e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home కథలు కర్మకాండ

కర్మకాండ

కర్మకాండ

మార్నింగ్‌ వాక్‌ ముగించుకొని ఇంటికొచ్చిన మనోహర్‌, షూ లేస్‌ విప్పుతుండగా ప్యాంటు జేబులోని మొబైల్‌ ఫోన్‌ రింగయ్యింది. చేతిలోకి తీసుకొని చూస్తే, తమ్ముడు సుధాకర్‌ నుండి కాల్‌. ఆత్రుతగా కిచెన్‌లోంచి బయటికొచ్చిన అర్ధాంగి కవితకు ఫోన్‌లో పేరు చూపిస్తూ, కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాడు. ఆవైపు నుంచి సుధాకర్‌ చెప్పిన మాటలకు మనోహర్‌ కండ్లు తడిసిపోయి, నీటిబొట్లు షర్ట్‌పై రాలుతున్నాయి.
‘అదే వార్తనా?’ అన్నట్లు భర్త కండ్లలోకి చూసింది కవిత.
‘ఔను’ అన్నట్లు చిన్నగా తలూపడంతో, దగ్గరికెళ్లి మనోహర్‌ను పొదివి పట్టుకుంది.
మనోహర్‌ తల్లి చనిపోయింది. ఎనభై ఏండ్లు దాటిన ఆవిడ ఉబ్బసంతో బాధపడుతూ, తెల్లవారు జామున తుదిశ్వాస విడిచింది.
సొంతూరిలో ఉంటున్న తల్లిని మనోహర్‌ చూసొచ్చి నాలుగు రోజులైంది. ఆరోగ్యం కాస్తా కుదుట పడ్డట్లు కనబడటంతో.. “కవితను తీసుకొని మళ్లీ వస్తాను” అని చెప్పి వచ్చాడు.
అమ్మకోసం మరణ శకటం సిద్ధమైందనిపించినా, దాని వేగం ఇంతలా పెరుగుతుందని ఆయన ఊహించలేదు. ముదిమి వయసు అంటేనే ఎప్పుడూ తుపాను హెచ్చరిక జెండా ఎగుర వేసినట్లే! చావు దోబూచులాటలో ‘ఆమె ఎంత కష్ట పడుతుందో? ఎందర్ని కష్ట పెడుతుందో?’ అనే బెంగనుండి ఆయనకు లభించిన ఊరట, విషాద మట్టాన్ని తగ్గిస్తున్నది.
కండ్లు తుడుకుంటూ కిచెన్‌లోకి వెళ్లిన కవిత నీళ్లగ్లాసు తెచ్చి, ఆయన చేతిలో పెడుతూ..
“బట్టలు సర్దేస్తాను” అని చెప్పి, బెడ్రూం వైపు నడిచింది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి వాష్‌ ఏరియావైపు వెళ్లింది.
పనిమనిషి వీరమ్మ కనబడలేదు. ‘బట్టలుతకడం మధ్యలో ఆపేసి ఎక్కడికెళ్లింది?’ అనుకుంటూ మెయిన్‌డోర్‌ దగ్గరికొచ్చింది.
డోర్‌ బయట కారిడార్‌లో కొంగుతో చేతులు తుడుచుకుంటూ నిలబడి ఉన్న వీరమ్మ…
“చావు ఇంట్లో పనిచేయనమ్మా” అన్నది ఇబ్బందిగా ముఖం పెడుతూ.
“చావు.. ఊర్లో కదా?..” నడుమ ఇదేం గోల అన్నట్లు అంది కవిత.
“పోయింది మీ సొంత మనిషే కదమ్మా.. అంటు మీకుండదా?” అని ఎదురు ప్రశ్న వేసింది వీరమ్మ.
“అంటు ముట్లేంటే తల్లీ!” అంటూ తలుపేసింది కవిత విసుగ్గా. సగం ఉతికిన బట్టలను దండెంపై వేస్తుండగా, పక్క ఫ్లాట్‌లోని అనసూయ మాటలు వినిపిస్తున్నాయి.
“బిరబిర వెల్లిపోతున్నవేందే.. మా ఇంట్లో పని చేయవా?” అంటున్నదామె.
