e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home బతుకమ్మ ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

వంట అనేది యాదృచ్ఛికంగా జరిగిన ఓ ఆవిష్కరణ అని చెబుతారు. లక్షల సంవత్సరాలనాటి మాట. మంటను చూసి మనిషి భయపడుతున్న సమయమది. మనిషి తలదాచుకొనే అడవిని నిప్పు కాల్చేస్తోంది. చిక్కుకున్న మనిషిని దహించేస్తోంది. మొత్తంగా మనిషి అస్తిత్వానికి సవాలుగా మారుతోంది. కానీ, అదే నిప్పులో బాగా కాలిన కొన్ని పదార్థాలు కనిపించాయి. ఆకలి తీర్చుకోవడానికి నోట్లో వేసుకొన్నాడు. అద్భుతం! పచ్చి ఆహారం కంటే, మహా రుచికరంగా ఉండటం గమనించాడు మనిషి. సొంతంగా నిప్పును పుట్టించే కళ నేర్చాక వంట కార్యక్రమం మొదలుపెట్టాడు. వ్యవసాయంతోపాటే పాకశాస్త్రమూ ఓ కళగా మారింది. వంటిల్లే ఓ ప్రయోగశాలగా అవతరించింది. గరికతోసైతం పచ్చడి చేయగల నేర్పు సొంతమైంది. కొన్నేండ్ల క్రితం పరిస్థితిలో మార్పు వచ్చింది. వంటను ఓ శ్రమగా, వృథా సమయంగా భావించసాగారు. కాస్త డబ్బులు ఖర్చు చేస్తే అనాయాసంగా కమ్మని ఆహారం దక్కుతుందనే భావన పెరిగింది. ఆ ట్రెండ్‌ ఇప్పుడు తిరగబడుతోంది. ఇంటివంటకు ఇంటింటా ఆదరణ పెరుగుతోంది! ఎంత శత్రువైనా, కరోనాకు
కృతజ్ఞతలు చెప్పుకోవాలి!

2020 మార్చి.
దేశమంతా లాక్‌డౌన్‌ విధించిన వేళ. కొన్నేండ్లుగా అలవాటు చేసుకున్న ఆన్‌లైన్‌ ఆహారాలకు గండి పడింది. సూపర్‌ మార్కెట్లలో అడుగూబొడుగూ ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌కూడా ఆవిరైపోయింది. ఇది కష్టకాలం. కొవిడ్‌ భయంతో బిక్కుబిక్కుమని గడిపిన సమయం. తప్పనిసరి పరిస్థితే అయినా, నిదానంగా ఇంటి ఆహారానికి అలవాటు పడటం మొదలుపెట్టారు. కష్టకాలంలోనే ఇలాంటి అలవాట్లు పాదుకుంటాయి, ఆదుకుంటాయి. భీముడి పాక ప్రావీణ్యత కారణంగానే పాండవులు అజ్ఞాతవాసాన్ని లాగించేశారు. నలుడి కథా అలాంటిదే. నలభీములకు దీటుగా, ఇప్పుడు మనకూ గరిట తిప్పే అవకాశం వచ్చింది. ఇంట్లో వంట చేసుకుంటే ఆదాకు ఆదా, ఆనందానికి ఆనందం! ఆడామగా తేడా లేకుండా, వయసు పట్టింపు రాకుండా ప్రతి ఒక్కరూ తిరగమోత మోగిస్తున్నారు!

- Advertisement -

అనూహ్యమైన ప్రయోజనాలు

ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

హోటల్లో అయితే డబ్బులు పెట్టాలి, ఇంట్లో అయితే వండుకోవాలన్నతేడా మాత్రమే కాదు.. ఇంటివంటకూ, బయటి తిండికీ సవాలక్ష భేదాలు కనిపిస్తాయి. లెక్క తేలిస్తే స్వయంపాకమే సర్వోత్తమమని తేలుతుంది.

