e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home బతుకమ్మ శత్రు దుర్భేద్యం.. మొలంగూర్‌ ఖిల్లా!

శత్రు దుర్భేద్యం.. మొలంగూర్‌ ఖిల్లా!

శత్రు దుర్భేద్యం.. మొలంగూర్‌ ఖిల్లా!

13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన ప్రతాపరుద్రుడి సైనికాధికారుల్లో ఒకరు.. ‘ఒరగిరి మొగ్గరాజు’. ఆయనే ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. శత్రు దుర్భేద్యంగా నిర్మితమైందీ కోట. రెండు గుట్టల నడుమ కోటకు తూర్పు, పడమరల దిక్కులో విశాలమైన ప్రవేశద్వారాలున్నాయి. గుట్టపైకి ఎక్కడానికి మెట్ల మార్గమున్నది. గుట్టమధ్య విశాలమైన పరుపు బండపై నడవడం కష్టమైన పనే. పరిపూర్ణ ఆరోగ్యవంతులు మాత్రమే శిఖరానికి చేరుకోగలరు. అప్పట్లో ఈ దుర్గమమార్గం గుండా పాలకులూ సైనికులూ ఎలా పైకి వెళ్లారన్నది ఊహకందని విషయం. గుట్టపైకి వెళ్లే మార్గంలో ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తున్నది.

విశాల మైదానం
ఏకశిలతో అలరారే మొలంగూర్‌ ఖిల్లా గుట్ట పైభాగం మొత్తం సమతలంగా ఉంటుంది. చుట్టూ రాతి ప్రాకారాలు, మధ్యలో కోట బురుజులు నిర్మితమయ్యాయి. నాటికాలంలో కోట రక్షణకోసం ఖిల్లా శిఖరాగ్రానికి నలువైపులా మర ఫిరంగులతో సైనిక పహరా ఉండేది. వీటిలో ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉంది. ఈ ఉక్కు ఫిరంగి, అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని నేటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. కొండపైన అక్కడక్కడా రాళ్ల మధ్యలోంచి అంతుచిక్కని సొరంగ మార్గాలున్నట్లు తెలుస్తున్నది. రాళ్ల వంపుతో సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరులూ కనిపిస్తాయి. ఇవే, నాటి సైనికుల దాహం తీర్చేవి. వీటితోపాటు ఇక్కడ వీరభద్ర, శివ, హనుమాన్‌ ఆలయాల శిథిలాలూ దర్శనమిస్తున్నాయి. శిఖరాగ్రంపై దక్షిణదిశలో దీపశిఖలున్నాయి.

స్థానికులు ప్రతి శుక్రవారం గుట్టపైకి వెళ్లి, ఈ దీపశిఖల్లో గండదీపాలు వెలిగించడం నేటికీ ఆనవాయితీగా వస్తున్నది. ఘనమైన చారిత్రక నేపథ్యమున్న మొలంగూర్‌ ఖిల్లా నాటి పాలకుల నిరాదరణకుతోడు, గుప్తనిధుల తవ్వకాలతో శిథిలావస్థకు చేరింది. గుట్టపైన, కింద కట్టడాలెన్నో నేలకూలాయి. కోట, పరిసరాలను సంరక్షించడంతోపాటు చారిత్రక సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలో 2018 ఆగస్టులో అప్పటి బల్దియా కమిషనర్‌ (ప్రస్తుత కలెక్టర్‌) శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, స్థానిక యువకులతో కలిసి గుట్టపై ట్రెక్కింగ్‌ నిర్వహించారు. నడకమార్గం క్లిష్టంగా ఉన్న పరుపుబండపై రెయిలింగ్‌ ఏర్పాటుచేశారు. దిగువ భాగాన హైమాస్ట్‌ లైట్లనూ అమర్చారు. ఖిల్లాను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కొంతవరకు కృషి చేశారు.

‘దూద్‌బావి’ ఘనత
గుట్ట దిగువన ప్రసిద్ధమైన ‘దూద్‌బావి’ ఉన్నది. మొలంగూర్‌ అంటేనే ‘దూద్‌బావి’ అన్నట్లుగా దీని ఖ్యాతి ఎల్లలు దాటింది. ఈ బావిలోని నీళ్లు పాలలా స్వచ్ఛంగా, తీయగా ఉంటాయి. అప్పట్లో గోల్కొండ ప్రభువు సైతం ఈ నీటిని గుర్రపు బగ్గీపై భాగ్యనగరానికి తెప్పించుకొని తాగేవారని స్థానికులు చెబుతారు. ఈ నీటిని తాగితే ఎలాంటి వ్యాధులూ దరి చేరవని స్థానికుల నమ్మకం.

-గోపు శ్రీనివాస్‌ రెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శత్రు దుర్భేద్యం.. మొలంగూర్‌ ఖిల్లా!

ట్రెండింగ్‌

Advertisement