e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home బతుకమ్మ ‘కాపు’రం గుట్టలు

‘కాపు’రం గుట్టలు

‘కాపు’రం గుట్టలు

ప్రజా పాలనతోపాటు, రాజ్యరక్షణకూ చక్రవర్తులు ప్రథమ ప్రాధాన్యమిచ్చేవారు. దండెత్తి వస్తున్న శత్రువుల జాడను సరిహద్దుల్లోనే కనిపెట్టి, అక్కడికక్కడే మట్టుబెట్టేందుకు రహస్య స్థావరాలనూ ఏర్పాటు చేసుకొనేవారు. కాకతీయులూ ఇదే వ్యూహాన్ని అనుసరించారు. రాజ్య సరిహద్దుల్లో అనేక సైనిక స్థావరాలను నిర్మించి వైరి మూకల ఆట కట్టించారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అడవులు చారిత్రక విశేషాలకు పెట్టింది పేరు. ఆదిమ మానవుల సమాధులు మొదలుకొని ఆలయాలు, గుహలు, రాతి చిత్రాలు, శత్రు దుర్భేద్యమైన కోటలు, చారిత్రక కట్టడాలకు నెలవు. అయితే, ఇందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మరికొన్ని ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచానికి పరిచయమవుతున్నాయి. అందులో ముఖ్యమైనవి కాపురం గుట్టలు, అక్కడున్న కాకతీయుల సైనిక స్థావరాలు.

అబ్బురపరిచే కొండలు
మల్హర్‌ మండలం తాడిచెర్ల నుండి 3 కి.మీ. దూరంలో ‘కాపురం’ అనే గ్రామం ఉన్నది. ఈ పల్లె సరిహద్దులోని చెరువువద్దకు వెళ్తే అల్లంత దూరంలోని దట్టమైన అడవిలో మూడు కొండలు దర్శనమిస్తాయి. ఎవరో శిల్పి పనిగట్టుకొని ఉలితో చెక్కినట్లు కనిపిస్తాయి. శత్రు దుర్భేద్యమైన ఈ కొండలు కాకతీయులకు సైనిక రహస్య స్థావరాలుగా ఉపయోగపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలూ లభించాయి. ఇందులోని ఒక కొండపై విష్ణుమూర్తి ఆలయం నేటికీ చెక్కు చెదరలేదు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించే పెద్ద రాతి స్తంభాలూ ఇక్కడ లభించాయి. కొండచుట్టూ సహజ
సిద్ధంగా ఏర్పడ్డ రాతి గోడ ఎంతటి శత్రువునైనా నిలువరిస్తుంది. దీనికి పక్కనే కోటగోడలు, బురుజులూ దర్శనమిస్తాయి. కొండ పైభాగంలో సైనికుల ఆవాసాలుగా రెండు భారీ గుహలున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కుండపెంకులు, ఇతర వస్తు సామగ్రి లభిస్తున్నది.

బావులు- గుహలు
కొండలమీద కాపు కాసే సైనికుల దాహం తీర్చడానికి చెక్‌డ్యామ్‌లను తలపించేలా రెండు బావులను నిర్మించారు. వర్షపునీటిని ఒడిసి పట్టేలా, పల్లంగా ఉన్నవైపు రాతిముక్కలతో గోడ కట్టారు. ‘కాపురం’ గుట్టల్లో సహజసిద్ధంగా ఏర్పడ్డ రెండు రాతిగుహలున్నాయి. వీటిలో 200 మంది సైనికులు నివాసం ఉండేందుకు సరిపడా స్థలం ఉన్నది. ఇక్కడి రెండు కొండలను కలుపుతూ 500 మీటర్లమేర సహజ
సిద్ధంగా ఏర్పడ్డ రాతిగోడ దర్శనమిస్తుంది.

‘కాపు’రం గుట్టలు

చారిత్రక నేపథ్యం
చారిత్రక ఆధారాలనుబట్టి ఇక్కడి నిర్మాణాలను రెండో ప్రతాపరుద్రుడి కాలంలో చేపట్టినట్లు తెలుస్తున్నది. ఆ కాలంలో ఇదొక రహస్య సైనిక స్థావరం కావడానికి అవకాశమున్నది. ఈ ప్రాంతానికి పశ్చిమ దిక్కులో రామగిరి ఖిల్లా, తూర్పున ప్రతాపగిరి కోట ఉన్నాయి. కీ.శ.1303 లో ఢిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ సేనాని మాలిక్‌ కాఫర్‌ కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. శత్రు సైన్యాలను ముందుగానే గుర్తించిన కాకతీయ సర్వసైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి ఉప్పరపల్లి గ్రామం వద్ద వారిని అడ్డుకున్నాడు. ప్రతాపగిరి, రామగిరి ఖిల్లాల నుండి వచ్చిన సైన్యం సహకారంతో కాఫర్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే, భారీ సైనిక బలగమున్న ఢిల్లీ పాలకులకు లొంగిపోక తప్పలేదు. దీంతో ఢిల్లీ సుల్తాన్‌కు ఏటా కప్పం కట్టేలా ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సైనిక స్థావరాల జాడ తెలుసుకున్న కాఫర్‌ సేనలు రామగిరి ఖిల్లాను పూర్తిగా, ప్రతాపగిరి కోటను పాక్షికంగా ధ్వంసం చేశాయని అంటారు. తమ రహస్య స్థావరాలు బహిర్గతం కావడంతో ఇదే ప్రాంతంలోని కాపురం గుట్టల్లో ప్రతాపరుద్రుడు కొత్త సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. వీరుడి జన్మ ధన్యం. గెలిస్తే విజేత అవుతాడు. మరణిస్తే అమరుడని అనిపించు కుంటాడు. ఆ ప్రకారంగా చూసినా, కాకతీయుల సేవలో కాపురం గుట్టలు చరితార్థం అయ్యాయి.

‘కాపు’రం గుట్టలు

కోటగోడలు
కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తే శత్రువుల కదలికలను, ముందే పసి గట్టడంతోపాటు, ముష్కర మూకల దాడులనుంచి రక్షణ పొందడంలో ‘కాపురం’ గుట్టలు ఎంతో కీలకమైనట్లు తెలుస్తున్నది. ఇందుకోసం కాకతీయులు ఈ గుట్టల పైభాగంలో శత్రు దుర్భేద్యమైన రక్షణ ఏర్పాట్లను చేసుకున్నారు. మూడంచెల్లో ఒకటిన్నర కిలోమీటర్ల మేర అత్యంత పటిష్ఠమైన రాతిగోడలను నిర్మించారు. పహరాకోసం గుట్టకు నలువైపులా బురుజుల నిర్మాణం చేపట్టారు. ఈ కోటగోడల నడుమ వాననీటిని నిల్వ చేసుకునేందుకు చెక్‌డ్యాం తరహా నిర్మాణాలు చేశారు.

-అరవింద్‌ ఆర్య ,7997 270 270

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘కాపు’రం గుట్టలు

ట్రెండింగ్‌

Advertisement