e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home బతుకమ్మ తీర్పు

తీర్పు

తీర్పు

ఇంటర్‌వెల్‌ అయిపోయి క్లాసులకు వెళ్తున్న సమయంలో స్టాఫ్‌రూమ్‌లోకి వచ్చింది రమ. ఆమె బిడ్డ ఐదో తరగతి చదువుతున్నది. కొడుకు ఐదువరకు మా వద్దే చదివి, ప్రస్తుతం ఈ ఆవరణలోనే ఉన్న హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నడు. స్టాఫ్‌రూమ్‌లోని అందరివైపూ బెదురుగా చూస్తున్నది రమ. ఏడ్చిఏడ్చి ఉబ్బిపోయిన కండ్లు ఆమె దుఃఖపు లోతును చెబుతున్నాయి.
“ఏం సంగతమ్మా.. ఇట్లా వచ్చావు?”
స్టాఫ్‌వైపు చూస్తూ, చూపులు నేలకు దించుకుంది కానీ, ఏమీ మాట్లాడలేదు. నా సైగతో స్టాఫ్‌ మొత్తం తరగతులకు వెళ్లిపోయారు.
నేను ఎనిమిదేండ్లుగా ఈ పాఠశాలలో పని చేస్తున్నాను. రమకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ సలహా కావాలన్నా నాతో చెప్పుకొని, నేనిచ్చే సమాధానంతో సాంత్వన పొందేది.
“కూర్చో రమా..” అని కుర్చీ ముందుకు జరిపానో లేదో ఒక్కసారిగా కాళ్లమీద పడింది. కురిసీ కురిసీ అలసిన మేఘం మళ్లీ కుండపోత వానందుకున్నట్లు బోరున ఏడవసాగింది. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న నేను, ఆమెను లేపి కుర్చీలో కూర్చోబెట్టాను. కాస్తంత కుదుట పడ్డాక-
“గంతగనం ఏం కష్టం వచ్చిందమ్మా?” అని అడిగాను.
“ఏం జెప్పాలె సారు. ఇగ నేను బతికే హైబిల్‌ కాదు. ఆడ పుట్టుక పుట్టినందుకు ఎన్ని భరించాల్నో అన్నీ భరించిన. ఎంత ఏగియాల్నో అంత ఏగిచ్చిన. ఎన్ని నిందలు మోయల్నో మోసిన. ఇవన్నీ భరించి బతుకుతున్ననంటే నా పిల్లల కోసమేనాయె. గిప్పుడు ఆ ఆశా సచ్చిపోయింది సార్‌. దేవతైన సీతమ్మకే తప్పలేదు. మనిషిని నేనెంత. ఒక్కసారి మనసు గట్టిగ చేసుకుంటే చాలు. సచ్చి సర్గానికో, నరకానికో పోతా. నరకం గూడ గింత ఘోరంగా ఉండదేమో! అన్నదమ్ములు లేని దానికి ఓ అన్నలాగ మీరు అండగున్నరు. ఎన్నో బాధలల్ల ఓదార్చిండ్రు. ఎన్నోసాళ్ల పైసలుగూడ సాయం జేసిండ్రు. నాకు తెలిసి మీకు మొత్తం తిరిగి ఇచ్చేశాననే అనుకుంటున్నా. నేను ఎవరి బాకీల లేను. కడసారి మాటగా మీకు శెప్పుకోవాలని అనిపించి వచ్చిన”
ఆమె గొంతు మూగబోయింది. కానీ, కండ్లు రెండూ గండిపడ్డ కాలువలే అయ్యాయి. ఏమీ మాట్లాడలేని మౌనం కాసేపు నన్నావహించింది. ఆమె ఎదుర్కొంటున్న సమస్యలన్నీ దాదాపు నాకు తెలుసు. కానీ, మనసును ముక్కలు చేసిన గాయమేదో కొత్తగా అయినట్లు తెలుస్తున్నది.
