e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home బతుకమ్మ సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

వాణిజ్య ప్రకటన అన్న మాటలోనే ‘వ్యాపారం’ ధ్వనిస్తుంది. ప్రేక్షకుల మనసును మాయ చేసి ఎలాగైనా, ఎలాంటి ఉత్పత్తినైనా కొనిపించే పక్కా వ్యూహం కనిపిస్తుంది. అవును, అదో మాయా ప్రపంచం! ఆ మార్కెటింగ్‌ తంత్రంలో పట్టు సాధించడం ఎలాగో నేర్పేందుకు ఎన్నో కోర్సులున్నాయి. లక్షల జీతాల కొలువులున్నాయి. అర నిమిషం దృశ్యంతోనో, అరపేజీ ప్రకటనతోనో చెప్పదల్చుకున్న విషయాన్ని స్పష్టంగా, ప్రభావవంతంగా చెప్పగలిగేవారిని కార్పొరేట్‌ ప్రపంచం తలకెత్తుకుంటుంది. ఈ మార్కెటింగ్‌ సాము గరిడీలో సామాజిక సందేశాలకు కూడా చోటు కల్పిస్తున్నారు. అణగారిన వర్గాల సమస్యను ప్రస్తావిస్తూ, మహిళల పట్ల వివక్షను ప్రశ్నిస్తూ.. నవలోకాన్ని సృష్టించమని ప్రోత్సహిస్తూ.. చాలా కంపెనీలు వాణిజ్య ప్రకటనలను సామాజిక బాధ్యతతో రూపొందిస్తున్నాయి.

ప్రకటనలు కొత్తేమీ కాదు. టీవీల రాకతో అవి మన జీవితంలో భాగమైపోయాయి. యూట్యూబ్‌లో స్కిప్‌ యాడ్స్‌ సౌలభ్యం తగ్గిపోతూ రావడంతో, అక్కడా ప్రకటనలు చూసి తీరాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ప్రకటన అంటే ఉత్పత్తి గురించి చెప్పడమే అన్న భావన ఉండేది. ‘ఇది మా బ్రాండ్‌. దీన్ని కొని చూడండి’ అనే ఆహ్వానం మాత్రమే! ఈ తరహా విధానాన్ని ‘ఫాక్చువల్‌ అడ్వైర్టెజింగ్‌’ అంటారు. పోటీ లేని రోజుల్లో మార్కెట్లో ఫలానా ఉత్పత్తి ఉందని తెలుసుకునేందుకు ఇది సరిపోయేది. క్రమంగా తమ ఉత్పత్తి ఎందుకు మెరుగైందో, దాన్ని వినియోగదారుడు ఎందుకు ఎంచుకోవాలో చెప్పి తీరాల్సినంత పోటీ నెలకొంది. తమ ప్రత్యేకతను, నాణ్యతను చెప్పడానికి సృజనకు పదును పెట్టడం మొదలుపెట్టారు. చిన్న పాటలు (జింగిల్స్‌), సూటి నినాదాలతో ఓ వాతావరణాన్ని సృష్టిస్తూ యాడ్స్‌ రూపొందించసాగారు. ఈ విధానానికి ‘క్రియేటివ్‌ అడ్వైర్టెజింగ్‌’ అని పేరు. ఆపైన, వాణిజ్యరంగం మరో అడుగు ముందుకు వేసింది. ప్రేక్షకులు తాము చూసిన ప్రకటనను ఎప్పటికీ మర్చిపోకుండా మనసుమీద చెరగని ముద్ర వేసేలా సాగే ప్రయత్నమది. దాన్నే ‘ఇంపాక్ట్‌ఫుల్‌ అడ్వైర్టెజింగ్‌’ అంటున్నారు. మనస్తత్వం, ఆధునిక పోకడలు, వినియోగదారుల అభిరుచులు, మార్కెట్‌ పరిస్థితులు.. దృష్టిలో ఉంచుకుంటూనే ప్రేక్షకుడి గుండెలకు గురిపెట్టే వ్యూహమిది. మరికాస్త ముందుకు వెళ్లి ప్రభావంతోపాటుగా సందేశాన్నికూడా అందించే ప్రయత్నం జరుగుతున్నది.