‘చావు కబురు’ మెల్లగా ఆమెకు చెప్పినట్లుంది వీరమ్మ.“సరే.. సరే.. ఇంటికి పోయి శుభ్రంగా స్నానం చేసి రాపో” అని కసురుకుంటూ తలుపేసుకుంది అనసూయ.
అనసూయ, కవిత ఇద్దరూ మిత్రులనేకన్నా వారి మధ్య నాలుగేండ్ల పరిచయం ఉంది అనాలి. పిండివంటలు ఇచ్చి పుచ్చుకోవడాలు, రెండిండ్లకూ పనిమనిషి ఒక్కరే కాబట్టి.
‘వచ్చిందా? పోయిందా?’ అనే ముచ్చట్లు వారిమధ్య సాగుతుంటాయి. అనసూయ భర్త విశ్వనాథం, మనోహర్‌ ఇద్దరిదీ టీచింగ్‌ ఫీల్డే అయినా, పక్కపక్క ఫ్లాట్లు కొన్నాకే పరిచయం ఏర్పడింది.
బ్యాగు బయటపెట్టి మనోహర్‌ ఇంటికి తాళం వేస్తుండగా, కవిత తాము ఊరెళ్తున్నట్లు చెప్పడానికి అనసూయ వాళ్ల కాలింగ్‌ బెల్‌ నొక్కింది. తలుపు తెరుచుకోలేదు. మళ్లీ నొక్కింది. తలుపునకు జీవం రాలేదు. బ్యాగు తీసుకొని కవితవైపు వస్తున్న మనోహర్‌ మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. చూస్తే..
‘మీ తల్లి మరణానికి ప్రగాఢ సానుభూతి. రిప్‌ ఫ్రమ్‌ విశ్వనాథం’ అని ఉంది. మళ్లీ బెల్‌ కొట్టేందుకు సిద్ధపడుతున్న కవితను వారిస్తూ మెసేజ్‌ చూయించాడు.
‘ఆ తలుపు తెరుచుకోదు. నీ బెల్లుకు ఇదే సమాధానం’ అన్నట్లు సైగ చేస్తూ, పదమంటూ ముందుకు
నడిచాడాయన.

మూడు గంటలు ప్రయాణించి, వాళ్లు ఇంటికి చేరేసరికి సమయం తొమ్మిది దాటింది. మనోహర్‌కు సుధాకర్‌తోపాటు ప్రకాశ్‌ అనే చిన్న తమ్ముడున్నాడు.
తల్లికి కొరివి పెట్టేది చిన్నోడే. వరంగల్‌ నుండి ప్రకాశ్‌ రావడంతో, ఊర్లోనే ఉండే సుధాకర్‌ అంత్యక్రియల పనులు వేగిరం చేయడంలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మనోహర్‌ తర్వాత ఇద్దరు ఆడబిడ్డలు. వాళ్లు శవపేటికకు దగ్గరగా కుర్చీలు వేసుకొని కూచున్నారు. అప్పటికే దుఃఖభారంతో అలసి పోయినట్లున్నా.. అమ్మ చివరి చూపుకోసం వచ్చిన అమ్మలక్కలను పట్టుకొని తల్లితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి
ఏడుస్తున్నారు.
మనోహర్‌, కవితలను చూడగానే వారి శోకం కొత్తరాగం అందుకుంది.
“కొడుకులను కన్నావుగని అమ్మా.. వారి సేవకు నోచుకోలేదే అమ్మా”
“నాలుగు తరాల సంతతి నీదమ్మా.. నీకు నా అన్నవాళ్లే లేరమ్మా..”
“అందరూ నీ చావు కోరినోళ్లేనమ్మా..
నీ ఉసురు తగిలి పోతరమ్మా..”
..మనోహర్‌ వాళ్ల అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. ఆమె తొలికాన్పువల్ల సుమారు ఏడాదిపాటు వీళ్లు అక్కడే ఉండక తప్పలేదు. అంత దూరమైనా, మనోహర్‌ తల్లిని చూడ్డానికి రెండు మూడు నెలలకోసారి వచ్చి వెళ్లాడు.