“రమా.. మీ ఆయన మస్కట్‌ పోవుడే నీకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చి పెట్టింది. ఎన్నో అవమానాలు భరిస్తూ, ఓపికగా నీ కుటుంబాన్ని ఇంత దూరం నెట్టుకొస్తున్నావు. తెలివైన పిల్లలు. వాళ్లకోసమే బతుకుతూ, మీ ఆయన డబ్బులు సరిగా పంపకున్నా, కూలీనాలీ చేసుకుని గుట్టుగా ఎల్లదీసు కొస్తున్నవు. ఇప్పుడు పిల్లలమీద ఆశకూడా చచ్చిపోయింది. జీవితాన్నే ముగిస్తానంటున్నావు. అంత పెద్ద సమస్య ఏమొచ్చిందమ్మా?”
“దొంగ ముండకొడుకు.. ఇక్కడ చేసుకోవడానికింత పనున్నా, దోస్తుల సంబురంతో ఏదో సంపాదిత్తనని మస్కట్‌ వోతే, మిత్తికి మిత్తి కలిసి కుప్పైన అప్పు గట్టడానికి, వాని ఖర్సులకు ఆడికాడికే గావట్టె! సుక్క తెగి పడ్డట్టు అప్పుడో పదివేలు, ఇప్పుడో పదివేలు పంపితే ఏ మూలకు సాలకపాయె. ఇక నా ఖర్మ గింతేనని నాది నేను సర్దుక రావడితి. కానీ, గీ అత్తముండ ఎక్కడ లేని నిందలు మోపవట్టే. సేన్లకెల్లి అచ్చుడు గంట ఆలస్యమైతే, ఏదో రంకు సాగించినట్టు.. వాడకట్టంతా ఇనచ్చేలా అనరాని బూతులనవట్టే. ఊళ్లో ఏ పనిమీద ఎవరింటికి పోయినా.. ఇంటికి రాంగనే, పిల్లిమీద, బల్లిమీద వెట్టి బండబూతులు తిట్టవట్టె. పానం మంచిగ లేక దవాఖానకో, పిల్లలకు ఏదన్నా కొందమని కరీంనగర్‌ దాకా పోయ్యత్తె.. ఇగ పెద్ద రాద్ధాంతమే! దాని మాటలకు సావనన్న సావాలె! సంపనన్న సంపాలె! అన్నంత కోపం అచ్చినా నేనేం జేత్త. నా జోలికి రావద్దని తిట్టినా, బెదిరిచ్చినా దాని మెదట్ల పురుగు మెసులుతునే ఉంటది. శిన్నపిల్లల ముందే నీచాతి నీచంగా మాట్లాడితే, నాపట్ల ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారోనని కుమిలి కుమిలి సత్తన్న. గిప్పుడు నాకు తెల్వకుంటనే పెద్ద కుట్ర జేసింది. ఎప్పటి సంది నూరిపోత్తందో ఏమో కానీ, మొన్న జరమొచ్చి కరీంనగర్ల చూయించుకొని ఇంటికచ్చెటాళ్లకు అంబటాైళ్లెంది. మా అత్త ముం.. ఒక్కమాట మాట్లాడకుండ మూలకే కూసున్నది. నాకు ఇచ్చంత్రమే అనిపిచ్చింది. గానీ, అంతల్నే వాన లేని పిడుగు నా నెత్తిన పడ్డట్టే అయ్యింది. ‘గింత సేపు ఎందుకైందే దొంగ లం.. ఏడేడ తిరిగి అత్తున్నవ్‌’ అని నా కొడుకు అనంగనే.. భూదేవర పగిలిపొయ్యి, అండ్లకు కూరుకుపోయినట్టయ్యింది. కొంచెం సేపు ఏమర్థం కాలే. ఈ దుఃఖం ఎవరితో శెప్పుకోవాలె.. లేచి ఈ శెంప ఆ శెంప వాయించేసరికి వాడు మరింత రెచ్చిపోయిండు. ‘నాకు నానమ్మ అంతా చెప్పింది. నువ్వు ఎవడెవడితోనో తిరుగుతున్నవనే ముఖం సూపెట్టలేక పదేండ్లయినా నాన్న వత్తలేడని. గందుకే మేమెన్నిసార్లు రమ్మని ఫోన్‌ చేసినా ఇగ వత్త, అగ వత్త అనుకుంట వత్తనే లేడు. నువ్వు గిట్ల జేస్తే నా తలకాయ కొట్టేసినట్లుంది. గిట్లనే జేత్తే సంపి పడేత్త’ అన్నడు. నిండా పదమూడేండ్లు లేని నా కన్నపేగు.. ఆడతనపు శీలానికి సంబంధించి రెచ్చగొట్టేసరికి అమ్మ అన్న విషయం కూడా మర్శిపోయి, నిజానిజాలు తెలుసుకోకుండానే అనరాని మాటలన్నడు. ఆడే గింత ఘోరంగా అనుమానించినంక ఇంక నేనెవరి కోసం బతకాలె సార్‌?”
