e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home బతుకమ్మ ఉస్మానియా క్యాంపస్‌లోఉదయించిన కిరణం

ఉస్మానియా క్యాంపస్‌లోఉదయించిన కిరణం

ఉస్మానియా క్యాంపస్‌లోఉదయించిన కిరణం


ఆయన పేరులో ‘అభినయం’ ఉంది. కానీ, ఆయన రాతలో సాహిత్యంపై తనకున్న ‘అభిమానం’ కనిపిస్తుంది. ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా..’ అని కదం తొక్కినా, ‘అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మలా సంబంధం’ అంటూ ఆత్మీయబంధానికి పదం కట్టినా ఆయనకే చెల్లింది.ఉద్యమగేయాలే కాదు,ప్రణయగీతాల్లోనూ కొత్త ఒరవడిని దిద్దిన సినీకవి అభినయ శ్రీనివాస్‌.

ఉద్యమగీత కర్తగా, సినీగేయ రచయితగా సుపరిచితుడైన అభినయ శ్రీనివాస్‌ది ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు. బ్రహ్మచారి, నర్సమ్మ దంపతులకు 1977 జనవరి 23న జన్మించారు. అసలు పేరు దొంతోజు శ్రీనివాసాచారి. ‘అభినయ’ తన కలం పేరు. దాన్నే ఇంటిపేరుగా మార్చుకొన్నారు. నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌, తిరుమలగిరిలోని ప్రగతి కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చేశారు. ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’లో ఉద్యోగం చేశారు. జిల్లా, రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో వందల ప్రదర్శనలిచ్చారు. అనేక బహుమతులు అందుకున్నారు.

‘నిరీక్షణ’తో ఆరంభం
2005లో వచ్చిన ‘నిరీక్షణ’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు శ్రీనివాస్‌. ఇందులో ‘దేఖో దేఖో భాయ్‌’ అనే పాటతో ‘ధనమూలం ఇదం జగత్‌’ అనే ఆర్యోక్తిని గుర్తు చేశారు. డబ్బు విలువను ప్రతి ఒక్కరికీ తెలియజేశారు.

‘నవవసంతం’(2007)లో రాసిన ‘చూశా చూశా..పున్నమి వెన్నెల్లో నిన్నే చూశాను’ అనే పాట ప్రణయ సౌందర్యాన్ని చూసిన కలల హృదయాన్ని తెలియపరుస్తుంది. ఈ పాటలోని ‘నువ్వు నాలోనే సగమైతే నన్నే కొత్తగ చూశాను’ అనే పంక్తుల్లో ప్రేయసిని తనలో నిలుపుకొన్న ప్రేమికుడి ఆనందానుభూతిని ప్రకటింపజేశారు. ప్రేయసీప్రియుల వలపు ప్రయాణంలో వారిరువురి హృదయాలు చవిచూసిన మధురస్వప్నాలను కనులముందు ఆవిష్కరింపజేశారు అభినయ శ్రీనివాస్‌. ‘తుపాకీ రాముడు’(2019) లో రాసిన ‘నా సిన్ని రామయ్య కొడుకా అమ్మనైతిరా ఏ తల్లి గన్నదిరా నిన్ను నాకు తోడుగా’ అనే పాట అమ్మ ప్రేమ మాధుర్యాన్ని గుర్తు చేస్తుంది. కడుపున పుట్టకపోయినా తనకు ఓ వరంలా దొరికిన పసివాడిని అల్లారుముద్దుగా, కొడుకులా కాచుకుంటున్న తల్లి హృదయాన్ని ఆవిష్కరింపజేస్తుందీపాట. ‘గుడిసె గుండెలో వెలుగై నిండినావురా పేగు బంధమేలేని ప్రేమమనదిరా’ అనే పంక్తుల్లో పేగుబంధమే తల్లిప్రేమను చాటి చెప్పదని, అనురాగంతో చేరదీసే ప్రతి దేవతా అమ్మేననే సందేశం దాగుంది.

