e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home బతుకమ్మ ఫారిన్‌పాడి!

ఫారిన్‌పాడి!

ఫారిన్‌పాడి!

బాగా చదువుకోవాలి. విదేశాలకు వెళ్లాలి. డబ్బు సంపాదించాలి. ఎన్నారై సంబంధం పెండ్లి చేసుకోవాలి. గ్రీన్‌కార్డు పొంది అక్కడే సెటిలవ్వాలి. ఎవరైనా ఇదే కోరుకుంటారు.కానీ, స్వదేశంలో వ్యవసాయం చేసుకుంటూ బతకడంలోని సంతృప్తి ఫారిన్‌ లైఫ్‌లో లేదంటున్నాడు కిశోర్‌ ఇందుకూరి.

కిశోర్‌ వాళ్ల నాన్న మెకానికల్‌ ఇంజినీర్‌. కొడుకును పక్కా ప్రణాళికతో పెంచారు. ఆ ప్లానింగ్‌లో భాగంగానే కిశోర్‌ ఇందూరి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివాడు. ఇంజినీరింగ్‌ తర్వాత పాలిమర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశాడు. తర్వాత పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ముందు నుంచీ కిశోర్‌ కల అమెరికా చదువు. ఆ స్వప్నాన్ని నిజం చేసుకుంటూ.. 2000లో విమానం ఎక్కాడు. మసాచుసెట్స్‌లో చదువుకున్నాడు. వెంటనే, అరిజోనాలోని ఇంటెల్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆరు సంవత్సరాలపాటు అదే సంస్థలో పనిచేశాడు. తర్వాత దక్షిణ కొరియా, కెనడా, జపాన్‌ వంటి దేశాల్లోని పెద్దపెద్ద కంపెనీల్లో, మంచి హోదాలో పనిచేశాడు. అమెరికాతో మొదలైన తన ప్రయాణం, వివిధ దేశాల్లోని బహుళజాతి సంస్థల వ్యవహారాలు చూసుకునే దాకా వెళ్లింది. బిడ్డ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులూ సంతోషించారు. ఓ దశ వరకూ కిశోర్‌ కూడా ఆ పరుగును ఆస్వాదించాడు.

- Advertisement -

వ్యవసాయంపై దృష్టి
ఎంత బిజీగా ఉన్నా ప్రతీ సంవత్సరం కిశోర్‌ హైదరాబాద్‌కు వచ్చేవాడు. వచ్చినా, వ్యవసాయ క్షేత్రాలు సందర్శించడం, ప్రకృతితో మమేకం కావడం.. ఇలా పచ్చదనానికే పూర్తి సమయం కేటాయించేవాడు. ఓ అందమైన సాయంత్రం, ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నప్పుడు ‘విదేశాల్లో సెటిలవడం, ఆస్తులు సంపాదించడమేనా జీవితం’ అనుకున్నాడు. ఇండియాకు వచ్చిన ప్రతిసారీ గ్రామీణ జీవితం మీద ప్రేమ పెరగసాగింది. 2012లో వచ్చాక, ఇక ఇక్కడే ఉండిపోయాడు. రోజుల తరబడి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడానికి వెళ్లేవాడు. అలా, ఐటీనుంచి క్రమంగా అగ్రికల్చర్‌పై దృష్టి మళ్లింది.

పాడి రైతుగా
‘వ్యవసాయం చేస్తా ’ అనగానే కిశోర్‌ను అభినందించారు వాళ్ల నాన్నగారు. బిడ్డ నిర్ణయం సరైందేనని ఆయన నమ్మకం. కానీ, కిశోర్‌కు వ్యవసాయంలో ఎలాంటి అనుభవమూ లేదు. దానిమ్మ తోటల పెంపకంలో అనుభవం ఉన్న బావద్వారా కొన్ని మెలకువలు గ్రహించాడు. కర్ణాటకలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో కొంతకాలం వ్యవసాయం చేశాడు. కానీ, ఆశించిన ఫలితాలు రాలేదు. మంచి అనుభవాలనైతే నేర్పిందా వైఫల్యం. వ్యవసాయం కన్నా, దానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమే మేలన్న నిర్ణయానికొచ్చాడు కిశోర్‌. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లోని పాడి రైతులను కలిసి, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశాడు. ప్రతీ రైతుకు ఐదారు ఆవులు ఉండేవి. వాటితో స్థిరమైన ఆదాయం పొందడాన్ని కండ్లారా చూశాడు. దీంతో, పాడి పెంపకమే ఉత్తమ మార్గమని అనుకున్నాడు. హైదరాబాద్‌ శివారులో కొంత భూమిని లీజ్‌కు తీసుకొని పశువుల పెంపకం మొదలుపెట్టాడు.

20 ఆవులతో ఫామ్‌
2012లో రూ. కోటి పెట్టుబడితో 20 ఆవుల్ని కొని డెయిరీ ఫామ్‌ ప్రారంభించాడు కిషోర్‌. ముద్దుల కొడుకు సిద్ధార్థ్‌ పేరుతో ‘సిద్‌ ఫామ్‌’ అని పేరు పెట్టాడు. ‘ఇంటివద్దకే తాజా పాలు’ అనే కాన్సెప్ట్‌తో మార్కెట్లోకి ప్రవేశించాడు. పశువుల డాక్టర్‌ రవి సహకారంతో పశువుల పెంపకంలో జాగ్రత్తలు తెలుసుకున్నాడు. విదేశాల్లో కూడబెట్టుకున్న ప్రతీ పైసానూ ఆవులమీద పెట్టాడు. పాల వ్యాపారంలోనే ఇప్పుడు కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నాడు. విజయాల్ని నెమరేసు కుంటున్నప్పుడు ఆ కళ్లలో ఎనలేని తృప్తి!

రూ.44 కోట్ల టర్నోవర్‌
సంవత్సరం అధ్యయనం తర్వాత మార్కెట్లోకి బ్రాండెడ్‌ పాలను తీసుకొచ్చాడు కిశోర్‌. అప్పటికే రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ పోటీని దృష్టిలో ఉంచుకొని ఉదయం 6.30 గంటలకే కస్టమర్‌ ఇంటికి పాలు చేరేట్లు ఒక వ్యవస్థను ఏర్పాటుచేశాడు. తెల్లవారు జామున 4 గంటలకు ప్యాకింగ్‌ మొదలయ్యేది. సంస్థ ఎదుగుతున్న కొద్దీ పనివేళల్లో మార్పులు చేసి 2.30 గంటలకే ప్యాకింగ్‌ సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. సకాలంలో నాణ్యమైన, రుచికరమైన పాలు అందిస్తూ సంవత్సరానికి రూ.44 కోట్ల టర్నోవర్‌ సాధించింది ‘సిద్‌ ఫామ్‌’. ప్రస్తుతం కిషోర్‌ ఫామ్‌లో 70 ఆవులు ఉన్నాయి. 1500 మంది పాడి రైతులతో ఒప్పందాలు చేసుకొన్నాడు. 10 వేల మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. ఆయన పాడి క్షేత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది పనిచేస్తున్నారు. అదనంగా 150 మంది పార్ట్‌టైమ్‌ డెలివరీ బాయ్స్‌గా ఉపాధి పొందుతున్నారు. ఈ పాడి పశువుల మధ్య తనను తాను మరచిపోతాడు కిశోర్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫారిన్‌పాడి!
ఫారిన్‌పాడి!
ఫారిన్‌పాడి!

ట్రెండింగ్‌

Advertisement