ఆధునిక మహిళలకు రకరకాల సవాళ్లు! వివక్షను ఎదుర్కొంటూనే చదువుల్ని సాగించాలి. కుటుంబాన్ని గమనించుకుంటూనే ఉద్యోగ బాధ్యతలూ మోయాలి. ఒకవేళ గృహిణిగా ఉన్నా, ఇంట్లోవారి అవసరాలను చూసుకోవాలి. ఇవి కాకుండా, వారిని ప్రత్యేకంగా విసిగించే అనారోగ్యాలు ఎలాగూ ఉంటాయి. చాలా సందర్భాలలో ఈ రుగ్మతలు వారి మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. తెలియని అశాంతికి గురిచేస్తాయి. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉందంటున్నారు న్యూయార్క్ ప్రొఫెసర్లు. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అది మహిళల మనసు మీదా సానుకూల ప్రభావం చూపుతుందని తేల్చారు. ఫాస్ట్ ఫుడ్, ఉదయం అల్పాహారం తినకపోవడం, కెఫిన్ పదార్థాలు తీసుకోవడం, శరీరంలో చక్కెర త్వరగా కలిసిపోయే ఆహారాన్ని (హై-గ్లెసిమిక్) ఆరగించడం.. వగైరా అలవాట్లకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. అందుకు బదులుగా పండ్లు, ఆకుకూరలు తీసుకుంటే చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు.