ఫలానా రాణిగారి ఆభరణం అనగానే ఎక్కడ లేని విలువ వస్తుంది. ఏ మొఘల్ సుల్తానో వాడిన పిడిబాకు అని చెప్పగానేఎంతైనా చెల్లించడానికి విశ్వకుబేరులు సిద్ధంగా ఉంటారు. కొన్ని వస్తువులంతే. కాలం గడిచేకొద్దీ విలువ పెరుగుతుంది. ఆ అరుదైన సంపదను అంతర్జాతీయ మార్కెట్లో వేలం వేస్తుంది ‘అష్టగురు’!
ప్రాచీనమైన ఆభరణాలు, వింటేజ్ కార్లు, కళాఖండాలు, హస్తకళలకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. ఎంత ధర పెట్టేందుకైనా కుబేరులు ముందుకొస్తారు. ఆర్థిక కారణాలతోనో, మరో కారణంతోనో వాటిని విక్రయించేందుకు యజమానులూ సిద్ధంగా ఉంటారు. ఆ ఇద్దరిమధ్యా వేదికే ‘అష్టగురు’! ఆ సంస్థ వెబ్సైట్ క్లిక్ చేసినా చాలు. కళ్లు చెదిరిపోతాయి. ఐరోపానుంచి భారత ఉపఖండం వరకు దేశదేశాల నుంచి సేకరించిన అరుదైన కళాసంపద అక్కడ దర్శనమిస్తుంది. హైగ్రేడ్ వజ్రాలు, బాస్రా ముత్యాలు, కొలంబియన్, జాంబియస్ పచ్చల హారాలు, మరకతమణులు, బర్మీస్ మాణిక్యాలు, రత్నాలు పొదిగిన హారాలు .. వేలం పాటద్వారా ఇక్కడ సొంతం చేసుకోవచ్చు. అసాధారణమైన పనితనం, కచ్చితత్వం, నాణ్యత వీటి సొంతం. ఖరీదైన చేతి గడియారాలూ అనేకం ఉన్నాయి. గోడ గడియారాల పనితనమైతే అబ్బుర పరుస్తుంది. వీటితోపాటుగా వెండితో చేసిన పురాతన కళాఖండాలను కూడా వేలంలో దక్కించుకోవచ్చు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా కొన్నేండ్లనుంచీ వీటిని సేకరిస్తున్నట్లు ‘అష్టగురు’ జ్యువెలరీ స్పెషలిస్ట్ జయ్సాగర్ చెబుతున్నారు. ఆసక్తి ఉంటే మీరే ఓసారి www.astaguru.comను సందర్శించండి.