ఆత్మీయ గీతాల్లోనూ..
ప్రణయగీతాలు, మాస్‌ సాంగ్స్‌ మాత్రమే కాదు, అన్నాచెల్లెండ్ల అనుబంధాన్ని చాటే ఆత్మీయగీతాలనూ శ్రీనివాస్‌ అద్భుతంగా రాయగలరని నిరూపించింది 2008లో వచ్చిన ‘గోరింటాకు’ చిత్రం. ఇందులో ఈయన రాసిన ‘అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మజన్మలా సంబంధం’ పాట అప్పట్లో ఓ సెన్సేషన్‌. ఇప్పటికీ ప్రతి అన్నా, చెల్లి పాడుకునే ఆత్మీయ గీతమిది. రక్తసంబంధం గొప్పతనాన్ని ఎంతో హృద్యంగా వివరించారీ పాటలో. రాఖీపండగ వస్తే ప్రతి ఇల్లు, ప్రతి గుండే ఈ పాటతోనే మోగిపోతుంది. ‘భీమిలీ కబడ్డీ జట్టు’(2010)లో శ్రీనివాస్‌ రాసిన ‘పదపదమని తరిమినదే.. నిను చేరగ నన్నే నా హృదయం’ అనే పాట పరవశమొందేలా ప్రణయబంధాన్ని వ్యక్తపరుస్తుంది. ఇదే సినిమాలో ‘కబడ్డీ కబడ్డీ’, ‘నిడదవోలు పిల్లా’ పాటలూ రాశారు. ‘వీర’(2011) సినిమాలోని ‘వీర వీర.. ఏక్‌ బార్‌ ఏసుకోరా తీన్‌మార్‌’ పాటకూడా ప్రతి ఒక్కరినీ మురిపించింది. చిరంజీవి ‘ఖైదీ’ సినిమాలోని ప్రసిద్ధ ‘రగులుతుంది మొగలిపొద’ పాటకు, కొన్ని మార్పులు చేసి ‘పున్నమి నాగు’(2009) కోసం తిరిగిరాశారు. ‘అధి నేత’(2009)లో ‘జనగణ నేత మన అధినేత’ అంటూ సమాజాన్ని మార్చడానికి వచ్చిన నాయకుడిని అభివర్ణిస్తూ స్వాగతగీతాన్ని అందించారు. నాయకుడి ఉత్తమ గుణాలను ఈ పాటద్వారా వివరించారు. ఇదే సినిమాలో‘ప్రేమంటే అదో ఇది’ అనే పాటనూ రాశారు.

శిఖరానికెక్కించిన ఉద్యమం
మలిదశ ఉద్యమ సమయంలో శ్రీనివాస్‌ రాసిన ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా.. వీర తెలంగాణమా’ పాట యావత్‌ తెలంగాణను ఉర్రూతలూగించింది. తెలంగాణ ఉద్యమగీత కర్తగా ఆయన పేరును శిఖరానికెక్కించింది. ఈ పాటను ‘పోరు తెలంగాణ’(2011)లో వాడుకున్నారు. ఇదే సినిమాలో ‘ఎంత సాహసమైంది’ అనే పాటనూ రాశారు శ్రీనివాస్‌.

‘ఐఐ’(2012)లో ‘ఇది నిజమే.. ఇదివరకెరుగని పరవశమే’ పాట యువ హృదయాలను కొల్లగొట్టింది. ‘కాకతీయుడు’(2019) కోసం శ్రీనివాస్‌ రాసిన ‘నీలవేణి అలివేణి’ పాట ప్రణయగీతాల వరుసలో ప్రత్యేకంగా నిలిచింది. ఇందులోని ‘చెలి చూపులే వరం వరం.. నను తాకెలే నిరంతరం’ అన్న పంక్తులు, సొగసైన ప్రణయాను భూతిని అందించాయి. ‘మా ఊరి మహర్షి’(2012)లో ‘వసంతమే అనిపించావే.. ఒంటరిని చేశావే’ అనే విరహగీతం రాశారు. ఇవే కాకుండా సమర్థుడు, నచ్చావ్‌ అల్లుడు, ఝలక్‌ ..మొదలైన సినిమాల కోసం వీనులవిందైన పాటలను అందించారు. తెలుగువారి కోసం ఎన్నో జనరంజకమైన సినీపాటలను రాసిన అభినయ శ్రీనివాస్‌, నిజంగానే ‘ఉస్మానియా
క్యాంపస్‌లో ఉదయించిన కిరణమే! ఆయన కలం నుంచి మరిన్ని మంచిగేయాల్ని ఆశిద్దాం.

-తిరునగరి శరత్‌ చంద్ర ,6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉస్మానియా క్యాంపస్‌లోఉదయించిన కిరణం

ట్రెండింగ్‌

Advertisement