చెల్లెండ్ల మాటలు విని తను సర్దుకుపోయినా, నలుగురిలో ఇలా అవమానించడం కవితకు ఇబ్బందిగా ఉందని గ్రహించాడు మనోహర్‌. సరాసరి సుధాకర్‌ దగ్గరికెళ్లి..
“మేమేం పాపం చేశామురా, ఏం విషపు మాటలివి?” అన్నాడు ముఖం చిట్లిస్తూ..
“దహనం అయ్యేదాకా ఓపిక పట్టు అన్నయ్యా. విననట్లే ఉండి, పని గట్టెక్కిచ్చుకుందాం..” అని అన్న గదవ పట్టుకొన్నాడు సుధాకర్‌. ‘సరే’ అని తల ఆడిస్తూ, కవిత దగ్గరికెళ్లి ఓపిక పట్టమన్నట్లు ఆమె తల నిమురుతూ ఇంట్లోకి వెళ్లాడు.
“ఎవరూ రాకండి. ఇక్కడ వసతులు లేవు. ఏదో హెల్త్‌ప్రాబ్లమ్‌ చెప్పి నేను కూడా రేపు వచ్చేస్తా..” అని గద్దించినట్లు ఫోన్‌లో మాట్లాడుతున్నది మనోహర్‌ పెద్దచెల్లి. ఆయన వాష్‌రూమ్‌లో ఉన్న సంగతి ఆమెకు తెలియదు. చిన్నప్పటి ప్రేమలు కాలంతోపాటు పెరగకుండా ద్వేషంగా, నలుగురిలో పరువు తీసేంత కసిగా ఎందుకు మారిపోతాయో అర్థం కాలేదు ఆయనకు.
పెండ్లిళ్లు కాగానే తోడబుట్టిన మగవాళ్లు మారిపోతారని ఆడబిడ్డలు, పెడ్లయి ఇన్నేండ్లయినా మీ వాళ్లు కనబడగానే ముఖం వెలిగిపోతుందని పెండ్లాలూ మగాళ్లని ఆడి పోసుకోవడం రివాజయింది. తల విదిలించుకొని బయటికి వచ్చాడు మనోహర్‌.
అమ్మకు స్నానం చేయించి, కొత్త వస్ర్తాలను చుడుతున్నారు. తలకొరివి పెట్టే ప్రకాశ్‌ తలపైనుంచి నీళ్లు కుమ్మరించుకొని కొత్త పంచె కట్టుకుంటున్నాడు.
ఈ వయసులోనూ అమ్మ పొద్దున్నే స్నానం చేసి, చక్కగా దువ్వుకొని హన్మాండ్ల సిందూరంతో నొసట నామంగా, చిన్నగా దిద్దుకొని, పెద్ద అరుగుమీద కుర్చీలో కూర్చొని, స్టూలుపై కాళ్లు చాపుకొని, ఇంటి ముందరినుండి వచ్చీపోయే వాళ్లను పేరుతో, వరసతో పలకరిస్తూ ఉండేది. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు అమ్మేవాళ్లంతా ఆమెకు ఆత్మబంధువులే. పొద్దున, సాయంత్రం టీతోపాటు బొంబాయి కారెలు తినడం అమ్మకు అలవాటు. చావు వార్త తెలియగానే వారంతా చివరి చూపుకోసం వచ్చినట్లు దూరంగా నిలబడ్డారు. కారెలమ్మే సాయబుకూడా సైకిల్‌ పక్కన పెట్టి, శవం దగ్గరిదాకా వచ్చి చూసి వెళ్తున్నాడు.
కుటుంబసభ్యులు వరసగా అమ్మ దగ్గరికెళ్లి నోట్లో తులసి ఆకుతో నాలుగు చుక్కల నీళ్లు పోస్తున్నారు. తన వంతు వచ్చేసరికి తల్లి జ్ఞాపకాలతో పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు మనోహర్‌. కవిత ఓదార్పుగా వెంట నడిచింది.
