e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడే ఓ తాపసి తారసపడతాడు. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు. కానీ, రాజ్యంలో మాత్రం అనిశ్చితి, యుద్ధ భయం! ఓ వైష్ణవ వృద్ధుడితో సంభాషణ రాజు అంతర్నేత్రాలను తెరిపిస్తుంది.

తన శక్తినంతా ఉపయోగించి, కొండగుహకు అడ్డంగా ఉన్న రాయిని బలంగా తోయడానికి ప్రయత్నించాడు త్రిభువన మల్లుడు. ఊహూ.. అది ఇసుమంత కూడా కదల్లేదు.
‘ఏమిటీ పరీక్ష?’తాను రాజవంశీకుడు. చిన్ననాటి నుంచే యుద్ధవిద్యల్లో, గొప్ప శిక్షణ పొందినవాడు. మదపుటేనుగును దంతాలు పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేయగలడు. కోటబురుజులపై నుంచి విసిరిన గండు శిలలను గుండెలమీద నిలుపగలడు. అటువంటి తనకు ఈ చిన్న రాయిని పక్కకు జరపడానికి సాధ్యం కావడం లేదెందుకని?అది చూసి నవ్వాడు.. ఆ వైష్ణవనామాల వృద్ధుడు.
“నిన్ను.. నీ ఆవేశాన్ని చూసి, ఏ మహారాజువయ్యుంటావో అనుకున్నా! చూస్తుంటే నువ్వూ నాలాగే కనిపిస్తున్నావు. కాకపోతే నేను ముసలివాణ్ణి. నువ్వు యువకుడివి. అయితే, ఒక పని చేద్దాం.. కొండ కిందనుంచి కొంతమందిని పిలిపించి ఈ రాయిని పక్కకు జరిపిద్దాం” అన్నాడు ఆ వృద్ధుడు.
ఆ వృద్ధుడి నవ్వు.. మాటలను సహించలేకపోయాడు త్రిభువనుడు.

“ఆపు! నీ వయసును చూసి ఊరుకుంటున్నా! ఎవరనుకున్నావ్‌ నన్ను. త్రిభువనమల్లుడి పేరు విన్నావా? నరసింహస్వామి దర్శనం కోసం కోటనుంచి బయటికొచ్చి భక్తిబాట పట్టాను. మమ్మల్నా నువ్వు హేళన చేసేది? ఒక్క కనుసైగతో నీ జీవితాన్ని మార్చగలను” కోపంగా హెచ్చరించాడు.
“ఓహో.. అంతటి గొప్పవాడివా? కొండమీదున్న రాయిని కదపలేక పోయావ్‌. కథలు మాత్రం చెప్తున్నావ్‌.. త్రిభువనమల్లుడంటే మూడు భువనాలను అంటే.. ముల్లోకాలనూ జయించినవాడని కదా! మంచి బిరుదే పెట్టుకున్నావ్‌. వెళ్లిపో! శ్రీ నారసింహుడి దర్శనం నీతో కాదు. వచ్చిన దారినే వెళ్లు. కోటలో భద్రంగా కూర్చొని.. స్తోత్ర పాఠాలు చెప్పించుకో..” హేళనగా పలికి, వెళ్లబోయాడు వృద్ధుడు.

“ఆగు!” గట్టిగా, దాదాపు అరిచినంత పని చేశాడు త్రిభువనుడు.
“ఈ భువనగిరి సామ్రాజ్యానికే నేను చక్రవర్తిని, నారసింహుడి దర్శనం చేసుకొని, తరించి.. నా రాజ్యంలోని ప్రజలందరికీ స్వామివారి దర్శనం ఇప్పించాలని సంకల్పించాను. నాది అహంభావమా? అజ్ఞానమా? అసమర్థతా? నాకు అర్థం కావడం లేదు. కొండగుహకు అడ్డుగా ఉన్న రాయిని జరిపే చిన్నపాటి శక్తికూడా నాకు ప్రసాదించలేని దేవుణ్ని నేనెందుకు మొక్కాలి?”
.. ఆవేశం, ఆవేదన కలగలిసిన స్వరంతో ప్రశ్నించాడు త్రిభువనుడు.
“అయితే ఇప్పుడేం చేద్దామని?” నవ్వుతూనే అడిగాడు వృద్ధుడు.