- Advertisement -

జోరున వర్షం. బైకులు, కార్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అందరిలోనూ చిరాకు. ఆ వాహనాల్లో ఓ కారు. అందులో ఓ చిన్నపిల్ల, పెద్దావిడ. ఇంతలో ఓ మూడో ప్రకృతి మనిషి ఆ కారు తలుపు తడుతుంది. ‘ఇంకెందుకు డబ్బు కోసమే!’- ఇది సగటు మనిషి ఆలోచన. కానీ, తను వచ్చింది, వర్షంలో ఇబ్బంది పడుతున్నవారికి ఉచితంగా టీ ఇవ్వడానికి. అదికూడా తన కాళ్లమీద తాను నిలబడేందుకు మొదలుపెట్టిన టీస్టాల్‌ నుంచి! ఒకే ఒక్క నిమిషపు యాడ్‌.. గుండెను తడిమేస్తుంది. అప్పటి వరకూ ఉన్న అభిప్రాయాలను తుడిచేయడమే కాకుండా ఓ మార్పు రావాలనే ఆకాంక్షను బలోపేతం చేస్తుంది. వాణిజ్య ప్రకటనల్లో వీస్తున్న కొత్తగాలికి ఇది సూచన. అక్కడక్కడా ఒకటీ అరగా ఉన్న ఈ తరహా ప్రకటనలు ఇప్పుడు విస్తృతమవుతున్నాయి. సొంతలాభం మానుకోకుండానే, పరుల మేలుకు పాటు పడాలనే కార్పొరేట్‌ బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

సామాజిక బాధ్యతగా..
ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు వెల్లువెత్తగానే, వీటి ప్రభావాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాయి ప్రభుత్వాలు. కుటుంబ నియంత్రణ, క్షయ నివారణ లాంటి సందేశాల కోసం తామూ ప్రకటనలు రూపొందించడం మొదలుపెట్టాయి. దీనికి ‘సోషల్‌ మార్కెటింగ్‌’ అని పేరు పెట్టారు. ఇందుకు మన దేశంలోని కె.టి.చాందీని ఆద్యుడిగా పరిగణిస్తూ ఉంటారు. మన దేశంలోని మొదటి ఐఐఎమ్‌ (కోల్‌కతా) తొలి డైరెక్టర్‌ ఈయన. వ్యాపార రంగంలోకూడా సుదీర్ఘ అనుభవం ఉన్న చాందీని ప్రభుత్వ విధానాల ప్రచారానికి వినియోగించుకోవాలని అనుకున్నారు అధికారులు. అందుకు అనుగుణంగా చాందీని, ప్రైవేటు సంస్థలను కూడా కలుపుకొంటూ కుటుంబ నియంత్రణకు సంబంధించి అసాధారణమైన కృషి చేశారు. ఒక్కో దశాబ్దం గడిచేకొద్దీ ఈ సోషల్‌ మార్కెటింగ్‌ ఓ ప్రత్యేక నైపుణ్యంగా మారింది. ప్రభుత్వాలు తమ సందేశాలను అందించేందుకు, సేవను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్‌ మార్కెటింగ్‌ను ఎంచుకోవడం మొదలుపెట్టాయి.

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

పోలియో టీకాల దగ్గరనుంచీ, హెచ్‌ఐవీ గురించి అపోహలు తొలగించడం వరకు ఈ వ్యవస్థ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. కొన్నిచోట్ల ఓ చిన్న నినాదంతో ప్రజల్లో మంచిమార్పును తీసుకురాగలిగింది సోషల్‌ మార్కెటింగ్‌. ఉదాహరణకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సముద్రతీరాల దగ్గర సేద తీరే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సూర్యకిరణాలు శరీరాన్ని నేరుగా తాకడంతో అతినీలలోహిత కిరణాలవల్ల చర్మానికి క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఎక్కువ. ఇందుకు విరుగుడుగా ‘క్యాన్సర్‌ కౌన్సిల్‌’ అనే సంస్థ ‘Slip-Slop-Slap’ అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. ‘పొడవాటి చేతులు ఉన్న చొక్కాలు ధరించండి, సన్‌స్క్రీన్‌ లోషన్‌ అద్దుకోండి, వెడల్పాటి టోపీని ధరించండి’ అని అర్థం వచ్చే ఈ చిన్నపాటి నినాదంతో అక్కడ స్కిన్‌ క్యాన్సర్‌ బాధితుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది.
క్రమంగా స్వచ్ఛంద సంస్థలు, సమాఖ్యలు కూడా తమ లక్ష్యలను వివరించేందుకు ప్రకటనల పంథాను ఎంచుకున్నాయి. ‘సండే హో యా మండే… రోజ్‌ ఖావో అండే’ అంటూ జాతీయ కోళ్ల ఫారాల సమాఖ్య (NECC) నినదించినా, వినూత్నమైన ప్రచారంతో PeTA సంస్థ జీవకారుణ్యాన్ని ప్రోత్సహించినా మంచి ఫలితాన్నే సాధించాయి. ఇప్పుడిక వాణిజ్య సంస్థలుకూడా ఈ బాట పట్టడం కొసమెరుపు!

