e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home బతుకమ్మ హీరో హాండా!

హీరో హాండా!

హీరో హాండా!

ఇష్టంతో వచ్చాడో, కష్టం తక్కువనుకున్నాడో, మరేదారి దొరక్క ఇరుక్కున్నాడో.. తెలియదు కానీ.. రవి హాండా పంట పండింది. ‘హాండా కా ఫండా’ సత్తా లోకానికితెలిసింది. ‘అన్‌ అకాడమి’ వంటి దిగ్గజ సంస్థతో బేరం కుదిరింది. హాండా కా ఫండా ‘టాక్‌ ఆఫ్‌ ద నేషన్‌’గా నిలిచింది. లెక్కలను నమ్ముకొని చుక్కలకు నిచ్చెన వేసిన 37 ఏండ్ల యువ తరంగం రవి హాండా సక్సెస్‌ స్టోరీ చదవండి.‘ఏయ్‌ రవి సూపర్బ్‌రా!’ తోటి విద్యార్థి అభినందన.‘హాండా.. యు ఆర్‌ హీరో మై బాయ్‌’ లెక్కల మాస్టారు ప్రశంస.ఈ ప్రశంసలే రవి హాండాకు లెక్కలపై లెక్కలేనంత మక్కువ పెంచాయి. బోర్డుమీద ఉపాధ్యాయుడు ప్రశ్న పూర్తి చేసి పిల్లలవైపు తిరిగేసరికే సమాధానం చెప్పేసేవాడు. ఆల్జీబ్రా సూత్రాలు, త్రికోణమితి ఫార్ములాలు, సంభావ్యత షార్ట్‌కట్‌లు, పర్మిటేషన్స్‌లోని కాంబినేషన్లు రవిని జైపూర్‌లో బ్రిలియంట్‌ స్టూడెంట్‌గా నిలబెట్టాయి.

సాఫ్ట్‌వేర్‌ను కాదని..
లెక్కల్లో చాకుల్లాంటి కుర్రాళ్లంతా ఇంజినీరింగ్‌ను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. రవికూడా అటుగానే అడుగులు వేశాడు. ఇంటర్‌ పూర్తయ్యాక ఐఐటీలో సీటు సాధించాడు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో బీటెక్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో చేరాడు. గణితంలో గుణాత్మకమైన పరిజ్ఞానం ఉన్న హాండాకు బైనర్‌ నంబర్లపై ఆధారపడి పరుగులెత్తే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు బుర్ర కెక్కేవి కావు. అందుకే, తీరిక తెచ్చుకొని కోల్‌కతాలోని స్నేహితుడి కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లేవాడు. అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి లెక్కలు చెప్పేవాడు. రోజూ 300 కి.మీ. ప్రయాణించేవాడు. ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు ఇచ్చే డబ్బులు ప్రయాణ ఖర్చులకుకూడా సరిపోయేవి కావు. కానీ, పాఠాలు చెప్పడం మాత్రం మానలేదు. బీటెక్‌ పూర్తయ్యాక ఎంటెక్‌ చదివాడు. అందులోనూ ఫస్ట్‌గానే పాసయ్యాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలు హాజరవ్వడం, ఒకట్రెండు ఉద్యోగాలకు సెలెక్ట్‌ అవ్వడం యథాలాపంగా జరిగిపోయింది. కానీ, తను కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ రాయడానికి పనికిరానని హాండా ఫుల్‌క్లారిటీతో ఉన్నాడు. అందుకే, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వద్దనుకున్నాడు. ‘ఏదో ఎంటెక్‌ చేశాను కానీ, ఆ కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ రాయడం నావల్ల కాదు. మనసును చంపుకొని ఆ రంగాన్ని ఎంచుకొని ఉంటే, నా పనితనం చూసి నాలుగు రోజులకే నాకో నమస్కారం పెట్టి ఇక దయచేయండి అనేవారు’ అంటాడు రవి.

ట్యూటర్‌గా ప్రస్థానం
లెక్కల మాస్టార్‌గా స్థిరపడాలనుకున్నాడు హాండా. అంటే, సాదాసీదా స్కూల్‌ టీచర్‌ కాదు. పోటీపరీక్షల్లో తికమక పెట్టి ర్యాంకులను దిగ జార్చే గణితంలో విద్యార్థులను గుణవంతులుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. హార్డ్‌ లెక్కలను షార్ట్‌ కట్‌లో సాల్వ్‌ చేయడం ఎలాగో నేర్పించాలనుకున్నాడు. అలాంటి లెక్కల ట్యూటర్‌గా స్థిరపడాలనుకున్నప్పుడు, రవి తల్లిదండ్రులు కూడా ఏమనలేదు. ఇద్దరూ వైద్యులే అయినా, కొడుకును ఇంజినీరింగ్‌ దారిలోకి వెళ్లనిచ్చారంటేనే కొడుకు అభిప్రాయాలకు వాళ్లు ఎంతగా విలువ ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగం విషయంలోనూ అడ్డు చెప్పలేదు. అందుకే, ట్యూటర్‌గా జర్నీ మొదలుపెట్టాడు రవి. 2006లో కోల్‌కతాలో ఓ ఇన్‌స్టిట్యూట్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. ఆన్‌లైన్‌లో క్యాట్‌ (కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌), బ్యాంకింగ్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అర్థమెటిక్స్‌ బోధించేవాడు. అప్పుడు ఆయన జీతం నెలకు రూ.22,500. తర్వాత తన స్వస్థలంలో జైపూర్‌లో కోచింగ్‌ సెంటర్‌లో పాఠాలు బోధించాడు. 2010లో సహస్థాపకుడిగా ఓ లెర్నింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాడు. 2013లో ‘హాండా కా ఫండా’ పేరుతో సొంతంగా వెబ్‌సైట్‌ మొదలుపెట్టాడు. పుణె కేంద్రంగా పనిచేస్తుందీ సంస్థ.

వేలల్లో విద్యార్థులు
యూట్యూబ్‌ తరగతులకు అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో హాండా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌పై సక్సెస్‌ఫుల్‌ టీచర్‌గా అవతరించాడు. మొదట్లో 200 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. హాండా టీచింగ్‌ టెక్నిక్స్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించింది. చూస్తుండగానే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు హాండా తరగతులను ఫాలో అవుతున్న విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంది. ఆన్‌లైన్‌లో రవి జోరు కొన్నేండ్లపాటు ఆగకుండా కొనసాగింది. తాజాగా ఆన్‌లైన్‌ టీచింగ్‌లో దిగ్గజ సంస్థగా పేరు మోసిన ‘అన్‌ అకాడమీ’ రవితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయన నిర్వహిస్తున్న ‘హాండా కా ఫండా’ని టేకోవర్‌ చేసింది. ఇన్నేండ్లు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేసినా సంపాదించనంత పెద్ద మొత్తాన్ని వారు ఆఫర్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి. హాండా తను నమ్ముకున్న దారిలోనే నిలబడ్డాడు. ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఎందరికో అర్థం కాని చిక్కు లెక్కలకు పరిష్కారం చూపుతున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హీరో హాండా!

ట్రెండింగ్‌

Advertisement