e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home బతుకమ్మ చదువులకే చదువు!

చదువులకే చదువు!

చదువులకే చదువు!

ఓ సాధారణ యువకుడు పట్టుదలతో ఇంగ్లండ్‌ వెళ్లి చదువుకొన్న తీరును, మట్టిమీద మమకారంతో తెలంగాణ పల్లెల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ఘట్టాన్నీ ఇటీవల ‘బతుకమ్మ’ ప్రత్యేక కథనంగా ప్రచురించింది. ఆ వ్యాసానికి అపూర్వ ఆదరణ లభించింది. ప్రపంచం నలుమూలలా ఉన్న ముద్దు రామకృష్ణ్ణయ్య శిష్యులు ఫోన్లు చేసి, తమ గురువుతో అనుబంధాన్ని పంచుకున్నారు. ఆ జ్ఞాపకాల సమాహారం..

ముద్దు రామకృష్ణయ్య జ్ఞాపకాలు మరికొన్ని..

- Advertisement -

ముద్దు రామకృష్ణయ్య అరుదైన వ్యక్తి. పాఠశాలే ఆయన ప్రపంచం. పిల్లలే బంధుగణం. ఆయన మార్చిన జీవితాలూ, తీర్చిదిద్దిన వ్యక్తిత్వాలూ అనేకం. ఆయన చొక్కాకు రెండు జేబులుండేవి. జీతం చేతికందగానే సగం కుడిజేబులో, మరో సగం ఎడమజేబులో పెట్టుకునేవారు. కుడిజేబులోనిది కుటుంబానికి, ఎడమజేబులోని సొమ్ము విద్యార్థుల కోసం. సాధారణంగా, ఎడమజేబే ముందుగా ఖాళీ అయ్యేది. దీంతో, కుడినుంచి ఎడమకు కొంత సొమ్ము బదిలీ చేసేవారు. విద్యార్థులకు ఆయన ప్రేమతత్వాన్ని బోధించారు. కలిసిమెలసి ఉండాలని హితవు చెప్పేవారు. బడి ఆవరణలోనో, తరగతి గదిలోనో విద్యార్థులు కొట్టుకుంటూ కనబడితే తక్షణం వెళ్లి వారించేవారు. ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని క్షమాపణ కోరమనేవారు. ఒప్పుకోకపోతే ఇద్దరి కాళ్లూ తానే మొక్కుతానని హెచ్చరించేవారు. అంతటి వ్యక్తి అలా మాట్లాడేసరికి, విద్యార్థుల కళ్లలో నీళ్లు తిరిగేవి. ఆయన కాళ్లపై పడేవారు.

అనేక ప్రయోగాలు
1946లో ఇంగ్లండులో ఎంఎడ్‌, పీహెచ్‌డీ చేసిన రామకృష్ణయ్యకు అక్కడి రాయల్‌ సొసైటీ టీచింగ్‌ ఫెలోషిప్‌ను అందించింది. ఈ అర్హతతో ఆ దేశంలోనే ఉపాధ్యాయుడిగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ, స్వదేశానికే తిరిగొచ్చారు. తాను అక్కడ చూసిన, చదివిన, నేర్చుకున్న విషయాలకు, స్వీయ ప్రతిభను మేళవించి ఉద్యోగ జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. రామకృష్ణయ్య తన సర్వీసులో చివరి ఏడేండ్లపాటు (1958-65) జగిత్యాల హైస్కూల్‌ హెడ్‌మాస్టర్‌గా ఉన్నారు. ఆయన ఆలోచనలకు ఈ బడి ఒక పూర్తిస్థాయి ప్రయోగశాల. బాధ్యతలు స్వీకరించగానే, నాటి విద్యామంత్రి పీవీ నరసింహారావు అనుమతితో దానికి ‘మల్టీపర్పస్‌ హైస్కూల్‌’గా పేరు పెట్టారు. బడిలో చదువే కాకుండా జీవన నైపుణ్యాలనూ బోధించాలనేది ఆయన ఉద్దేశం. తోటపని, వడ్రంగి పని, గృహ నిర్మాణం, చిత్రలేఖనం, నాటకాలు, ఈత నేర్పేవారు. ఎన్నో బోధనేతర అంశాలను టైమ్‌ టేబుల్‌లో చేర్చారు. ఈత శిక్షణ అంటే, ఏదో ఊరి బయట చెరువుకు వెళ్లడం కాదు. బడి ఆవరణలోనే స్విమ్మింగ్‌ పూల్‌ కట్టించారు.