1.మహిళల పక్షాన..
ప్రకటనలు వినియోగదారుల్లోని వేర్వేరు వర్గాలకు గురి పెట్టడం వింతేం కాదు. పిల్లల్ని ఊరిస్తూ కొన్నిసార్లు, ఉద్యోగస్తులను లక్ష్యం చేసుకుంటూ మరికొన్నిసార్లు ప్రకటనలు రూపొందిస్తారు. అలా కొన్నిట్లో మహిళల్ని దృష్టిలో ఉంచుకోవడం సహజమే. క్రమంగా చాలా సంస్థలు స్త్రీ స్వాతంత్య్రం, పునర్వివాహం, సాధికారత లాంటి అంశాలను భుజాలకెత్తుకోవడం విశేషం! నిర్మా ప్రకటన చూస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఓ నాలుగు దశాబ్దాల క్రితం సంగతి. నిర్మా వాషింగ్‌ పౌడర్‌ను ప్రచారం చేసేందుకు ఓ వినూత్నమైన ప్రకటనను రూపొందించారు. ‘హేమ, రేఖ, జయ, సుష్మ..’ అంటూ నాలుగు మహిళా పాత్రలతో వీటిని నడిపించారు. బట్టలు ఉతుకుతూనో, పిల్లలతో ఆడుకుంటూనో, మోడలింగ్‌ చేస్తూనో కనిపించే ఈ పాత్రలలో సాధికారత అంటే ఉద్యోగం మాత్రమే అనే భావన కనిపిస్తుంది. కాలం గిర్రున తిరిగింది. మహిళల విశ్వరూపాన్ని చూపించాల్సిన అవసరం వచ్చేసింది. అందుకే, 2011లో వచ్చిన యాడ్స్‌లో అవే పాత్రలు కనిపిస్తాయి. కానీ, బట్టలు ఉతుకుతూ కాదు! బురదలో చిక్కుకున్న ఆంబులెన్స్‌ని బయటకు తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, సురక్షితంగా వెలికి తీసే స్త్రీలుగా కనిపిస్తారు.

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

2.కొత్త గాలి వీస్తుంది

‘పెండ్లి తర్వాత ఎప్పుడూ భార్య తన ఇంటిపేరు మార్చుకోవాల్సిందేనా! తనకి ఇష్టమైతే భర్తే, భార్య ఇంటిపేరును తనదిగా చేసుకోవచ్చు కదా’ అనే తర్కంతో రూపొందిందే హేవెల్స్‌ ఫ్యాన్‌ ‘హవా బదలేగీ’ ప్రకటన. మాతృస్వామ్యాన్ని తలకెత్తుకున్న సందర్భం ఇది.ఉద్యోగం తన అభీష్టం- ఉద్యోగం సంపాదన కోసం మాత్రమే కాదు. నైపుణ్యం నిరూపించుకునే మార్గం కూడా. అందుకనే ‘నీ సంపాదన సరిపోతుంది కదా. ఇక తను ఉద్యోగం చేయడం ఎందుకు?’ అని అడిగిన తల్లిదండ్రులకు ‘అది తనకు ఇష్టం కాబట్టి!’ అని చెప్పగలుగుతాడు కొడుకు. ఇది భారత్‌ మేట్రిమోనీ ప్రకటన.