  • ఓ అంచనా ప్రకారం మనం తినే ఆహారంలో ఏ మాత్రం తేడా వచ్చినా అది 250 రకాల జబ్బులకు కారణం అవుతుంది. హోటల్‌ ఆహారంతో ఈ సమస్య మరీ ఎక్కువ. నాణ్యతలో లోపాలను పక్కన పెట్టినా హోటల్‌ ఉండే ప్రాంతం, అక్కడికి వచ్చే మనుషులు, వంటవాళ్ల శుచీ శుభ్రతసహా ఎవరి నుంచైనా, ఎలాగైనా అంటువ్యాధులు సంక్రమించవచ్చు. ఉదాహరణకు చాలాసార్లు హోటల్‌లో తిన్నప్పుడు వచ్చే విరేచనాలకు ‘ట్రావెలర్స్‌ డయేరియా’ అనే సమస్యే కారణం. ఇంటి దగ్గర తింటే ఇలాంటి అంటువ్యాధుల బాధ దాదాపుగా శూన్యం.
  • ఇంట్లో వండుకునేవారు తక్కువ కెలోరీలను తీసుకుంటారని ఓ నమ్మకం. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనుకున్నారు జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. దీనికోసం ఏకంగా తొమ్మిది వేల మంది అలవాట్లను పరిశీలించారు. తరచూ ఇంట్లోనే వంట చేసుకునేవారు చాలా తక్కువ మోతాదులో కెలోరీలు, పంచదార, కొవ్వు పదార్థాలు వాడుతున్నట్టు తేలింది. అంతేకాదు! ఇంట్లో వండుకునే అలవాటు ఉన్నవారు ఫ్రిజ్‌లో నిలువ ఉంచే పదార్థాలను కూడా తక్కువగా వాడుతున్నారట. ఒకవేళ ఎప్పుడైనా బయటకి వెళ్లినా ఆరోగ్యకరమైన పదార్థాలనే ఎంచుకుంటున్నారట. ఇందుకు కారణాలు స్పష్టమే! బయట వండే ఆహారంలో రుచికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. మసాలా ఎక్కువైతే అందుకు తగినంత ఉప్పూకారం వేయాలి. నోరూరే రుచికోసం ఇంకాస్త బటర్‌ వేయాలి.. అన్న లెక్కలే ఉంటాయి. ఇంట్లో అలా కాదు. అనుభవం, అలవాటు, ఆరోగ్యం అన్నీ దృష్టిలో ఉంచుకునే దినుసుల కొలత ఉంటుంది.
  • ఇంట్లో వండుకునేటప్పుడు ఒక వస్తువు అవసరమా లేదా అనే చూస్తాం. అదే ఆహారాన్ని వాణిజ్యపరంగా రూపొందిస్తే ధరలే కీలకంగా మారుతాయి. ఉల్లిపాయల ధర పెరిగితే దోసెలో ఉల్లి ముక్కలు కనిపించవు. నూనె ధర పెరిగితే కల్తీ ఆయిల్‌ రాజ్యమేలుతుంది. ధర గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నాణ్యత గురించీ చెప్పుకోవాలి. ఇంట్లో ప్రతి వస్తువునూ ఆచితూచి వాడతాం. ఏ మాత్రం తేడాగా తోచినా వాసన చూస్తాం. అనుమానం వస్తే చెత్తబుట్టలో పడేస్తాం. బయట ఆ భరోసా ఉండదు. ముఖ్యంగా చికెన్‌, పనీర్‌ లాంటి వస్తువులు కాలపరిమితి దాటిపోతే ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. హోటళ్లలో సోదాలు జరిగినప్పుడు కుళ్లిన పదార్థాలు ఇబ్బడి ముబ్బడిగా బయట పడుతుంటాయి. దీనికి బ్రాండెడ్‌ రెస్టారెంట్స్‌ సైతం మినహాయింపు కాదు.
