వయసు తగ్గించేశారు!
కాలాన్ని, దానితోపాటు పెరిగే వయసునూ ఎవరూ ఆపలేరు. కానీ, జాగ్రత్తగా ఉంటే వయసును ఏమార్చడం అసాధ్యమూ కాదు. నిద్ర, పోషకాహారం, వ్యాయామం లాంటి జాగ్రత్తలతో వయసుతోపాటు వచ్చే సమస్యలను తగ్గించవచ్చు. ఇదే విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు సిద్ధమయ్యారు హెల్ఫ్గాట్ పరిశోధనశాల శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం కోసం 50నుంచి 73 సంవత్సరాల మధ్యనున్న 43 మందిని ఎంచుకున్నారు. వీరికోసం రెండువారాల పాటు ప్రణాళికా బద్ధమైన జీవన విధానాన్ని రూపొందించారు. మంచి నిద్ర, తగినంత వ్యాయామం, పోషకాహారంతోపాటు ‘ప్రోబయాటిక్స్’, ‘ఫైటోన్యూట్రియంట్స్’ను అందించారు. భారతీయ ఆహారంలో ముఖ్యభాగమైన పెరుగు, ఇడ్లీ వంటి పులిసిన పదార్థాలలో ఉండేవే ‘ప్రోబయాటిక్స్’. ఇక మొక్కలనుంచి సహజంగా లభించే రసాయనాలను ‘ఫైటోన్యూట్రియంట్స్’ అంటారు. ఓ రెండు నెలలపాటు ఈ తరహా జీవన విధానాన్ని పాటించిన తర్వాత చూస్తే అభ్యర్థుల జన్యువులలో ‘మెథిలేషన్’ అనే ప్రక్రియ మెరుగుపడిందట. ఫలితంగా, వయసు మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లినంత చురుగ్గా తయారయ్యారట. త్వరలో ఈ తరహా థెరపీ అందరికీ అందుబాటులోకి వస్తుందేమో!
పిల్లల జోలికి రాకుండా…
కొవిడ్వల్ల ప్రపంచం తలకిందులవుతున్నది. జీవితాలు చెదిరిపోతున్నాయి. ఇంత విపత్తులోనూ కాస్త ఊపిరి పీల్చుకోదగిన అంశం ఏమిటంటే, ఇది పిల్లలమీద అంతగా ప్రభావం చూపడం లేదు. చిన్నపిల్లలలో కొవిడ్ లాంటి వైరస్లను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి బలంగా ఉండటమే ఇందుకు కారణమని తేలింది. అయితే, ఇప్పుడు ఓ కొత్త సమస్య మొదలైంది. కొందరు పిల్లల్లో కొవిడ్ తీవ్రరూపం దాల్చడాన్నీ నిపుణులు గమనిస్తున్నారు. ఇందుకు మూలాల్ని శోధించే ప్రయత్నమూ చేశారు యేల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. కొవిడ్ బారిన పడిన పెద్దలు, ఆరోగ్యవంతులైన పిల్లలు, కొవిడ్వల్ల ఇబ్బంది పడిన పిల్లలు.. వీరందరి జన్యువులనూ పరిశీలించారు. ఆశ్చర్యంగా ‘అలార్మిన్స్’ అనే కణాలు ఉన్న పిల్లలమీద కొవిడ్ ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఈ ‘అలార్మిన్స్’ నిజానికి రోగ నిరోధక శక్తికి తోడ్పడేవే! కానీ, శరీరం మీద కొవిడ్ దాడి చేసినప్పుడు, ఇవి మరింగా ఉత్తేజితం కావడంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. వీటిని ఓ కంట కనిపెట్టగలిగేతే పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవచ్చేమో!
కాఫీ దేనికి మంచిదంటే?
రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇందులో వింతేముంది? పరుగులు తీసే జీవితం. నిరంతర ఒత్తిడి. కండ్లముందు రకరకాల లక్ష్యాలు. ఇక కలలు కనేందుకు అవకాశం ఎక్కడ? కానీ, పొద్దున లేవగానే మళ్లీ పరుగు తప్పదు కదా! ఇలాంటప్పుడు ఓ గుక్కెడు కాఫీ తాగితే, రాత్రి నిద్ర లేని మగత తీరిపోతుందని ఓ నమ్మకం. ఇందులో నిజం ఎంతో తెలుసుకోవాలనుకున్నారు మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇందుకోసం 275 మంది జీవన విధానాల్ని పరిశీలించారు. వీరికి కొన్ని సాధారణ పనులు, మరికొన్ని ఏకాగ్రతతో చేయాల్సిన పనులు పురమాయించారు. రాత్రి నిద్ర లేకపోయినా కాఫీ తాగినవారు (తాగనివారితో పోలిస్తే) సాధారణ పనులను ఇట్టే పూర్తి చేసేశారు. కానీ, ఏకాగ్రత అవసరమయ్యే పనులలో మాత్రం బోల్తా పడ్డారు. దీంతో తేలిందేమిటంటే, రాత్రి నిద్ర లేని సందర్భాల్లో మర్నాడు ఉత్తేజంగా, మెలకువగా ఉండేందుకు కెఫిన్ తప్పక ఉపయోగపడుతుంది. చిన్నచిన్న పనులకు కావాల్సిన ఓపికను కూడా అందిస్తుంది. అయితే, పూర్తిస్థాయి దృష్టి పెట్టాల్సిన సందర్భాల్లో మాత్రం నిద్రలేమి ప్రభావాన్ని అది తీర్చలేదు. శస్త్రచికిత్సలు చేయడం, వాహనం తోలడం లాంటి పనులకు కాఫీ ఏ మాత్రం సాయపడలేదు. ఈ విషయాన్ని కాస్త గుర్తుంచుకోండి మరి!
బ్యాక్టీరియాపై విజయం
మనవి కాని సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే రకరకాల సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కొనేందుకు వైద్యులు యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. ఇక్కడ రెండు ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి: ఏ బ్యాక్టీరియాకు ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలనే సందేహంతో జనరల్ మందులు ఇచ్చేస్తుంటారు. రెండు: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల, బ్యాక్టీరియాకూడా రాటుదేలి పోతున్నది. ఈ రెండు సమస్యలకూ ఒకే పరిష్కారాన్ని కనుగొన్నారు రాధికా మెహతా అనే శాస్త్రవేత్త. మన శరీరానికి హాని కలిగిస్తున్న బ్యాక్టీరియా ఏదో కచ్చితంగా తేల్చేందుకు, దాని నిర్మాణంలో ‘NDM’ అనే ఎంజైమ్ కీలకమని ఆయన గుర్తించారు. ఓ రసాయనాన్ని శరీరంలోకి పంపితే, ఈ ఎంజైమ్ ధగధగా మెరిసింది. ఈ పరీక్ష ఆధారంగా ఎలాంటి యాంటీబయాటిక్ వాడాలో తెలిసింది. బ్యాక్టీరియా మొండిగా మారినప్పుడు కూడా అందుకు అనుగుణమైన చికిత్స చేసే అవకాశం వస్తుంది.