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

3.బాధ్యతలు పంచుకోవాలి

‘ఇంటిపనంతా అమ్మే చేయాలి. నాన్న టీవీ చూస్తూ, పేపర్‌ చదువుతూ గడిపేయాలి! అనే వాతావరణం నీకు అలవాటు చేశాను. అందుకు నన్ను క్షమించు. ఇకనుంచి నేనుకూడా ఇంటి బాధ్యతల్లో పాలు పంచుకుంటాను’ అంటూ ఓ తండ్రి, పెళ్లయిన కూతురికి చెప్పే సందేశంతో సాగుతుంది ఏరియల్‌ ప్రకటన. ‘బట్టలు ఉతకడం అమ్మ బాధ్యతేనా?’ అనే ప్రశ్నతో ముగుస్తూ ‘షేర్‌ ద లోడ్‌’ అనే సందేశాన్ని అందిస్తుంది. ఇదే ఇతివృత్తంతో మరిన్ని ప్రకటనలను రూపొందించింది ఏరియల్‌.

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

4.మహిళా సాధికారత ప్రస్తావన వస్తే ఎయిర్‌టెల్‌ యాడ్‌ను తప్పక గుర్తు చేసుకుంటారు. ఆఫీసులో తన కింద పనిచేసే ఉద్యోగికి ‘ఈ పని త్వరగా చేసి తీరాల్సిందే’ అంటూ ఆజ్ఞ జారీ చేసే అధికారిణి అదే ఉద్యోగికి భార్య అయితే! ఓ చిక్కని ఊహను ప్రకటనగా మలిచారు. సమాన అవకాశాలకోసం ఎదురుచూసే స్థాయినుంచి వాటిని అందిపుచ్చుకుని, తమను తాము నిరూపించుకునే దశవరకు మహిళల ప్రయాణాన్ని ఒకే నిమిషంలో తేల్చేస్తుందీ సన్నివేశం. సరే, ఇలాంటి ప్రకటనలన్నీ మార్పును గుర్తించాల్సిన అవసరానికి సూచన మాత్రమే కదా అనుకోవచ్చు. అలాగని మహిళల విషయంలో సామాజిక మార్పు అగత్యాన్ని ప్రోత్సహించే ప్రకటనలూ రాకపోలేదు!

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

5.పునర్వివాహం

వృద్ధాప్యంలో మగవారు రెండో పెండ్లి చేసుకుంటే చూసీచూడనట్టు ఉంటుంది సమాజం. అదే, వృద్ధురాలి పెండ్లిని అంగీకరించగలదా?.. అంటే కష్టమే! విప్లవాత్మకమైన ఆలోచనతో రూపొందించిన కోల్గెట్‌ యాడ్‌ విస్మయం కలిగించింది.

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

మార్పు కోసం..

రాజకీయ ప్రకంపనలతో, తూటాల ప్రతిధ్వనులతో గడగడలాడే కశ్మీర్‌ జోలికి వెళ్లే ధైర్యం ఎవరు చేస్తారు? 2018లో ప్రముఖ షూ కంపెనీ అడిడాస్‌ ఆ ప్రయత్నం చేసింది. ఓ నిజమైన గాథను ఎంచుకుని దాన్ని శాంతి సందేశంగా మార్చింది. మనుషులని ఏకం చేసే సత్తా క్రీడలకే ఉందంటూ ‘ద రియల్‌ కశ్మీర్‌’ హ్యాష్‌ టాగ్‌ను ప్రచారం చేసింది. ఇలాంటి ప్రయోగాలు కత్తిమీద సామే అయినా, ఆ విద్యలో బాగానే ఆరితేరాయి వాణిజ్య సంస్థలు. ఒక్కోసారి ప్రేక్షకుల అహాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉన్నాకూడా తమ ప్రయత్నాన్ని విరమించుకోకపోవడం విశేషం. ‘ఎన్నికల రోజున ఓటు వేయకుండా కాలక్షేపం చేస్తుంటే మీరు నిద్రపోతున్నట్టే లెక్క’ అంటూ టాటా టీ రూపొందించిన ‘జాగో రే’ (నిద్ర లేవండి) అనే ప్రకటనే అందుకు సాక్ష్యం.