అమ్మ అంతిమయాత్ర మొదలైంది. నలుగురు మోసే కాలం పోయి మహాప్రస్థానం వాహనాలు వచ్చాయి. ‘నలుగురితో మంచిగా ఉండు’ అనే సామెత వట్టి పోయినట్లయింది. వాహనం వెనకాల ఆటోల్లో, మోటారు సైకిళ్లపై రావలసినవారు వచ్చారు.
చిన్న కొడుకు చేతులమీద దహన సంస్కారం పూర్తయింది. అక్కడే స్నానాలు చేసి, ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు అమ్మ జ్ఞాపకంగా అరుగుపై వెలిగించిన దీపానికి దండం పెట్టుకున్నారు. కేటరింగ్‌కు ఇచ్చిన భోజనం వచ్చింది. ససేమిరా తినలేమని కండ్లు తుడుకుంటున్న ఆడబిడ్డలను కవిత బతిమాలి నాలుగు ముద్దలు తినేలా చూసింది.
భోజనాలయ్యాక కొందరు సేద తీరగా, మనోహర్‌ తమ్ముళ్ల వద్దకెళ్లి జరుపవలసిన కర్మకాండల గురించి ప్రస్తావన తెచ్చాడు. ఎవరికీ ఇందులో పెద్ద అనుభవం లేదు. దహనం తర్వాత శ్మశానవాటికలోనే తోడొచ్చినవారికి మందు ఏర్పాటు చేయాలట. ఎవరూ గుర్తు చేయకపోవడంతో ఆ కార్యక్రమం జరగలేదు. ‘ఆచారాలు తెలియని మనుషులని’ మాట పడాల్సి వచ్చింది. మూడోరోజు పక్షికి పెట్టి, అక్కడే చెట్ల నీడన భోజనాలతోసహా మద్యం ఏర్పాటు చేద్దామని అన్నదమ్ములు నిర్ణయించుకొన్నారు. అమ్మ చనిపోయింది బుధవారం. శుక్రవారం పక్షికి పెడుతున్నామని యాభైకి పైగా బంధుమిత్రులకు ఫోన్లద్వారా సమాచారం అందించారు.
చెట్ల పక్కన వంటలు మొదలైనాయి. పన్నెండు దాటింది. వండిన పదార్థాలన్నిటినీ ఓ విస్తరిలో పెట్టి దూరంగా పక్షులు తిరిగే చోట పెట్టి వచ్చారు. కొద్దిసేపటికి ఓ కాకి వచ్చి విస్తరిలోని ఓ ముక్కను నోట కరచుకొని
వెళ్లిపోయింది.
పగలు రెండవుతున్నది. ఒక్కొక్కరుగా పది, పదిహేను మంది వచ్చారు. వచ్చినవారిని టెంట్లకింద టేబుల్‌ ముందు కూర్చోబెట్టి ప్లేట్లలో, గ్లాసుల్లో కావలసినవి సమకూర్చి మర్యాదలు చేస్తున్నారు. యాభైకి పైగా వస్తారనుకున్న మనుషుల జాడలేదు.
“ఏరా.. నారాయణ వస్తానన్నాడు రాలేదు..” అన్నాడు ఓ స్నేహితుడితో
మనోహర్‌.
“ఇవ్వాళ శుక్రవారం కదా. పలకరించడానికి ఎవరూ రారు. నిన్న, మొన్న కలిసిన వాళ్లే వస్తారు” అని సమాధానం.
“చావు భోజనమంటే చాలామంది వెనుకాడుతున్నారు మనోహర్‌! కొత్తింట్లోకి వెళ్లినవారు, పిల్లల పెండ్లిళ్లు చేసిన వాళ్లు ఏడాదిదాకా ఈ భోజనం ముట్టరు” అని తనకు తెలియని విషయం చెప్పారొకాయన.
“నీ మాట తీసేయలేక గోపాల్‌ వచ్చాడుగానీ, తింటలేడు. తాగుత లేడు. మిక్చర్‌ ప్యాకెట్‌ తెచ్చుకొని తింటున్నాడు” అంటూ వేలెత్తి ఆయనవైపు చూపుతూ చెప్పాడో మిత్రుడు.