ఒక్కసారి మెదడు మొద్దు బారినంత పనైంది నాకు. రమ కొడుకు రవి కండ్లలో మెదిలాడు. చాలా క్లెవర్‌, ఉట్టి అమాయకుడు. ముసల్ది కక్ష తీర్చుకోవడానికి పసి హృదయంలో విషం నింపింది.
“రమా.. ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదమ్మా! వాడొట్టి అమాయకుడని నీకూ తెలుసు. మీ అత్త వాణ్ణి పావుగా వాడుకుంది. దానికి నేను నచ్చజెపుతాను. నువ్వు మనసు స్థిమితం చేసుకోమ్మా. అనవసరంగా మనసు విరగొట్టుకొని క్షణికావేశంలో పిల్లలకు అన్యాయం చేయకు”
“ఆడు అమాయకుడే సార్‌. కానీ, ఆడూ మొగోడే కదా! మొగోళ్ల రక్తంలనే ఆడదాని మీద అనుమానపు బీజాలుంటాయి. మగ అహంకారమూ దాగి ఉంటుంది. మొగోన్ని మరో మొగోడు సమర్థించుకోవడమూ ఉంటుంది. కానీ, ఆడవాళ్లలోనే ఆడవాళ్లను ద్వేషించే లక్షణం.. తరాలు మారినా పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఇంతకు ముందే మీకు చెప్పిన, మస్కట్‌ కెళ్లే ముందు వీసా ఆలస్యమై.. నా మొగుడు బొంబైల రెండు నెల్లున్నడు. గప్పుడు ఆడు రెడ్‌లైట్‌ ఏరియాలకు పోయిన సంగతి తెల్సినా ఆని దోస్తులు, అవ్వయ్య.. ఎవలూ తప్పు తీయలే. నా మొగుడు తల్లి శెప్పిన మాటలు ఇని నన్ను అనుమానించిండు. కానీ, నేను శెప్పినా వాళ్ల నాయిన చేసే తప్పును నమ్మేటోడు కాదు. ఇక ఆడిదానికి నిజమైన సపోర్ట్‌ ఎక్కడ దొరుకుతది. మొగ తోడు లేని ఆడోళ్లను ఎవడైనా ‘ఫ్రీగా దొరికిన సినిమా’ అన్నట్లే చూస్తరు సార్‌. అయినా, పేదరికమే ఎన్నెన్ని సమస్యలకో మూలకారణం సార్‌. మొన్న ఆదేశ్‌ రవి పాటల ఎంత గొప్పగ శెప్పిండు.. ‘పేదరికం కంటే పెద్ద రోగముందా.. అయినవాళ్ల కంటే పెద్ద అండ ఉందా’ అని.. ఇంటర్‌ పూర్తి కాంగనే, సదివించే స్తోమత లేక సదువుకోవాలన్న నా కోరికను చంపేశిండ్రు. కట్నమిచ్చుకొనే స్థాయి లేక నాకంటే తక్కువ సదివినోనితో గీ దిక్కుమాలిన సంబంధం కట్టబెట్టి నా గొంతు కోసిండ్రు. మీరుగూడ ఎన్నోసార్లు ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ కట్టమని చెప్పిండ్రు. కానీ, క్లాసులకు వెళ్లినా, పుస్తకం పట్టినా మా అత్త శివసత్తి ఏషం ఏత్తదన్న భయమే నన్ను ముందుకు పోనియ్యలే. ఇంటర్‌దాకా మా క్లాస్‌ల నేనే ఫస్ట్‌ సార్‌. టీచర్లకు, లెక్చరర్లకు ఇష్టమైన స్టూడెంట్‌ను. ఇంటర్‌లో కాలేజీ జీవితం రంగుల ప్రపంచంలా ఉండేది. కానీ, పెండ్లితోనే ఒక్కసారి జీవితం తలకిందులైంది. మొగుడు మారుతడన్న దారి కనిపిస్తలేదు. అత్తమామల ఆగడాలు ఆగుత లేవు. కొడుకు పుర్రెలో సొచ్చిన అనుమానం పురుగు సచ్చిపోదు. ఇక నా జీవితాన్ని ముగించుకోవడమే నా ముందున్న దారి సార్‌”