విద్యార్థుల నాటక ప్రదర్శనకోసం ఆడిటోరియం నిర్మించారు. స్కూల్‌మధ్య ఖాళీస్థలంలో పెద్ద పూదోటను పెంచారు. పిల్లలు మధ్యాహ్నం ఒక పీరియడ్‌ తోటపని చేయాల్సిందే. స్కూల్లో ఏ నిర్మాణమైనా సరే మేస్త్రీకి విద్యార్థులే సహాయకులు. క్రాఫ్ట్‌ వర్క్‌కోసం విశాలమైన పెద్ద గది ఉండేది. అన్ని సైజుల చెక్క పలకలు, వడ్రంగి పరికరాలు అక్కడ ఉండేవి. ఆ పీరియడ్‌లో విద్యార్థులు తమ ఆలోచన మేరకు రకరకాల ఆట వస్తువులు, చిన్నపాటి కర్ర సామాగ్రి తయారు చేయవచ్చు. ఆయన స్కూల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ ఉండేది. ఒక్కో క్లాసులో ఏడెనిమిది సెక్షన్లు. అంతా కలిసి రెండు వేలమంది విద్యార్థులు, 100 మంది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు స్థానిక విద్యావంతులకు ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడానికి బేసిక్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ ఏర్పాటుచేశారు.

ఎన్నికలు కూడా..
ఏటా బడిలో విద్యార్ధి సంఘం ఎన్నికలు జరిగేవి. సంఘానికి అన్ని వసతులతో ఒక ఆఫీసు గది ఉండేది. పాఠశాలకు అర కిలోమీటరు దూరంలోని అనుబంధ హాస్టల్‌ను, రోజూ సాయంత్రం రామకృష్ణయ్య సందర్శించేవారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం ఉత్తర, దక్షిణ భారతయాత్రలు నిర్వహించే వారు. వారంలో ఒకరోజు, రోజూ ఒక గంట మౌనం పాటించడం రామకృష్ణయ్యకు అలవాటు. ఆ సమయంలో, తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఇంగ్లండ్‌ నుంచి తెచ్చుకున్న మ్యాజిక్‌ స్లేట్‌పై రాసేవారు. బటన్‌ నొక్కగానే అక్షరాలు మాయం కావడాన్ని ఆ రోజుల్లో వింతగా చెప్పుకొనేవారు. ఉదయం 6 గంటలకే రామకృష్ణయ్య స్కూలు ఆవరణలో ప్రత్యక్షమయ్యేవారు. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పది దాటేది. భోజనం ఇంటినుంచే వచ్చేది. ఆయన వ్యక్తిగత, భోజన ఏర్పాట్లను దళితుడైన కొప్పుల గంగారాం చూసుకునేవాడు.

ఆయనను తొలగించమంటూ, బ్రాహ్మణుడైన రామకృష్ణయ్యను బంధువులు ఒత్తిడి చేసినా వారి మాట వినలేదు. రామకృష్ణయ్య ఉన్నంతకాలం పరీక్షల్లో ఫెయిల్‌ అనే మాటే లేదు. ఆయన దగ్గర చదువుకున్న వారిలో వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు. చాలా కుటుంబాల్లో అదే తొలి ప్రభుత్వ ఉద్యోగం. రామకృష్ణయ్య పదవీ విరమణ సభకు, యాత్రకు ఊరంతా కదిలి వచ్చింది. ‘మీరు మా ఊరు వదిలి వెళ్ళకండి. మిమ్మల్ని ఏకగ్రీవంగా మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటాం’ అని ముక్తకంఠంతో కోరారు. కానీ, ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు ఆ మహోపాధ్యాయుడు. 1985లో 78వ ఏట ఆయన మరణించారు. ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా చిగురిస్తూనే ఉన్నాయి. కారణజన్ముడు అనేది ఆచితూచి వాడాల్సిన మాట. ఆ పదానికి పరిపూర్ణ యోగ్యుడు ముద్దు రామకృష్ణయ్య, చదువులకే చదువు నేర్పిన గురువాయన.

-బి.నర్సన్‌, 9440128169

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చదువులకే చదువు!
చదువులకే చదువు!
చదువులకే చదువు!

ట్రెండింగ్‌

Advertisement