e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home కథలు ఈవారం కథ.. సుక్క బర్రె

ఈవారం కథ.. సుక్క బర్రె

ఈవారం  కథ.. సుక్క బర్రె

అడవుల్లో తిరిగే జంతువులు, వృక్షాలమీద కొందరు పరిశోధన చేస్తుంటారు. కొంతమంది దేశంలో జరుగుతున్న అల్లకల్లోలాలను, ఉద్యమాలను అధ్యయనం చేస్తుంటారు. మరికొంతమంది చంద్రమండలాన్ని, నక్షత్రకూటమిని శోధిస్తుంటారు. కానీ, మనుషుల లోపల కూలుతున్న మమతల గోడలు, వాటి శిథిలాల గురించి ఎవరికి కావాలి.ప్రతి ఊరినావహించి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ‘ఊరికి వ్యక్తిత్వమేమిటని’ ఆశ్చర్యంగా అనిపించినా ఆ ఊరూ, ఆ మనిషీ గుర్తుకురాగానే, నాలో నేనే విషాదంగా నవ్వుకుంటాను. అవి నేను రీసెర్చ్‌ చేసే సమయంలో ముఖ్యమైన చాప్టర్లు. నా జీవితానుభవంలో మమేకమైపోయిన జ్ఞాపకాలు, గుర్తులు..

అక్కడంతా నిశ్శబ్దం.“ఆ చల్లని సముద్రగర్భం.. దాచిన బడబానలమెంతో..”గంభీరమైన ఆ గీతంలో భావరాగ స్వరాలెంతగా కదిలిస్తాయో ఆమె కనుకొనుకుల్లో నుండి పొంగి పొర్లుతున్న దుఃఖం నన్ను కుదిపేస్తుంటుంది.ఆమె అసలు పేరు తెలియదు. ఆ ఊర్లో అందరూ ‘పాలమ్మ’ అంటారు. పాడిపశువులే ఆమె జీవితం, సంతోషం, సర్వస్వం. వాటికీ, ఆమెకూ ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే, ఆమె గతంలోకి తొంగి చూడాల్సిందే! ఆనాడు ఆడపిల్లకు పసుపు కుంకుమ కింద పాడి పశువును ఇచ్చి పంపడం ఆనవాయితీ. ఆ విధంగా ఆమెతోపాటే తెచ్చుకున్న సుక్కబర్రె, ఎన్ని ఈతలైనా అన్నీ ఆడదూడల సంతతితో ఆమె చేతుల్లోనే పుట్టి పెరిగినయ్‌. ఆమె అన్నిటినీ ముద్దుగా ‘సుక్కబర్రె’, ‘సుక్కదూడ’ అనే పిల్చుకునేది. ఆ విధంగా ఆ బర్రె సంతతితో ఆమె ఇల్లు ఒక పాల సంద్రమైంది.“దొడ్డంతా బర్రెలే నిండె.. నా బురద పొలానికి నాగలి కట్టేందుకు ఒక్క మగదూడను కనకపాయె..” మనసులో నవ్వుతూ అనేవాడు ఆమె భర్త.

- Advertisement -

నేను చిన్నప్పుడు వెళ్లిన మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్లాలనిపించి బయల్దేరాను. ఈ మధ్యకాలంలో పల్లెలు చాలా అభివృద్ధి చెందాయని, పల్లె గురించి రీసెర్చ్‌ చేస్తున్న. నా థీసిస్‌కి ప్రత్యక్షంగా కథనం కోసం కూడా ఒక నెపంగా వెళ్లా. మా మేనమామ కొత్తగా పెట్టిన డెయిరీ ఫామ్‌ను చూపిస్తానని తీసుకెళ్తూ, మధ్యలో ఒక ఇంటిముందు ఆగి-“ఇదే నాతో పొత్తు కలుస్తానని వెంట పడుతున్న చిన్నప్పటి స్నేహితుడు సత్యబాబు ఇల్లు” అన్నాడు.“అంటే, నీకు ఇష్టం లేదా మామా? వెంట పడుతున్నాడంటున్నావు?” అడిగాను.“వాడు వట్టి బద్ధకస్తుడు. కాకపోతే, వాళ్లమ్మకు దొడ్డినిండా బర్రెలే. అవి పేరు మోసిన గౌడి బర్లకన్నా ఎక్కువ పాలిస్తయి. కొడుకులమీద కోపంతో ఈ మధ్యన పాలన్నీ మిల్క్‌ బూత్‌కు పంపించుకుంటుందట”“అంటే.. వాళ్లకు పోయకుండానా?”“వాళ్లకెందుకు పొయ్యదు. ఆమె పేరే పాలమ్మ.