“అష్టకష్టాలు పడైనా.. దైవదర్శనం చేసుకోవాలనుకున్నాను. నేను అనుకుంటే సరిపోదనీ, ఆయన అనుగ్రహం నాపైన ఉండాలనీ నాకర్థమైంది. ఇప్పుడు ఆ అనుగ్రహం నాపైన లేదనికూడా అర్థమైంది. ఈ భూభాగానికి రాజునైనా.. ఇక్కడ నా శాసనం పనికిరాదు. స్వామి దయవుంటే గుడి కట్టి, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించి, నా భక్తిని చాటుతూ శిలాశాసనం వేయించాలనుకున్నాను. నాకు దర్శనాన్ని వద్దనడమే శిలారూపంలో ఉన్న నారసింహుడి శాసనమేమో! అవనిని జయించగలిగే శక్తి ఉన్న జగజ్జేతకూడా అలవికాని చోట అధికులమనరాదు.. అని తెలుసుకున్నాను. మీరెవరో? ఇక్కడికెందుకు వచ్చారో? నాకు తెలియదు. కానీ, దేవుడు సర్వాంతర్యామి కనుక మీకు చెప్పినా, నాకు నేను చెప్పుకున్నా ఆయనకు తెలుస్తుంది. కనుక చెప్తున్నాను. యుద్ధరంగంలో నేను విజేతను. కానీ, భక్తిపథంలో పరాజితుణ్ణే! ‘నమో నారసింహా’ అని దండం పెట్టి వెళ్లి పోవడం తప్ప వేరే మార్గం లేదు”

నిరాశా పూరితమైన త్రిభువనుడి మాటలు విని ఒక్క క్షణం ఆలోచించాడు ఆ వృద్ధుడు.
“నాయనా.. త్రిభువనా! నీ బాధ నాకర్థమైంది. ఎంత ప్రయత్నించినా అనుకున్న లక్ష్యం నెరవేరనప్పుడు మనసుకు కష్టం కలుగుతుంది. ఇష్టం లేకపోయినా సమయం నష్టపోయామని తెలిసినప్పుడు వెనుకడుగు వేయాల్సి వస్తుంది”
“ఇప్పుడు నా పరిస్థితీ అదే..” స్పష్టం చేశాడు త్రిభువనుడు.
“తెలుస్తున్నది.. కానీ, ఒక కోటను కట్టడానికి ఎంత సమయం పడుతుందో, ఎన్ని వ్యయప్రయాసలు అవసరమో ఒక అంచనా ఉంటుంది. దుక్కిదున్ని విత్తనాలు చల్లిన తర్వాత ఎంత కాలానికి పంట చేతికి వస్తుందో ఒక లెక్క ఉంటుంది. విజయమో వీరస్వర్గమో తెలియక పోయినా యుద్ధం ఎంత కాలం చేయవలసి వస్తుందో ఒక ఊహ ఉంటుంది. కానీ, భక్తి అనే విత్తనం హృదయంలో ఎప్పడు నాటుకుంటుందో, మహావృక్షమై ఎప్పటికి అది ఫలితాన్నిస్తుందో ఎవరూ చెప్పలేరు..”
వృద్ధుడి మాటలు తనకు అంగీకారం కాదన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు త్రిభువనుడు.
“మనలో భక్తి అంటూ ఉంటే దానికి పరిపక్వత ఉంటుంది. భక్తుడి మనసులో భక్తి సంపూర్ణంగా లేదని, భగవంతుడు భావిస్తే అది ఎప్పటికీ ఫలించదు. నిష్ఫలమైన ప్రయత్నాన్ని కొనసాగించడం కంటే కోటకు తిరిగి వెళ్లిపోవడం ఉత్తమం అనుకుంటున్నాను.”

