గారెలు, వడలు, టిక్కీలు, ముట్టీలు.. ఎలా పిలిస్తేనేం, తలుచుకొంటే నోరూరిపోతుంది. పప్పు గారెలకే అంత రుచి ఉంటే, మటన్ ముట్టీల ముచ్చట చెప్పేదేముంది? జిహ్వ జివ్వుమంటుంది. ఈ సండే మటన్ గారెలతో మజా చేసుకొందాం!
మటన్ గారెలను, బొక్కల్లేకుండా తుక్కుతుక్కుగా కొట్టే ఖీమాతో చేస్తారు. ఆ ఖీమాకు ఉప్పు, కారం, మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి జోడిస్తారు. బాగా కలిపి మరిగే నూనెలో గారెల్లా వేయించుకొంటే చాలు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో మటన్ బాల్స్, మటన్ కోఫ్తా, సీక్ కబాబ్ అంటూ ైస్టెల్‌గా పిలిచినా ఈ వంటకం ఇప్పటిదేం కాదు. తెలంగాణ లోగిళ్ళలో అనాదిగా వండుతున్నదే. అందుకే ఖీమా ముట్టీలు తెలంగాణ స్పెషల్‌గా నిలిచిపోయాయి. మటన్‌తోనే చేయాలన్న రూలేం లేదు. చికెన్, ముళ్లు తీసిన చేప మాంసంతోనూ ముట్టీలు వేసుకోవచ్చు.
ఖీమా మిశ్రమాన్ని ఉండలు, గారెలు, వడలు.. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నూనె ఎక్కువ వద్దనుకునేవాళ్ళు ముట్టీలను పెనంపై కొంచెం కొంచెం నూనె వేస్తూ కాల్చుకుంటారు. ఒవెన్లోనూ, బొగ్గులపైనా గ్రిల్ చేసుకుని తినొచ్చు. టమాట సాస్ వీటికి సరైన జోడి. కారం, మసాలా కాస్త గట్టిగా వేసుకుంటే వట్టివే లాగించవచ్చు.
నాన్‌వెజ్ ప్రియులకు మటన్ అంటే మహా మమకారం. పరిమితంగా తింటే మటన్‌తో ప్రయోజనాలెన్నో! ప్రొటీన్లతో కూడిన మంచి పౌష్ఠికాహారం ఇది. దీనిలోని పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. మటన్‌లో బి12 ప్రమాణాలెక్కువ. ఇవి ఎర్రరక్త కణాలు ఏర్పడేందుకు దోహదపడటమే కాదు, దెబ్బతిన్న కణాలను సైతం బాగుచేస్తాయి.
మటన్‌లో విటమిన్- బి1, బి2, బి3, బి9 పుష్కలం. బీ కాంప్లెక్స్, సెలీనియం కాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయి. గర్భిణులు తమ డైట్లో మటన్‌ను చేర్చుకుంటే పుట్టబోయే బిడ్డల్లో న్యూరల్ ట్యూబ్ సమస్యలు రావు. మటన్‌లో లభించే ఐరన్ స్త్రీల రుగ్మతలను నివారిస్తుంది.
తరచూ మటన్ తినడం వల్ల సొరియాసిస్, ఎగ్జిమా, యాక్నే వంటి చర్మ సమస్యలను అధిగమించవచ్చు. అంతేకాదు, చర్మాన్ని కాంతిమంతం చేయడంలో దీనిలోని పోషకాలు దోహదపడతాయి. సరైన మోతాదులో తీసుకుంటే టైప్-2 డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.
మటన్‌లోని ప్రొటీన్లు ఎదుగుదలకు దోహదపడతాయి. చిన్నపిల్లలకు మంచి ఆహారం. దీనిలోని పోషకాలు జీవక్రియ సక్రమంగా జరిగేలా సాయపడతాయి. ఖీమా ముట్టీలను భోజనంలోనే
కాదు, సాయంకాలం స్నాక్స్లానూ లాగించొచ్చు. దోస్తుల కాలక్షేపం కబుర్లకు కూడా మంచి జోడీ! ఖీమా ముట్టీ పని పట్టండి మరి!