అమ్మమ్మ, నాన్నమ్మల కాలంలో పంచభక్ష్య పరమాన్నాలు లేకపోయినా.. నాలుగు తోటకూర కాడలు వేసి మరగబెట్టిన చారు కూడా కమ్మగా ఉండేది. మల్లెపూలలాంటి సన్నబియ్యం అన్నానికి నోచుకోకున్నా.. దొడ్డు సాంబల పరిమళం ఆకలిని గెలిచేది. ఇందుకు ఆ తరం అమ్మల అమృతహస్తం ఒక కారణమైతే.. వారు వండి వార్చే బగోనెల్లోనే ఉండేది కిటుకంతా. ముఖ్యంగా మట్టిపాత్రల్లో కుతకుత ఉడికిన పప్పు, కంచుగిన్నెలో సలసల మసిలిన చారు, ఉక్కు బాణలిలో పెళపెళ వేగిన వేపుళ్లు రుచులకు పట్టం కట్టేవి. మోడర్న్ కిచెన్‌లోకి వచ్చిచేరిన రకరకాల మెటల్ గిన్నెలు రుచిని మింగేసి, అనారోగ్య కారకాలను పదార్థాలకు అంటించడం మొదలుపెట్టాయి. ఈ విషయం ఆలస్యంగానైనా గుర్తించి మళ్లీ పాతతరం పాత్రలకు సై అంటున్నది ఈ తరం. అయితే, ఎలాంటి పదార్థాలకు ఏ గిన్నెలు, ఎప్పుడు, ఎలా వాడాలి? అనే విషయాలను తెలుసుకోవాలి.
మట్టి పాత్రలు : వంటకు కావాల్సిన పదార్థాలన్నీ మట్టి పాత్రల్లో వేసి స్టవ్ మీద పెడితే వేడి, తేమ పూర్తిగా ప్రసారం అవుతాయి. దానివల్ల పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి. ఒకప్పుడు, వీటిలోనే వండేవాళ్లు కాబట్టి, గంజి తాగినా ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఈ రోజుల్లో మట్టిపాత్రలు విరివిగా దొరక్కపోయినా, మార్కెట్లో అందుబాటులో అంటూ ఉన్నాయి. కాకపోతే, వీటిని జాగ్రత్తగా వాడాలి. పప్పు మట్టిపాత్రలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. కూరలూ వండుకోవచ్చు.
స్టెయిన్లెస్ స్టీల్ : దీన్ని వంటకు ‘బెస్ట్ మెటల్’గా చెప్పొచ్చు. ఈ పాత్రలను ఐరన్, క్రోమియం, నికెల్, సిలికాన్, కార్బన్లతో తయారు చేస్తారు. అందువల్ల, ఎంత వేడినైనా తట్టుకుని ఎక్కువ మన్నికతో పని చేస్తాయి. మార్కెట్లో స్టెయిన్లెస్ స్టీల్ పేరుతో కొన్ని డూప్లికేట్ పాత్రలు వస్తున్నాయి. వాటిలో వండితే హానికరమైన రసాయనాలు విడుదలయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి, స్టీల్ సామాన్లను కొనేటప్పుడు లేబుల్ చూడాలి. స్టెయిన్లెస్ స్టీలు పాత్రల్లో అన్ని పదార్థాలూ వండుకోవచ్చు.
ఇనుప గిన్నెలు : లోహాల్లో ఇనుము ప్రత్యేకమైంది. ఇనుప గిన్నెలు, కడాయిల్లో వంట చేస్తే, ఆ ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ గిన్నెల్లో వంట వల్ల పోషకాలన్నీ ఆహారంలోనే ఉంటాయి. ఇనుప కడాయిలను చాలామంది పోపు పెట్టడానికి మాత్రమే వాడుతుంటారు. నిక్షేపంగా కూరలు కూడా వండుకోవచ్చు.
వీటితో జాగ్రత్త..!
రాగి పాత్రలు :
ఒకప్పటికంటే ఇప్పుడు కాపర్ కుక్వేర్ గురించి బాగా చర్చ జరుగుతున్నది. సాధారణంగా, రాగి పాత్రల్లో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే, రాగికి ప్రతిక్రియాశీలత ఎక్కువ. అందుకే, రాగి పాత్రల్లో ఉప్పు కలిపే పదార్థాలు వండకూడదు. ఉప్పులోని అయోడిన్ కాపర్‌తో వెంటనే రియాక్ట్ అవ్వడంవల్ల, కాపర్ కణాలు వంటలోకి విడుదలవుతాయి. అలాగే రాగి గిన్నెలకు లైనింగ్, కోటింగ్ సరిగ్గా లేకపోయినా, దానికి వేడి తగలగానే అందులోని హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. అవి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. రాగి పాత్రలతో లాభాలు పొందాలంటే అందులో మంచినీటిని నిల్వ చేసుకోవాలి. రాగి ప్లేట్లు, జగ్స్, గ్లాసులు వంటివి వాడుకోవచ్చు.
ఇత్తడి గిన్నెలు :
పాత రోజుల లోహాల్లో ఇత్తడి ఒకటి. దీన్ని ఇప్పటికీ చాలామంది సంప్రదాయ వంటల కోసం వాడతారు. ఇత్తడి గిన్నెలకు అడుగుభాగం మందంగా ఉండటంవల్ల వాటిని ఎక్కువగా మటన్, చికెన్, బిర్యానీ తయారీ కోసం ఉపయోగిస్తారు. కానీ, ఇత్తడిని పెద్ద మంటపై పెట్టి ఉప్పు కలిపిన ఆహారాన్ని వండితే, ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే, చాలా వాటికంటే ఇత్తడి గిన్నెలు కొంత మేలు. అప్పుడప్పుడు వాడుకోవచ్చు.
అల్యూమినియం :
ఈ లోహాన్ని మంచి హీట్ కండక్టర్‌గా చెప్పొచ్చు. అందుకే చాలామంది అల్యూమినియం గిన్నెలనే ఎక్కువగా వంటకు ఉపయోగిస్తారు. కానీ, వీటిని పెద్దమంటపై పెట్టి, క్షారగుణం ఎక్కువగా ఉండే టమాట, వెనిగర్ వంటివి జోడించి వండితే రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అల్యూమినియం అణువులు వంటలో కలుస్తాయి. అలాంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అల్యూమినియం గిన్నెలో వంట చేసేటప్పుడు చెక్క చెంచానే వాడాలి. స్టీలు చెంచా వాడితే, కూర కలుపుతున్నప్పుడు బేస్ లైనింగ్ మెల్లిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.