  • వంటలతో పిల్లలు ప్రయోగం చేస్తుంటే వాళ్లలో బాధ్యత పెరుగుతుందని, సృజనాత్మకత మెరుగుపడుతుందనీ చెబుతారు. కెనడాలోని ఆల్బెర్టా విశ్వవిద్యాలయం ఇందుకు సంబంధించి మరో కీలక విషయాన్ని బయటపెట్టింది. వంట పనుల్లో తల్లిదండ్రులకు సహకరించే పిల్లలు లేదా స్వయంగా వంట చేయడానికి ఆసక్తి చూపించే పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారానికి మొగ్గు చూపుతారట. మిగతా పిల్లలు కేవలం పండ్లని మాత్రమే ఇష్టపడితే వీళ్లు కూరలను కూడా ఇష్టంగా స్వీకరిస్తారట. వంటింట్లో కూరగాయలతో సావాసం చేయడం వల్లో, వాటివల్ల కలిగే ఆరోగ్యం గురించి పెద్దలద్వారా తెలుసుకోవడం వల్లో ఇలా జరుగుతూ ఉండవచ్చు. అంతేకాదు, వంట అలవాటైన పిల్లలు, ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు కూడా పౌష్ఠికాహారానికే మొగ్గు చూపారని పరిశోధకులు తేల్చేశారు. 150కి పైగా స్కూళ్లలోని విద్యార్థులను పరిశీలించి మరీ నిరూపించుకున్న విషయాలివి.
  • ఫుడ్‌ కలర్స్‌, అజినమోటొ, ఫ్లేవర్స్‌ లాంటి సవాలక్ష పదార్థాలతో బయటి ఆహారాలు తయారవుతాయి. ఒక స్థాయికి మించితే ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే మైదా లాంటివాటిని ఎడాపెడా వాడేస్తారు. ఇక, ఇంట్లో కనిపించని బేకింగ్‌, డీప్‌ ఫ్రై లాంటి పద్ధతులూ రెస్టారెంట్లలో రాజ్యమేలతాయి. ఇవన్నీ ఏమంత శుభశకునాలు కాదు. అంతేకాదు, కొన్ని పదార్థాలు, రసాయనాలు మనకు అలెర్జీని కలిగిస్తాయి. ఇంట్లో అయితే మనకి సరిపడని వాటిని పక్కన పెట్టేస్తాం. హోటల్‌లో మన ముందుంచిన వంటకంలో ఏమేం కలిశాయో తెలుసుకోవడం దాదాపు అసాధ్యం.
  • బయట ఆహారానికి మొగ్గు చూపే చాలామంది తేలికగా తీసుకునే విషయం పరిమాణం. ఇంట్లో వండుకునేటప్పుడు ఎవరు ఎంత తింటారో స్పష్టమైన అంచనా ఉంటుంది. బయట అడుగు పెడితే ఆ లెక్కలు తారుమారవుతాయి. ఒక్కో హోటల్‌ లెక్క ఒక్కోలా ఉంటుంది. అక్కడికి వెళ్లాక వీరావేశంతో మనం చేసే ఆర్డర్లు రకరకాలుగా ఉంటాయి. వెరసి అనేకానేక గిన్నెలతో టేబుల్‌ నిండిపోతుంది. మొదటి నాలుగు ముద్దలు మాత్రమే ఆస్వాదిస్తాం. ఆ తర్వాత పదార్థాలను ఖాళీ చేయాలన్న యావలోనే ఉంటాం. అందుకే ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలున్న వారికి బయటి ఆహారం మరింత చేటు చేస్తుంది. ఓ నివేదిక ప్రకారం, బయట తినే ఆహారంలో పోషక విలువలు లేకపోవడం, తినే పరిణామం మీద నియంత్రణ లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 15 శాతం ఎక్కువని తేలింది.
  • మధ్యతరగతి జీవితాలకు ప్రతి రూపాయీ పాపాయి లాంటిదే! ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మేలు. కానీ, బయటి ఆహారం అలవాటైతే వందలు, వేలుగా కనిపించే ఖర్చు ఏడాది రెండేండ్లు దాటేసరికి లక్షలకు ఎసరు పెడుతుంది. నెలకు నాలుగైదుసార్లు రెస్టారెంట్‌ దారి పట్టినా జీతంలో పదో వంతుకు పైగా ఖర్చవడం ఖాయం. ఇంటి దగ్గరే అయితే తక్కువ ఖర్చులో ఆరోగ్యకరమైన ఆహారం తయారవుతుందని భరోసా ఇస్తున్నారు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఆరెగావ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలుకూడా 400మంది అలవాట్లను పరిశీలించి, ఇంట్లో వండుకునేవారి ఆహారంలోనే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని, డబ్బుకూడా అదా అవుతుందనీ తేల్చారు.