ఎవ్వరు అడిగితే వాళ్లకు లేదనకుండా పోస్తది”“మరి కొడుకులమీద ఎందుకు కోపం?”“పక్కనే ఉండి ఏమీ పట్టించుకోక.. పైగా వాటిని అమ్ముకుందామంటున్నరట.. అందుకే”ఆ విధంగా మాట్లాడుకుంటూనే ఇద్దరం డెయిరీ ఫామ్‌ దాకా నడుచుకుంటూ వెళ్లాం. అక్కడికి పోగానే మామ అక్కడి పనులన్నీ చూసుకుంటూ, అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, నాకు మాత్రం పాలమ్మ గురించే ఆలోచన కలుగుతోంది. కాసేపటికి అక్కడున్న ఒక సిమెంట్‌ బెంచీమీద ఇద్దరం కూర్చున్నాం. మామ తన డెయిరీ ఫామ్‌కైన ఖర్చు గురించి, ఇచ్చే పాల గురించి, పచ్చి పాలలో వెన్న తీసే మిషిన్‌ గురించి.. ఇంకా ఏదేదో చెప్తున్నాడు. ‘పాలు తీసే మిషిన్‌ కొనాలి’ అనుకుంటున్నట్లు చెప్తూ-“సత్త్తిబాబు వాళ్ల అమ్మకు వయస్సు మళ్లింది. బర్రెలన్నీ అమ్మేస్తానంటున్నది. మాక్కాకుండా ఆమెను వేరేటోళ్లకు అమ్మనిస్తమా? వాళ్ల అన్నకు అన్నో ఇన్నో పైసలిచ్చి తానే బర్లను తోలుకొచ్చుకొంటానని సత్తిబాబు అంటుండు. నాతోపొత్తు కలుస్తనని చెబుతుండు. అవి చక్కదనాల పాడి బర్లు. ఇవ్వాళ్ల సాయంత్రం వాటిని చూసి పొమ్మన్నడు. నా కొడుకు గూడ వస్తడు. చూద్దాం” మామ మాటలకు ఆ పాలమ్మను చూడొచ్చనే ఆత్రుత కలిగింది నాకు.

సాయంత్రం బర్రెగొడ్లను చూసొచ్చిన రాకేశ్‌ను-
“ఎట్ల ఉన్నయిరా బర్రెగొడ్లు?” అడిగిండు మామ.
మామ కొడుకు రాకేశ్‌ ముఖమంతా జేబురించుకుంటూ-
“ఏమో, నాయ్న నాకిష్టం లేదు. ఆ పాలమ్మ కండ్లళ్ల నీళ్లు కనపడుతున్నయ్‌. ఆమె మనల్ని మింగినట్టు కొరకొర చూస్తంది. మనమేందో పుణ్యానికి బలవంతంగా ఆమె సొమ్ము దోచుకున్నట్టు..” చిరాకుగా అన్నాడు.
“ఉంటుందిరా. నాకా పాలమ్మ బాధ తెలుసు. ఆ తల్లిని నా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా. ముసిముసి చీకట్ల లేచి వొంగబడి కొట్టాన్ని అద్దమోలె శుభ్రం చేయడం, బర్లకు గడ్డేయడం, సూడిబర్లను పురిటికొచ్చిన బిడ్డ లెక్క చూసుకోవడం చూసి, ఆ అమ్మ చెయ్యి తీరు మంచిదని ఊర్లందరూ అనుకునేటోల్లు. ఆమె పిల్లలతోపాటే వాటినీ పెంచుకున్నది. ‘పాలమ్మా.. బర్రెగొడ్లను భలే సాదుతున్నవ్‌’ అని ఎవరన్నా అంటే, ‘కాదు.. కాదు.. కరువుల్ల, కాలాల్ల అవే మమ్మల్ని సాదుతున్నయ్‌’ అని తృప్తిగా నవ్వుతుండేది. ఆవూ దూడలకు మేత తినిపించిన తర్వాతనే తన పిల్లలకు అన్నం పెట్టుకునేది. ఆ సూరిబాబుకూ, నాకూ చిన్నప్పటి నుంచీ దోస్తానం కదా. చెట్లకు ఉయ్యాలలు కట్టుకొని ఊగుకుంట, ఆడుకుంట అక్కడ్నే ఉండేటోన్ని. సాయబాన్ల పెద్దదాలి వుండేది. పిడకలమీద పెద్ద కుండెడు పాలు ఎర్రగా కాగుతుండేవి. ‘తాగుండ్రిరా..’ అనుకుంట బెల్లం కలిపిన పాలను తన కొడుకులతోపాటు నాకూ పోసేది.