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

స్వలింగ సంపర్కం దగ్గర నుంచీ పర్యావరణం వరకూ ప్రతీ అంశాన్నీ స్పృశిస్తున్నాయి ప్రకటనలు. LGBT సమస్యనే తీసుకోండి! ఇదివరకు దానిగురించి మాట్లాడే సాహసమే చేసేవి కావు వాణిజ్య సంస్థలు. ఇప్పుడలా కాదు. ట్రాన్స్‌ జెండర్స్‌ శరీర మార్పులను అర్థం చేసుకోవాలని (భీమా జ్యువెలరీ), వాళ్ల కాళ్లమీద నిలబడగలిగే అవకాశం ఇవ్వాలని (బ్రూక్‌ బాండ్‌ టీ), వాళ్లుకూడా పిల్లల్ని దత్తత తీసుకుని సాకగలరని (విక్స్‌) సూచించే ప్రకటనలు కోట్లాది గుండెల్లో తడి నింపాయి. క్లోజప్‌, పెప్సీ, ఫాస్ట్‌ ట్రాక్‌ లాంటి బడా సంస్థలుకూడా స్వలింగ సంపర్కం గురించిన ప్రకటనలు వెలువరించాయి. మింత్రా సంస్థ ఏకంగా ఓ లెస్బియన్‌ జంటమీదే వీడియో (బోల్డ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌) రూపొందించింది. ఈ తరహా ప్రకటన దేశంలో ఇదే ప్రథమం! ఇవే కాదు, లంచాలకు వ్యతిరేకంగా, పర్యావరణానికి అనుకూలంగా ఇలా ప్రతి అభ్యుదయవాదం మీదా ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

ఇప్పుడు ఏకంగా కొన్ని కంపెనీలే తమ ప్రకటనల్లో సామాజిక సందేశాలు ఉండాలంటూ విధాన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొన్నాళ్ల క్రితం యూనిలీవర్‌, తన ప్రకటనల్లో ‘జెండర్‌ స్టీరియో టైప్స్‌’కి స్వస్తి పలుకుతామని చెప్పింది. పురుషులు ఉద్యోగంలో రాణిస్తారు, మహిళలు వంట చేస్తారు, తెల్లని అమ్మాయిలే విజయం సాధిస్తారు, కండలు తిరిగిన మగవారే అమ్మాయిల మనసు చూరగొంటారు… తరహా భావనలన్నీ జెండర్‌ స్టీరియో టైప్స్‌లోకే వస్తాయి. చాలా ప్రకటనల్లో తెలియకుండానే ఈ తరహా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఓ నివేదిక ప్రకారం కేవలం రెండు శాతం ప్రకటనల్లో మాత్రమే మహిళలు నాయకత్వ పాత్రల్లో ఉన్నారు, మూడు శాతం ప్రకటనల్లో మాత్రమే మగవారు పిల్లలను గమనించే తండ్రిగా కనిపించారు. ఇలాంటి నివేదికల ఆధారంగా యూనీలివర్‌ సంస్థ తన పంథా మార్చుకోవడమే కాకుండా తోటి సంస్థలనుకూడా ఈ దిశగా పయనించమని అభ్యర్థిస్తున్నది.

ఇవే కాదు ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలరని చెప్పే హార్లిక్స్‌ ప్రకటన, మగవారుకూడా వంటపని పంచుకోవచ్చని సూచించే సఫోలా యాడ్‌, బయట ఉన్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి బాలికలు సన్నద్ధంగా ఉండాలనే హమామ్‌… అన్నీకూడా మహిళా సాధికారతను ప్రచారం చేసే ప్రయత్నాలే.

ఈ పాప మాట.. అమూల్యం!

