింది”
పద్మనాభయ్య మాటలు సంభ్రమంగా వింటున్నారు అందరూ..
“నమో నారసింహా.. తర్వాత ఏం జరిగింది పద్మనాభయ్యా?”
“అయ్యవారూ.. అద్భుతం జరిగింది. మమ్మల్ని వెతుక్కుంటూ మా కుమారుడు, పిచ్చివాడు అక్కడికి వచ్చాడు. రాయి తాకాడు” ఈ మాటలంటున్నప్పుడు పద్మనాభయ్యకు, లక్ష్మమ్మకు ఏడుపు ఆగలేదు.
“ఉన్నాడో లేడో అనుకున్నాను. ఉన్నాడయ్యా.. మన కోసం ఆ నారసింహుడున్నాడయ్యా.. పిచ్చివాడు ఆ శిలను తాకాడో లేదో, ఒక సింహం గాల్లోంచి ఎగిరొచ్చి దూకింది. తక్షణమే మా అబ్బాయిని ఆవహించి ఉన్న దుష్టశక్తి ఒక్కసారిగా అదృశ్యమై పోయింది. జరిగింది అర్థమయ్యేలోపే.. అద్భుతం జరిగింది. పిచ్చివాడు మామూలు మనిషయ్యాడు.. మామూలు మనిషయ్యాడు”
ఉద్వేగం ఆపుకోలేకపోతున్నారు ..
దంపతులిద్దరూ..
వింటున్న వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్విగ్నభరిత వాతావరణం.
“ఇదిగోనయ్యా.. రాములయ్యా. నా కుమారుడు, ఈమె నా కోడలు” వాళ్లిద్దరూ ముందుకొచ్చి దండం పెట్టారు.
“ఇదిగో వీడు నా మనమడు.. గోపయ్య”
రామభట్టు గోపయ్యను దగ్గరకు తీసుకొని..
“శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు” అన్నాడు.
ఆ దీవెన వింటూనే పద్మనాభయ్య, లక్ష్మమ్మ, కొడుకు, కోడలు ఆనందంతో ఉప్పొంగి పోయారు.
“ఎంత మంచిమాట అన్నారు.. అయ్యగారు మీరు! మీ దీవెన ఫలించాలి. కానీ,…” చెప్పలేక ఆగాడు పద్మనాభయ్య.
“కానీ, ఏం జరిగింది?”
“మా మనవనికి చూసిన సంబంధం, వాళ్ల తండ్రి పిచ్చోడయ్యాడని వద్దనుకున్నారు..”
“ఇప్పుడు మామూలు మనిషయ్యాడుగా!” అడిగింది జానకమ్మ.
“కానీ, వాళ్లు ఒప్పుకోవడం లేదమ్మా.. మీరు ఒక మాట చెప్తే వాళ్లు వింటారు. మీరు సమయమిస్తే వాళ్లను ఇక్కడికే రమ్మంటాను..”
“తప్పకుండా రమ్మను. మాట్లాడుదాం” అభయమిచ్చాడు రామభట్టు.
ఎందుకో ఆయనకు మహారాణి, వ్యాధితో బాధ పడుతున్న రాకుమారుడు గుర్తుకొచ్చారు.
రైతుబిడ్డను ఆరోగ్యవంతుడిగా మార్చిన ఆ అనుగ్రహమూర్తి.. శ్రీలక్ష్మీ నారసింహుడు రాజుగారి బిడ్డను రక్షించలేడా?


భువనగిరి కోట..
రాజ మందిరంలో ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతున్నది. మహారాణి వారి సమక్షంలో అనంతపాల మహాసేనాని ఆధ్వర్యంలో యోధానుయోధులందరూ గంభీరమైన వదనాలతో తీవ్రమైన చర్చలో ఉన్నారు.
విద్యాపతి లేచి సభకు అభివాదం చేసి చెప్పాడు.
“అనంతపాల సేనాని సారథ్యంలో భువనగిరి సైన్యాలు మిత్రద్రోహి విష్ణువర్ధనుడిని హతం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయి. ప్రభువులవారి ఆదేశం మేరకు, రాజ్య నిర్వహణా భారం వహిస్తున్న మహారాణీవారు తమ ఆమోదాన్ని తెలుపవలసిందిగా సవినయంగా అర్థిస్తున్నాము..”
