e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home కథలు ఆరాధ్య

ఆరాధ్య

ఆరాధ్య

సునంద గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ మెయిన్‌ బ్రాంచ్‌.. చాలా హడావిడిగా ఉంది. చైర్‌పర్సన్‌ సునందాదేవి, సంస్థ వార్షికోత్సవ కార్యక్రమానికి రాబోయే ముఖ్యఅతిథి కోసం ఎదురుచూస్తున్నది.“మేడం.. మీరంత ఆదుర్దా పడకండి.అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. అతిథిని ఆహ్వానించేందుకు అందరం సిద్ధంగానే ఉన్నాం” యజమాని మనసులోని ఆదుర్దాని పోగొట్టాలని ప్రయత్నించింది టీమ్‌లీడర్‌ ఆరాధ్య.“నాకు తెలుసు ఆరాధ్య, నువ్వంతటి సమర్థురాలివని. అందుకే, ఆ బాధ్యతను నీకు అప్పగించాను” మనస్ఫూర్తిగా అన్నది సునందాదేవి.ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే మంత్రి శ్రీపతి కారు వచ్చింది. ఆరాధ్య, సునందాదేవితోపాటు మరికొంతమంది ఎదురెళ్లి మంత్రి శ్రీపతిని సాదరంగా ఆహ్వానించారు.
మంత్రిని ముందు వరుసలో కూర్చోమని చెప్పి, క్షణంకూడా ఆలస్యం చేయకుండా సమావేశాన్ని ప్రారంభించారు.

తన మధురమైన స్వరంతో ప్రార్థనా గీతమాలపించి, సంస్థ యజమాని అయిన సునందాదేవిని, మంత్రితోపాటు అక్కడికి విచ్చేసిన మరికొంతమంది ప్రముఖులను వేదికపైకి పిలిచింది ఆరాధ్య. మంత్రి చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన చేయించి, ఆయనను మాట్లాడవలసిందిగా కోరింది.
మంత్రి శ్రీపతి మాట్లాడుతూ.. సునందాదేవి గొప్పతనాన్ని, ఆమె కార్యశీలతను ప్రశంసించాడు. నేటి సమాజంలో స్త్రీ సాధిస్తున్న విజయాలకు ఆమెను ఒక ఉదాహరణగా చెప్పాడు. వారి పార్టీ స్త్రీ సాధికారత కొరకు చేస్తున్న కృషిని వివరించి, తన ప్రసంగాన్ని ముగించాడు.
మంత్రి తర్వాత సునందాదేవి, మరికొంతమంది ప్రముఖుల ప్రసంగాలూ పూర్తయ్యాయి. ఆ తర్వాత తనను మాట్లాడమంటూ సునందాదేవి చేసిన సైగలను అర్థం చేసుకొన్న ఆరాధ్య వేదికపైకి వచ్చి మాట్లాడింది.

“సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. స్త్రీలపై ఇంతటి గౌరవాన్ని, అభిమానాన్ని చూపిస్తున్న మంత్రిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ, మంత్రిగారు భావిస్తున్నట్లుగా స్త్రీలందరూ అభివృద్ధి చెందలేదు. ఇప్పటికీ మారుమూల పల్లెటూర్లలో కనీస సౌకర్యాలు లేకుండా ఎంతోమంది స్త్రీలున్నారు. సమాజంలో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు” అని చెప్పి.. కొన్ని సమస్యలను వివరించింది. వీలైనంత ఎక్కువగా స్త్రీలకు సహకారం అందించమని కోరింది. అనంతరం సమావేశాన్ని ముగించి, అందరినీ లంచ్‌ చేయమని ఆహ్వానించింది. సునందాదేవి తనపై ఉంచిన నమ్మకానికి తగినట్లుగా మొత్తం కార్యక్రమాన్ని ముందుండి నడిపించింది ఆరాధ్య. అక్కడికొచ్చిన క్షణంనుండి ఆరాధ్యలోని అభ్యుదయ భావాలు, మాటతీరు, తెలివితేటలు, చలాకీతనం, సంస్కారం, ఆత్మైస్థెర్యాన్ని గమనిస్తున్న మంత్రి శ్రీపతి, వెంటనే ఆమెను తన ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశాడు.

“నీ అర్హతకు తగిన ఉద్యోగం ఇప్పుడొచ్చింది ఆరాధ్య. నీ తెలివితేటలకు తగిన బహుమానం ఈ ఉద్యోగం” అభినందించి, పంపించింది సునందాదేవి.
వచ్చిన అవకాశానికి సంతోషిస్తూ, విషయాన్ని తల్లికి ఉత్తరం ద్వారా తెలియజేసింది ఆరాధ్య. వెంటనే మంత్రి కొలువులో చేరింది.
ఆరాధ్యను చూసిన క్షణంనుండి ఆమెను ఎక్కడో చూసిన భావం మనసులో మెదులుతున్నా.. ఎక్కడ చూసాడో గుర్తురాక, అనుక్షణం ఆమె గురించి ఆలోచిస్తూ, ప్రతిపనినీ ఆమెను సంప్రదించిన తర్వాతే చేస్తున్నాడు మంత్రి శ్రీపతి.
అది అతని అనుచరులకు కంటగింపుగా మారింది. “సార్‌.. మీరు ప్రతి విషయం మేడం సలహా తీసుకొని చేయడం, ఒక ఆడదానికి మీరంత విలువనివ్వడం ఏం బాగాలేదు సార్‌” అన్నాడు మంత్రి ముఖ్య అనుచరుడైన సత్యవేలు.
“ఏవయ్యా సత్య.. ఆమె పనే నాకు సరైన సలహాలివ్వడం. సరే! మీ అందరికీ అంత బాధగా ఉంది కదా! ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఏంచేస్తే మంచిదో ఆలోచించండి. రేపు మా ఇంట్లో హోంమినిస్టర్‌ గారితో సమావేశం ఉంది. మీరందరూ రండి, మీ సలహాలు చెప్పండి. ఎవ్వరి సలహా నచ్చినా.. మేం పాటిస్తాం” అన్నాడు శ్రీపతి. ఆరాధ్య సమయస్ఫూర్తి, తెలివితేటలను అందరికీ తెలియజేయాలని అనుకున్నాడు.
అతను ఇంటికెళ్లేసరికి పంట డబ్బులను బ్యాంకులో వేయడానికి నగరానికి వచ్చిన తన తండ్రి లక్ష్మీపతి ఇంట్లో ఉన్నాడు.
“చాలా రోజులనుంచి రమ్మంటున్నాను. ఇప్పటికి తీరిక దొరికిందా నాన్నా? అమ్మ ఎలా ఉంది? అమ్మను కూడా తీసుకురావాల్సింది” అంటూ తండ్రి కాళ్లకు నమస్కరించాడు శ్రీపతి. వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు.
“నీకు తెలియందేముంది శ్రీపతి, సర్పంచ్‌గా ఊరి బాగోగులు చూసుకోవాలి. పొలం పనులూ చూడాలి. తీరికెక్కడ? నిన్న పంట అమ్మితే వచ్చిన డబ్బులను బ్యాంకులో వేసినట్లుంటుంది.. నిన్ను చూసినట్లుంటుందని వచ్చాను” కొడుకును ఆప్యాయంగా తడుముతూ చెప్పాడు లక్ష్మీపతి.
“సరే నాన్నా.. భోజనం చేసి ఈ రోజుకు విశ్రాంతి తీసుకోండి. రేపు హోంమినిస్టర్‌గారితో సమావేశముంది. అది పూర్తయ్యాక నేనే స్వయంగా మమ్మల్ని బ్యాంకుకు తీసుకువెళ్తా” అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు శ్రీపతి.