నారసింహ దేవుడే దయ చూపనప్పుడు ఇంకా తనెందుకు ఇక్కడ?
వెళ్లిపోవాలి. తన రాచనగరుకే వెళ్లిపోవాలి.
తన మాతృమూర్తి గుర్తుకొచ్చింది. అమ్మ ఎప్పుడూ చెప్పేది.
మనకు ఏదీ అసాధ్యం కాదు అనుకోవాలి. సాధించాలి. కానీ, కొన్ని ఎన్నటికీ సాధ్యం కావు. అటువంటివి ఉంటేనే మనం దేవతలం కాదనీ, భూమ్మీద మనుషులమనీ గుర్తు తెచ్చుకుంటాము. అవీ ఉండాలి.
‘లక్ష్యం’లో నిస్వార్థం ఉండాలి. సాధనలో స్వార్థం ఉండాలి. అహం ఉండాలి. అది వ్యక్తిగతం కాకుండా సామూహిక శక్తిపరమై ఉండాలి.
శ్రీ నారసింహుడి దర్శనం తన లక్ష్యం. అది నిస్వార్థం.
సాధన తన స్వార్థం! మార్గం అసాధ్యమైనప్పుడు, ఇప్పుడు అహం అక్కర్లేదు.
అందుకే, వెనుకకు మళ్లాలనుకోవడం! మరలి వెళ్లడమే మంచిది.
“అంటే.. దర్శనం పొందకుండానే వెళ్లిపోతావా?”
“తప్పదు”
“త్రిభువనా! నీది సంకల్పమా, ప్రయత్నమా?”
“సఫలమైతే సంకల్పం.. విఫలమైతే ప్రయత్నం.. ఇంకా చెప్పాలంటే నాది విఫల ప్రయత్నం”
“అంటే..?”
“నేనేదో గుడి కడదామనుకుంటే.. మూలవిరాట్టు దర్శనమే లేకుండా కొండగుహకు పెద్దరాయిని అడ్డంగా పెట్టాడు నా దేవుడు. నేనేం చేయగలను. వెనక్కి వెళ్లడం తప్ప!”
ఇటువంటి మాటలు వినలేనట్టు.. చెవులకు రెండు చేతులూ అడ్డం పెట్టుకున్నాడు ఆ వృద్ధుడు.
“సంకల్పం నెరవేరాలంటే సాధన గట్టిగా ఉండాలి. సాధన చేయాలంటే సాహసం ఉండాలి. అంతు తెలియని సహనం ఉండాలి. ఎదురు చూడాలి. అనుకున్నది నెరవేరేదాకా దృష్టి మరల్చకూడదు”
“అది అసాధ్యం..”
“కాదు.. అది సాధ్యం” అంతకన్నా గట్టిగా అన్నాడా వృద్ధుడు.
అలా అంటూనే.. కనులముందు ఏదో అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టు, తనదైన ప్రపంచంలోకి వెళ్లిపోయాడు ఆ వృద్ధుడు.
“నీకు తెలుసా? ఆ మహాత్ముడు.. ఈ కొండపైన నడయాడిన మహాపురుషుడు. స్వామివారి దర్శనం కోసం ఎంత వేచి చూశాడో.. నీకు తెలుసా?” ప్రశ్నించాడు మళ్లీ.
అర్థం కానట్టుగా చూశాడు త్రిభువనుడు.
“చిన్నప్పటి నుంచి నరసింహా.. నరసింహా.. అని కలవరించి తిరిగేవాడు. శ్రీ నరసింహస్వామి వారిని కనులారా దర్శించాలని కలలు కన్నాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. తీర్థాలు, క్షేత్రాలు, పర్వతశ్రేణులు, నదీనదాలు.. ఒకటి కాదు ప్రతిచోటా వెతికాడు. అంతటా ఉన్న స్వామి.. ఆయనకు ఎక్కడా దర్శనం ఇవ్వలేదు..” అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆ వృద్ధుడు.
“ఎవరి గురించి స్వామీ మీరు చెప్పేది? ఎవరా మహాభక్తుడు? చివరికి ఆ భక్తాగ్రేసరుడికి స్వామి దర్శనం ఇచ్చాడా?” అడిగాడు త్రిభువనుడు.
“అంత త్వరగా దర్శనం ఇస్తాడా లీలా నారసింహుడు. ప్రళయకాల సమయం లాంటి హిరణ్యకశిపుడి సంహారం తర్వాత తనకనువైన కొండగుహలో కొలువుతీరాడు స్వామి. అదంతా ఒక పెద్ద కథలే! ఇప్పుడు మన కథలో కొద్దాం. ఎవరు, ఎవరని అడిగావు కదూ! ఆ పుణ్యపురుషుడు.. మహారుషి పుంగవుడు యాదర్షి మహర్షి!”
‘యాదరుషి’ పేరు వినిపించగానే సమస్త ప్రకృతి ఒక్కసారిగా పులకాంకితమయ్యింది. ‘యాదర్షి’ పేరు కొండల గుండెల్లో మార్మోగింది.

