e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home బతుకమ్మ తొలి బౌద్ధ స్తూపంబావాపూర్‌ కుర్రు

తొలి బౌద్ధ స్తూపంబావాపూర్‌ కుర్రు

తొలి బౌద్ధ స్తూపంబావాపూర్‌ కుర్రు

బౌద్ధం.. భారతదేశంలో ఆవిర్భవించి, ఖండాంతరాలకు విస్తరించింది. భారతీయ తాత్త్విక, దార్శనికతలను ప్రపంచానికి తెలియజెప్పి మన కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసింది. భారతీయ వాస్తుశిల్పకళలకు బౌద్ధం చేసిన సేవ ఎనలేనిది. దేశంలోని అన్ని ప్రాంతాలకన్నా ముందే బౌద్ధానికి స్వాగతం పలికింది.. తెలంగాణ గడ్డ. బుద్ధుడి ఉపదేశాలను ఆచరించి, ఆదరించిందీ నేల.
బుద్ధుడి కాలంలోనే తెలంగాణలో బౌద్ధం విస్తరించిందనడానికి బలమైన సాక్ష్యం ఉన్నది. సుత్తనిపాత గ్రంథంలోని ‘బావరి కథ’ తెలంగాణలో బౌద్ధం అంకురార్పణ వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. ఉత్తరాదినుంచి వచ్చి, అస్మక జనపదం (నేటి బోధన్‌) రాజ్యంలోని ములక జనపదానికి దగ్గరలో ప్రవహిస్తున్న గోదావరి ఒడ్డున బావాపూర్‌ కుర్రు కపిటవనంలో బావరి అనే బ్రాహ్మణుడు నివాసం ఏర్పరచుకున్నాడు.

ఈయన బుద్ధుడి సమకాలికుడు. తనకు కలిగిన సంశయాలను నివృత్తి చేసుకోవడానికి బుద్ధుణ్ని కలిసి రమ్మని, తన శిష్యులు 16 మంది (అజిత, తిస్సమెత్తెయ్య, పున్నకుడు, మెత్తగు, ధోతకుడు, ఉపాసి, నందుడు, హేమకుడు, తోదెయ్య, కప్ప, జాతుకన్ని, భద్రావుదుడు, ఉదయుడు, పోసాలుడు, మొఘరాజ, పింగియ)ని పంపించాడు. వారు ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి నగరంలో బుద్ధుడిని దర్శించుకొని.. తమ గురువు సందేహాలకు సమాధానాలను పొందారు. బుద్ధుడితో సమావేశం అనంతరం ఆ పదహారుగురూ బౌద్ధాన్ని స్వీకరించారు. వారందరిలో ‘పింగియ’ అనే వ్యక్తి తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు. మిగతా వారు శ్రావస్తిలోనే ఉండిపోయారు. పింగియద్వారా బుద్ధుడి బోధనలను గురించి తెలుసుకున్న బావరికూడా బౌద్ధంలోకి మారాడు.

ఏకైక ద్వీపం
నిర్మల్‌జిల్లా ఖానాపూర్‌ మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ‘బావాపూర్‌’ ఉంది. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలమధ్య గోదావరి ప్రవాహంలో ఏర్పడ్డ ద్వీపం ఇదొక్కటే. ఇక్కడినుండి కిందికి ప్రవహించే నది, రెండు పాయలు (తూర్పువైపున పెద్ద గోదావరి, పడమర వైపున చిన్న గోదావరి)గా మారి ప్రవహిస్తుంది. ఈ రెండు పాయలమధ్య మరొక ద్వీపం వంటి ప్రదేశం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని ‘బావాపూర్‌ కుర్రు’ అని పిలుస్తారు. బుద్ధుడి కాలంలోనే తెలంగాణలో బౌద్ధం అడుగిడిన నేల ఇది. తెలంగాణ ప్రాంతంలో మొదటి బౌద్ధస్తూపం ఇక్కడే నిర్మితమైంది. నిర్మల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న డి.సంతోష్‌, బావాపూర్‌ కుర్రులో పురాతన మట్టి దిబ్బను గుర్తించారు. దీంతోపాటు అనేక రకాల మట్టి ఇటుకలు, చైత్యాలను పోలిన నిర్మాణాలూ బయల్పడ్డాయి. దీంతో ఈ ద్వీపం బావరి కాలం నుండి పూర్వ శాతవాహన పాలనా కాలం మధ్యలో నిర్మితమై ఉంటుందని పురావస్తు పరిశోధకుడు, పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్‌ సంస్థ జనరల్‌ సెక్రటరీ ఎం.ఎ.శ్రీనివాసన్‌ అభిప్రాయపడ్డారు.

కొనసాగుతున్న పరిశోధనలు
బావాపూర్‌ కుర్రు ప్రాంతాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారి పగడం నాగరాజు, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య సారథ్యంలో బుద్ధవనం అధికారి శ్యామ్‌సుందర్‌ పరిశీలించారు. ప్రాథమిక పరిశోధనలు జరిపారు. చరిత్రను విద్యార్థులూ ఈ పరిశోధనలో పాలుపంచుకొన్నారు. స్తూప పరిసరాలతోపాటు గోదావరి సమీపంలో మధ్యరాతి యుగానికి చెందిన సూక్ష్మరాతి పనిముట్లు లభించాయి. వీటి మూలంగా ఈ ప్రదేశం వేల సంవత్సరాల నుండి మానవ ఆవాసంగా ఉన్నదని చెప్పవచ్చు. స్తూప పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే మరిన్ని స్తూపాలు, నిర్మాణాలు బయల్పడతాయి. తద్వారా కాలగర్భంలో నిక్షిప్తమైన బౌద్ధం ఆనవాళ్లు మరిన్ని వెలుగుచూస్తాయి. ఫలితంగా తెలంగాణ చరిత్ర మరింత పరిపుష్ఠం అవుతుంది. ఏ జాతికైనా చరిత్రే పునాది, గతాన్ని స్మరించుకోవడం భవిష్యత్తును నిర్మించు కోవడంలో ఓ భాగం.

భారీ స్తూపం
బావాపూర్‌ కుర్రులో ఒక పెద్ద బౌద్ధస్తూపం నిర్మితమైంది. మూడు వరుసల సోపాన వేదికలపైన దాదాపు 16 అడుగుల ఎత్తు, 26 అడుగుల వ్యాసం (సోపాన వేదికలతో కలుపుకొని 60 అడుగుల మధ్యదూరం)తో ఈ స్తూపం ఉంది. మొదటి సోపాన వేదిక 19 మీటర్లు, రెండో సోపాన వేదిక 12 మీటర్లు, లోపలి వైపు వున్న సోపాన వేదిక 7 మీటర్లు ఉంది. ఇక్కడ వివిధ పరిమాణాల్లో లభించిన ఇటుకలు వేర్వేరు కొలతలతో ఉండటం విశేషం.

-అరవింద్‌ ఆర్య ,7997 270 270

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తొలి బౌద్ధ స్తూపంబావాపూర్‌ కుర్రు

ట్రెండింగ్‌

Advertisement