ఫోను ఎత్తిన వాళ్లంతా వస్తామనే అన్నారు గానీ, రాలేమని ఒక్కరూ అనలేదు. రాకపోవడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. సాయంత్రం అయిదైంది. వచ్చిన కొద్దిమంది సెలవు తీసుకున్నారు. ఇంటివారంతా తిన్నాక కూడా వండిన పదార్థాలు సగమైనా ఒడవలేదు.
గిన్నెలు కడుగుతున్న పనివాళ్ల దగ్గరికెళ్లి..
“మిగిలినదంతా మూటలు కట్టుకోండి. ఎవరికైనా పనికొస్తుంది..” అన్నాడు మనోహర్‌ , ఎవరో ఒకరు తింటే మేలే కదా అనుకొని.
“సార్‌.. మేం చావు భోజనం ముట్టము. బయట తినడానికి విడిగా రెండు వందలీయండి..” అంది ఒకామె తలెత్తకుండానే.
అలసిపోయిన వాళ్లు కుర్చీల్లోనో, చాపలపైనో కునుకు తీస్తున్నారు. తమ్ముళ్లవైపు వెళ్తున్న మనోహర్‌ వెనుకాలే వచ్చిన పనామె.. “సార్‌.. గిన్నెలు ఖాళీ చేసి ఇవ్వండి. కడిగేసి వెళ్తాం..” అన్నది.
“మీరే ఎక్కడైనా..”
“మాకు అంత బరువులు లేవవు. ఆ వాగు పక్కన పడేసి రండి. పశువులు తింటాయి”
ముగ్గురన్నదమ్ములూ కలిసి, గిన్నెలు మోసుకెళ్లి వాగు ఒడ్డున రాళ్లపై కుమ్మరించి వచ్చారు.
మామూలు భోజనానికి, చావు భోజనానికి తేడా ఏముందీ. మనుషుల్లో ఇలాంటి అపోహల్ని నూరి పోసినోడు కనిపిస్తే కసి తీరా తన్నాలనిపిస్తున్నది మనోహర్‌కు.
మర్నాడు ఉదయం కూరగాయల మార్కెట్లో మనోహర్‌కు తన డిగ్రీ క్లాస్‌మేట్‌ రవీందర్‌ కనబడ్డాడు. ఎన్నాళ్లకు కనబడ్డాడన్న ఆనందంలో చేయి కలుపుతూ..
“బాగున్నావా రవీ..” అన్నాడు .
మనోహర్‌ బోడిగుండును చూసి రవీందర్‌,
“తిరుపతికి వెళ్లినవా?” అన్నాడు.
లోపలే నాలుక కరుచుకున్న మనోహర్‌ చేయి వదులుకొని,
“లేదు.. మా అమ్మ చనిపోయి నాలుగు రోజులైంది” అన్నాడు సంజాయిషీగా. మాట పూర్తి కాకుండానే రవీందర్‌ కొంత ఎడంగా జరిగాడు.
“సారీ. మరిచిపోయి చేయి కలిపాను..”
“దాందేముంది, పర్వాలేదు. ఇంటికి పోయినాక స్నానం చేస్తే సరి..” అంటూ రవీందర్‌ చకచకా వెళ్లిపోయాడు.
v v v
పదో రోజు జరిపే పెద్దకర్మకు ఏర్పాట్లు మొదలయ్యాయి. కుటుంబసభ్యులంతా ఆహ్వానిస్తున్నట్లు కార్డుపై పేర్లు వేయించి, రెండ్రోజుల ముందే వాటిని పక్కింటి అబ్బాయి సాయంతో ఊర్లో ఉన్న బంధుమిత్రులకు, వీధిలో ఇంటింటికీ అందేలా చూశారు.
పొద్దున్నే మార్కెట్‌వైపు బయలుదేరిన మనోహర్‌కు దార్లో, చెత్తవేసే మూలల్లో తల్లి దశ దినకర్మ కార్డు ముక్కలు కనబడ్డాయి. వెనుదిరిగి పక్కింటి అబ్బాయిని పిలిచి, ‘ఇదేంటి’ అన్నట్లు వాటిని చూయించాడు.
“కర్మకాండ కార్డును ఎవరూ ఇంట్లో ఉంచుకోరు. చదవగానే చించేసి పడేస్తారు. మీదేకాదు, ఎవరిదైనా ఇంతే అంకుల్‌..” అని అబ్బాయి ఇందులో తన తప్పేమీ లేదన్నట్లు మనోహర్‌వైపు చూశాడు.
తనను తాను ఎలా సమాధాన పరచుకోవాలో అర్థం కాలేదు మనోహర్‌కు.
మూడో రోజు అనుభంతో పెద్దకర్మ రోజున వంటలు సగానికి సగం తగ్గించారు. అందులోనూ కొంత మిగిలినా ఇబ్బంది కలుగలేదు.
ఇంటివారి భోజనాలు కూడా అయ్యాక, వెళ్లేవారు తిరుగు ప్రయాణం ఆలోచనలో పడ్డారు.
ముగ్గురు అన్నదమ్ములను వారివారి అత్తింటివారు నిద్రకు తీసుకెళ్లాలి. సరాసరి ఇప్పుడే తీసుకెళ్లొచ్చు లేదా పది రోజుల్లో ఎప్పుడయినా పర్వాలేదు. మనోహర్‌ అత్తమామలు గడిచి పోయినందున ఆ భారం బావమరుదులపై పడింది. ఇద్దరిలో ఏ ఒక్కరు తీసుకెళ్లినా చాలు. పెద్ద బావమరిది, ఆయన భార్య ఓ మూలన నిలబడి చర్చించుకుంటున్నారు. నెలరోజుల్లో వారి కూతురు పెండ్లి ఉంది.
“నిద్రకు తీసుకుపొమ్మని మీ తమ్మునికి చెప్పు” అని పోరుతోందామె. ఈలోగా చిన్న బావమరిది దంపతులు “మేం వెళ్తున్నాం” అని చెప్పి జారుకున్నారు.
పిచ్చిచూపులు చూస్తున్న పెద్ద బావమరిదిని పిలిచి.. “సంగతేంటి?” అన్నాడు మనోహర్‌.
“బావా! మిమ్మల్ని, చెల్లిని నిద్రకు తీసుకెళ్లాలి. మా అమ్మాయి పెండ్లి సంగతి మీకు తెలిసిందే, తమ్ముడు..” అని ఇంకేదో చెప్పబోయాడాయన.
“మీరు పిలిచినా నేను రాను. ఏడాదిపాటు మేమే ఎవరింటికీ వెళ్లం. మీరు నిశ్చింతగా ఉండండి..” అంటూ ఆయన భుజాన్ని తట్టి, ఇదంతా చూస్తున్న కవితవైపు నడిచాడు
మనోహర్‌.
అన్నల అవమానకర ప్రవర్తనతో కవితకు తల్లిదండ్రులు గుర్తొచ్చారు. మనోహర్‌ దగ్గరికి రావడంతో ఆమెకు కన్నీరు ఆగలేదు.
“ఊర్కో.. ఏడవకు. దీంట్లో వాళ్ల తప్పేముంది? ఇలాంటి పనికిమాలిన ఆచారాల్ని వారి మెదళ్లలో కూచోబెట్టిన వారిని అనాలి..” అని ఓదార్చాడు.
తిరుగు ప్రయాణంలో మనోహర్‌ మనసు నిలకడగా లేదు.
‘పోయినవారు మిగిల్చిన దుఃఖం కన్నా చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన భరించడమే కష్టం. నిర్జీవమైన దేహం కాల్చితే బూడిదవుతుంది. పాతి పెడితే మట్టి అవుతుంది. వదిలేస్తే కుళ్లి కంపు కొడుతుంది. ప్రేతం, భూతం అని చనిపోయిన వారిని అగౌరవ పరుస్తూ, అమానవీయంగా చిత్రిస్తున్నారు.
అమ్మ జ్ఞాపకంగా మిగిలిపోతుంది గానీ, దెయ్యమెలా అయి ఇతరులను భయపెడుతుంది, బాధ పెడుతుంది..’ జర్నీ సాంతం ఇవే ఆలోచనలు ఆయన్ని వేధించాయి.