“రమా.. నీకు నేను మాట ఇస్తున్నాను. ఈ ఒక్కసారి విను. రవి మెదడులో చిమ్మిన విషాన్ని తొలగించి, నీ పట్ల ప్రేమ, విశ్వాసం కలిగి ఉండేలా చేసే బాధ్యత నాది. వాడికి నేనంటే గౌరవం. మీ ఆయనతో కూడా మాట్లాడతాను. మీ అత్తామామల సంగతి ‘సఖి’ లాంటి సంస్థలకు అప్పజెప్తాను. వాళ్లే చూసుకుంటారు. న్యాయపరంగా వాళ్ల అరాష్‌మెంట్‌ను కట్టడి చేయిస్తా. అన్నదమ్ములు లేరని ప్రతి రక్షాబంధన్‌కు నువ్వు కట్టే రాఖీ సాక్షిగా చెబుతున్నానమ్మా.. నేను నిన్ను కాపాడుతా! నా మీద భరోసా ఉంచి ఇంటికెళ్లి హాయిగా పడుకో!”
ముఖం కొంగులో దాచుకొని ఐదు నిమిషాలు ఆగకుండా ఏడ్చింది. ఆ తర్వాత తేలిక పడిన మనసుతో నాకు దండం పెట్టి వెళ్లిపోయింది.
మగవాడినైనందుకు అంతసేపూ అదిమి పెట్టుకున్న కన్నీళ్లు.. ఆమె వెళ్లగానే ధారాపాతంగా కురవసాగాయి. కండ్లు తుడుచుకొని కూర్చున్నాను.
లంచ్‌ కాగానే అరుణ మేడం అడిగింది..
“రమ ఎందుకంత ఆందోళనగా ఉంది సార్‌?”
కొడుకు చేసిన నిర్వాకాన్ని, ఆమె సూసైడ్‌కు సిద్ధపడ్డ విషయాన్నీ చెప్పాను.
“తెలంగాణ గ్రామీణ స్త్రీలకు ఇది పెద్ద శాపమే సర్‌. ఇక్కడ ఆడవాళ్లను వాళ్ల మానానికి వాళ్లను వదిలేసి అక్కడ వాళ్లు హాయిగా ఉంటారు. కుటుంబాలను పోషించుకోలేక మగవాళ్ల లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యల వరకూ వెళ్తున్నారు ఆడవాళ్లు” ఆందోళనగా అన్నది అరుణ మేడం.
“రమ గురించి ఊళ్లో బ్యాడ్‌ టాక్‌ నడుస్తుంది మేడం. నిప్పు లేందే పొగ వస్తుందంటరా?” అన్నాడు మరో కొలీగ్‌ శ్రీనివాస్‌.
“బ్యాడ్‌ టాక్‌ అంటే ఏమిటి సార్‌? రమ అందంగా ఉంది. ఎందరెందరి వెకిలి చేష్టల్నో ధైర్యంగా తిప్పి కొట్టింది. లొంగని ఆడవాళ్ల మీద సునాయాసంగా చేయగలిగేది, వారి కారెక్టర్‌ అసాసినేషన్‌. బాధ్యత గల ఒక ఉపాధ్యాయుడిగా, ఊళ్లో వాళ్లు అన్న దాంట్లో ఏ ఆధారాలున్నాయో తెలుసుకోకుండా ప్రచారంలో మీరూ ఓ భాగం కావడం మీలో సహజాతంగా దాగిన పురుష అహంకారమే శ్రీనివాస్‌గారు”.. ఆవేశంతో విరుచుకుపడింది అరుణ మేడం.
ఆమె మాటలకు రియాక్ట్‌ అవడం అటుంచి, ఆమె ఆవేశం ముందు కామ్‌గా ఉండక తప్పలేదు అతనికి.
“రమకు మనం ఏమీ చేయలేమా సార్‌?” అంది అరుణ మేడం.
