e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home బతుకమ్మ యోగాలయం!

యోగాలయం!

యోగాలయం!

‘అనుభవించడం తెలిసిన వారికి జీవితమే ఒక యోగం. కానీ, జీవితాన్ని ఎలా అనుసరించాలో తెలియజేసేది మాత్రం యోగానే’ అంటారు ప్రముఖ విద్యావేత్త, యోగా గురువు హెచ్‌ఆర్‌ నాగేంద్ర. ‘యోగాభ్యాసం’ అంటే ఒళ్లు విరిచి ఆసనాలు వేయడం మాత్రమే కాదు, మన దృక్పథాన్ని మార్చే అద్భుత నేస్తమని చెబుతారాయన. భారతీయ సంపదగా భావించే యోగాకు ఓ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. యోగాచార్యుడిగా నాగేంద్ర ్రప్రయాణం, ఆయన స్థాపించిన యోగ విశ్వ విద్యాలయ ప్రస్థానం..

భారతీయ సంస్కృతిని, యోగాను విడదీసి చూడలేం. ఆసనాల శాసనాలపై నిర్మితమైన యోగ ప్రాథమిక లక్ష్యం ఆరోగ్య సాధనే కావచ్చు. కానీ, యోగాభ్యాసం మనిషిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దుతుంది. అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించిన డాక్టర్‌ నాగేంద్ర తన కొలువును వదిలేశారు. పరపతిని పక్కనపెట్టారు. ఉన్నత పదవులను త్యజించారు. సంప్రదాయ యోగాను ఆధునిక తరానికి పరిచయం చేయడానికి 2002 బెంగళూరు శివార్లలో ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన విశ్వవిద్యాలయాన్ని’ నెలకొల్పారు.

- Advertisement -

హోదాలన్నీ వదిలి..
హెచ్‌ఆర్‌ నాగేంద్ర చదివింది మెకానికల్‌ ఇంజినీరింగ్‌. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేశారు. అదే సంస్థలో కొన్నాళ్లు అధ్యాపకుడిగా సేవలు అందించారు. తర్వాత బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ‘నాసా’కు అనుబంధంగా మాస్టర్‌ స్పేస్‌ ఫ్లయిట్‌ సెంటర్‌లో పరిశోధకుడిగా చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీతోపాటు మరిన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. లౌకికంగా ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా ఆయన మనసు ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసేది. 1975లో వివేకానంద కేంద్రంతో పరిచయం ఆ భావనకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. ‘యోగాను, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి సంస్థ పరిచయం తర్వాతే పూర్తిస్థాయిలో తెలుసుకోగలిగాను’ అంటారు నాగేంద్ర. నాటినుంచి వివేకానంద కేంద్రంతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. 1986నుంచి నేటివరకు వివేకానంద కేంద్ర రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీతోపాటు యోగశ్రీ అన్న బిరుదునూ అందుకున్నారు.

యోగాలయం!

అనుసంధాన యోగ
యోగాతో తనకు కలిగిన అనుభవాన్ని ప్రపంచానికి సరికొత్తగా అందించాలని భావించారు నాగేంద్ర. యోగాసనాలకు శ్వాసక్రియను క్రమబద్ధీకరించే శక్తి మాత్రమేకాదు, జీవితాన్ని తీర్చిదిద్దే మహత్తర గుణం ఉందని గుర్తించారు. ఈ మహత్తర విజ్ఞానాన్ని ముందు తరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో యోగ యూనివర్సిటీ ప్రారంభించానని చెబుతారు నాగేంద్ర. ప్రారంభం నుంచీ వర్సిటీ కులపతిగా కొనసాగుతున్నారు. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ విశ్వవిద్యాలయం సిలికాన్‌ సిటీలో అచ్చమైన గురుకులంలా కనిపిస్తుంది. ఇక్కడ యోగాను జీవితానికి ఎలా అనుసంధానం చేయాలో నేర్పుతారు. అందుకు తగ్గట్టుగా రకరకాల కోర్సులు ప్రవేశపెట్టారు. పేరెన్నికగన్న యోగా గురువులను అధ్యాపకులుగా ఎంచుకొని సంప్రదాయ యోగాను ఆధునికంగా నేర్పుతున్నారు. డీమ్డ్‌ యూనివర్సిటీగా ఎదిగిన యోగా విశ్వవిద్యాలయంలో సీటు దొరకడం, చదువడం ఒక అదృష్టంగా భావించేవాళ్లూ ఉన్నారు.

విదేశీ విద్యార్థులు
యూనివర్సిటీలో ప్రతి కోర్సుకు మూలం యోగానే. ఆధ్యాత్మికతను అనుసంధానం చేస్తూ విద్యాబోధన సాగిస్తారు. యోగా స్పిరిచ్యువాలిటీ, యోగా లైఫ్‌ సైన్సెస్‌, యోగా ఫిజికల్‌ సైన్స్‌, యోగా మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, హ్యుమానిటీస్‌.. ఇలా ప్రతిదీ యోగాధారమే. వాటికి తగ్గట్టుగానే కోర్సులన్నీ ఉంటాయి. అందుకు అనుగుణంగానే బోధనా ఉంటుంది. యోగాను శారీరక, మానసిక సాధనగానే కాకుండా ఉపాధి అవకాశంగానూ మార్చే విధంగా కోర్సులు డిజైన్‌ చేశారు. ప్రకృతి వైద్య కళాశాలనూ నిర్వహిస్తున్నారు. యూజీ, పీజీ కోర్సులకు నోటిఫికేషన్లు విడుదలైంది మొదలు దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడతాయి. విదేశాలనుంచి కూడా వందలమంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకొని నిష్ణాతులైన యోగా గురువులుగా తయారవుతున్నారు.

