e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home బతుకమ్మ వ్యవసాయ ఇంజినీర్‌!

వ్యవసాయ ఇంజినీర్‌!

వ్యవసాయ ఇంజినీర్‌!

మంచి జీవనశైలి ఉన్నా, ఒక వ్యక్తి క్యాన్సర్‌ బారిన పడి చనిపోయాడు. అతడి కుటుంబంలో క్యాన్సర్‌ ఉన్న వాళ్లెవరూ లేరు. ఆహార కాలుష్యమే అసలు కారణ మన్నారు డాక్టర్లు. అది తెలిసినప్పటినుంచీ ఆలోచనలో పడ్డాడు ఓ బంధువుల అబ్బాయి. స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా సేంద్రియ సాగు మొదలుపెట్టాడు. ప్రతిష్ఠాత్మక ‘ఐకార్‌ అవార్డు’
అందుకొన్న ‘తొలి తెలంగాణ రైతు’గా రికార్డుకెక్కాడు.

..ఆ ఆదర్శ యువరైతే కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన మావరం మల్లికార్జున్‌రెడ్డి. 20 ఎకరాల వ్యవసాయ భూమిలో జింక్‌రైస్‌, బ్లాక్‌రైస్‌ వంటి దేశీయ వరి,తోపాటు సేంద్రియ పద్ధతిలో అనేక పంటలు సాగు చేసి సక్సెస్‌ అయ్యాడు. మల్లికార్జున్‌ సాగు విధానాలు, ఉత్పత్తి, రాబడి గురించి తెలుసుకున్న ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐకార్‌) అతడిని ‘ఉత్తమ రైతు’గా గుర్తించింది.

- Advertisement -

ఉద్యోగాలను వదిలేసి..
మల్లికార్జున్‌రెడ్డి, అతడి భార్య సంధ్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. వాళ్ల బంధువొకరు క్యాన్సర్‌ బారినపడి చనిపోయారు. ఆయనదీ మంచి జీవనశైలే. మునుపటి తరాలలోఎవరికీ క్యాన్సర్‌ లేదు. ఆంకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ‘ఆహార కాలుష్యమే ప్రధాన కారణం’ అని చెప్పారు. రసాయన ఎరువులు, పురుగుమందులతో కూడిన ఆహారం అతడి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి శరీర వ్యవస్థలో ప్రవేశించింది. స్వచ్ఛమైన ఆహారంతో ఇలాంటి రోగాలనుంచి విముక్తి పొందవచ్చు’ అని చెప్పారు. అంతే, దంపతులిద్దరూ ఉద్యోగాలు వదిలేసి పెద్దకుర్మపల్లికి వచ్చేశారు. తమకున్న 12 ఎకరాల్లో ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు మొదలుపెట్టాడు మల్లికార్జున్‌.

ప్రత్యక్ష పద్ధతిలో..
ప్రయోగాత్మక సేంద్రియ సాగులో మంచి ఫలితాలు వచ్చాయి. మరో పది ఎకరాలు లీజుకు తీసుకొని 26 రకాల పంటలను సేంద్రియ, అవశేష రహిత వ్యవసాయ పద్ధతులలో సాగు చేస్తున్నాడు. బియ్యం, కూరగాయలే కాకుండా ఔషధమొక్కలు, ఆవాలు, అల్లం, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు వేస్తున్నాడు. ప్రతి సీజన్‌లో ఎకరానికి 42 క్వింటాళ్ల బియ్యం వస్తున్నాయి. సంప్రదాయ పద్ధతులద్వారా వచ్చే దిగుబడికంటే 10-12% ఎక్కువ. నేరుగా నాటేసే పద్ధతిని అవలంబిస్తున్నాడు. సంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 25 కిలోల విత్తనాలు అవసరమైతే, ఈ ప్రత్యక్ష విత్తనానికి 5 కిలోలు మాత్రమే సరిపోతాయి. వ్యయం కూడా రూ. 25 వేలు అయ్యేది. ఇప్పుడు, రూ. 12 వేలు సరిపోతుంది.

సమగ్ర వ్యవసాయం
మల్లికార్జున్‌ది సమగ్ర వ్యవసాయ విధానం. బిందుసేద్యంతో నీరు ఆదా చేస్తున్నాడు. భూగర్భజల స్థాయిలను పెంచేందుకు ఇంకుడు గుంతలు తీస్తున్నాడు. ఆ నీటిలో ఆక్వా కల్చర్‌ అమలు చేశాడు. వీటికితోడు గొర్రెలు, మేకలు, దేశీ కోళ్లు పెంచుతున్నాడు. ఆ వ్యర్ధాలతో పంటలకు సహజ పోషకాలను అందిస్తున్నాడు.

భార్య సహకారంతో..
ఈ విజయం వెనక చాలా శ్రమ ఉన్నది. మొదట్లో ఆశించిన దిగుబడి పొందలేక పోయాడు. దీంతో వ్యవసాయ రంగాల నిపుణులైన సుభాష్‌ పాలేకర్‌, రాజీవ్‌ దీక్షిత్‌, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకున్నాడు. అయినా ఏవో సమస్యలు. ‘మేం ఏండ్ల తరబడి చేస్తున్నాం. కొత్తగా వ్యవసాయం చేయడం అంటే ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకోవడమే’ అని గ్రామస్తులు నిరాశ పరిచారు. ‘ఇవేవీ పట్టించుకోవద్దు. మీకు నేను తోడుగా ఉన్నా’ అని సంధ్య ప్రోత్సహించింది. ఇప్పుడు వ్యవసాయశాఖ అధికారులు సైతం ఆశ్చర్యపడేలా లాభాలు గడిస్తున్నాడు. మిగతా రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు.

ఆరోగ్య సమాజమే లక్ష్యం
మూస విధానాల్లో పంటలు సాగు చేయకుండా ఉద్యానవనం, పశు సంవర్ధకం కూడా ఉండాలన్నది మల్లికార్జున్‌ మాట. ఆర్నెల్లకు ఒక పంట, ఒక ఆదాయం అనే భావనలోంచి బయటకు వచ్చి నెలనెలా ఆదాయం పొందవచ్చని అంటున్నాడు. తన పొలంలో గడ్డి, పప్పు ధాన్యాలు, ఔషధ మొక్కలు వంటి నిత్యం ఆదాయం వచ్చే పంటలతో ప్రయోగాలు చేస్తున్నాడు. ‘మేము మా పిల్లలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలనుకున్నాం, ఇస్తున్నాం. ఇక, మాకున్న ఒకే లక్ష్యం ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు కృషి చేయడం. దీనికోసమే రసాయనరహిత సాగు చేస్తున్నాం’ అని చెబుతున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యవసాయ ఇంజినీర్‌!
వ్యవసాయ ఇంజినీర్‌!
వ్యవసాయ ఇంజినీర్‌!

ట్రెండింగ్‌

Advertisement