“చెయ్యాలి మేడం.. మనలాంటి వాళ్లం, ఇతర స్వచ్ఛంద సంస్థలు అండగా నిలబడాలి. ఆమెకు ఏ ఇతర ఆధారమూ లేదు. నేను ఆమెకు భరోసా ఇచ్చి పంపాను. నా మీద విశ్వాసంతో వెళ్లింది. ఈ నా ప్రయత్నంలో మీ సహకారం కూడా ఉండాలి”
“తప్పకుండా సార్‌..”
స్కూల్‌ అయిపోగానే సరాసరి ‘సఖి’ ఆఫీసుకు అరుణ మేడంతో కలిసి వెళ్లి పూర్తి వివరాలు ఇచ్చాను. వాళ్ల టీంతో ఊరికి వచ్చి, ఫామిలీ మెంబర్స్‌, ఊరివాళ్లతో కలిసి మాట్లాడి తప్పక పరిష్కరిస్తామని మాట ఇచ్చారు.
అక్కడ నుండి అడ్వకేట్‌ మిత్రుని దగ్గరకు వెళ్లి, చట్టపరంగా ఆమెకుగల రక్షణ చర్యల గురించి డిస్కస్‌ చేశాను. అవసరమైతే పోలీస్‌ సహాయం ఏ విధంగా తీసుకోవచ్చో తెలుసుకున్నాను.
ఇక అక్కణ్ణుంచి ఇంటికెళ్లి రాత్రంతా ఒకటే ఆలోచిస్తున్నాను. ఈ సున్నితమైన విషయాన్ని రవితో ఎలా మాట్లాడాలి. మా బడిలో ఐదో తరగతి అయిపోయే వరకు, “అమ్మా అమ్మా..” అంటూ కొంగు పట్టుకొని తిరిగిన వాడి అమాయకపు చూపులు ఇప్పటికీ నా కండ్లలో తిరుగుతున్నాయి. ఒక మూర్ఖురాలి దుర్మార్గపు ఆలోచన వాడి పసి హృదయంలో కల్లోలం రేపి, ఇంతటి కలకలానికి కారణమైంది. ‘చాలా ప్రేమతో, సున్నితంగా డీల్‌ చేయాలి’ అనుకొని పడుకున్నాను.
v v v
ఉదయం స్కూల్‌కు వెళ్లగానే లొల్లిలొల్లిగా ఉంది. హైస్కూల్‌ హెడ్‌మాస్టర్‌ గారి దగ్గరకు వెళ్లాను.
“విషయం తెలిసిందా సార్‌? మన పేరెంట్‌ రమ.. వాళ్ల అత్తామామలిద్దర్నీ చంపేసింది”
ఒక్కసారి షాక్‌కు గురయ్యాను.
“ఏమయ్యిందట సార్‌? ఇంత ఘోరం ఎలా జరిగింది?”
“అర్ధరాత్రి వాళ్ల మామ బాగా తాగి ఉండి, రమమీద చెయ్యి వేశాడట. ఎంత ఆవేశంలో ఉందో ఏమో, రోకలి బండతో మోదగానే ఒక్క దెబ్బకే తలపగిలి కుప్ప కూలిండంట. అడ్డుకోబోయిన అత్తకూడా, ఎడాపెడా బాదిన దెబ్బలకు ప్రాణాలు విడిచిందంట”
ఉండబట్టలేక అరుణ మేడంతో కలిసి రమ ఇంటికి వెళ్లాను. ఊరు ఊరంతా పోగైంది. బట్టలనిండా రక్తపు మరకలతో, వాకిట్ల పందిరికింద మౌనమునిలా కూర్చొని ఉంది రమ. జనాలంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
“గింతకు తెగిత్తదా?” అని కొందరు..
“చాలా మంచి పని చేసింది. కాటికి కాళ్లు జాపిన ముసలోనికి గిదేం పాడుబుద్ధి. మంచి గుణపాఠం నేర్పింది. మల్లెవ్వల్లు గీ చెత్త పని చేయకుండా భయం కొద్ది ఉంటరు. ముసల్ది ఏవన్న తక్కువనా.. పొల్లను అరిగోస వోసుకుంది” అని మరికొందరు అంటున్నరు.
నన్ను చూడగానే రమ పిల్లలిద్దరూ వచ్చి నన్ను చుట్టేసుకున్నరు.
“అమ్మా.. అమ్మా..” అంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నరు.