బిజినెస్‌ యోగం
దాదాపు 19 ఏండ్లుగా వేలమంది విద్యార్థులు ఈ యోగా యూనివర్సిటీనుంచి పట్టభద్రులయ్యారు. వీరిలో కొందరు యోగాను వ్యక్తిగత జీవిత నిర్మాణానికి సాధనంగా భావిస్తే, మరికొందరు ట్యూటర్లుగా ఉపాధి పొందుతున్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో యోగా గురువులుగా చేరి భారతీయ సంపదను మరో తరానికి పరిచయం చేస్తున్నారు. యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సుకూడా అందుబాటులో ఉంది. ఇక్కడ ఆర్థిక మేనేజ్‌మెంట్‌ పాఠాలతోపాటు ఎమోషన్స్‌ మేనేజ్‌మెంట్‌ గురించికూడా చెబుతారు. పారిశ్రామికవేత్తలు తమ వారసులను, ఉద్యోగులను ప్రత్యేకంగా ఇక్కడ ఎంబీఏ చదివిస్తుంటారు.‘ప్రపంచమంతా యోగావైపు చూడటం మొదలైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన యోగాను మనసారా సాధన చేస్తున్నారు. దీనిని ఒక్కరోజుతో ఆపేయకుండా జీవితంలో భాగంగా చేసుకుంటే ఊహించని ఫలితాలు సాధ్యమవుతాయ’ని అంటారు ఆచార్య నాగేంద్ర. నిజమే, ఆధునిక జీవన సంక్షోభా లకు యోగాలోనే పరిష్కారం ఉంది.

యోగాలయం!

యోగ చికిత్స

ఇక్కడ యోగవిద్యా బోధన మాత్రమే కాదు, యోగసాధన వర్క్‌షాప్‌లు కూడా రెగ్యులర్‌గా జరుగుతుంటాయి. వర్సిటీకి అనుబంధంగా ఓ దవాఖాన కూడా ఉంది. 150 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రికి నిత్యం వందలమంది రోగులు వస్తుంటారు. బెంగళూరు నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి రకరకాల రుగ్మతలతో బాధపడేవారు వర్సిటీ వైద్యశాలకు వస్తుంటారు. నిపుణుల ఆధ్వర్యంలో యోగాభ్యాసం చేస్తుంటారు. వ్యాధి, దాని తీవ్రతనుబట్టి రకరకాల ఆసనాలు వేయిస్తుంటారు. ప్రాణాంతక వ్యాధులతో వచ్చి ఆరోగ్యంగా తిరిగి వెళ్లినవారు ఎందరో! డయాబెటిక్‌ రోగులకు ప్రత్యేక ఆసనాలలో తర్ఫీదునిస్తారు. క్యాన్సర్‌ రోగులు సైతం ఇక్కడికి
వస్తుంటారు.

బీఎస్సీ యోగ.. ఎమ్మెస్సీ ఆసన..
యోగా వర్సిటీలో రకరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అధ్యయన, అధ్యాపన, సద్విద్య సంభాషణ, సంశోధన, సేవ.. ఈ ఐదు సూత్రాలను అనుసరించి విద్యాబోధన ఉంటుందిక్కడ. యోగాభ్యాసకులుగా స్థిరపడేవారి కోసం యోగా ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సు ప్రవేశపెట్టారు. యోగ, యోగా థెరపీలో బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఎమ్మెస్సీతోపాటు యోగాలో పీహెచ్‌డీ చేయొచ్చు. యోగాలోని వివిధ ప్రక్రియల్లో పీజీ డిప్లొమా కోర్సులు, నేచురోపతి కోర్సులు సైతం ఉన్నాయి. ఇక్కడి ప్రతి కోర్సూ యోగాసనాల చుట్టూనే తిరుగుతుంది.యోగం అంటే కేవలం ఆసనాలు కాదు. ‘యోగః చిత్త వృత్తి నిరోధః’ అన్నారు పెద్దలు. చంచలమైన చిత్తాన్ని నిరోధించి నిశ్చింతను కలుగజేసే అద్భుత ప్రక్రియ ఇది. యోగ ఒక జీవన విధానం. దానిని అనుసరిస్తే వ్యక్తిత్వ నిర్మాణం కోసం ప్రత్యేక సాధనలు చేయాల్సిన అవసరం లేదు. మనిషి శరీర నిర్మాణమే కాదు, భావోద్వేగాలు, మానసిక స్థితి, ఆలోచనా విధానం.. అన్నీ మారుతాయనడంలో సందేహం లేదు. మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలాంటి సవాలునైనా స్వీకరించే శక్తి వస్తుంది.
-హెచ్‌ ఆర్‌ నాగేంద్ర,యోగా వర్సిటీ కులపతి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యోగాలయం!
యోగాలయం!
యోగాలయం!

ట్రెండింగ్‌

Advertisement