ఎంత రుచి ఆ పాలకు. పాలటికెను కవుచిప్పతో గీకుతున్న చప్పుడు కాంగనే అందరం ఉరికి, చుట్టూ చేతులు చాపుకొని కూచునేటోళ్లం. ఆ గోకు, ఆ పాలు.. అబ్బ.. ఎంత రుచి! ఇప్పటికీ అనుకోంగనే ఆ రుచి నాలుకమీద తెలుస్తునే ఉంటది. ఆమె చల్లకవ్వం పెట్టి, పెద్ద కుండెడు చల్లచేసి ఊళ్లో వాళ్లకు పోస్తూనే ఉండేది. కొంతమంది కూరగాయలు, ఇంకొంతమంది మెత్తడి తవుడు, తెలకపిండి తెచ్చి పెట్టెటోళ్లు. ఈ విధంగా వస్తుమార్పిడి తప్ప, పైసల బేరం లేదు. అసలు పైసెట్లుంటదో మా చిన్న పోరగాళ్లకు తెల్వకనే పోయేది. అయినా, పల్లెల్ల పైసలెందుకు? పాడి, పంట.. ఈ రెండే జనాన్ని సాదినయ్‌. ఏమో.. ఆ తరం వెళ్లిపోయింది. పాడుకాలం మోపైంది..”
విరక్తిగా అంటున్న మామ మాటలకు నా మనసులో ఏవేవో ఆలోచనలు. అవేంటో తెలుసుకుంటుంటే, మనమేంటో అర్థమైపోతుంది. ఇప్పటివాళ్లకు అన్నీ గొప్పలే. చెప్పుకోవడం తప్ప, చేతలు లేవు. వాళ్లకు చేతలు తప్ప, మాటలు రావు. ఈ కాలంలో మరీ వాట్సప్‌, ఫేస్బుక్‌ లొచ్చినాక నీతుల పుట్టలే! అవన్నీ నీటిలో రాతలే.

