e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home బతుకమ్మ కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ ఆలం ఓ స్ఫూర్తి కెరటం

కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ ఆలం ఓ స్ఫూర్తి కెరటం

కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ ఆలం ఓ స్ఫూర్తి కెరటం

ఆశలు.. ఆశయాలు.. కలగానే మిగిలిపోతే, అందులో కిక్కేముంది? ఒంటిపై యూనిఫాం వేసుకొని, ఓ పెద్ద పోలీస్‌ అధికారి అనిపించుకోవాలనే తన చిన్ననాటి కలకు పదునుపెట్టాడు ఓ యువకుడు. కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా కానిస్టేబుల్‌ మాత్రమే కాగలిగాడు. మరి పెద్ద అధికారి కావాలన్న ఆశయం? అందుకే, అక్కడితో సరిపెట్టుకోకుండా ఈసారి గట్టిగా చదివాడు. ఎంతలా అంటే, తోటి కానిస్టేబుళ్లే ‘ఏసీపీ సార్‌’ అనేంతలా..!

‘ఫిరోజ్‌ బేటా.. పెద్దయ్యాక ఏమవుతావ్‌..?’‘పోలీస్‌ అవుతా పప్పా.. డ్రెస్‌ వేసుకొని.. గన్‌ పట్టుకొని.. ఢాం.. ఢాం.. ఢాం.. అని కాల్చేస్తా. దొంగల్ని పట్టేస్తా’ఇనుమును స్క్రాప్‌గా మలిచి కుటుంబాన్ని పోషించుకుంటున్న ఫిరోజ్‌ తండ్రి, కొడుకు మాటలకు మురిసిపోయాడు. లోలోపల మాత్రం, ఇంటర్‌ వరకు చదువుకొని కానిస్టేబుల్‌ అయితే.. అదే పదివేలని అనుకున్నాడు.
కానీ, కొడుకు మాత్రం కానిస్టేబుల్‌గానే ఉండిపోవాలనుకోలేదు. కష్టపడి డిగ్రీ చదివాడు. తన లక్ష్యానికి పదునుపెట్టాడు. సివిల్స్‌ సాధించాడు. చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు. ఫిరోజ్‌ ఆలం కానిస్టేబుల్‌ నుంచి ఏసీపీ స్థాయికి ఎదిగిన ఓ స్ఫూర్తి కెరటం. కష్టాలకు భయపడిపోయి ఆశయాలను, లక్ష్యాలను మధ్యలోనే వదిలేసే ఎంతోమందికి ఇతనో గెలుపు పాఠం.

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌ హాపూర్‌ జిల్లాలోని పిల్‌ఖూవా పట్టణానికి చెందిన ఫిరోజ్‌ తండ్రి స్క్రాప్‌ డీలర్‌. చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న ఫిరోజ్‌కు పోలీస్‌ బలగాల్లో చేరాలని, ఓ పెద్ద పోలీస్‌ అధికారి కావాలని కోరికగా ఉండేది. ఇంటర్‌ వరకూ చదువుకొని తన చిన్ననాటి లక్ష్యానికి తగ్గట్లుగానే 2010లో ఢిల్లీలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. అలా తన మొదటి కలను సాకారం చేసుకున్నాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సీనియర్ల సలహాలు తీసుకుంటూ సివిల్స్‌ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాడు.

పీసీ నుంచి ఏసీపీగా..
తన జీవితం బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మాడు ఫిరోజ్‌ ఆలం. అందుకే, అత్యున్నత హోదాల్లో ఒకటైన సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో తన స్నేహితులతో ఉండేవాడు. ఎప్పుడు సమయం దొరికినా పుస్తకాలు తిరగేసేవాడు. క్రమపద్ధతిలో చదువుకుంటూ.. రివిజన్‌ చేసుకునేవాడు. సహచరులు, సీనియర్లు, డిపార్ట్‌మెంట్‌లో కొందరు అధికారుల సలహాలు తీసుకుంటూ పరీక్షకు సన్నద్ధం అయ్యాడు. అలా 2019లో సివిల్స్‌ రాశాడు. ఫలితాలు 2020 ఆగస్టు 4న వచ్చాయి. సివిల్స్‌ రాసిన 8 లక్షల మందిలో 645వ ర్యాంకు సాధించి విజేతగా నిలిచాడు ఫిరోజ్‌. కానిస్టేబుల్‌ నుంచి ఏసీపీ అయ్యాడు. పెద్ద పోలీస్‌ అధికారి కావాలనే తన రెండో కోరికనూ నెరవేర్చుకున్నాడు.

కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ ఆలం ఓ స్ఫూర్తి కెరటం

ఓ వాట్సాప్‌ గ్రూప్‌..
30 ఏండ్ల ఫిరోజ్‌ ఆలం నిత్య చైతన్య స్ఫూర్తి. అన్నిటికీ మించి తోటి కానిస్టేబుళ్లు కూడా తనలా ఉన్నతస్థానాల్లో ఉండాలని ఆశిస్తున్న వ్యక్తి. తనలాగే సివిల్స్‌ సాధించాలనుకునే కానిస్టేబుళ్ల కోసం ‘ఢిల్లీ పోలీస్‌ ఫ్యామిలీ ఫర్‌ యూపీఎస్సీ’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశాడు. ఇందులో అనేక మంది ఔత్సాహికులు ఉన్నారు. వీరంతా సివిల్స్‌ సాధించడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు ఫిరోజ్‌. అతని స్ఫూర్తితో కొందరు ప్రిలిమ్స్‌ పూర్తి చేశారు. మరికొందరు మెయిన్స్‌ వరకూ వెళ్లారు. ఇంకొందరు సన్నద్ధమవుతున్నారు. ‘మిత్రులు సివిల్స్‌ సాధించేందుకు నేను ఏ సహాయమైనా చేస్తాను. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యం’ అంటాడు ఫిరోజ్‌ ఆలం.

ఎలా స్పందించాలో తెలియడం లేదు!
“నాముందున్న దారి ఎన్నో సవాళ్లతో నిండి ఉంది. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మంచి అధికారిగా ఉండటానికే ఇష్టపడతాను. నేను సివిల్స్‌ రాయడానికి ముఖ్యకారణం.. అందరికీ న్యాయం చేయాలనే సంకల్పమే. మొదటిసారి ఐపీఎస్‌ యూనిఫాం ధరించినప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగింది. నా బాధ్యత గుర్తొచ్చింది. కానిస్టేబుల్‌ నుంచి ఏసీపీగా పదోన్నతి సాధించడం నాకెంతో గర్వకారణం. గతేడాది వరకూ 46వేలమంది జూనియర్‌ పోలీసులలో ఒకడినైన నేను.. ఇప్పుడొక అధికారిని. ఇన్నాళ్లూ నాతోపాటు కలిసి పనిచేసిన కానిస్టేబుల్‌ స్నేహితులు ఇప్పుడు నన్ను ‘సార్‌’ అని పిలుస్తున్నారు. ఆ పిలుపునకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. చిరునవ్వే నా సమాధానం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ ఆలం ఓ స్ఫూర్తి కెరటం
కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ ఆలం ఓ స్ఫూర్తి కెరటం
కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ ఆలం ఓ స్ఫూర్తి కెరటం

ట్రెండింగ్‌

Advertisement