మర్నాడు ఆఫీసుకు వెళ్లి తిరిగి వస్తూ, దారిలో మోహన్‌ ఫౌండేషన్‌ నుండి రెండు అప్లికేషన్‌ ఫారాలు తీసుకొచ్చాడు మనోహర్‌. రావడంతోనే అందులోంచి ఒకదాన్ని కవిత చేతిలో పెట్టి చదవమన్నాడు.
“ముందు ఫ్రెష్‌కండి..” అంది కాగితం తీసుకుంటూ.
“అన్నీ తర్వాతే.. ముందు చెరో ఫారంపై సంతకం పెడుదాం..” అంటూ సోఫాలో కూర్చున్నాడు.
కవితవైపు చూస్తూ, “చనిపోయాక మన శరీరాలను మెడికల్‌ కాలేజీకి అప్పగించేందుకు ముందస్తు అంగీకార ధృవీకరణ పత్రం ఇది..” అని ఆమెకు చెప్పి, తను సంతకం చేశాడు.
“ఇదిగో పెన్ను తీసుకో..” అన్నాడు ఆలోచన అనవసరం అన్నట్లు..
“ఇప్పుడివన్నీ ఎందుకండీ?” అంటూనే పెన్ను అందుకొని సంతకం చేసి, పెన్ను, కాగితాన్ని భర్త చేతిలో పెట్టింది.
“ఇలా చేస్తే కర్మకాండల నుంచి తప్పించుకోవచ్చు. దినాలు, తద్దినాలు, ఏవీ వద్దని పిల్లల్ని రాతపూర్వకంగా కోరుదాం. అంతగా అవసరమనిపిస్తే చిన్నగా సంస్మరణ సమావేశం జరిపి, తేనీటి విందు ఇవ్వమందాం”
“చావు సభ అని వచ్చినవారంతా చాయ్‌, బిస్కట్‌ తీసుకుంటారో? లేదో?” విషాద సందర్భంలో కవిత చమత్కారంగా మాట్లాడటంతో చాన్నాళ్ల తర్వాత మనోహర్‌ ముఖం నవ్వుతో విప్పారింది.

బద్రి నర్సన్‌
రచయితగా, కాలమిస్ట్‌గా చిరపరిచితులైన బద్రి నర్సన్‌ స్వస్థలం జగిత్యాల. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. డిగ్రీ వరకూ జగిత్యాలలోనే విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎంఎడ్‌ చేశారు. పాఠశాల స్థాయినుంచే సాహిత్యాభిలాషను పెంచుకున్నారు. బాల్య స్నేహితులతో కలిసి ‘సాహితీ మిత్ర దీప్తి’ అనే సంస్థ ద్వారా కవితల పోటీలు నిర్వహించారు. ఎంపికైన రచనలను పుస్తకాల రూపంలోకి తెచ్చారు. ఓయూలో చదువుతున్న రోజుల్లోనే ‘రంగుల కల’, ‘విముక్తి కోసం’ సినిమాలకు రచన, దర్శకత్వ శాఖల్లో పనిచేశారు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. 2015లో విరమణ పొందారు. పదేండ్లుగా సమకాలీన అంశాలపై వివిధ పత్రికలకు విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్నారు. దివంగత కవి, చిత్రకారుడు అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వాన్ని పుస్తకంగా తెచ్చారు. తన జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన అంశం ఇదేనని నర్సన్‌ చెప్తారు. సాహిత్యంపై మక్కువతో 30 వరకూ కథలు రాశారు. అందులో ఎనిమిదింటికి వివిధ పోటీల్లో బహుమతులు అందుకున్నారు. ‘ఓ రైతుకథ’కు 2016లో నోముల సత్యనారాయణ పురస్కారం దక్కింది. 2017, 19లలో ‘నవ తెలంగాణ’ పత్రిక నిర్వహించిన కథల పోటీల్లో ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుపొందారు. 2020లో నిర్వహించిన ‘పాలపిట్ట-శకుంతల జైనీ’ దసరా కథలపోటీల్లో
‘రబ్బరు బొమ్మ’ కథకు మొదటి బహుమతి లభించింది.

-బద్రి నర్సన్‌, 9440128169

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కర్మకాండ

ట్రెండింగ్‌

Advertisement