“చల్లతో ఊరోళ్లందరి కడుపులు చల్ల చేసేది. అంత చేసినా.. ఇదేందో గొప్పనిగానీ, అందరికీ తెలవాలనిగానీ ఆమె అనుకోలేదు” అంటూ మామ మళ్లీ చెప్పుకుపోతున్నాడు.“పాలమ్మ మొగడు కూడా వ్యవసాయంల దిట్ట. నలుగురైదుగురు పాలేర్లు ఉన్నా వీళ్లకు తగ్గట్టు ‘రాజాలు’ అనే పాలేరు మంచి పనోడు. వాడి పనితనాన్ని చూసి, ఊళ్లో ఎంతోమంది ఎక్కువ జీతం ఇస్తానన్నా ఆ ఇంటి మనుషులకూ, పశువులకూ, తనకూ మాటా మంచి కలిసిందనీ, ఆ ఇలు ్ల వదిలి కాస్త ఎక్కువ జీతానికి ఆశపడి పోకపోయేటోడు. అసలు అతనికి రాని పనిలేదు. చేయని పనిలేదు. వొళ్లు దాచుకోవడం అంటే ఆ రోజుల్లో చాలామందికి తెలియదు. ఈ పనెందుకు చేయాలని వచ్చిన పని ఎగ్గొట్టే కువారాలు అప్పుడు లేవు. అందుకే, మనసు శుభ్రంగా ఉండి, పని చేస్తుంటే ఏ రోగాలూ ఉండక పొయ్యేవి..” “మరి పెద్దకొడుకు ఏం పని చేస్తాడు మామ?” అడిగాను.“ఆస్తి పంపకాలప్పుడు ‘నాకే వాటాలొద్దు. రెండర్రలు, నా బర్రెగొడ్లు నాకుంచుండ్రి. నా జీవి ఉన్నంతకాలం వాటికి నేను, నాకు అవి అనుకుంట.. వాటిని సాదుకుంట బతుకుత’ అన్నది. పెద్ద కొడుక్కు ఖర్చు పెట్టుకొనేందుకు ఎప్పుడూ చేతినిండా పైసుండాలె. ‘వ్యవసాయంల ఏం పాడయింది. దండుగ పని. మా నాయన పిచ్చోడు. రోగమొచ్చినా భూమి అమ్మొద్దంటడు. గందుకే డాక్టరద్దు.. మందులద్దు అనుకుంట రోగాన్ని ముదర బెట్టుకొని సచ్చి పోయిండు’ అనుకుంటనే లీడర్‌ గిరి పేరుతో రాజకీయాల్లో దిగిండు. ఏ నాయకుడినో అవుతనని కలలు గంటూ గడి కింత భూమి నమ్మిండు. ఆఖరికి పెండ్లాం మెడల బంగారం కూడా పాడు చేసిండు..”

“మామా.. నీకు ఇవన్నీ ఎలా తెలుస్తయి?” అడిగాను.“ఎందుకు తెలవదు? అప్పుడప్పుడూ వాళ్ల ఇంటికి పోతూనే ఉంట కదా!”“అవునా మామ. రేపు ఒక్కసారి పోదాం..” నా మాటలకు మామ ‘సరే’ అని తలూపాడు.
“ఆ బర్రెగొడ్లను అమ్ముకుందం” కొడుకుల మాటలు లీలగా వినిపించాయి పాలమ్మకు.ఆమె గుండెల్లో సన్నని దడ ప్రారంభమైంది. ఆమె కండ్లముందే ఇవన్నీ ‘మాయం కావడం’ ఆమె జీర్నించుకోలేక పోతున్నది.
నిద్రపట్టని పాలమ్మ కండ్లూ నోరు తెరుచుకొని డబ్బు ఐదేండ్ల మూగభాషగా మిగిలింది. సుక్కబర్రె మొదటి ఈత గుర్తొచ్చి, ఆమె మనసు బాధగా మూలిగింది. మొట్టమొదటి దూడ పుట్టినప్పుడు తను ఎంతో సంతోషించింది. ఆ దూడ చూడటానికి చాలా అందంగా ఉండి, గిట్టల దగ్గర, మోకాళ్ల దగ్గర నల్లటి మచ్చలు మరింత అందాన్ని తెచ్చిపెట్టినయ్‌. నుదుట గోధుమ రంగుతో మచ్చ. మెత్తటి శరీరం. చురుకైన కండ్లు. తను వేడి నీళ్లు కాసి, బర్రెను- దూడను కడిగి శుభ్రం చేసింది. ఈనిన కొన్ని గంటలకు తినిపించాల్సిన ఆకులు, మందులు తినిపించింది. దూడ పుట్టిన కొన్ని గంటలకే ఆకిలంతా పరుగు తీసింది. దాని లేతకాళ్లు నొప్పి పెడతాయని ఉరకనీయకుండా పట్టుకుంటే, విడిపించుకొని పరుగు తీసింది. తన బిడ్డ చలాకీతనానికి సుక్కబర్రె గర్వంగా చూసింది.
“తొలుసూరు ఆడబిడ్డ పుట్టిందయ్యా మనింట్ల. ఇంక అంతా మంచే జరుగుతది” అంటున్న తన సంతోషాన్ని చూసి-
“ఇంటి ముందట గొడ్డూ గోదా ఉంటేనే మంచిది. కమ్మగా వారం రోజులపాటు జున్నుపాలు తాగొచ్చు” అన్నాడు భర్త.
ఆ మాటలు విని, “ఇంకా నయం. రోజూ మనమే తాగుడేందయ్యా! ఈ వాడన పూటకొకళ్లకు పంపుడే!” అలా అన్నప్పుడు ఆమె మనసులో ఏదో తృప్తి. వెచ్చటి పాలకు వింతైన వాసన. అమ్మ ఒళ్లో కూర్చున్నప్పుడు వచ్చే వాసన. బర్రెగొడ్లు వేతమేసి ఇంటికి రాగానే వాటికోసం ఉలవలు, తెలకపిండి, మెత్తటి తవుడు కలిపిన బొచ్చెలు వాటి ముందుంచితే, అవి ఆవురావురని తినేవి. కాసేపటికే కుడితి తాగి, బరువైన పొట్టలతో నేలపై అటూ ఇటూ దొర్లుతూ వ్యాయామం తీరుగ చేస్తుండేవి. ఆ రోజులన్నీ ఇంకా ఆమె కండ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఉవ్వెత్తున లేచిన జ్ఞాపకాలను అదిమి పెడుతూ, గట్టిగా కండ్లు మూసుకున్నది.

