తొక్కు లేని విస్తరి డ్యూయెట్ లేని సినిమా లాంటిది! చప్పచప్పగా ఉంటుంది. అదే పచ్చడి తోడైతే, అదీ నాన్-వెజ్ పచ్చడైతే.. అదిరిపోయే ఐటమ్ సాంగే! కాబట్టే, ముక్క లేందే ముద్ద దిగని వాళ్లంతామాంసాహార పచ్చళ్లను ప్రేమించేస్తున్నారు. వీటికో వెసులుబాటు ఉంది. ఓపికుంటే పెట్టుకోవచ్చు, కష్టం అనుకుంటే కొని తెచ్చుకోవచ్చు.
ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా ఏదో ఒకటి కంచుట్లో ఉడికి కంచంలో చేరాల్సిందే. ముక్క కొరకాలంటే ఆదివారం వరకు ఆగాలా? అక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వడ్డించుకునేలా పచ్చడి చేసి నిల్వ చేసుకోవచ్చు. అన్నిరకాల నాన్‌వెజ్ పచ్చళ్లను ఇంట్లోనే పెట్టుకుని ఆరగించేయవచ్చు.
సమస్యంతా నూనెతోనే. అంతంత నూనె ఆరోగ్యానికి మంచిది కాదు. ఖరీదైన వ్యవహారమే అయినా ఆలివ్ ఆయిల్ వాడితే ఎంతోకొంత నయం. ఉప్పు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత తక్కువ వాడాలి. లేదంటే, మధ్యేమార్గం ఉండనే ఉంది. ముప్పూటలా వాడకుండా.. ఎప్పుడో ఓసారి మితంగా ఆరగించాలి.
చికెన్ పచ్చడి తయారీలోనూ ఊరగాయ విషయంలోతీసుకున్నన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నీళ్లు తగలకుండా జాగ్రత్త పడితే, నెలరోజులైనా నిల్వచేసుకోవచ్చు. సరైన మోతాదులో లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఉప్పు, కారం, పసుపు మేళవించిన పచ్చడి ఔషధం లాంటిదే. జలుబు, రొంప పరార్.
వండిన కూర నచ్చకపోయినా, నోటికి కాస్త కారంగా తినాలని అనిపించినా, ఎప్పుడూ తినే కూరగాయలు బోర్‌కొట్టినా.. చికెన్ పచ్చడిని రంగంలో దించొచ్చు! కడుపునిండా కుమ్మేయవచ్చు. నిజానికి, చికెన్ కూరకంటే, పచ్చడి రుచే ఎక్కువ. సరైన ఉప్పు, కారం, మసాలాలతో నూనెలో తేలే నిల్వ పచ్చడిని వేలితో నాలుకకు అద్దుకుంటే జిహ్వ
‘వహ్వా’ అనాల్సిందే.
జీవక్రియను సమన్వయపర్చడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది చికెన్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలం. తక్షణ శక్తిని ఇవ్వడంలోనూ దోహదపడుతుంది. చేపలు, పీతలు, రొయ్యలతోనూ నిల్వ పచ్చళ్లు చేస్తున్నారు. వీటిలోనూ అపారమైన పోషక విలువలు ఉంటాయి.
పచ్చడి తయారీలో బోన్‌లెస్ చికెనే వాడుతారు. ముక్కలను కూరకంటే కాస్త చిన్నగా కోసుకుంటే సమంగా ఉడుకుతాయి. ఈ పచ్చడిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో పెడతారు. కొందరు ఉప్పూకారం కలిపిన చికెన్‌ను నేరుగా నూనెలో వేయిస్తే, మరికొందరు కాసేపు నీటిలో ఉడికించిన చికెన్‌ను నూనెలో వేయిస్తారు.