e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home బతుకమ్మ తలుపులతలపులు!

తలుపులతలపులు!

తలుపులతలపులు!

తుమ్మయి గడపలు. తుప్పు వట్టిన చిలుకులు. పుచ్చి పోయిన తలుపులేమో, పెచ్చులూడి ఉంటయి
గరీబోళ్ల ఇండ్లు.ఇల్లు ఇరుకుదే కావచ్చు. కానీ, అద్దాల మేడకంటే అందమైన దర్వాజలు.
తీరొక్క విధంగా సక్కదనంగా కనిపిస్తయి. ఎన్నిఆపదలున్నా సిలుకలు చెక్కిన దర్వాజకు ఒరిగి సేద తీరితే భారమంతా తగ్గిపోతది. అసొంటి అరుదైన దర్వాజల దరహాసాన్ని త్రీడీ ఎఫెక్టుతో ప్రదర్శిస్తూ కళాద్వారాలు తెరుస్తున్నాడు కేఆర్‌ శంతన కృష్ణన్‌. ఇప్పుడన్నీ అద్దాల నిర్మాణాలే. దర్వాజలు అద్దాలవే. కిటికీలూ అద్దాలవే. ఒకప్పుడు మన ఇండ్లు ఎట్లుండేవి? పెద్ద వాకిలి. దానికి ఆనుకొని అరుగు. దానిని ఎత్తుకున్నట్టు పెద్దర్వాజ, లోపల చిన్న దర్వాజలు, అత్యంత పవిత్రంగా భావించే పడమటింటి దర్వాజ, దేవుని దర్వాజ. ఇలా చాలా. కనుమరుగై పోయిన అలనాటి దర్వాజల దర్జాను, తలుపుల తళుకులను నేటి తరానికి పరిచయం చేయాలనుకున్నాడు శంతన కృష్ణన్‌.

నాటి జీవన విధానం
తమిళనాడులోని కుంభకోణానికి చెందిన కళాకారుడు శంతన కృష్ణన్‌. ముప్పయ్‌, నలభయేండ్ల కిందటి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి గడపనూ గుర్తు చేస్తూ కాన్వాస్‌మీద తలుపుల బొమ్మలు గీయడం ఆయన అభిరుచి. కండ్లకు కట్టినట్లుగా, జీవం ఉట్టి పడేట్లుగా ఉంటాయి శంతన బొమ్మలు. నేటి తరానికి మన పూర్వపు జీవన విధానాలను తెలియజెప్పడమే లక్ష్యంగా దర్వాజలను కాన్వాస్‌ పెయింటింగ్‌గా మారుస్తున్నాడు.

చిన్నప్పటి గుర్తులు
శంతన కృష్ణన్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో చదివాడు. కాలేజీకి వెళ్లేప్పుడు సగం తెరుచుకొని ఉన్న తలుపులెన్నో కనిపించేవి. మట్టి మనుషుల జీవన స్థితిగతులను, వారి కళాభిమానం స్పష్టంగా అర్థమయ్యేది. చాలా అరుదైన ఇండ్ల నిర్మాణాలు, వాటికి సరితూగే దర్వాజలు దర్శనమిచ్చేవి. అరుగు మీదికి ఎక్కకున్నా సరే పెద్దర్వాజలోంచి చూస్తే లోపల అంగడం, ఇల్లు కనిపించేవి. పట్టణీకరణవల్ల ఇంటికి కనురెప్పల్లాంటి దర్వాజలూ కనుమరుగయ్యాయి. తుమ్మ, టేకు దర్వాజలకు బదులు అద్దాల తలుపులొచ్చి, గత వైభవమంతా కనుమరుగు కావడంతో శంతన కృష్ణన్‌ కలత చెందాడు. ఎప్పటికైనా సామాన్యుల సాంప్రదాయిక దర్వాజలకు సజీవ రూపమియ్యాలని అనుకునేవాడు.

వారసత్వ సంపద
శంతన ఇప్పటివరకు 80 చిత్రాలు గీశాడు. అన్నీ దర్వాజలకు సంబంధించినవే. ఒక్కో దర్వాజ ఒక్కో తీరుగ ఉంటుంది. అవన్నీ అతను చిన్నప్పుడు వాళ్ల వీధిలో, ఊళ్లో చూసినవే. ‘ఈ దర్వాజలు ఇంటికి మాత్రమే పరిమితమైనవి కావు. మన వారసత్వ సంపద’ అంటాడు శంతన్‌. దర్వాజలను పూజించడం, అందంగా అలంకరించడం అనేది ప్రాచీన సంప్రదాయమని చెబుతాడు. ఒక్క భారతదేశంలోనే ఇలాంటి ఆచారం కనిపిస్తున్నట్లు తన పరిశోధనలో తేలిందని చెప్పాడు. ‘నేను చిన్నప్పటినుంచి చూసిన రకరకాల దర్వాజలను నా కుంచెతో మరోసారి ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నాను. వందమంది వ్యక్తుల పెయింటింగ్స్‌ వేసినప్పుడు కలగని సంతృప్తి ఒక ఇంటికి సంబంధించిన నోస్టాల్జిక్‌ పెయింటింగ్‌ వేస్తే కలుగుతుంది’ అంటాడు శంతన్‌.

తలుపులతలపులు!

త్రీడీ ఎఫెక్ట్‌తో..
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారం ఉంటుంది. కానీ, అన్ని సంప్రదాయాల్లోనూ ఇంటిని పవిత్రంగా చూస్తారన్న విషయాన్ని శంతన్‌ తన పర్యటనల్లో గుర్తించాడు. భారతదేశమంతా అనేక పర్యాయాలు చుట్టేసిన అనుభవం తర్వాత.. మన సంస్కృతీ, సంప్రదాయాలను అధ్యయనం చేయాలనే ఆసక్తి ఏర్పడింది. తాను గీసిన 80 దర్వాజల కాన్వాస్‌ పెయింటింగ్స్‌లో 20కిపైగా అరుదైనవి ఉన్నాయి. ఇవన్నీ మధుబని శైలిలో గీసినవి. వీటిలోని ఒక్కో భాగాన్ని ఒక్కో ప్రాంతం నుంచి సేకరించాడు. త్రీడీ ఎఫెక్ట్స్‌తో ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శంతన ప్రతిభను సచిన్‌ టెండూల్కర్‌ నుంచి కమల్‌హాసన్‌ వరకూ చాలామంది మెచ్చుకున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తలుపులతలపులు!

ట్రెండింగ్‌

Advertisement