అప్పుడు ఆ నామాల పెద్దాయన.. సుస్వరనాదంతో శ్రావ్యంగా పలికాడు.
“సత్యం విధాతుం నిజభృత్య భాషితం
వ్యాప్తంచ భూతేష్వఖిలేషు చాత్మనః
అదృశ్యతాద్భుత రూపముద్వహన్‌
స్తంభే సభాయాం నమృగం.. నమానుషం
..అని ‘మహాభాగవతం’లో చెప్పినట్టు ప్రహ్లదుడివంటి నిజభక్తుడితో సత్సాంగత్య సంభాషణం నెరిపేవాడు. అద్భుతమైన రూపంతో విరాజిల్లుతూ భక్తకోటిని కాపాడేవాడు. శ్రీ లక్ష్మీ నారసింహుడు అంత త్వరగా దర్శమిస్తాడా? యాదర్షి తన జీవితకాల తపంలో ఎంతో సమయాన్ని వెచ్చించాడు. సహనంతో వేచి చూశాడు”
“మహానుభావా! యాదర్శి సంకల్పం ఎలా నెరవేరింది? అసలు ఈ యాదర్షి ఎవరి కుమారుడు? అంతటి జన్మ సంస్కారం అతనికి ఎలా ఏర్పడింది?” అత్యంత సుమధురమైన యాదరుషి వృత్తాంతాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో అడిగాడు త్రిభువనమల్లుడు.
వృద్ధుడి వదనంలో చిన్న చిరునవ్వు మెరిసింది.
“వెనక్కి వెళ్లిపోతాను.. ఇది విఫలయత్నం. ఇంక నావల్ల కాదని కాడి దించేసి, కొండ దిగి వెళ్లిపోతానంటివి కదయ్యా! నీవు కోరుకున్నప్పుడు నీకు దర్శనం ఇవ్వడానికి నారసింహుడేమన్నా నీ ఆస్థాన జోతిష్కుడా? నీ ఆశ్రయాన్ని పొందిన పండితుడా? స్తంభంలో దాగిన సింహదేవుడు. అవసరమై అందులోంచి బయటికొచ్చాడు గానీ, అన్నిట్లోనూ ఆయనే కదయ్యా సర్వాంతర్యామీ! మరి, అంత సులభంగా దర్శనమిస్తాడా? అందులోనూ నీలాంటి లౌకిక వ్యవహారాల్లో తలమునకలయ్యేవాడికి. వెళ్లిపోతానన్నావుగా! వెళ్లిపో.. నారసింహుణ్ణి ఇక కలలో కూడా దర్శించలేవుగా.. పాదాలదాకా వచ్చావు ప్రయత్నిస్తే దర్శనం దొరికుండేదేమో! ప్రయత్నం వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లి పోతానంటున్నావు. పట్టుదల లేని నీవంటి భక్తులు స్వామికి లేకపోతే.. యేం నష్టం లేదులే..!”

వృద్ధుడి మాటలు త్రిభువనుడిని గాయపరిచాయి.
“నిజంగా నీవంటి అహంభావి ఇంతవరకూ రావడం చాలా ఆశ్చర్యకరం. స్వామివారి దయ, అనుగ్రహం నీ మీద లేకపోతే నువ్విలా ఉండేవాడివా? చూసుకో నీ శరీరాన్ని. అడుగు నీ మనసును. తెలుసుకో వాస్తవాన్ని! ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు. అసలు ఉన్నావో, పోయావో అనే పరిస్థితిలో కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చావు. సుడిగాలికి రెపరెపలాడే నీ ప్రాణదీపం మినుకు మినుకుమంటున్న దశలో, నీ దశను మార్చాడు నా దేవదేవుడు.. నా నారసింహుడు. ఏమయ్యాయి నీ గాయాలు? ఎలా మాయమయ్యాయి రక్తపు చారికలు? ఎక్కణ్నించి వచ్చింది మళ్లీ నీ ఒంట్లోకి ఊపిరి? ఆయనే ఇచ్చాడు. నా నరసింహుడే నీకు మళ్లీ జన్మ యిచ్చాడు. ఎందుకో తెలుసుకో..” ఆగి స్వామిని ధ్యానించాడు వృద్ధుడు.
నిజమే!
ఈ జ్ఞానవృద్ధుడు పలికిన ప్రతీ మాట అక్షర సత్యమే. ఏదీ కాదనడానికి లేదు.
ఆగిపోయిన శ్వాసను, ఎగిరిపోయిన ఊపిరిని, స్తంభించిన హృదయాన్ని మళ్లీ చైతన్యవంతం చేసింది ఈ దేవదేవుడే! ఏ మాత్రం సందేహం లేదు. తను ఉన్నాడు అంటే, బాగున్నాడు అంటే అందుకు కారణం నారసింహుడే!
“నాకు పునర్జన్మ ఇచ్చింది శ్రీ నారసింహుడే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. నేను ఆయన్ని మనసా వాచా కర్మణా నమ్ముతున్నాను. కానీ, స్వామివారు నన్నూ, నా భక్తిని నమ్మాలి కదా! అది నా చేతుల్లో లేదు కదా!” ఆవేశంగా అన్నాడు త్రిభువనుడు.
“నిన్ను చూస్తే నాకు నవ్వొస్తున్నది. ప్రతి జన్మకూ ఒక అర్థం ఉంటుంది. అలాగే, ప్రతి పునర్జన్మకూ అంతకన్నా గొప్ప పరమార్థం ఉంటుంది. చక్రవర్తీ! నీవల్ల ఈ రాజ్యప్రజలకు ఎంతో మేలు జరగాల్సి ఉందేమో! వారి క్షేమం కోసమే స్వామివారు నీ క్షేమాన్ని కోరారేమో! నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారేమో!”

ఆయన మాటలు.. ఇప్పుడు అర్థమయ్యాయి.
త్రిభువనుడి కంట్లో కన్నీరు ఉప్పొంగింది.
ఆనందం.. స్వామి పేరు తలిస్తే పరమానందం.
“అయ్యా.. ఈ సంతోషానికి కారణం నేను బతికి ఉండటం కాదు. నేను బతికి ఉండటానికి కారణం పదిమంది మేలు కోసం అని మీరన్నారే.. అందుకు ఈ ఆనందం! ఇంకోమాట, నేను వెళ్లి పోతానన్నది కష్టాలకు భయపడి కాదు. స్వామివారు పిలిచినప్పుడే మళ్లీ వద్దామని..”
ఆయన కంఠస్వరం రుద్దమయింది.
అప్పుడు వినిపించింది.. తీవ్రస్థాయిలో ఒక శబ్దం!
అది సింహగర్జన!
‘వేయి సింహాలు ఒకేసారి ఆ కొండపైకి పరుగు పరుగున వస్తున్నాయా..?’ అన్నంత మహోన్నతమైన సింహగర్జన..

[email protected]

(మిగతా వచ్చేవారం)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement