e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home బతుకమ్మ అలనాటి ‘ఆర్ట్‌' గ్యాలరీ ఒంటిగుండు

అలనాటి ‘ఆర్ట్‌’ గ్యాలరీ ఒంటిగుండు

అలనాటి ‘ఆర్ట్‌' గ్యాలరీ ఒంటిగుండు

తెలంగాణ గడ్డమీద ఆదిమ మానవుడు నడయాడిన తావులు కోకొల్లలు. పురాతత్వ తవ్వకాల్లో, శాస్త్రవేత్తల పరిశోధనల్లోతొలి మనుషుల అవశేషాలు అనేకం బయటపడ్డాయి. ఎండావానల నుంచి రక్షణగా నిలిచిన గుహలు,వేట కోసం వాడిన పనిముట్లూ అక్కడక్కడా వెలుగుచూస్తూనే ఉన్నాయి. పరిసరాల్లో దొరికిన సహజ రంగులతోఆదిమ మానవుడు గీసిన బొమ్మలైతే ఇప్పటికీ అబ్బురంగా అనిపిస్తాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నల్లముడి గ్రామ సమీపంలోని ఒంటిగుండు ఆదిమ మానవుల చిత్రకళా చాతుర్యాన్ని కండ్లకు కడుతున్నది. నాటి సంస్కృతిని, అలవాట్లనూ ప్రతిబింబిస్తున్నది. ఈ ప్రదేశాన్ని 2019 జూలైలో చరిత్ర పరిశోధకులు కొండవీటి గోపి, కట్టా శ్రీనివాస్‌ వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతం వన్యమృగాల నుంచి రక్షణగా, 30 అడుగుల ఎత్తుతో ఒంటిస్తంభం మేడలా కనిపిస్తున్నది. పదీపన్నెండు మంది ఆవాసానికి అవకాశమున్న చోటిది. ఇక్కడి కొండచరియ పైకప్పుకు వేసిన రాతిచిత్రాలు విస్తుగొల్పుతున్నాయి. మక్కజొన్న మొక్క, పాము, గుహలోకి వరుసగా వెళ్తున్న మనుషులు, తేనెపట్టు, నీటి తేళ్లు, ఉడుములు.. తదితర చిత్రాలతోపాటు వేలిముద్రలు, సాలెగూటి వరుసలు, ఒకదానిలో ఒకటి ఇమిడే పెట్టెలవంటి డిజైన్లు అబ్బుర పరుస్తున్నాయి. ఇందులో సరీసృపాల చిత్రాలే అధికం. ఒక్కోటి 1 సెం.మీ. నుంచి 40 సెం.మీ. వరకూ పొడవున్నాయి. సమీపంలోని రామచంద్రాపురం నీలాద్రి ఆలయాల దగ్గర్లో ఉన్న రాతిచిత్రాలతో, అక్షరలొద్ది రాతిచిత్రాలతో వీటికి పోలికలు కనిపిస్తున్నాయి. అయితే, ఒంటిగుండువద్ద ఎరుపు బొమ్మలకు తెలుపు అంచులు, తెల్లటి చుక్కల అలంకరణ ఉండటం ప్రత్యేకం. ఎరుపు రంగులోని హెమటైట్‌ రాళ్లలో కొవ్వు, జిగురు, పసర్లు వంటివి కలపడంతో ఎరుపు రంగు, సున్నపు రాతిలో మరికొన్ని పదార్థాల మిశ్రమంతో తెలుపు రంగు ఏర్పడినట్లు రామన్‌ స్పెక్ట్రోస్కోపీ పరీక్షలో తేలింది. నాటి ఆవాసానికి గుర్తులుగా రాతి పనిముట్లూ లభించాయి.
గిరిజనుల ఆరాధన
కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని గిరిజనులు, తమ ఆరాధనా స్థలంగా వినియోగించారు. ఇప్పటికీ గుట్టకింద నిలబెట్టిన నిలువు రాళ్లను పంచపాండవులుగా కొలుస్తున్నారు. రాతిచిత్రాల మధ్యలోనూ తెలుగు లిపిలో ‘మహాభారతంలో ఐదుగురు పంచపాండవులు’ అని రాసి ఉండటాన్ని గమనించవచ్చు. సగం చెక్కి వదిలేసిన రాతిశిల్పం కూడా ఇక్కడ దర్శనమిస్తున్నది.

- Advertisement -

‘రామన్‌ స్పెక్ట్రా’ పరీక్షలు
రాతిచిత్రాల నిపుణులు బండి మురళీధర్‌ రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్‌, కట్టా జ్ఞానేశ్వర్‌, నాగులపల్లి జగన్‌ మోహన్‌ రావు మరికొందరు నిపుణులు కలిసి రామన్‌ స్పెక్ట్రోగ్రఫీద్వారా ఇక్కడ పరిశోధనలు జరిపారు. రాతిచిత్రాలకు ఇసుమంతైనా నష్టం కలిగించని ఈ పరిశోధనవల్ల పురాతన మానవుడు ఆ రాతిచిత్రాలను వేయడానికి వాడిన పదార్థాలను గుర్తించవచ్చు. నమోదు చేసిన అధ్యయన పత్రాలను ‘రాక్‌ ఆర్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’, 2020లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ సెమినార్‌లో సమర్పించారు. ఇక్కడ మరిన్ని అధ్యయనాలు జరిపితే తెలంగాణ చరిత్రకు సంబంధించి, మానవాళి మూలాలకు సంబంధించి ఎన్నో ఆధారాలు లభించవచ్చు. అనేకానేక చిక్కుముళ్లు విడిపోవచ్చు. ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు.

ధ్వంసమవుతున్న విశేషాలు
సరైన సంరక్షణ లేక, ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఒంటిగుండు రాతిచిత్రాలు ధ్వంసమవు తున్నాయి. వాతావరణ మార్పులవల్ల కొంత, మానవ సంచారం వల్ల మరికొంత కనుమరుగవుతున్నాయి. ఈ ప్రాంతం గిరిజనుల ఆరాధనా స్థలంగా ఉండటంతో అన్యాక్రాంతం కాకుండా ఉన్నది. అయితే, ఇక్కడ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలవల్ల పురాతన రాతిచిత్రాలు దెబ్బతింటున్నాయి. వాటిని కాపాడుకొనే చర్యలు చేపట్టకపోతే కొద్దికాలంలోనే ‘ఒంటిగుండు అక్షరలొద్ది జంట రాతిచిత్రాల తావులు’ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదమున్నది.

…?అరవింద్‌ ఆర్య
7997 270 270

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అలనాటి ‘ఆర్ట్‌' గ్యాలరీ ఒంటిగుండు
అలనాటి ‘ఆర్ట్‌' గ్యాలరీ ఒంటిగుండు
అలనాటి ‘ఆర్ట్‌' గ్యాలరీ ఒంటిగుండు

ట్రెండింగ్‌

Advertisement