పాలమ్మ మమ్మల్ని కూర్చోమంటూ వాల్చిన మంచంపై, మామ పక్కనే కూర్చున్నాను.ఆ పక్కనే ఆమె కొడుకు సత్తిబాబు నిల్చొని ఉన్నాడు. “కొడ్కా.. మీ నాయిన పోయేనాటికి తాతల ఆస్తితోపాటు తను సంపాదించిందంతా కాపాడుకున్నడు..” అంటూ కండ్లనీళ్లు పెట్టుకొన్నది పాలమ్మ. కొంగుతో కండ్లు తుడుచుకుంటూ మళ్లీ చెపుతున్నది.. “కొడ్కా.. మీ నాయిన కట్టం చేసి చేసి ఓ కుక్కి మంచాన్ని ఆ శెట్లకింద ఏసుకొని కూసుండెటోడు. మోదుగాకు సుట్టల పొగాకు పొడుం పోసుకొని, ఈ సుట్ట తాగుకుంట సేద తీర్చుకునేటోడు. ఆ చెట్లనీడే తన తల్లి ఒడి అనేటోడు. గందుకదే.. మీ నాయిన పోయినా, ఆ శెట్టుకింద కుక్కి మంచంల కూసున్నట్టే కనిపించేది నాకు..” ఆమె మాటలు మింగుతూ వెక్కివెక్కి ఏడ్చింది. “కొడ్కా.. మీరు కొట్టేసింది ఆ శెట్లను కాదు. మీ నాయిన రూపాన్ని, నా పాణాన్ని..”ఆ మాటలు వింటున్న మామ, ఏమీ మాట్లాడలేక తలొంచుకొని కూర్చున్నాడు. నాకు మాత్రం హృదయమంతా పిండేసినట్లయింది. పాలమ్మ ఇంకా చెబుతూనే ఉన్నది. “మనకు బుక్కెడు బువ్వ పెట్టే భూదేవరే మన కన్నతల్లి. ఎన్ని కట్టాలచ్చినా తల్లిని అమ్ముకుంటమా? గట్లనే బువ్వ పెట్టే భూమినిగూడ అమ్మద్దని మీ నాయిన శెప్పేది. భూముంటే ఏం లాభమని నా కొడుకులు అడిగితే, నేనేం జెప్పాలె? అమ్మతో లాభమేంది? బువ్వతో లాభమేంది? అని అడిగితే ఏం జవాబు చెప్తం. ఈ కాలం మనుషులు శానా తెలిసినోళ్లు. తెలివిగల్లోళ్లాయె. మా ఎన్కటోళ్లకు గివ్వేవీ తెల్వదాయె. భూమిని నమ్ముకోవాలె కొడుకా. అమ్ముకోవద్దు..” విరక్తిగా నవ్వుకుంటూ చెప్పిందామె. “ఏముంది నాయినా.. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ మాయమైనై. ఇద్దరు కొడుకులు పోటీపడి భూమిని అమ్ముకున్నా.. నా ఆస్తి కాదని గుండెను రాయి చేసుకున్న. అన్నీ అయిపోయినయ్‌. గిప్పుడు నా బర్రెగొడ్లకు బేరం బెట్టిండ్రు..” అని ఒక్క క్షణం ఆగి మళ్లీ చెబుతోంది.

