e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home బతుకమ్మ మర చెయ్యి..అమర్చేయి!

మర చెయ్యి..అమర్చేయి!

మర చెయ్యి..అమర్చేయి!

జీవితం మధ్యలో ప్రమాదవశాత్తు ఏదైనా అవయవం కోల్పోతే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. అందులోనూ చెయ్యి దూరమైతే భవిష్యత్తు చేజారినట్టు అవుతుంది. అలా ఎవరూ బాధ పడకూడదని ముగ్గురు మిత్రులు ఓ ప్రతి సృష్టి చేశారు. దూరమైన చేయి స్థానంలో మరచేతిని అమర్చి గీతల్లేకుండానే బతుకురాతను మార్చేస్తున్నారు.

ఒక చెయ్యి దూరమైనంత మాత్రాన, జీవితం తల్లకిందులు కాకపోవచ్చు. కానీ, బతికినంత కాలం వైకల్యం బాధిస్తూనే ఉంటుంది. ఆత్మన్యూనత వెంటాడుతూ ఉంటుంది. అంది వచ్చిన అవకాశాలను సొంతం చేసుకోవడానికి వెనుకంజ వేయాల్సి రావచ్చు. ప్రమాదంలో చేతిని కోల్పోయిన వారికి ఈ పరిస్థితి రాకూడదన్నదే హైదరాబాద్‌కు చెందిన ఈ మిత్రత్రయం తాపత్రయం. మరచేతితో అభయహస్తం ప్రసాదిస్తున్నారు హర్షారెడ్డి పొంగులేటి, వెంపటి ప్రణవ్‌, సురేన్‌ మరుమాముళ్ల.

కలామ్‌ స్ఫూర్తి
కృత్రిమ అవయవాలు చాలా కాలం నుంచీ అందుబాటులో ఉన్నవే. వీటిలో చాలావరకు కాస్మొటిక్‌, మెకానిక్‌ అవయవాలే. వీటిని ధరించడం వల్ల వైకల్యం కనిపించకుండా పోయినా, ఆ పరికరం చేసే పనులు మాత్రం పూర్తిస్థాయిలో ఉండవు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకే ఆధునికమైన మరచేతిని తీర్చిదిద్దారు ప్రణవ్‌, అతడి స్నేహితులు. అంతకు ముందు ఈ ముగ్గురూ ‘మేకర్స్‌ హైవ్‌’ అనే పరిశోధనా సంస్థను నెలకొల్పారు. నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోసే సంస్థ ఇది. ఈ ప్రయత్నంలో దివ్యాంగులకు కృత్రిమ చేతులు తయారు చేయాలని అనుకున్నారు. ప్రమాదవశాత్తు చేతులను కోల్పోయినవారు శాశ్వతంగా దివ్యాంగులుగా ఉండిపోకూడదని సంకల్పించుకున్నారు. ఎన్నో పరిశోధనల తర్వాత దేశంలోనే తొలిసారిగా ‘బయోనిక్‌ హ్యాండ్‌’ను రూపొందించారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌ కలామ్‌ స్ఫూర్తితో ఈ కృత్రిమ హస్తానికి ‘కలామ్‌’ (కల్‌+ఆమ్‌) అని పేరు పెట్టారు.

24 రకాల పట్టు
భుజం కండరాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా ఈ మరచేయి పనిచేస్తుంది. ఇలాంటి కృత్రిమ హస్తాలు విదేశాల్లోనూ ఉన్నాయి. కానీ, వాటి ధర రూ.35 లక్షల నుంచి రూ.60 లక్షలు. కానీ, ముగ్గురు మిత్రుల అద్భుత సృష్టి.. హైవ్‌ బయోనిక్‌ హ్యాండ్‌ ధర అందులో పదో వంతు మాత్రమే! గత డిసెంబర్‌లో దీనిని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ చేతిని అమర్చుకున్న దివ్యాంగులు ఇప్పుడు స్వేచ్ఛగా పనులు చేసుకోగలుగుతున్నారు. కలామ్‌ చేతికి ‘ప్రీ డిఫైన్డ్‌’ గ్రిప్‌లు ఉంటాయి. గ్లాసు పట్టుకున్నప్పుడు వేళ్లను ఎలా కదిలించాలి, బంతిని ఎలా పట్టుకోవాలి, కాయగూరలు కోసేటప్పుడు కత్తి పట్టుకునే తీరేమిటి, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం ఎలా.. ఇలా 18 రకాల గ్రిప్‌లు ముందుగానే డిజైన్‌ చేశారు. వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టు మరో ఆరు గ్రిప్‌లు సేవ్‌ చేసుకోవచ్చు. చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ) చాణక్య నేతృత్వంలో సాంకేతిక బృందం కృషితో ఈ అద్భుతం దివ్యాంగులకు చేరువ అయింది. మూడున్నరేండ్లు శ్రమతో.. బయాలజీ, రొబోటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాలను అనుసంధానం చేసి పూర్తి స్థాయి దేశీయ పరిజ్ఞానంతో ఈ బయోనిక్‌ హ్యాండ్‌ను తయారుచేశారు.

మర చెయ్యి..అమర్చేయి!

ఎన్జీవోల సహకారం
ఆవిష్కరణ ఒక ఎత్తు, ఈ మరచేయిని దివ్యాంగులకు చేరువ చేయడం మరో ఎత్తు. ఇందుకోసం ప్రముఖ దవాఖానలతో చేతులు కలుపుతున్నది ప్రణవ్‌ బృందం. పేదవాళ్లకు సాయం చేసే ఉద్దేశ్యంతో పలు ఎన్‌జీవోలనూ సంప్రదిస్తున్నది. ఆయా సంస్థల సహకారంతో చేయి లేని వారికి ఈ కృత్రిమ హస్తాన్ని అందిస్తున్నది. ఈ ప్రయత్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం 100 బయోనిక్‌ చేతులను ఉచితంగా అందించడం విశేషం. అంతేకాదు, ప్రణవ్‌ బృందం దివ్యావిష్కరణను ‘ఫోర్బ్స్‌’ పత్రిక ప్రశంసించింది. ‘ఫోర్బ్స్‌’ 30 అండర్‌ 30లో ప్రణవ్‌కు చోటిచ్చింది.

మూడు వెర్షన్లలో..
ఈ బయోనిక్‌ హ్యాండ్‌ అండగా ఉంటే చేయి కోల్పోయామన్న వెలితి ఉండదు. పదిమందికీ ఉపయోగపడే ఇలాంటి ఆవిష్కరణను అందించడం మాకెంతో గర్వకారణం. ఇది సుమారు 8 కిలోల బరువును అవలీలగా ఎత్తుతుంది. ఈ ప్రయత్నంలో మా బృంద సభ్యుల సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 35 మంది నిపుణుల కష్టానికి ఫలితమిది. ప్రస్తుతం మూడు వెర్షన్స్‌లో బయోనిక్‌ హ్యాండ్‌ అందుబాటులో ఉంది.
-హర్ష రెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మర చెయ్యి..అమర్చేయి!

ట్రెండింగ్‌

Advertisement