మహారాణి చంద్రలేఖ ఏమీ మాట్లాడలేదు.
తానే స్వయంగా యుద్ధభూమిలోకి అడుగు పెట్టడానికి మానసికంగా సిద్ధపడి ఉంది.
తాను సైన్యానికి సారథ్యం వహించడం ఎవరికీ ఇష్టం లేనట్లుగా ఉంది.
“అనంతపాల సేనానీ! మనం గతంలో చర్చించినట్టు, మేమే స్వయంగా యుద్ధానికి వెళ్లదలిచాం. ఇందుకు ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా నిస్సంకోచంగా చెప్పవచ్చు. అందులో సహేతుకత ఉందని మేము భావిస్తే, తదుపరి యోచిస్తాం..”
మహారాణి నిర్ణయం ఎవరికీ సమ్మతం కాదని అక్కడున్న అందరికీ తెలుసు.
కానీ, వ్యతిరేకించే అధికారం, ధైర్యం ఎవరికీ లేదు.
ఒకవేళ నిర్దంద్వంగా వద్దకునుకున్నా.. అటువంటి అభిప్రాయాన్ని చెప్పినా, అది ‘రాజద్రోహం’గా ప్రకటితమయ్యే ప్రమాదమున్నది.
వ్యక్తిని వ్యతిరేకించే ప్రయత్నంలో వ్యవస్థకు ద్రోహిగా మారడం శ్రేయస్కరం కాదు. అలా ముద్ర పడిన వారిని ప్రభువులవారు కూడా రక్షించలేరు.
అనంతపాలుడు ఒక ఆఖరి ప్రయత్నం చేద్దామనుకున్నాడు..
“మహారాణీ! మీ నిర్ణయం శాసనం. మా అందరికీ శిరోధార్యం. మీరే స్వయంగా ప్రకటించాక, మేమందరం పాటించక తప్పదు. నా అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకురావడం, రాజ ప్రముఖునిగా నా కర్తవ్యం. మీరు అనుమతిస్తే నేను మనవి చేస్తాను..”
సభలో అవాంఛనీయ నిశ్శబ్దం అలుముకుంది.
ఈ ప్రతిపాదనలు, వాదోపవాదాలు ఎటుపోయి ఎటు దారి తీస్తాయో.. ఎవరూ ఊహించలేక పోతున్నారు.
మహారాణి ఒక్కక్షణం మౌనంగా తలపంకించింది.
మరుక్షణం అనంతపాలుడి కేసి తీక్షణంగా చూసింది. సభా మర్యాద గుర్తు చేసుకుంది.
“అనంతపాల మహాసేనానీ! మీ అంతరంగమేమిటో ఎటువంటి సందేహం లేకుండా ఈ సభకు వివరించండి. కానీ, ఒక విషయం మరిచిపోకండి. మీ సమర్థత, విధేయత, అనుభవం యుద్ధ నిర్వహణలోనే ఇంతవరకూ నిరూపితమైనాయి. కానీ, యుద్ధ నిర్ణయంలో కాదని గుర్తుంచుకోండి. చెప్పండి.. మీ ఆలోచన ఏమిటో చెప్పండి..”
మహారాణి అంత నిష్కర్షగా చెప్పిన మాటలు విన్నాక అందరికీ అర్థమైపోయింది. ఆమె ఒక గట్టినిర్ణయం తీసుకున్నారనీ, ఎలాంటి సూచననూ ఆమోదించే మనఃస్థితిలో లేరనీ!
తన అభిప్రాయం చెప్పాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డాడు అనంతపాలుడు.
“మహారాణీ! ఒకవైపు యువరాజా వారు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మరొకవైపు ప్రభువులవారు అందుబాటులో లేరు. మీరుకూడా యుద్ధ రంగానికి వెళితే రాజ్యభారం ఎవరు వహిస్తారు? పరిపాలన ఎవరు చేస్తారు? ప్రజలకు ఎవరు భద్రత, భరోసా ఇస్తారు? మీరు సహృదయంతో ఆలోచించి అనుమతిస్తే.. నేను సైన్యాలకు సారథ్యం వహించి, విష్ణువర్ధనుడిని ఓడించి విజయంతో తిరిగి వస్తాను. అతి విశ్వాసంతో కాకుండా, ఆత్మ విశ్వాసంతో వినమ్రతతో ఈ మాటలంటున్నాను..”
