e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home బతుకమ్మ పద సంపన్నుడు.. వల్లకొండ!

పద సంపన్నుడు.. వల్లకొండ!

పద సంపన్నుడు.. వల్లకొండ!
  • తెలంగాణ సినిమా కవులు

అతని పాటలు భావలహరిలో తేలియాడిస్తాయి. అతని పదాలు సుమధుర కవితాకిరణాలుగా భాసిస్తాయి. అతనే కవి, సినీ గీత రచయిత వల్లకొండ రాజ్‌కుమార్‌. 2005లో ’శ్రావణమాసం’ సినిమాతో పాటల రచయితగా పరిచయమయ్యారు. ఆణిముత్యాల్లాంటి గీతాలను వెండితెరకు అందించారు.

కవిగా, సినీ గేయ రచయితగా, టీవీ సీరియల్స్‌ మాటల రచయితగా ప్రసిద్ధులు వల్లకొండ రాజ్‌ కుమార్‌. ఆయనది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి సమీపంలోని గోధూరు గ్రామం. ప్రమీల, లింబాద్రి అమ్మానాన్నలు. తొలి చదువు గోధూరులోనే. ఉన్నత విద్యాభ్యాసమంతా మెట్‌పల్లిలో సాగింది. చిన్నతనం నుంచే నాటకాలపై, జానపద కళలపై ఆసక్తి ఎక్కువ. పాటలు వినేవారు, పాటల్లోని సాహిత్యాన్ని అర్థం చేసుకొనేవారు, స్వయంగా పాడేవారు కూడా. ఆ సాధన ఆయనలో సృజనాత్మక శక్తిని పెంచింది. విశ్వనాథ, చలం,కృష్ణశాస్త్రి తదితరుల రచనలను లోతుగా అధ్యయనం చేశారు. అలా గేయ రచనవైపు దృష్టి సారించారు. పాటమీద, పల్లెమీద ప్రేమతో.. ‘గోధూరు స్వరాలు’ అనే ఆల్బమ్‌ను తీసుకొచ్చారు. ఆ పాటలనిండా మట్టివాసనల గుబాళింపులే. అవి ఎంతో పేరు తెచ్చాయి. ఆ ఉత్సాహంతో సినిమా పాటలవైపు అడుగులేశారు.

తొలకరి పాటతో..

- Advertisement -

2005లో పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ’శ్రావణమాసం’ సినిమాలోని ‘చినుకు చినుకు పడుతుంది. మనకు వణుకు పుడుతుంది’ పాటతో గీత రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలి వలపుల సందడిలో మునిగిన లేత వయసుల తహతహలను తన పదాల్లో పలికించారు. ఈ పాటలోని ‘వయ్యారి నీ కళ్ళు ఆ తారకలకు చెల్లెళ్ళు.. మెరిసేటి అరనవ్వుల్లు ఆ పాలధార పరవళ్ళు’ అనే పంక్తులు రాజ్‌ కుమార్‌ వినూత్న కవితాభివ్యక్తికి తార్కాణాలు. ఇదే సినిమాలోని ‘చిలకరెక్కపై రాసినా ఒక ప్రేమలేఖ.. మనసు తెరలపై గీసినా నీ రూపురేఖ’ పాటకూడా గొప్ప భావుకతను పొదుగుకున్నదే. తన ఎదలో చిన్ననాటినుండే పాదులు వేసుకున్న కోరిక ఈనాటికి తీరబోతున్నదన్న ఆనందంతో ఓ మరదలు ప్రాణానికి ప్రాణమైన బావకోసం పాడే ప్రణయానంద గీతమిది. ఇదే సినిమాలోని ‘నా పల్లె అందం చూడు..నా తల్లి చందం చూడు’ పాట గ్రామీణ సౌందర్యాన్ని పల్లవింపజేసింది.

పదాల పోహళింపు

‘మెంటల్‌ కృష్ణ’(2009) లోని ‘హ్యాపీ హ్యాపీ హ్యాపీ డే.. లవ్లీ వైఫ్‌కు జాలీ డే’ పాట హుషారైన పదాల పోహళింపుతో సాగింది. సినిమా పాటకు కావాల్సిన మసాలా దినుసులు రాజ్‌ కుమార్‌ దగ్గర పుష్కలంగా ఉన్నాయనడానికి ఇదో నిదర్శనం. ‘ఆపద మొక్కులవాడు’(2008) కోసం రాసిన ‘పోరుబాటలో రాలిన ఆ నింగి చుక్కలవుదాం.. నెత్తురు ఏరవుతున్న సమరాన్నే సాగిద్దాం’ పాట ఆశయబాటలో ముందుకు సాగే క్రాంతి సైన్యాన్ని కళ్ళముందుంచుతుంది. ‘విరామమెరుగని నరాల పిడికిలి బిగించినామంతే’ వంటి పంక్తులు అభ్యుదయ భావాన్ని పొదుగుకొన్నవే. ఇవే కాదు.. ‘ఆపరేషన్‌ దుర్యోధన’, ‘మనోడు’, ‘ప్రేమికులు’ మొదలైన సినిమాల్లో 40కి పైగా పాటలు రాశారు. ప్రస్తుతం మాటీవీ, ఈటీవీ తదితర చానల్స్‌లో సీరియల్స్‌కు స్క్రీన్‌
ప్లే, మాటలు అందిస్తున్నారు. ‘నా పేరు మీనాక్షి’, ‘చెల్లెలి కాపురం’ లాంటి అనేక ధారావాహికలకు పనిచేశారు. దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు రాజ్‌.

జుగల్‌ బందీ..

‘ఇట్లు నీ వెన్నెల’ (2007)లోని ‘ఆత్రేయ గీతమా.. ఇది ఆరుద్ర భావమా..’ అనే ప్రణయగీతం వినూత్నమైంది. ఆత్రేయ, ఆరుద్ర, సినారె, వేటూరి, సీతారామశాస్త్రి తదితర గీత రచయితల కలాల్లోని సొగసునూ.. సాలూరి, కె.వి.మహదేవన్‌, కీరవాణి, ఎ.ఆర్‌.రెహమాన్‌ మొదలైన సంగీత దర్శకుల స్వరాల్లోని సౌందర్యాన్ని తన ప్రేయసికి అన్వయిస్తూ ప్రియుడు పాడే పాట ఇది. ఇలా కవులూ, సంగీత దర్శకుల పేర్లతో పాట మొత్తం రాయడం కత్తిమీద సామే. ‘వెంకట్‌తో అలివేలు’(2005)లో ‘ఓ ఏరమ్మా ఏం జోరమ్మా… గలగలగల గోదారి ఎటువైపే నీ దారి.. అలలై పొంగే వయ్యారి కరుణించు ఓ సారి’ పాట గోదారి అలల సవ్వడులను తిలకిస్తూ, పులకిస్తూ కథానాయిక పాడే పాట. గోదారితో పాటు కథానాయిక వయసు కూడా ఉరకలేసే తీరు మనకు కనబడుతుంది.

తిరునగరి శరత్‌ చంద్ర
6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పద సంపన్నుడు.. వల్లకొండ!
పద సంపన్నుడు.. వల్లకొండ!
పద సంపన్నుడు.. వల్లకొండ!

ట్రెండింగ్‌

Advertisement