“మా అమ్మ చాలా మంచిది సార్‌. మా నానమ్మ తాతయ్యలే మంచోళ్లు కారు”
రవి నోట్లోంచి ఆ మాటలు వినగానే, రమ ఒక్కసారిగా తలెత్తి ఇటువైపు చూసింది. కండ్లవెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నా, కుండల కొద్దీ అమృతమేదో ఆమె నెత్తిమీద కుమ్మరించినట్లు.. సంతోషంతో కూడిన చిన్న నవ్వు నాకు మాత్రమే కనిపించి మాయమైంది.
ఇప్పుడు రమ మనస్సు పూర్తిగా తేలిక పడిన విషయం నాకు బోధ పడింది.
అరుణ మేడం, నేను రమ దగ్గరకు వెళ్లగానే..
“సార్‌, ఇది నేను ఊహించని ముగింపు. కాలం నా నుదుటన రాసిన వింత తీర్పు. నా పిల్లలమీద కొంచెం దయ ఉంచండి”
“రమా! ఇది నువ్వు కావాలని చేసిన నేరం కాదు. నువ్వు త్వరలోనే నీ పిల్లల దగ్గరకు వస్తావు. దానికోసం చట్టపరంగా, ఇతరత్రా మేము నీకు అండగా ఉంటాం”
బయట పోలీస్‌ వ్యాన్‌ వచ్చిన చప్పుడు. రవి నా దగ్గరకు వచ్చి..
“పోలీసులు వచ్చిండ్రు సార్‌. అమ్మను కాపాడండి సార్‌..” అంటూ భయం భయంగా అడుగుతున్నాడు.
“తప్పక బేటా.. అమ్మకేం కాదు. మేమంతా లేమూ” అంటూ చెబుతుంటే, అరుణ మేడం పిల్లలిద్దర్నీ దగ్గరకు తీసుకుంది.
పోలీసులు రమను తీసుకు వెళ్లగానే, నేను స్కూల్‌వైపు తిరిగి వస్తుంటే గుర్తొచ్చింది.
ఆ రోజు.. ‘రక్షా బంధన్‌’.

గాజోజు నాగభూషణం
కవి, రచయిత, గాయకుడిగా చిరపరిచితులు గాజోజు నాగభూషణం. 1962 మే 12న జగిత్యాలలో జన్మించారు. బీఏ, బీఎడ్‌ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ కరీంనగర్‌లో నివాసముంటున్నారు. అలిశెట్టి ప్రభాకర్‌తో పరిచయం తర్వాత, ఆయన ప్రభావంతో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు.ప్రధానంగా ‘కవిత్వం’ రాస్తారు. ‘మట్టి సరిగమలు’ పేరుతో మొదటి కవితా సంకలనాన్ని వెలువరించారు. మరో పుస్తకం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటి వరకూ పది కథలు రాశారు.

- Advertisement -

మొదటి కథ
‘పరిష్కారం’ 2104లో సాహితీ గౌతమి వెలువరించిన కరీంనగర్‌ జిల్లా కథా సంకలనం ‘పంచపాల’లో ప్రచురితమైంది. కరోనా నేపథ్యంలో రాసిన ‘రాజమ్మ’ కథకు మంచి ఆదరణ లభించింది. వీటితోపాటు ‘ధిక్కార స్వరం’, మరో ఆరు కథలు రాశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘నెత్తుటి గాయాలు – తెలంగాణ ఉద్యమ గేయాలు’ పేరుతో పాటల సీడీని విడుదల చేశారు. సాహితీ ప్రపంచంలో సంచలనానికి తెర లేపిన ‘ఎన్నీల ముచ్చట్లు’ రూపకర్తల్లో నాగభూషణం ఒకరు. 2009 నంది టీవీ అవార్డుల కమిటీ జ్యూరీ మెంబర్‌గా పనిచేశారు. సాహిత్య సేవకుగాను అలిశెట్టి
ప్రభాకర్‌ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారంతోపాటు మరికొన్ని సాహిత్య,
సాంస్కృతిక పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం ‘తెలంగాణ రచయితల వేదిక’ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫిలిం సొసైటీతోపాటు మరికొన్ని సంస్థల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

-గాజోజు నాగభూషణం, 9885462052

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తీర్పు
తీర్పు
తీర్పు

ట్రెండింగ్‌

Advertisement