అది 1946. పాల వ్యాపారంలో దళారుల దోపిడినుంచి బయటపడేందుకు గుజరాత్‌లోని కైరా జిల్లాలో పాడిరైతులు ఓ సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. అది సాధికారత దిశగా అడుగులు వేస్తున్న సమయంలోనే వర్గీస్‌ కురియన్‌, ఆ సమాఖ్య పగ్గాలు చేపట్టారు. అంతే, అమూల్‌ అసాధారణంగా ఎదగడం మొదలైంది. ఏకంగా దేశంలో క్షీర విప్లవానికి దారితీసింది. అలాంటి సమయంలో అమూల్‌ను ఒక జాతీయ బ్రాండ్‌గా నిలబెట్టాలనుకున్నారు కురియన్‌. అందుకోసం కన్హా అనే వ్యక్తిని ఎంచుకున్నారు. ఆ సమయంలో ప్రకటనలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సినీతారల చుట్టూ తిరిగే వ్యూహం. అందుకు భిన్నంగా ఓ చిన్నపాప రూపును గీయించారు కన్హా. అదే ఇప్పటి అమూల్‌ పాప. అమూల్‌ పాప సరదా కబుర్లు మాత్రమే చెప్పదు. వ్యంగ్యం, ప్రశంస, ధిక్కారం.. అన్నీ తన అమాయకపు అక్షరాల వెనుకనుంచి తొంగిచూస్తాయి. ఇలా మూడు దశాబ్దాల కాలం నుంచే అమూల్‌ ప్రకటనల్లో సామాజిక సందేశాలు స్పష్టంగా కనిపించాయి. మండల్‌ కమిషన్‌ సమయంలో కులవివక్షకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రపంచీకరణ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులు కొనమని ప్రోత్సహించినా అమూల్‌ సందేశాలను ప్రజలు బాగానే స్వీకరించారు. స్టాక్‌ ఎక్సేంజ్‌ కుంభకోణం, వ్యాట్‌ చట్టం, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, వీర్య దానం… అన్నిటి మీదా నినదించింది ఈ పాప. అవినీతి అంటుకున్న సురేష్‌ కల్మాడీ, కేతన్‌ పరేఖ్‌ల మీద విరుచుకుపడింది. అంతేనా! కొన్ని సందర్భాల్లో అనూహ్యమైన విప్లవాన్ని ధ్వనించింది. 2013లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా ‘స్వేచ్చకు సమాధి’ అంటూ బాధ పడింది అమూల్‌ పిల్ల. అర్ధ శతాబ్దం దాటినా తన ఉధృతిలో మార్పు రాలేదు. రాకపోవచ్చు కూడా!

సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

సంవాదాలూ వివాదాలు!

సందేశం మంచిదే! కానీ, అది కొందరి మనసును నొప్పిస్తే.. అదే వివాదంగా మారుతుంది. మనోభావాలను దెబ్బ తీస్తే కనుక, మాటలే మంటలవుతాయి. అందుకే, ఒక్కోసారి సామాజిక ప్రకటనలు అనూహ్యమైన ఎదురుదాడిని చవిచూశాయి. దేశ సమైక్యతను చాక్లెట్‌తో పోల్చినందుకు
క్యాడ్బరీస్‌ సంస్థకు చేదు అనుభవం మిగిలింది. హోలీని మత సమైక్యతతో ముడిపెట్టే ప్రయత్నం చేసినందుకు సర్ఫ్‌ ఎక్సెల్‌ను ఉతికి పారేశారు. లోకమంతా నల్లజాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ అంటూ ఉద్యమిస్తుంటే ‘ఓ పెప్సీ డబ్బాతో పోలీసుల మనసు గెలుచుకోవచ్చు’ అంటూ ప్రకటన రూపొందించింది పెప్సీ. అసలే నల్లజాతీయులమీద పోలీసుల జులుంతో మంటెక్కి ఉన్నవారికి, ఆ శాంతి సందేశం రుచించలేదు. పెప్సీని మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇక తనిష్క్‌ వివాదాన్ని ఎవరు మర్చిపోగలరు! మతాంతర వివాహం చేసుకున్న మహిళకు అత్తవారింట సీమంతం జరిపించడం ఇందులోని ఇతివృత్తం. ఏకత్వం అనే నినాదంతో దీన్ని రూపొందించినా కొందరికి నచ్చలేదు. ఆ రచ్చ సద్దుమణిగేలోపే తనిష్క్‌ మరో యాడ్‌ రూపొందించింది. దీపావళిని ఆర్భాటం లేకుండా కాలుష్యం జోలికి పోకుండా సాదాగా జరుపుకోవాలనే సందేశాన్ని అందించే ప్రయత్నం చేసింది. ఈ మాటా జనాలకి నచ్చలేదు. ఫలితంగా రెండోసారి తనిష్క్‌ వెనకడుగు వేయాల్సి రావడమే కాకుండా ఓ వర్గానికి వ్యతిరేకం అనే ఆరోపణను ఎదుర్కోవాల్సి వచ్చింది. చెప్పే మాట మంచిదని మనం అనుకుంటే సరిపోదు, ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారో కూడా గమనించుకోవాలనే జాగ్రత్తను వాణిజ్య సంస్థలు గమనించుకోవాల్సిందే.

కారణాలు అనేకం..