అనంతపాలుడి మాటలు పూర్తి కాకుండానే మహారాణి తను కూర్చున్న ఆసనం నుండి లేచి నిలబడింది.
“అనంతపాల మహాసేనానీ! మీ పరాక్రమం, ప్రభువులపట్ల మీ విధేయత మాకు తెలుసు. భువనగిరి దుర్గం, రాజ్య సరిహద్దుల సంరక్షణ బాధ్యతలు మీరు తీసుకోండి. మీ విధి నిర్వహణపై మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. విద్యాపతి కవి వరేణ్యా! యుద్ధానికి తగిన ముహూర్తం నిర్ణయించండి. రెండు సూర్యోదయాల శుభ ఘడియల లోపున!…” అంటూ సభకు అభివాదం చేసి, చరచరా సభనుండి వెళ్లిపోయింది మహారాణి.
అనంతపాలుడు అవమానం భరించలేక ఎర్రబడిన మొహంతో విద్యాపతికేసి కోపంగా చూశాడు.
అది గమనించి దళపతులు ఒకరి మొకం ఒకరు చూసుకొని నిశ్శబ్దంగా సెలవు తీసుకొని నిష్క్రమించారు.
అనంతపాలుడు, విద్యాపతి.. ఇద్దరే మిగిలారు.
తమ నోటి వెంట ఏ మాట వస్తే ఇతరుల నుండి దానికి ఎటువంటి ప్రతిస్పందన వస్తుందోనని మౌనంగా ఉండిపోయారు.
“విద్యాపతి వివరేణ్యా! ఆలోచనలకు తగిన సమయం లేదు. విష్ణువర్ధనుడు మన సరిహద్దు దుర్గాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. రాణీవారిని యుద్ధభూమికి పంపించి, మనం ఇక్కడ ఉండి చేయగలిగిన రాచకార్యాలేమీ లేవు. కానీ, ఈ సంగతి ఆమె అర్థం చేసుకొనే పరిస్థితులు లేవు. ఏదేమైనా తెల్లవారేప్పటికి మన సైన్యాలు కోటదాటి బయలుదేరాలి..”
“అనంతపాల సేనానీ! ప్రభువులవారు రాగలిగితేనే ఇది పరిష్కారం అవుతుంది..”
ఇంతలో కోలాహలం వినిపించింది.
దళపతి సింగన్న పరుగు పరుగున వచ్చి.. దాదాపు అరిచినంత గట్టిగా చెప్పాడు..
“సేనానీ.. ప్రభువుల వారు కోటకు తిరిగొచ్చారు..”
“భగవంతుడా.. ఎంత శుభవార్త!” అన్నాడు విద్యాపతి.
“సమస్యకు పరిష్కారం దొరికినట్టే.. ప్రభువుల వారి ఆజ్ఞ తీసుకొని సైన్యాలను సిద్ధం చేస్తాను..” అంటున్న అనంతపాలుడి మాటలకు అడ్డొస్తూ..
“కానీ, త్రిభువనమల్ల చక్రవర్తి మన మాటలు వినే పరిస్థితిలో లేరు..” అన్నాడు సింగన్న.

“అమ్మా.. అంతా మంచిగయిందమ్మా..
ఆనాడు మీరు చెప్పినట్టు నరసింహస్వామి కోసం అడివిల పడిపోయినం. కొండ ఎక్కినం.
నాకేమో నమ్మకం లేకుండేది.
కానీ, తల్లిప్రాణం ఊరుకోదు కదా..
నా భార్య దేవునిపైన భారం వేసింది. అక్కడ ఇద్దరు మహాపురుషులు
కనిపించారు. యాదర్షి
అడుగు పడిన శిలను చూపించారు. అందులో ఒకడు చిన్న పిల్లవాడు. సాక్షాత్తూ ప్రహ్లాదుడే ఆ రూపంలో వచ్చాడా అనిపించింది”
పద్మనాభయ్య మాటలు సంభ్రమంగా వింటున్నారు అందరూ..
“నమో నారసింహా..
తర్వాత ఏం జరిగింది పద్మనాభయ్యా?”

(మిగతా వచ్చేవారం)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement