e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home బతుకమ్మ అన్నదాతకు ఆన్‌లైన్‌ గురువు!

అన్నదాతకు ఆన్‌లైన్‌ గురువు!

అన్నదాతకు ఆన్‌లైన్‌ గురువు!

ఏ సీజన్లో ఏ పంట వేయాలి? ఎన్ని ఎకరాలకు ఎంత విత్తనాలు సిద్ధం చేసుకోవాలి? మార్కెటింగ్‌ ఎలా? సస్యరక్షణ ఎలా? తదితర విషయాల్లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తుంటారు. కానీ, మహారాష్ట్రలో ఓ యువకుడు ఈ బాధ్యత తీసుకున్నాడు. యూట్యూబ్‌ వేదికగా దాదాపు 1000 మంది అన్నదాతలకు ఆసరాగా నిలుస్తున్నాడు.

గణేష్‌ ఫర్టాడే.. సామాజిక మాధ్యమంలో రైతులకు సాగు సలహాలు ఇస్తాడు. యూట్యూబ్‌ చానల్‌ద్వారా సేద్యం పట్ల అవగాహన కల్పిస్తున్నాడు. సక్సెస్‌ స్టోరీలు, లాభసాటి వ్యవసాయ విధానాలు, సేంద్రియ సాగు, ఆధునిక పద్ధతులు, సస్యరక్షణ చర్యలు.. తదితర అంశాలపై రైతన్నకు సమాచారం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాడు.

రైతుల అభ్యర్థనలు
మహారాష్ట్రలోని గెవ్రాయ్‌ గణేష్‌ సొంతూరు. అది మరఠ్వాడా ప్రాంతమైన బీడ్‌కు సమీపంలో ఉంది. గెవ్రాయ్‌ కరువు ప్రభావిత సీమ. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతాయి. గణేష్‌ కుటుంబానికి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. కానీ, ఏనాడూ పంట పండింది లేదు. పైకం అందుకున్నదీ లేదు. పేరుకు రైతు కుటుంబమే. కానీ, పూట గడవకపోయేది. ఇట్లాంటి పరిస్థితుల మధ్య పెరిగిన గణేష్‌, వ్యవసాయం గురించి లోతుగా ఆలోచించేవాడు. రైతాంగ సమస్యలపట్ల స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొన్నాడు. ఆ పరిజ్ఞానంతోనే ఒక అడుగు ముందుకేశాడు. రైతుల్లో కొత్త ఆశలు కలిగించడానికి 2019లో ‘టిక్‌టాక్‌’ను అస్త్రంగా మార్చుకున్నాడు. వీడియోలద్వారా రైతులకు ఆలోచనలు అందించాడు. లక్షలమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. కానీ, టిక్‌టాక్‌ను నిషేధించేసరికి రైతులకు, గణేష్‌కు మధ్య అగాథం ఏర్పడింది. ‘వేరే ప్లాట్‌ఫామ్‌లోకి రండి’ అంటూ రైతులనుంచి అభ్యర్థనలు వచ్చాయి. అప్పుడే, ‘రాయల్‌ శెట్కారి’ చానెల్‌ను ప్రారంభించి, రైతులకు మరింత దగ్గరయ్యాడు. లక్షమంది సబ్‌స్ర్కైబర్లుగా చేరారు. ప్రస్తుతం, సగటున నెలకు ఎనిమిది లక్షలమంది ప్రేక్షకులు ఉన్నట్లు ఒక అంచనా.

మారిన కంటెంట్‌
గణేష్‌ చొరవకు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మద్దతు తెలిపారు. అయితే, యూట్యూబ్‌కు మారిన కొత్తలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇక,‘నావల్ల కాదు’ అనుకునేన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. టిక్‌టాక్‌ అయితే 30 సెకన్ల వ్యవధి ఉంటుంది. చిన్న వీడియోలే అయినా పెద్ద సందేశాలను ఇచ్చేవి. కానీ, యూట్యూబ్‌ ద్వారా తనను నమ్ముకున్న రైతులకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని అనిపించింది. సమస్యకు మూలం ఎక్కడుందో తెలుసుకున్నాడు. ప్రేక్షకులు కోరిన సమాచారం ఇచ్చేందుకు, కొంతకాలం లోతైన అధ్యయనం చేశాడు. కంటెంట్‌ మార్చాడు. జర్నలిజం విద్యార్థి కాబట్టి, కవితాత్మక ధోరణిని అవలంబించాడు. యూట్యూబ్‌ కూడా ఎక్కువ వీడియోలను అనుమతించింది. మళ్లీ గాడిలో పడ్డాడు.

90% పరిష్కారం
గణేష్‌ వ్యవసాయ సూచనల ప్రభావం ఏపాటిదో చెప్పడానికి కృష్ణ అనే రైతు అనుభవం ఒక్కటి చాలు. కృష్ణ తన పొలంలో పత్తి పండించేవాడు. ప్రతీ యేడూ నష్టమే. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గణేష్‌, ఏ పంట వేస్తే బాగుంటుందో అవగాహన కల్పించాడు. తృణధాన్యాల సాగు గురించి వివరించాడు. రెండు పంటల్లోనే కృష్ణ లాభసాటి రైతు కాగలిగాడు. సబ్‌స్ర్కైబర్లు పెరుగుతున్న కొద్దీ కంటెంట్‌ను పెంచుతూ వెళ్లాడు గణేష్‌. నిపుణుల ద్వారాకూడా సాగు సలహాలు ఇప్పించేవాడు. 90% రైతుల సందేహాలను నివృత్తి చేసే సత్తా అతడికి ఉంది. మిగతా 10% కోసం నిపుణుల సాయం కోరేవాడు. ఇలా యూట్యూబ్‌ జర్నీ కొనసాగుతుండగానే, పీజీ పూర్తి చేశాడు. ఒక నిపుణుల బృందాన్ని ఏర్పరచుకొని 24 గంటలూ అందుబాటులో ఉండే ఒక రైతాంగ సంస్థను స్థాపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు.

రోజూ 1000 మంది
మొదటి ప్రయత్నంగా ఎలక్ట్రిక్‌ మోటారు గురించి వీడియో పెట్టాడు గణేష్‌. ‘ఎలాంటి మోటారు కొనుగోలు చేయాలి? పరికరాలను ఎక్కడ తీసుకోవాలి?’ తదితర అంశాలపై రైతులకు విలువైన సమాచారం ఇచ్చాడు. చాలామంది రైతులకు ప్రభుత్వ కార్యాలయాల్లో భూసమస్యలను పరిష్కరించు కోవడంలో సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు అధికారులు స్పందించరు. ఇలాంటి విషయాల్లోనూ రైతులకు మార్గనిర్దేశనం చేసింది రాయల్‌ శెట్కారి. నీటి సంరక్షణ, భూగర్భ
జలాలు, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులు, మంచి పంటలను ఎంచుకోవడం.. వంటి అంశాలను తరచూ చర్చకు లేవనెత్తుతుంటారు రైతులు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నదాతకు ఆన్‌లైన్‌ గురువు!

ట్రెండింగ్‌

Advertisement