ఆయన పాటలు యువతరాన్ని ఆకట్టుకునే సమ్మోహనాస్ర్తాలు. ప్రణయగీతాలైనా, జానపద గేయాలైనా ఆ కలానికి సలాం కొట్టాల్సిందే. భావావేశాన్ని, ప్రణయానుభూతిని పొదుగుకున్న ఆ పదాలు నవతరాన్ని ఉర్రూతలూగిస్తాయి. ఆయనే.. చిత్రసీమలోని ఆల్ రౌండర్ బల్లెం వేణుమాధవ్. తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు బల్లెం వేణుమాధవ్. కవిగా, గీత రచయితగా, గాయకునిగా, దర్శకునిగా, నటుడిగా బహుముఖీన ప్రతిభను చాటుతున్నారు. వేణు స్వస్థలం సికింద్రాబాద్‌లోని లాలాపేట. బల్లెం రంగస్వామి, కస్తూరిదేవి అమ్మానాన్నలు. 1972 జూలై 27న వేణుమాధవ్ జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబం కొన్నేండ్లపాటు మహారాష్ట్రలోనే ఉండాల్సి వచ్చింది. అక్కడే వేణుమాధవ్ విద్యాభ్యాసం సాగింది. తర్వాత నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో, హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో హైస్కూల్ చదువులు చదివారు. నిజాం కళాశాలలో బీఏ, ఉస్మానియా విశ్వవిద్యాలయలో ఎంఏ (పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్) చేశారు.
తల్లినుంచే..
వేణుమాధవ్ తల్లి కస్తూరిదేవికి పఠనాభిలాష ఎక్కువ. రంగనాయకమ్మ నవలలోని ఓ పాత్ర ప్రభావంతోనే తన కుమారునికి ‘వేణుమాధవ్’ అని పేరు పెట్టుకున్నారు. అలా తల్లినుంచి అక్షర వారసత్వాన్ని అందుకున్నారు. ఆరో తరగతి నుంచే తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. వేణు రాసిన ‘కోతియుక్తి’, ‘శాసనం’ వంటి కథలు బాలచంద్రిక, స్రవంతి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తర్వాత ఆలిండియా రేడియోలో కవితా గానం చేశారు.
నటుడు కాబోయి..
బాల్యం నుంచి సాహిత్యాభిలాష ఉన్నా నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వేణుమాధవ్. సినిమాల్లో నటుడిగా రాణించాలని వచ్చి రచయితగా స్థిరపడ్డారు. 1988లో
‘కపాల భైరవి’ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి కథా సహకారం అందించారు. వల్లభనేని జనార్దన్ దర్శకత్వంలో వచ్చిన ‘మీకోసం’ సినిమాకు మాటల రచయితగా పనిచేశారు. ఆ తర్వాత సినీపాటల రచయితగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినీరచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జాబిలమ్మ..
2002లో వచ్చిన ‘హంతకురాలు’ సినిమాతో తన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించారు వేణుమాధవ్. ‘జాబిలమ్మ జంట చేరేనమ్మ.. వెన్నెలమ్మ వెంట వచ్చేనమ్మా’ అనే ప్రణయగీతంతో గేయ రచయితగా పరిచయమయ్యారు. ప్రేయసీప్రియుల వలపు తలపులను ఈ పాటలో ఎంతో రమణీయంగా చెప్పారు. పాటలోని ప్రతి పదంలోనూ భావుకతను ప్రదర్శించారు. ‘వలపుల వాకిట్లో వందనాలు చేద్దామా! తలపుల కౌగిట్లో తందనాలు వేద్దామా!’ అనే పంక్తుల్లో ప్రణయ భావావేశాన్ని ఎంతో అందంగా లిఖించారు. ఇదే సినిమాలో వేణుమాధవ్ రాసిన ‘ఎదలో ఈవేళ ఎగిసింది జ్వాల.. రగిలింది హేల ఈవేళ..’ పాటద్వారా, పగతో రగిలిన జీవితాల్ని కండ్ల ముందుంచారు. ‘ఈ తీర్పు ఇల్లాలిది’ (2008) సినిమాకోసం మరో ప్రణయగీతం అందించారు వేణుమాధవ్. ‘వలపు వెన్నెల కాసి చిలిపి ఊహకు మురిసి.. విరహవేదన తెలిసి.. ఎదురుచూసితిని..’ అంటూ గొప్ప ప్రణయానుభూతిని పొదుగుకున్న మరో పాటను అందించారు. ప్రేయసీప్రియుల హృదయాల్లో పురులు విప్పుకొన్న ప్రేమ సౌందర్యాన్ని ఎంతో ఇంపుగా చెప్పారీ పాటలో.
జానపదాల్లోనూ..
భావ గంభీరమైన గీతాలే కాదు, జానపద పలుకుబళ్లనూ వేణుమాధవ్ గొప్పగా పలికించగలరని ‘నన్ను ప్రేమించవా?’ సినిమా నిరూపించింది. ఈ చిత్రంలో ‘జమాజమా పిల్లరో! జామకాయలమ్మెరో!’ పాట స్వచ్ఛమైన యాసను పొదుగుకొని జానపద శైలిలో హుషారుగా సాగుతుంది. ‘నడుస్తుంటె నడుమురో! నకరాలు జేసెరో! నెత్తిమీద గంపరో! నవ్వుకుంటు దింపెరో!’ వంటి వాక్యాలు యువకుల్ని ఆకట్టుకునే సమ్మోహనాస్ర్తాలు. ఈ పాటలోని ‘జమా..జమా’, ‘నకరాలు’ వంటి పదబంధాలు జానపద సొగసుతో రవళించేవే. ఇదే చిత్రంలో ‘గాలి మోసెనే నీ పరిమళాలను.. నన్ను మోయనీ నీ పాదధూళిని..’ అంటూ మధురాతి మధురమైన మరో గీతాన్ని అందించారు. ఈ పాటలో లాలిత్యంగా సాగే కవితాభివ్యక్తి అబ్బుర పరుస్తుంది. ‘వెలుతురన్నదే నీ రూపమేనని.. విరహచీకటి ఇక మాయమవ్వని..’ లాంటి పంక్తుల్లో చెలిరూపం వెలుగులు విరజిమ్మితే, ఆ వెలుగుల ప్రవాహానికి విరహమనే చీకటి తొలగిపోక తప్పదని చెప్పడం గొప్ప భావన. ‘నన్ను ప్రేమించవా! తేనె చిందించవా! నన్ను మురిపించవా! ముందుకు నడిపించవా!’ అంటూ ప్రణయరథమెక్కి ఊరేగుతుందీ పాట. ఇదే సినిమాలో వేణుమాధవ్ రాసిన ‘స్వప్నాల సాగరాలే దాటేసి వెళ్తే స్వర్గతీరం’ అనే పాటకూడా బహుళ జనాదరణ పొందింది.
ఆల్ ఇన్ వన్‌గా..
..ఇవే కాకుండా ‘ఫ్యామిలీ బ్లూస్’, ‘కలలు కనే చెలియా!’, ‘ప్రేమ గులాబి’ మొదలైన ఎన్నో సినిమాలకు పాటలు రాశారు వేణు. పలు చిత్రాలకు మాటలుకూడా అందించారు. చిత్రసీమకు ఆయువు పట్టయిన 24 ఫ్రేమ్స్‌లో (కళల్లో) ఆరితేరారు బల్లెం వేణుమాధవ్. కొన్ని చిత్రాలకు తానే దర్శకత్వం వహించడంతోపాటు కథ, మాటలు, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అలా గిన్నెస్ బుక్‌లోనూ స్థానం సంపాదించుకున్నారు. సినిమాపాటలతోపాటు ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్ చేశారు. ‘బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్’ను నెలకొల్పి, విశేష సేవలందించిన కళాకారులకు పురస్కారాలు అందిస్తున్నారు వేణు.
-తిరునగరి శరత్ చంద్ర ,6309873682