మరునాటి ఉదయం మంత్రి శ్రీపతి ఇంట్లో హోంమినిస్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసింది ఆరాధ్య. ఎప్పుడూ మోడ్రన్‌ డ్రెస్‌లో ఉండే ఆరాధ్య, ఆ రోజు మొదటిసారి సంప్రదాయ
బద్ధంగా చీర కట్టింది. ఆ చీరలో ఆమెను చూస్తుంటే.. బాగా తెలిసిన మొహంలా అనిపించింది మంత్రి శ్రీపతికి. హోంమినిస్టర్‌ వచ్చిన తర్వాత.. “ఎవరైనా.. ఏమైనా సలహాలు చెబుతారా?” అనుచరులందరినీ చూస్తూ అడిగాడు మంత్రి.
“అసలీ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకండి? ప్రభుత్వానికి అనవసరపు ఖర్చు. విద్యను పూర్తిగా ప్రైవేటుపరం చేయండి. ప్రభుత్వానికి డబ్బే డబ్బు” అన్నాడు సత్యవేలు.. ఇంతకంటే అద్భుతమైన సలహాను ఎవ్వరూ ఇవ్వలేరన్నట్టుగా చూస్తూ..
“అప్పుడు మన పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. ఇంతమందిలో మంచి సలహాలిచ్చేవారే లేరా?” అందరివైపు చూశాడు హోంమినిస్టర్‌.
సత్యవేలులాగే అందరూ పిచ్చిపిచ్చి సలహాలు ఇచ్చారు.
“ఇంతకంటే మంచి సలహాలిచ్చేవారు లేరా శ్రీపతి?” ఎవ్వరి సలహా నచ్చక.. అసహనంగా అన్నాడు హోంమినిస్టర్‌.
“ఉన్నారు సార్‌”.. అంటూ ‘ఇప్పుడు నీ వంతు’ అన్నట్టుగా ఆరాధ్య వైపు చూశాడు శ్రీపతి.
అంతవరకూ మౌనంగా కూర్చున్న ఆరాధ్య, హోంమినిస్టర్‌కు నమస్కారం చెప్పి..
“సత్యవేలుగారు చెప్పినట్లుగా ప్రభుత్వ పాఠశాలలన్నిటినీ ప్రైవేటుపరం చేయడంకాదు.. నెమ్మదినెమ్మదిగా ప్రైవేట్‌ పాఠశాలలన్నిటినీ ప్రభుత్వపరం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పాలి. ప్రతి ఉపాధ్యాయుడికీ సెలవుల్లో ప్రత్యేక శిక్షణనిస్తూ, వారిలోని ప్రతిభకు మెరుగులు దిద్దాలి. ప్రతి పాఠశాలలో.. అంటే ప్రభుత్వ పాఠశాలలైనా, ప్రైవేట్‌ పాఠశాలలైనా ఒకే రకమైన అంశాలను బోధించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని అమలుచేస్తుంటే, అతిత్వరలో ప్రభుత్వ పాఠశాలలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయి” అని చెప్పింది.
తన సలహా హోంమినిస్టర్‌కు నచ్చిందో.. లేదోనని అతని ముఖ కవళికలను
పరిశీలించింది.
ఆమె చెప్పింది విన్న హోంమినిస్టర్‌..
“అద్భుతం మిస్‌ ఆరాధ్య, మీరు చెప్పిన ప్రతి సలహా పాటించేలా చర్యలు తీసుకుంటాం. ఇన్ని తెలివితేటలున్న అమ్మాయిని కాదని పిచ్చిపిచ్చి సలహాలన్నిటినీ వినిపించారేంటయ్యా? తెలివిలేకపోతే.. ఆ అమ్మాయిని చూసి నేర్చుకోండి మీరంతా. ఇకపై ఎవరికీ పిచ్చిపిచ్చి సలహాలు ఇవ్వకండి” అంటూ శ్రీపతి అనుచరులను మందలించాడు హోంమినిస్టర్‌. సమావేశాన్ని ముగించి బయల్దేరాడు.
అంతవరకూ గదిలో కూర్చొని ఆరాధ్య చెబుతున్నది విన్న లక్ష్మీపతి, మనసాగక ఆమెను చూసేందుకు బయటకు వచ్చాడు. ఆరాధ్యను చూసి ఆశ్చర్యపోయాడు.
“ఆరాధ్యా.. నా అంచనా ఎప్పుడూ తప్పు కాలేదు. నాకు తెలుసు నువ్వు చాలా చక్కటి సలహాలిస్తావని” అభినందించాడు మంత్రి. మళ్లీ ఏదో గుర్తొచ్చిన వాడిలా “మీ అమ్మగారి పేరు ఏంటి? మీ ఊరు ఏంటి?” అని అడిగాడు.
“నాది కూడా మీ ఊరే సార్‌. మేడ్చర్లలోని తూముకుంట. మా అమ్మ పేరు మంగమ్మ. ఆమెకు మీరంతా తెలుసు”
“నేను మీ ఊరి వాడినని తెలిసికూడా ఇన్ని
రోజులూ ఎందుకు చెప్పలేదు ఆరాధ్య?” ఒకపక్క సంతోషం.. ఇంకోపక్క ఆశ్చర్యం కలగాపులగం అవుతుండగా అడిగాడు మంత్రి శ్రీపతి.
“ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది సార్‌. మీరడిగుంటే చెప్పేదాన్ని. మీరడగలేదు.. నేను చెప్పలేదు.. ఒకే సార్‌ ఇక నేను వెళ్లొస్తాను” అంటూ వెళ్లిపోయింది ఆరాధ్య.
అప్పటివరకూ వాళ్ల మాటలు వింటున్న లక్ష్మీపతి.. ఆరాధ్య అందాన్ని తలచుకుంటూ, అంతులేని సంతోషంతో గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

ఆరాధ్య పుట్టిన మూడేండ్లకు ఆమెకు అమ్మవారు పోసింది. చావుబతుకుల మధ్య ఉన్న కూతుర్ని తీసుకొని, పోలేరమ్మ గుడికి వచ్చింది ఆమె తల్లి మంగమ్మ. కూతురు ప్రాణాపాయం నుండి బయటపడితే జోగినిగా మారుస్తానని మొక్కుకుంది. కానీ, కాలక్రమంలో ‘జోగినీ వ్యవస్థ నిరోధక చట్టం’ వచ్చిందని తెలుసుకొని, కూతుర్ని పట్నం పంపించి చదివించింది.
విలాస పురుషుడైన లక్ష్మీపతికి మంగమ్మ మీద కోపం వచ్చినా, తన కొడుకు అప్పుడే రాజకీయ ప్రవేశం చేయడంతో, అతని రాజకీయ భవిష్యత్తుకు భంగం వాటిల్లకూడదని అప్పటికా విషయాన్ని పక్కనపెట్టాడు. కానీ, ఇప్పుడు ఆరాధ్య అందాన్ని చూసిన లక్ష్మీపతికి వికారపు ఆలోచనలు మొదలయ్యాయి. వెంటనే తన కర్తవ్యం ఏంటో ఆలోచించాడు.
తండ్రి పరిస్థితి ఇలా ఉంటే.. కొడుకు పరిస్థితి ఇంకోలా ఉంది. ‘సద్గుణాలు, ఆత్మైస్థెర్యం, తెగువ, అందం కలిగిన అమ్మాయి భార్యగా వస్తే.. తన జీవితం ‘తిలక్‌ అమృతం కురిసిన రాత్రి’లా మధురంగా, మనోహరంగా ఉంటుంది. కానీ, ఒక మామూలు అమ్మాయిని పెండ్లి చేసుకోవడానికి తండ్రి ఒప్పుకొంటాడా?’ అని ఆలోచిస్తున్నాడు శ్రీపతి.
వారంరోజులు ఉంటానని వచ్చిన లక్ష్మీపతి, కొడుకుతో చెప్పి వెంటనే ఊరు బయల్దేరాడు. తండ్రి ఎందుకింత అకస్మాత్తుగా వెళ్తున్నాడో అర్థంకాలేదు శ్రీపతికి. కానీ, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేదతనికి. అందుకే, క్షేమంగా వెళ్లమనీ.. ఇంటికెళ్లిన వెంటనే ఫోన్‌ చేయమనీ చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు.
ఊరు చేరుకున్న వెంటనే.. లక్ష్మీపతి మంగమ్మకు కబురు పంపాడు.
“దండాలు దొర.. రమ్మని కబురుచేసిండ్రట?” అడిగింది మంగమ్మ.
‘ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు పిలిపించారో? తానేం తప్పు చేశానో?’ అని అర్థంకాక భయం భయంగా చూస్తున్నది.
“ఏం మంగమ్మ.. దేవుడికి మొక్కిన మొక్కులు మర్శిపోయినట్టున్నవ్‌”.. డొంకతిరుగుడు మాటలెందుకని నేరుగా అడిగాడు
లక్ష్మీపతి.
“ఏం మొక్కు దొర ” అంటూ.. అసలు తాను ఏం మొక్కుకుందో గుర్తురాక నెత్తి గోక్కుంది మంగమ్మ.
“ఏమే.. ఒళ్లు బలిశిందా? పోలేరమ్మ మెుక్కునే మర్శిపోయినవా?” హూకరించాడు లక్ష్మీపతి.
“మట్టిబుర్ర దొర.. యాదికిలేదు. తప్పు మన్నించి, గదేందో శెప్పు దొర” వణికిపోతున్న చేతులను జోడిస్తూ అడిగింది మంగమ్మ.
“నీ బిడ్డకు అమ్మవారు పోసినప్పుడు జోగినీగా మారుస్తనని ఊరందరి ముందు.. పోలేరమ్మ గుడిలో మెుక్కిన మెుక్కు మర్శిపోతే ఎలాగే? ఇప్పుడు సూడు.. పోలేరమ్మకు కోపమచ్చింది. ఊరంతా కరువుతో కటకటలాడుతంది. ఇప్పుడు నీ మొక్కుబడి ప్రకారం నీ బిడ్డను జోగినిగా మార్చు” గంభీరంగా అన్నాడు లక్ష్మీపతి.
అంతవరకూ వణికిపోతూ.. వంగివంగి దండాలు పెట్టిన మంగమ్మ, అతడి మాటలు వినగానే రౌద్రమూర్తి అయ్యింది.
“ఏంది దొరా.. నా బిడ్డను జోగినిగా మార్చాల్నా? నీకు గత్తర్రాను. నీ బతుకు శెడ. ఎంతమంది ఆడిబిడ్డల ఉసురు పోసుకుంటవ్‌? ఇంకోసారి గా మాటంటే.. నిన్నే ఆ పోలేరమ్మకు బలిత్త! నా బిడ్డను జోగినిగ మారుత్తనని మొక్కిన. నిజమే! గానీ, గట్ల శెయ్యద్దొన్ని సర్కారే ఖానూన్‌ చేసింది. నువ్వు యాది మర్శినవా దొర. సదువుల సరస్వతి.. నా బిడ్డ. పట్నంల కొలువు జేత్తంది. ఇంకొసారి నీ పాడుకండ్లు నా బిడ్డమీద పడ్డయంటే.. సాకలి బండకేసి దంచుత.. యాదికుంచుకో.. నా బిడ్డ జోలికి రాకుంటే నీకే మర్యాద”
ఎందరో ఆడబిడ్డలను జోగినులుగా మార్చి, వాళ్ల బతుకులను బుగ్గిపాలు చేసిన లక్ష్మీపతి.. తన బిడ్డనూ జోగినీగా మారుస్తాననే సరికి విచక్షణ కోల్పోయింది మంగమ్మ. ఊరిపెద్ద అనే విషయం మర్చిపోయి.. చెడామడా తిట్టి, అక్కడి నుండి వెళ్లిపోయింది.