లక్షల ఏండ్లుగా..

పరిణామ శాస్త్రంలో ‘పైలోజెనెటిక్స్‌’ అనే విశ్లేషణ ఉంది. మన జన్యువులలో వచ్చిన మార్పుల ఆధారంగా, మనిషి జీవన విధానాన్ని తెలుసుకునే ప్రక్రియ ఇది. ఆ ప్రకారం, కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే మనిషి ఓ వంటవాడయ్యాడు. కొలంబస్‌ తరహా నావికులు సాగించిన ప్రయాణాలతో ‘ఇది స్థానికం, ఇది కాదు’ అన్న తేడా లేకుండా రకరకాల కూరలు, దినుసులు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో పండే మసాలా దినుసులకోసం జరిగిన యాత్రలు, వ్యాపారంతో చరిత్రలే మారిపోయాయి. పారిశ్రామిక విప్లవంతో వంట చేసుకునేందుకు రకరకాల సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. 18వ శతాబ్దం చివరి నాటికి వెయిటర్లు, మెనూ, ప్రత్యేక వంటగది లాంటి సౌకర్యాలతో పూర్తిస్థాయి రెస్టారెంట్లు మొదలయ్యాయి. ఒక అంచనా ప్రకారం, 2019లో భారతీయ ఆహార పరిశ్రమ విలువ నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైమాటే.

ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

ఆహారమే ఔషధం
మొదటినుంచీ ఆహారాన్ని మన దేశంలో ఆకలి తీర్చే సాధనంగానే కాకుండా శక్తినీ, ఆరోగ్యాన్నీ అందించే ఔషధంగా భావించారు. మన ఆలోచననూ, ఆయుష్షునూ అన్నం ప్రభావితం చేస్తుందని నమ్మేవారు. ఆయుర్వేదంలోని మౌలిక సూత్రాలూ ఈ నమ్మకాన్నే బలపరుస్తాయి. ఆయా కాలాల్లో దొరికే పదార్థాలు, బయటి వాతావరణం, ఇంట్లోవారి ఆరోగ్యం.. అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పొయ్యి వెలిగేది. పండుగల సమయంలోనూ ఇదే విచక్షణ కనిపిస్తుంది. జీర్ణసమస్యలు రాకుండా కొత్తబియ్యంతో సకినాలు, అరిసెలు వండే సంక్రాంతి; ఎండాకాలం వడదెబ్బ తగులకుండా ‘వడ’పప్పు, పానకం; యుక్తవయసు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు మినుప అట్లతో సాగే అట్లతద్ది… ఇలా ప్రతి వంటకం వెనుకా స్పష్టమైన ఆరోగ్య లక్ష్యం కనిపిస్తుంది. మన వంటకాల్లో మరో ప్రత్యేకత ‘కాంబినేషన్‌’. ఒక ఆహారం వల్ల శరీరంలో కలిగే దుష్ఫలితాలను తగ్గించడానికి లేదా దాని రుచి పెంచడానికి జోడీగా మరో ఆహారాన్ని తీసుకోవడం (ఉదాహరణకు ముద్దపప్పు – ఉల్లిచారు).

ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

సవాలక్ష కారణాలు

ఇంటి ఆహారంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జబ్బు పడినవారు లేదా ఆరోగ్య సమస్య ఉన్నవారికి ఇంటి భోజనమే ఉత్తమం. బరువు తగ్గాలనో, కండలు పెంచాలనో లక్ష్యం పెట్టుకున్న వారికి కూడా ఇదే పరిష్కారం.

వంట అంటే నాలుగు పదార్థాల కలయిక మాత్రమే కాదు, ఓ నైపుణ్యం. సహజంగానే అది మనలో ఆత్మవిశ్వాసం, సృజన, ఓరిమిలాంటి ఇతర సానుకూల ధోరణులను అలవాటు చేస్తుంది.
వంట చేసేటప్పుడు మన ఆలోచన దానిమీదే కేంద్రీకృతమవుతుంది. అందుకే, చాలామంది దృష్టిలో వంట, ఒత్తిడిని తగ్గించే చిట్కా. మూడ్‌ను మార్చే మందు.సరదాగా కలిసి కాలం గడిపేందుకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచేందుకు వంటను మించిన ఉపాయం లేదన్నది అనుభవజ్ఞుల మాట.
వంట ఓ అద్భుతమైన వ్యాయామం. ఇక్కడ నిలబడే అవకాశం ఉండదు. పొయ్యి ముందు చెమటలు కక్కాల్సిందే. ఎప్పటి కప్పుడు పదార్థాలను గమనించుకుంటూ, అటూ ఇటూ తిరుగుతూ సర్వేంద్రియాలకూ పని చెప్పాల్సిందే.
మనం గమనించం కానీ, ప్రత్యేకించి రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఓ పూట కరిగిపోతుంది. రానూ పోనూ ప్రయాణంతో పాటు రద్దీ వేళల్లో ఆర్డరు చెప్పాక అరగంటైనా వేచి ఉండాల్సిందే. దిల్లీలోని ‘జంగ్లీ బిల్లి’ అనే రెస్టారెంట్‌ ప్రకారం, ఆ హోటల్‌లో కస్టమర్లు గడిపే సమయం ఏకంగా రెండు గంటలు.

ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

మా వంట… మీ ఇంటికి!
బయటి హోటళ్లలో ఆహారం శుచిగా ఉండదు. ఆ నాణ్యతను పరీక్షించే వ్యవస్థ మన దేశంలో చాలా బలహీనంగా ఉంది. పైగా నూనె దగ్గరనుంచీ పిండివరకు ఎలాంటి పదార్థాలు వాడతారో తెలియదు. ఈ అపనమ్మకాలను పోగొట్టడానికి ఇప్పుడిప్పుడే కొన్ని రెస్టారెంట్లు తమ కిచెన్‌ అందరికీ కనిపించేలా ‘ఓపెన్‌’గా ఏర్పాటు చేస్తున్నాయి. ఎంత చేసినా లాభాపేక్షతో నడిచే హోటళ్లకంటే ఇంటివంటే ఆరోగ్యమని నమ్మేవారి సంఖ్య పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా ఇంటివంటను అందించే సేవలు ఎక్కువయ్యాయి. ఇది ఓ ఉపాధి రంగంగా కూడా రూపుదిద్దుకుంటున్నది. ఒక్క హైదరాబాద్‌లోనే హోమ్స్‌ కిచెన్‌, పూజా కీ రసోయి, హెల్దీ బైట్‌ అంటూ చాలామంది ఇంటివంటను అందిస్తున్నారు. ఇలా ఇంటినుంచి వంటకాలను అందించేవారిని హోమ్‌ షెఫ్స్‌గా పేర్కొంటారు. ఇప్పుడు వాళ్లదే హవా!

ఎందుకింత రుచి?
చాలా దేశాలలో వంటకాలు అవసరం కొద్దీ ఏర్పడ్డాయి. ఉదా॥కు ఇటలీలో మధ్యతరగతి ప్రజలు తమ ఆకలిని తీర్చుకునేందుకు తక్కువ ఖర్చులో, ఎక్కువ కాలం నిలువ ఉండే జంక్‌ ఫుడ్స్‌ని రూపొందించారు. కానీ భారతీయులు అవసరాలను గమనించుకుంటూనే, సమతుల ఆహారం కోసం ప్రయత్నించారు. ప్రిజర్వేషన్‌ (నిల్వ) సూత్రంతో పచ్చళ్లను రూపొందించినా, ఫెర్మంటేషన్‌ (పులియ బెట్టడం) పద్ధతిలో ఇడ్లీల్లాంటి వంటకాలు కనిపెట్టినా ఆకలి తీరుతూనే రుచికరమైన భోజనం కోసం తపించారు. ఇక, మన ఆహారంలో వాడే పసుపు, ఇంగువ, జాజికాయ లాంటి దినుసుల గురించి చెప్పుకొంటే మరో కథనం అవుతుంది.

ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

వీటన్నిటినీ మించి ఈమధ్య జరిగిన పరిశోధన మరో ప్రత్యేకతను వెలుగులోకి తెచ్చింది. ‘జోధ్‌పూర్‌ ఐఐటీ’ పరిశోధకులు కొన్ని వేల భారతీయ వంటకాలను పరిశీలించి ఓ అనూహ్యమైన విషయాన్ని కనుగొన్నారు. మనం తీసుకునే ప్రతి ఆహారానికీ ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటాయి. వీటిని ‘ఫ్లేవర్‌ కాంపౌండ్స్‌’ అంటారు. ఐఐటీ పరిశోధకులు గమనించిన వంటకాలలో, దాదాపు 200 రకాల ఫ్లేవరింగ్‌ కాంపౌండ్స్‌ కనిపించాయి.