“మట్టి తినకుండ దూడ మూతికి కట్టిన బుట్టలిప్పితే గంతు లేసుకుంట తల్లి దగ్గరికి పోతది. పొదుగును మూతితోని కుమ్మితే పాలు కారుత్తది. అది తాగినంక యజమాని పోయి, చేతితోని పాల పొదుగును తాకంగనే మనిషికి ఉపకారం చేస్తున్న అనుకుంట తృప్తిగ కండ్లు మూసుకొని కల్మషం లేకుండా పాలిత్తది. గందుకే, ఆ పాలకు అంత రుశి, గంత బలం. అదీ.. మనిషికీ పశువుకూ ఉన్న బంధం. గదంతా పోయి, ఏందో పాలు పిండే మిషినట. పచ్చి పాలల్ల వెన్నతీసే మిషినట. మనిషికి, భూమికి, పశువుకు ఉన్న బంధాలన్నీ తెగ్గొట్టి, మధ్యన రాక్షసుల తీరుగ ఈ మిషిన్లు అచ్చి కూసున్నయ్‌. మిషిన్లతోటి పాలు తీస్తరట. కొంచెం అటీటు అయినా పాల బదులు రక్తం కార్తదట. ఏదో సూదెయ్యంగనే పొదుగుల పాలు జేర్తయట. కానీ, ఆ పశువుకు అచ్చు రోగం, ఆ పాలు తాగితే మనిషికి అచ్చే రోగం గురించి ఆలోచన లేదా బిడ్డా! నోరు లేని పశువును పీడించి, దాని బిడ్డను పాలు తాగకుంట చేసే హక్కు మనకెక్కడిదయ్యా? బిడ్డపాలు బిడ్డ తాగాల్సిందే గదా?” పాలమ్మ మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది.“మిషిన్ల కాలం అచ్చె కొడుకా.. విషపు కాలం అచ్చె. క్యాన్లకొద్దీ పాలు గావాల్నని సంకరజాతిని పెంచబట్టిరి. పాలల్ల ఏందేదో కల్ప బట్టిరి. పాలల్ల నీళ్లు తప్ప ఏది కలిపినా, పాపమే! పాలు నీళ్ల తీర్గ కలిసుండే మనిషినీ, పశువును విడగొడుతుండ్రు. పాడి పరిశ్రమ పెంచండి కొడుకా.. కానీ, పాలల్లో ఇసం కల్పొద్దు. మిషిన్లు అద్దు, అవి రాక్షసులు. మనుషుల్ల రాక్షసులు కల్వొద్దు. కలియుగం మునిగిపోతది..” అంటూ మళ్లీ విరక్తిగా నవ్వింది.“నిన్నటి సంది బర్రెగొడ్ల బేరం అయిపోయిందనీ, బయానా తీసుకున్ననని నా శిన్నకొడుకు ఒక్కటే గోల..” ఈ మాటలు అనంగనే ఆమె ఎండిపోయిన చెంపల మీద జలజలా కన్నీళ్లు కారాయి.