139 కోట్ల జనాభా! అందులో దాదాపు మూడోవంతు స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగించేవారే. దినపత్రికలు చదివేవారి సంఖ్యా తక్కువేమీ కాదు. 40 కోట్లకు పైగా న్యూస్‌ పేపర్లు రోజూ మన దేశంలో అమ్ముడవుతున్నాయి. ఇక టీవీ సంగతి చెప్పేదేముంది! 20 కోట్లకు పైగా ఇండ్లలో టీవీలు మోగుతున్నాయి. వీటితోపాటుగా రేడియోలు, సినిమాలు, కంప్యూటర్లు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాయి. ఇంత ఖరీదైన రంగంలో కార్పొరేట్‌ సంస్థలు సామాజిక సందేశాల జోలికి ఎందుకు వెళ్తున్నాయి? ఆధునిక తరం మార్పును స్వాగతిస్తున్నది. కాబట్టి, సామాజిక సందేశం ఉన్న ప్రకటనలు, వారిని ఆకట్టుకోవడంతోపాటు సంస్థమీద సదభిప్రాయాన్ని కలిగిస్తున్నాయట.

మహిళా సాధికారత వంటి సందేశాలు వినిపించినప్పుడు స్త్రీల మనసును గెలుచుకునే అవకాశం ఎలాగూ లభిస్తుంది. వారు కీలక వినియోగదారులు కూడా.ఈ మార్పుకు సోషల్‌ మీడియాకూడా కారణమని అంటున్నారు ప్రీతి అనే యాడ్‌ కంపెనీ ప్రొడ్యూసర్‌. ప్రకటనల్లో ఏ మాత్రం వివక్ష ఛాయలు కనిపించినా సామాజిక మాధ్యమాల్లో చీల్చిచెండాడేస్తున్నారు. సదరు ప్రకటనని, అందులో నటులని, సంస్థనీ కలిపి ట్రోల్‌ చేస్తున్నారు. ప్రగతిశీల ప్రకటనలు రూపొందిస్తే ఈ సమస్య ఉండదు కదా!

ప్రకటనలు ఓ ట్రెండ్‌ను అనుసరిస్తాయి. ఇప్పటి ట్రెండ్‌ మార్పు! అందుకే, తమ సంస్థ ‘ప్రగతిశీలి’ అనిపించుకోవాలంటే, దూకుడుతోకూడిన సందేశాలు వినిపించాలి. అదే పని చేస్తున్నాయి వాణిజ్య సంస్థలు.ఓ కారులో అమ్మాయి కూర్చుంటే ఉండే ప్రభావం వేరు, తనే కారు తోలుతున్నట్టు ప్రకటన ఉంటే కలిగే స్పందన వేరు. దీన్నే ‘ఇన్‌క్లూజివ్‌ అడ్వైర్టెజింగ్‌’ అంటారు. ఓ ఉత్పత్తి తమదిగా భావించేలా చేయడం దీని వ్యూహం. ఇప్పటి వరకూ వివక్షలో ఉన్న వర్గాలను ఆకర్షించడానికి ఇదో మార్గం.

ప్రకటనల రంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగిపోవడం కూడా భావోద్వేగపూరిత, సందేశాత్మక ప్రకటనలు పెరగడానికి కారణమని అంటున్నారు.

ప్రకటనలో వివక్షను యువత వ్యతిరేకిస్తోంది. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ 45 ఏండ్లకు పైగా తన ఉత్పత్తిని విక్రయిస్తోంది. కానీ, ‘ఫెయిర్‌’ అన్నమాట వర్ణవివక్షను పెంచుతున్నదంటూ 22 ఏండ్ల చందనా హిరన్‌ గొంతెత్తారు. ఆ పేరు మార్చాలంటూ 15 వేల సంతకాలు సేకరించారు.

మన మనసుమీద ప్రకటనల తాకిడి అపారం. అవి మన ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపుతాయని, వాటిల్లో కనిపించే సందేశాలు మార్పును సాధిస్తాయని, జంక్‌ ఫుడ్‌ లాంటి అలవాట్లను ప్రోత్సహిస్తాయనీ పరిశోధనలు కుండబద్దలు కొట్టేశాయి. ప్రకటనలద్వారా మంచైనా, చెడు అయినా సాధ్యమే అని తేల్చాయి. వాణిజ్య ప్రకటనలు వినోద ప్రధానంగానే సాగకుండా, సందేశాన్ని అందించే ప్రయత్నమూ చేయడం అభినందనీయం. రూపాయిల కొలమానాన్ని మించిన లాభం!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!
సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!
సందేశం + వ్యాపారం కమర్షియల్‌ యాడ్స్‌!

ట్రెండింగ్‌

Advertisement