e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home బతుకమ్మ ‘ఆటో’..మోటివేషన్‌!

‘ఆటో’..మోటివేషన్‌!

‘ఆటో’..మోటివేషన్‌!

‘ఆడపిల్ల’ను ఆకాశానికి ఎత్తుకున్నా.. ఆమెపై చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. పనిలోప్రతిభను చాటుతున్నా.. చాటు మాటున అవమానం జరుగుతూనే ఉంది. ‘ఆడపిల్ల శాపం కాదు. ఇంటిదీపం’ అంటూ ఆటోలో తిరుగుతూ అవగాహనకల్పిస్తున్నది ఓ మిత్ర బృందం.

హర్యానాలోని అశోక యూనివర్సిటీ విద్యార్థులు.. ప్రీతా దత్త, అన్షూల్‌ రాయ్‌ శర్మ, పాల్‌ కురియన్‌, వెంకటేశ్‌ తపన్‌, విదుర్‌ సింగ్‌. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంవారు. ఒకే బ్రాంచ్‌ కూడా కాదు. కానీ సామాజిక బాధ్యత స్నేహితులుగా మార్చింది. చాలాసార్లు లాంగ్‌ రైడ్‌కు వెళ్లారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల జీవన విధానంపై ప్రాజెక్టు రూపొందించేవారు.

అవనికి వెలుగు
సరదాగానే ప్రారంభమైన ఆ ప్రయాణం ఎన్నో ఆలోచనలను ఆవిష్కరించింది. సమాజంలోని వాస్తవ పరిస్థితులను చూసి చలించిపోయారు. ఆడపిల్లల స్థితిగతులు కన్నీళ్లు పెట్టించాయి. దేశం ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పుకొంటున్నా భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అనే ప్రశ్న మొదలైంది. పేదరికం, నిరక్షరాస్యత వీటికి కారణాలని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. అంతే, దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. పల్లెపల్లెలో, వీధి వీధిలో ‘ఆడపిల్ల అవనికి వెలుగు’ అనే సందేశం ఇస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు ఆడజన్మ గొప్పదనం గురించి అవగాహన కల్పిస్తున్నారు. క్యాంపస్‌లో చదువుతూనే, సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో సమాజం పట్ల వీరి బాధ్యత ప్రశంసలు అందుకొంటున్నది.

ఆటో ప్రయాణం
‘ఆడపిల్లలకు చదువు’ నినాదమే తొలి ప్రాధాన్యంగా బెంగళూరు నుంచి ‘అవగాహన యాత్ర’ను ప్రారంభించారు. ఇందుకోసం ఒక ఆటోను తీసుకున్నారు. కార్లలో, బస్సుల్లో వెళ్లి చెప్తే సామాన్య ప్రజలు స్వీకరించకపోవచ్చు. వారిలో కచ్చితమైన మార్పును తీసుకురావాలంటే ‘ఆటో’ ద్వారానే సాధ్యమని భావించారు. ‘నన్హి కలీ’ అనే ఎన్‌జీఓ సహకారంతో చేపట్టిన ప్రాజెక్ట్‌లో భాగంగా ‘ఆటో ఫర్‌ ఇంపాక్ట్‌’ యాత్ర ప్రారంభమైంది. 2020 ఆగస్టులో బెంగళూరులో మొదలైన యాత్రలో వేలాదిమందిని కలుసుకున్నారు. ‘చదువు వల్ల ఉపయోగం ఏంటి? దేశం ఎటు వెళ్తుంటే.. మీరెటు ఆలోచిస్తున్నారు?’ అంటూ ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. ‘ఒక్క ఆడపిల్ల విద్యావంతురాలైతే ఇంటిల్లిపాదీ విజ్ఞానవంతులు అవుతారు. పేదరికం అనే మాటే ఉండదు’ అని అర్థమయ్యేట్లు వివరిస్తున్నారు.

‘ఆటో’..మోటివేషన్‌!

1700 కిలోమీటర్లు
బెంగళూరు నుంచి ప్రారంభమైన ప్రయాణ లక్ష్యం 1000 కిలోమీటర్లు. రోడ్లు, వీధులు, జన సమూహాలు ఉన్నచోట్ల ఆటోను ఆపుతారు. చర్చలు, వీధి నాటకాల రూపంలో సందేశాన్ని చేరవేస్తారు. ఇప్పటికే, 1000 కిలోమీటర్ల లక్ష్యం పూర్తయింది. అంతలోనే, కరోనా వేవ్‌-2 మొదలైంది. ఈ సమయంలో ఇంట్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేయడం కాదు.. ప్రజలతో ఉండటం మంచిదని అనుకున్నారు. ఒకవైపు ఆడపిల్ల జీవితం గురించి చైతన్యం కల్పిస్తూనే, కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవచ్చో అవగాహన కల్పిస్తున్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష అనేది కరోనా కంటే ప్రమాదమైనదని హెచ్చరిస్తున్నారు. అలా 1000 కిలోమీటర్లు అనుకున్న ప్రయాణం 1700 కిలోమీటర్లు దాటి ముంబై చేరుకున్నది. రెండో పర్యటనలో భాగంగా మరో లక్ష్యాన్ని ఎంచుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

అనూహ్య స్పందన
ఆటో యాత్రకు మంచి స్పందన లభించింది. 300పైగా కార్పొరేట్‌ కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. దాదాపు 30 లక్షల రూపాయల నిధి పోగయ్యింది. ఈ మొత్తంతో ‘ఆటో ఫర్‌ ఇంపాక్ట్‌’ యాత్ర కొనసాగిస్తూనే సామాజిక మాధ్యమాల వేదికగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 450 మందికి పైగా అమ్మాయిలను పాఠశాలల్లో చేర్పించగలిగారు. వారి చదువు పూర్తయిన తర్వాత ,ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పలు కంపెనీలు హామీ ఇచ్చాయి. 1996 నుంచి ఇదే అంశంపై అధ్యయనం చేస్తున్న ‘నన్హి కలీ’ వీరితో శాశ్వతంగా కలిసి పనిచేసుందుకు ముందుకు రావడంతో సమాజ సేవ చేయాలన్న ఆ యువత సంకల్పం మరింత బలపడింది.

‘ఆటో’..మోటివేషన్‌!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘ఆటో’..మోటివేషన్‌!

ట్రెండింగ్‌

Advertisement