పుస్తక ప్రియులకు స్వాగతం
పుస్తకం లేని ఇల్లు, గ్రంథాలయం లేని ఊరు.. ఏమంత శోభించవు. కానీ, రోజురోజుకూ పుస్తకాలకు ఆదరణ తగ్గిపోతున్నది. ఎంతసేపూ స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నారు. కాదంటే, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి యువతను గట్టెక్కించడానికి, ఎంతోమంది స్వచ్ఛందంగా లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్రమంలోనే వినూత్నమైన లైబ్రరీ డిజైన్‌కి నాంది పలికింది ‘స్టూడియో ఇన్ఫినిటీ’ అనే ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ. పుణెలోని ఒక పాత పార్కింగ్ స్థలాన్ని అందమైన లైబ్రరీగా మార్చింది. చదువరులకోసం ఏకంగా ఒక బుక్హబ్ను ఏర్పాటు చేసి,ప్రపంచమంతా పుస్తకంలోనే ఉందని చాటి చెబుతున్నది. ఎటు చూసినా పుస్తకాల అరలే!చూడగానే పుస్తకాలపై ప్రేమ కలిగేలా, చదవాలని ఆసక్తి పుట్టేలా.. అందంగా, ఎకో-ఫ్రెండ్లీ
పద్ధతిలో రూపుదిద్దుకున్న ఈ లైబ్రరీ పేరు ‘ది బుక్ రూమ్’.
‘జనంలో పుస్తకాలపై ఆసక్త్తికలిగించాలన్నదే ఫస్ట్ పాయింట్. పుస్తకాలతో సంపాదించిన జ్ఞానాన్ని, ఇక్కడే నలుగురితో పంచుకోవాలన్నది మరో ఉద్దేశ్యం. పిల్లలను, యువతను ఆకర్షించడానికి వాళ్లకంటూ ఓ మల్టీ యుటిలిటీ స్పేస్‌ను అందించేందుకు విశాలమైన పాత పార్కింగ్ ప్లేస్‌ని ఎంచుకున్నాం’అంటున్నారు స్టూడియో ఇన్ఫినిటీ ప్రిన్సిపల్ డిజైనర్ తుషార్. దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇదో ఎకోఫ్రెండ్లీ భవనం. లోపల, బయట రకరకాల మొక్కలను పెట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి అందుతుంది. వెలుతురుకూడా బాగా వచ్చేలాడిజైన్ చేశారు. చీకటి పడేంతవరకూ లైట్ల అవసరమే రాదు. బుక్రూమ్కి ఇరువైపులా రీడింగ్ టేబుల్స్ అమర్చారు. వీటి ఫొటోలను చూస్తే ఎవరైనా సరే, లైబ్రరీకి ఫిదా కావాల్సిందే. ‘సరస్వతీ నమస్తుభ్యం’ అని చేతులు జోడించాల్సిందే!