మంగమ్మ చేసిన అవమానాన్ని లక్ష్మీపతి భరించలేకపోయాడు.
అంతవరకూ అక్కడే ఉన్న లక్ష్మీపతి అనుచరుడు రంగయ్య.. జరిగిన విషయాన్నీ, మంగమ్మ చేసిన అవమానాన్నీ వెంటనే మంత్రి శ్రీపతికి చేరవేశాడు.
అంతవరకు ఆరాధ్యను పెండ్లి చేసుకుందామనుకున్న శ్రీపతి, తండ్రికి జరిగిన అవమానానికి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అప్పటివరకూ ఎంతో సౌమ్యంగా, మర్యాదగా మాట్లాడిన మంత్రి, ఆ రోజు నుంచి ఆరాధ్యతో చాలా కఠినంగా, అగౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మంత్రి ప్రవర్తనలో అకస్మాత్తుగా ఎందుకింత మార్పు వచ్చిందో అర్థంకాలేదు ఆరాధ్యకు.
తరువాత తన అనుచరులను మంగమ్మ ఇంటికి పంపించి, ఆమె గుడిసెను కూలగొట్టించాడు లక్ష్మీపతి. మొక్కును తీర్చుకోకుంటే ఊరినుండి వెలేస్తానని బెదిరించాడు.
ఊరి పెద్దను కాదని ఆ ఊరిలో బతకలేక, కూతురి బతుకు బుగ్గిపాలు చేయలేక.. కన్నీటితో ఉన్న ఊరిని విడిచి కూతురు దగ్గరికి బయల్దేరింది మంగమ్మ. తల్లిద్వారా జరిగిందంతా తెలుసుకున్న ఆరాధ్యకు.. అప్పుడు అర్థమైంది శ్రీపతి ప్రవర్తనలో మార్పుకు కారణం. అయినా, ఏమీ తెలియని దానిలానే మౌనంగా శ్రీపతి దగ్గరకు వెళ్లింది.
“ఏంటి? మొహం అలా వాడిపోయి ఉంది. మీ అమ్మ వచ్చేసిందా?” అన్నాడు మంత్రి శ్రీపతి వెటకారంగా నవ్వుతూ.
“నన్ను క్షమించండి సార్‌.. అమ్మ పాతకాలం మనిషి. అందుకే, తొందరపడి పెద్దయ్యగారిని తిట్టింది”
“ఆరాధ్యా.. నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన ఊరిలో మా తండ్రికి జరిగిన అవమానం మాసిపోదు. నేను నిన్ను పెండ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ, ఇప్పుడు కాదు. మా నాన్న అన్నట్లుగా నువ్వు జోగినిగా మారాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే, అది చట్ట వ్యతిరేకం. కానీ, నువ్వు జీవితాంతం నాకు ఉంపుడుగత్తెగా ఉండాలి. అప్పుడే మా తండ్రికి జరిగిన అవమానానికి లెక్కసరిపోతుంది”
తన రాక్షసత్వాన్ని కురిపిస్తూ కఠినంగా శాసించాడు మంత్రి శ్రీపతి.
“సరే సార్‌.. కానీ, మా అమ్మను ఊరినుండి వెలివేయకండి. నా తండ్రి జ్ఞాపకాలతోనే బతుకుతున్న ఆమె.. ఈ పట్టణంలో ఉండలేదు. నిన్నటి నుండి పచ్చి మంచినీళ్లుకూడా తాగలేదు” అంటూ కన్నీళ్లతో వేడుకుంది ఆరాధ్య.
తెగువ, తెలివితేటలున్న ఆరాధ్య.. తల్లికోసం లొంగిపోతుందని ఊహించని శ్రీపతి, ఆశ్చర్యపోయాడు.
