ఊబకాయం వర్సెస్ క్యాన్సర్
ఊబకాయంతో సవాలక్ష సమస్యలు వస్తాయని తెలుసు. రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులకు ఊబకాయమే రాచమార్గం. ఇప్పుడు మరో దుర్వార్త. ఊబకాయం క్యాన్సర్‌కు దారితీయడమే కాకుండా క్యాన్సర్‌నుంచి కోలుకోవడంలో అడ్డు పడుతుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘ఒబెసిటీ’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం, ఊబకాయంతో మనలోని జీవక్రియలు దెబ్బతింటాయి. అంతేకాదు, శరీరంలోని లిపిడ్స్, ఇన్సులిన్, లెప్టిన్ వంటి రసాయనాలను ప్రభావితం చేసి MDSC అనే కణాల ఉత్పత్తికి కారణమవుతాయి. ఇవి క్యాన్సర్ బాధితుల రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. దాంతో క్యాన్సర్ చికిత్స సత్ఫలితాలను ఇవ్వదు. రోగి కోలుకునే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి, క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా త్వరగా బయట పడేందుకు ప్రయత్నించాలి. అది జరగాలంటే, శరీర బరువు పరిమితుల మధ్యే ఉండేలా చూసుకోవాలి.
ఓసీడీతో పక్షవాతం!
వేసిన తాళాన్ని పదిసార్లు లాగి చూసుకోవడం, కడిగిన చేతులనే మళ్లీ కడగటం వంటి చేష్టలను చూసి ‘చాదస్తం’ అంటూ నవ్వేస్తాం. నిజానికి ఇది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) అనే మానసిక సమస్య. సాదాగానే కనిపించే ఈ రుగ్మత ‘ప్రాణాంతకమవుతుందా?’ అంటే, ‘అవుననే’ అంటున్నారు తైవాన్ పరిశోధకులు. యాభై వేలమందిని గమనించిన మీదట, ఓసీడీ సమస్య ఉన్నవారిలో ‘ఇస్కెమిక్ స్ట్రోక్’ వచ్చే ప్రమాదం ఏకంగా మూడు రెట్లు అధికమని తేల్చారు. రక్తం గడ్డ కట్టడం వల్ల మెదడుకు రక్త సరఫరాలో లోపం తలెత్తడాన్ని ‘ఇస్కెమిక్ స్ట్రోక్’ అంటారు. పక్షవాతానికి ఇదో ముఖ్య కారణం. ఓసీడీ సమస్య ఉన్నవారు మద్యం, సిగరెట్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉన్నా, మంచి జీవన విధానాన్ని అలవర్చుకున్నా, రక్తపోటును నియంత్రించుకున్నా ఈ సమస్య కనిపించడం విచిత్రం. ఓసీడీకీ, పక్షవాతానికీ మధ్య సంబంధానికి కారణం ఏమిటన్నది మాత్రం పరిశోధకులు చెప్పలేక పోతున్నారు. ఓసీడీవల్ల మెదడులో నిత్యం అలజడి చెలరేగుతూ ఉండటమే పక్షవాతానికి దారితీస్తున్నదేమో!
కంటిచూపు-నిద్ర
దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనబడుతూ, దూరపు ప్రపంచం అస్పష్టంగా గోచరించడం అన్న సమస్య చాలామందికి ఉంటుంది. దీన్నే ‘మయోపియా’ (హ్రస్వదృష్టి) అంటారు. ‘ఈ సమస్యకూ నిద్రకూ సంబంధం ఉందా?’ అనే అనుమానం ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులకు కలిగింది. రోజూ చీకటి పడగానే మనందరిలోనూ ‘మెలటోనిన్’ అనే హార్మోను విడుదల అవుతుంది. ఇది శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. మన జీవ గడియారంలో మెలటోనిన్ది కీలకపాత్ర. హ్రస్వదృష్టి ఉన్నవారిలో మెలటోనిన్ చాలా నిదానంగా స్రవిస్తున్నట్టు కనుగొన్నారు. ఇదే వారిలో నిద్రలేమికి దారితీస్తున్నది. ఈ పరిశోధన కంటిచూపునకూ మెలటోనిన్‌కు మధ్య బంధాన్ని స్పష్టం చేసింది. ఎలాగైతే మయోపియా వల్ల నిద్రలేమి కలుగుతుందో, అలాగే నిద్రలేమి వల్లకూడా హస్వదృష్టి ఏర్పడుతుందని పరిశోధకులు నిర్ధారించారు. నగరాల్లోని కృత్రిమ వెలుతురు, మొబైల్ నుంచి వెలువడే నీలం కాంతి ఇవన్నీకూడా మెలటోనిన్ మీద ప్రభావం చూపుతాయని, ఫలితంగా పిల్లల్లోకూడా హ్రస్వదృష్టి సమస్య తలెత్తుతున్నదనీ వారంటున్నారు.
పెంపుడు జంతువే ‘నిద్రమాత్ర’
కొంతమంది పిల్లలకు, తమ పక్కలో పెంపుడు కుక్కకో, పిల్లికో చోటివ్వడం అలవాటు. దీనివల్ల వాళ్ల నిద్రమీద ఎలాంటి ఫలితం ఉంటుందో కెనడాలోని కంకార్డియా విశ్వవిద్యాలయ నిపుణులు తెలుసుకోవాలనుకున్నారు. సాధారణంగా పక్కలో జంతువులుంటే చిరాగ్గా ఉంటుందని, వాటితోపాటు ఇరుక్కుంటూ, వాటి గోళ్లను గమనించుకుంటూ పడుకోవడం వల్ల సరిగా నిద్ర పట్టదనీ కొందరి నమ్మకం. ఇందులో వాస్తవాన్ని వారు తేల్చుకోవాలనుకున్నారు. ఇందుకు కొంతమంది పిల్లలను ఎంచుకున్నారు. వారి నిద్ర అలవాట్లను తెలుసుకున్నారు. అంతేకాదు, నిద్ర ఎంతవరకు గాఢంగా ఉంటున్నదో తేల్చేందుకు వాళ్ల చేతులకు ట్రాకర్లు అమర్చారు. ఒకరోజైతే వారి నిద్రను గమనించేందుకు మెదడుకి ఓ పరికరాన్నీ జోడించారు. ఆశ్చర్యంగా పెంపుడు జంతువులతోపాటు పడుకున్న పిల్లలు, ఇతరులతో పోలిస్తే మరింత గాఢంగా నిద్రపోతున్నట్టు తేలింది. పిల్లలు పెంపుడు జీవులను తమ ప్రేమను పంచుకునే సహచరులుగా, అభద్రతను దూరం చేసే నేస్తాలుగా భావించడమే ఇందుకు కారణాలు కావచ్చని పరిశోధకులు అంటున్నారు.