ఆశ్చర్యమేమిటంటే ఓ వంటకంలో ఒకే రకమైన రుచి, సువాసన అందించే దినుసులను వాడటం చాలా తక్కువగా కనిపించింది. కావాలంటే ఏదన్నా ఓ వంటకం తయారీని తీసుకోండి. కావల్సిన పదార్థాల జాబితాను గమనించండి.

వాటిలో ప్రతి ఒక్కటీ ఎంత వైవిధ్యమో అర్థమవుతుంది. విదేశీ పదార్థాలు అలా కాదు. పన్నీర్‌, బటర్‌, యోగర్ట్‌… ఈ మూడు పాల పదార్థాలూ ఒకే వంటకంలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఎలా చేసుకోవడం?

చాలామంది దృష్టిలో వంట ఓ అసాధ్యమైన కార్యం. అందుకే, వీలైనంత వరకూ దాని జోలికి పోరు. కానీ, వంటను ఓ సరదా ప్రయోగంగా భావిస్తే ఎంత చేసినా ఆసక్తి తీరనంత లోతు కనిపిస్తుంది. వంటలో ఆరితేరిన వాళ్లు పక్కన ఉంటే వాళ్ల సూచనల ఉపయోగమే వేరు. వాటితోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా మంచి షెఫ్‌గా మారిపోవచ్చు.

ముందు మనం వాడే పాత్రలను గమనించుకోవాలి. ఏ వంటకానికి ఎలాంటి పాత్ర సరిపోతుందో తెలుసుకోవాలి.కూరలు తరగడమూ ఓ కళే. రక్తం కళ్ల చూడకుండా సులువుగా, క్రమంగా వాటిని తరిగే అలవాటు ముఖ్యం.ముందు చిన్నపాటి వంటకాలతో ప్రయోగాలు మొదలుపెట్టాలి. సమయం, దినుసులు ఎక్కువ పట్టేకొద్దీ వంట మరింత క్లిష్టంగా మారుతుంది. ఒకటే ప్రక్రియలో పూర్తయ్యే బొంబాయి రవ్వ ఉప్మాలాంటి పదార్థాలు మొదట అలవాటు చేసుకోవాలి.వంటల్లో, ముఖ్యంగా భారతీయ వంటల్లో అంతర్లీనంగా ఓ పద్ధతి ఉంటుంది. ఉదాహరణకు వేపుళ్లు ఒక రకంగా ఉంటాయి, తాలింపుతో చేసే కూరలు మరో తీరున ఉంటాయి. ఈ పద్ధతులని గమనిస్తే ఒక్కో అడుగూ ముందుకు వేయొచ్చు.

కొన్ని వంటకాలు మనకు బాగా చేతనవుతాయి. వాటిమీద పట్టు సాధిస్తే నలుగురూ చేరినప్పుడు మన తడాఖా చూపించవచ్చు.ఆసక్తి పెరిగితే అడుగు ముందుకు వేయడానికి ఆన్‌లైన్‌ కుకింగ్‌ కోర్సులు చాలానే వచ్చాయి. ఈ కొవిడ్‌ సమయంలో వాటికి ఆదరణ విపరీతంగా ఉంది. అంతేకాదు, ఇంట్లోనే రకరకాల పదార్థాలు చేసి డెలివరీ చేయగల హోమ్‌ షెఫ్స్‌కి ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది.
ఎవరికి ఎరుక, సరదాగా మొదలయ్యే ఓ హాబీ మన జీవితంలో నేస్తం లాగానో, కాలక్షేపంగానో, పదిమంది ఆకలిని తీర్చేదిగానో చివరికి వృత్తిగానో మారుతుందేమో.

ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

కశ్మీర్‌ టు కన్యాకుమారి
ఇంట్లో వంట చేసుకోవడం వల్ల అపారమైన వంటకాలకు ఆస్కారం దొరుకుతుంది. రోజుకో పదార్థం చేసుకున్నా జీవితాంతం తరిగి పోనన్ని వంటకాలు మన దేశంలో ఉన్నాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించే ఓ ముఖ్య కారణం మన వంటకాల్లోని వైవిధ్యమే. అసోం నుంచి కేరళ వరకు ప్రతీ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ప్రతీ జిల్లాకూ ప్రత్యేకమైన వంటకాలు కనిపిస్తాయి. బీహార్‌లాంటి మారుమూల ప్రదేశాల్లో కూడా భోజ్‌పురీ, మైథిలీ, మగహీ అంటూ వేర్వేరు రీతుల్లో వంటకాలున్నాయి. దాద్రానాగర్‌ హవేలీ లాంటి అతిచిన్న ప్రాంతాల్లోనూ విశిష్టమైన ఆహారం నోరూరిస్తుంది. ఇక గుజరాతీ, రాజస్థానీ థాలీల గురించి చెప్పేదేముంది.

కిచెన్‌ హీరోలు
మహిళలకంటే మగవారే బాగా వంట చేస్తారనేది చాలామంది నమ్మకం. అదెంత వరకు నిజమో కానీ, మన టాలీవుడ్‌ హీరోలు మాత్రం వంటలు అదర గొట్టేస్తారు. మెగాస్టార్‌ గరిటె పడితే, లంచ్‌ ‘బాక్సులు బద్దలై పోవాల్సిందే’. ఈమధ్య ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రం విడుదల సందర్భంలో టెన్షన్‌లో ఉన్న నాగార్జునను ఇంటికి పిలిచి, తన చేతివంట రుచి చూపించారు ఆచార్య. చిరు తనయుడు రామ్‌చరణ్‌ కూడా వంటల స్పెషలిస్టే! టర్కిష్‌, జపనీస్‌ అంటూ భార్య ఉపాసనతో కలిసి ప్రపంచ రుచులని ఇంట్లో ఘుమఘుమలాడిస్తారు. ఇక జూనియర్‌ ఎన్టీయార్‌ సరేసరి. వీళ్లే కాదు, రానా, మోహన్‌బాబు, నాగచైతన్య అంతా పొయ్యితో చెలగాటాలాడే మొనగాళ్లే!

కొన్ని చానల్స్‌
వంట పాఠాలకు ఒకప్పుడు పుస్తకాలే శరణ్యం. ఇప్పుడు ఆ స్థానాన్ని ‘యూట్యూబ్‌ చానల్స్‌’ అందుకున్నాయి. తెలుగులో శ్రావణీస్‌ కిచెన్‌, అమ్మచేతి వంట, మన షెఫ్‌, హైదరాబాదీ రుచులు లాంటి చానల్స్‌ ప్రజాదరణలో ఉన్నాయి. ఇక, దేశవ్యాప్తంగా ఎక్కువమందిని ఆకర్షిస్తున్న చానల్స్‌ ఇవీ.

నిషా మధులిక – 1.14 కోట్లు (అనుచరుల సంఖ్య)
కబితాస్‌ కిచెన్‌ – 1.03 కోట్లు
సంజీవ్‌ కపూర్‌ ఖజాన – 65.3 లక్షలు
హెబ్బార్స్‌ కిచెన్‌ – 55.3 లక్షలు
కుకింగ్‌ షుకింగ్‌ – 41.9 లక్షలు
రాజశ్రీ ఫుడ్‌ – 28.2 లక్షలు
వాహ్‌ షెఫ్‌ వారెవా – 23.7 లక్షలు

లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో కాలక్షేపం అవడానికీ, నలుగురి మధ్యా బంధాలు మెరుగు పడటానికీ ఇంటివంట ఓ గొప్ప అవకాశం. చాలామంది ఈ నైపుణ్యాన్ని అలవర్చుకుంటున్నా దురదృష్టవశాత్తు ఫ్రైడ్‌రైస్‌, పాస్తా లాంటి పాశ్చాత్య ఆహారానికి ప్రాముఖ్యం ఇవ్వడం బాధాకరం. ఈ కాలాన్ని, అవకాశాన్ని మన సంప్రదాయ భారతీయ వంటకాల పట్టు పట్టేందుకు, వాటితో ఆరోగ్యాన్ని సాధించేందుకు కేటాయించాలి. అదే జరిగితే, నలుడూ భీముడూ మనల్ని పూనినట్టే! పూటకో రుచి, రోజుకో విందు, జీవితమే పసందు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!
ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!
ఘర్‌ కా ఖానా..రుచుల ఖజాన!

ట్రెండింగ్‌

Advertisement