“సరే.. మీ అమ్మ ఊర్లో ఉండాలంటే, మా తండ్రి కాళ్లపై పడి క్షమాపణ చెప్పాలి. అయినా, ఎందుకే అంతపొగరు? ఇప్పుడు నువ్వు పెళ్లీపెటాకులు లేకుండా.. పూజకు పనికిరాని పువ్వులా ఉంటూ, నీ జీవితం నా చేతుల్లో బలవుతుంటే.. అప్పుడు మా నాన్న పగ చల్లారుతుంది. నువ్వు ఇప్పుడే నా కోరిక తీర్చాలి” అన్నాడు అసభ్యకరంగా మాట్లాడుతూ.
“అమ్మను ఊరు పంపించి.. నా బట్టలు సర్దుకొని వచ్చేస్తాను సార్‌. మీకు నాపై నమ్మకం లేకుంటే.. మీ అనుచరులను నాతో పంపించండి” అతని మాటలకు ఒంటిపై తేళ్లూ జెర్లూ పాకుతున్నంత అసహ్యం వేస్తున్నా.. ముఖంలో ప్రశాంతత కోల్పోకుండా మాట్లాడింది ఆరాధ్య.
తల్లికోసం పూర్తిగా లొంగిందని భావించిన శ్రీపతి.. “అవసరం లేదు.. మీ అమ్మకు నచ్చచెప్పి, మా నాన్న కాళ్లపై పడి క్షమించమని అడగమని చెప్పు. ఇక వెళ్లు. రేపు ఉదయాన్నే రా” అని ఆదేశించాడు.
అతని ముఖంలో రాక్షసానందం ఉప్పొంగింది. ఆరాధ్య అందాన్ని తలుచుకొని.. మధ్యాహ్నం కునుకుతీశాడు మంత్రి శ్రీపతి.

“సార్‌.. లేవండి. ఒక్కసారి టీవీ పెట్టండి” అరుచుకుంటూ మంత్రి గదిలోకి వచ్చాడు సత్యవేలు.
అతని అరుపులకు ఉలిక్కిపడి లేచి..
“ఏమైంది రా.. ఎందుకలా అరుస్తున్నావ్‌? కొంపలేం మునిగాయని” మంచి నిద్ర చెడగొట్టాడన్న కోపంలో చిరాగ్గా అన్నాడు శ్రీపతి.
“నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయ్‌. ముందు మీరు టీవీ పెట్టండి సార్‌” కంగారుగా అన్నాడు సత్యవేలు.
“నువ్వూ.. నీ వెధవ కంగారు..” అంటూ టీవీ ఆన్‌ చేశాడు శ్రీపతి.

గౌరీ పొన్నాడ
గౌరీ పొన్నాడ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పొండూరు మండలం తోపలి గ్రామం. పదహారేండ్లకే వివాహమైనా, భర్త మధుసూదన రావు ప్రోత్సాహంతో ఉన్నత విద్యనభ్యసించారు. బీఎస్సీ, బీయీడీ పూర్తి చేసి, ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. బాల్యం నుంచే కథలపై మక్కువ పెంచుకున్నారు. అయితే, ఇటు కుటుంబ బాధ్యతలు.. అటు విధుల నిర్వహణ వల్ల కథలు రాయడంపై దృష్టి పెట్టలేకపోయారు. లాక్‌డౌన్‌లో ఖాళీ సమయం దొరకడంతో కలంపట్టారు. వీరి మొదటి కథ ‘ప్రేమకు వయసు లేదు’. రెండోకథే ‘ఆరాధ్య’. కరోనా కవితలు, వ్యాసాల పోటీలో ప్రథమ బహుమతిని గెలుపొందారు. ‘ప్రతిలిపి’ నిర్వహించిన ‘సైన్స్‌ ఫిక్షన్‌’ పోటీలో రెండో బహుమతిని, ‘సహరి’ పత్రిక నిర్వహించిన ఉగాధి కథల పోటీలో కన్సొలేషన్‌ బహుమతిని అందుకున్నారు. ‘పరివర్తన’ వృత్తి కథా సంకలనానికి ఎంపికైంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆరాధ్య

ట్రెండింగ్‌

Advertisement