ఆ తెల్లవారి..
బేరగాడు వచ్చాడు. బర్రెలు కదలడం లేదు. ఒక్క అడుగు ముందుకేస్తే, రెండడుగులు వెనక్కి వేస్తున్నాయి. అన్నిటికన్నా పెద్దదయిన ‘సుక్కబర్రె’.. మెడతాడు గుంజిపట్టి, కాళ్లు నేలకు తొక్కిపట్టి, చెవులు రిక్కించి పాలమ్మనే చూస్తోంది. అది కదిలేటట్టు లేదని కర్రతో రెండు దెబ్బలు వేశాడు కొన్నవాడు. ఆ దెబ్బలు తనకే తాకినట్టు ఉలిక్కి పడ్డది పాలమ్మ. ఉరికినట్లే పోయి, అతని చేతిలోని కట్టెను పక్కకు తోసింది. “వద్దు కొడుకా కొట్టకు. నోరు లేని బిడ్డలు. ఇన్నేండ్లు దెబ్బ కొట్టకుండ సాదుకున్న. గందుకే నన్ను వదిలి పోనంటున్నయ్‌..” అంటూ కొంగుతో సుక్కబర్రె చర్మాన్నంతా తుడుస్తూ ప్రేమగా నిమిరింది. “బిడ్డా.. నన్నొదిలి పోను కాళ్లస్తలెవ్వా! నన్నేం జెయ్యమంటవ్‌ బిడ్డా! నువ్వెళ్లిపోతే ఈ పాలమ్మ ఎట్ల బతకాలె? నువ్వు లేకుంటె నాకు ఈ పాలమ్మ పేరెందుకు? అసలు బతుకుడెందుకు?” హృదయ విదారకంగా దాని వీపుమీద అలాగే పడుకొని వెక్కివెక్కి ఏడుస్తున్నది పాలమ్మ. ఆమెను చూసి సుక్కబర్రె.. ఆమె చేతులను నాలుకతో నాకుతూ, కండ్లెంట నీళ్లు కారుస్తూ, మూగప్రేమతో ఆమె చేతులను తడిపింది. ఇప్పుడవి ఆమెవి కావు. వాటిని కొట్టొద్దనే హక్కు ఆమెకు లేదు. డబ్బుతో లావాదేవీలు జరిగి, వాటి శరీరాలు అమ్ముడు పోయాయని పాపం వాటికేం తెలుసు? వెనక ఉన్నవాడు గట్టిగా అదిలించాడు. బలవంతంగా అడుగులు గుంజుకుంటూ, వెనక్కి తిరిగి పాలమ్మను చూస్తోంది సుక్కబర్రె. ఒంటిమీద దెబ్బ పడగానే అడుగు ముందుకు వేసింది.సూర్యుడి వెలుగులా ప్రకాశిస్తున్న ఓ రైతు రూపం, చంద్రుడి వెన్నెలలా పరచుకున్న ‘పాలమ్మ’ నామం క్రమక్రమంగా నల్లబడి పోయాయి. కానీ, ఆమె పాడి పంట గురించి, అనుభవాల లోతుల నుండి ముందు తరాలకు ప్రబోధించమన్నట్టు చెప్పిన సందేశం మాత్రం.. నా చెవుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.

వేముగంటి శుక్తిమతి
వేముగంటి శుక్తిమతి స్వస్థలం హన్మకొండ. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి, రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఇప్పటి వరకూ 25 కథలు, ఆరు నవలలు, 50కి పైగా వ్యాసాలు రాశారు. పిల్లల పాటలతో, ‘ఒకే తోట పువ్వులం’ ఆడియో క్యాసెట్‌ను విడుదల చేశారు. పిల్లలకోసం బుర్రకథలు, నృత్య నాటికలు, ఏకపాత్రాభినయంతోపాటు అనేక పాటలు రాశారు. పలు సందర్భాల్లో రేడియో ప్రసంగాలూ ఇచ్చారు. 2017 దూరదర్శన్‌ ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ పీర్జాదిగూడలోని ‘స్ఫటిక సాయిబాబా’ చరిత్రను పారాయణ గ్రంథంగా వెలువరించారు. వీరి మొదటి కథ ‘మానవత్వం మరిచిన వేళ’కు ఆంధ్రభూమి వారపత్రిక ఉగాది కథలపోటీలో మొదటి బహుమతి వచ్చింది. ‘మళ్లీ పల్లె ఒడిలోకి’ అనే నవల ‘అంపశయ్య నవీన్‌ అవార్డు’ను గెలుచుకున్నది. తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రను ‘నేను సైతం’ పేరుతో నవలగా రాశారు. ‘ఉపాసన’ సంస్థ నిర్వహించిన సంక్రాంతి కథలపోటీలో ‘నేటి మనిషి’ కథకు బహుమతిని గెలుచుకున్నారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘నమస్తే నమః’ శీర్షికలో ‘దేవీ భాగవతం’ గురించిన ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు.

-వేముగంటి శుక్తిమతి ,9908110937

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈవారం  కథ.. సుక్క బర్రె
ఈవారం  కథ.. సుక్క బర్రె
ఈవారం  కథ.. సుక్క బర్రె

ట్రెండింగ్‌

Advertisement