e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home కథలు ఈ వారం కథ..చీకటి వెలుగులు

ఈ వారం కథ..చీకటి వెలుగులు

ఈ వారం కథ..చీకటి వెలుగులు

“జయమ్మా! వో జయమ్మా!” గడపకాడ నిలవడి ఇంట్లకు తొంగి సూసుకుంట, జయమ్మ కొరకు వెతుక్కుంట పిల్శింది ఎదురింట్లుండే చంద్రకళ. చేతిలున్న జాకిటు గుడ్డకు మ్యాచింగ్‌ దారం కోసం, గూట్ల ఉన్న దారాల డబ్బాలు తీస్తున్న జయమ్మ.. చంద్రకళ పిలుపు ఇనంగనే-
“ఆ.. వొస్తి!” అనుకుంట జాకిటు గుడ్డను ఆడ్నే స్టూల్‌మీన వెట్టింది. వొంగిపోయిన నడుముకు చేతులు వెట్టుకొని తలుపు కాడికొచ్చింది.
“చంద్రకళా నీవా! నీ బట్టలే కుడుతుండా! రేపు పొద్దుగాల వరకు కుట్టిస్త బిడ్డ. నీవు రాలేకున్నా సరే! పొద్దుగాల్నే నీ బిడ్డను పంపు. ఇచ్చి తోల్తా.. అట్లేగెనా?” అన్నది ముక్కు చీదుకుంట, కొంగుతోని కండ్లద్దాలు తూడ్సుకుంట.
“ఇంగా కుట్టిలేవా జయమ్మా! రేపు ఊరికి వోతున్నమని చెప్తి గద!” అన్నది చంద్రకళ.
“అవ్వు.. చెప్తివిగానీ, నాకు జర నిన్నటిసంది సర్దయింది. కుట్టనీకే వీలుగాలే. రేపు ఎండ పొద్దున బస్సుకు గద మీరు వొయ్యేది! అప్పటి వరకు ఇస్తలే”
“పొద్దుగాల్నే పిల్లను వంపుత, తప్పకుండ కుట్టి పెట్టయితే!”
“అట్లెగే కుట్టిస్త పో బిడ్డ!”
‘సరే’ అనుకుంట ఇంటికి వోయింది
చంద్రకళ.
జయమ్మ లోపటికి వోయి స్టూల్‌మీన వెట్టిన జాకిటు గుడ్డ, దారం కండలు తీస్కొని కుట్టు మిషన్ల రెండు మూడు నూనె సుక్కలు వోశి, కుట్టడం షురు జేయంగనే-
“జయవ్వా! ప్రమీలక్క ఫోను జేషింది” అని ఉరుక్కుంట వొచ్చి జెప్పిండు జయమ్మ ఇంటిపక్క పోర్షన్ల కిరాయికుంటున్న సీనుగాడు.
“అవ్వ కొడ్కా! వొస్తున్న పా” అనుకుంట, దబదబ తలుపులు దగ్గరికేసి సీనుగానెంబడే వోయింది జయమ్మ.
ఐదు నిమిషాలకు ప్రమీల మల్ల ఫోను జేసింది.
“హలో అమ్మా! మంచిగున్నవా?” అన్నది ప్రమీల.
“మంచిగున్న బిడ్డ! అల్లుడు, మన్మరాండ్లు గిట్ల మంచిగున్నరు గద!” అన్నది జయమ్మ.
“అందరం మంచిగున్నం. ఈసారి పండ్గకు ఊరికి రానికే వీలుగాదేమోమ్మా! మీ అల్లుడికి జర ఆఫీసుల పని ఎక్వుంది. ఇగ ఆడ ఊర్ల నీవొక్క దానివి ఏం జేస్తవు ఈడికే రా”
“పండుగ బట్టలు చానున్నయి బిడ్డ! సూస్త.. కుదుర్తే వొస్తలే”
“కుదుర్తే గాదు తప్పకుండ రామ్మా. ఇగో నీ మన్మరాండ్లు అమ్మమ్మ తానికి వోదమని ఒకటే ఎంబడి వడిన్రు. వాళ్లకొరకన్న రా”
“అట్లెగే వొస్తలే! ఉంట మల్ల. ఇగ ఫోన్ల పైసలు చానయితయ్‌” అని ఫోను పెట్టేసి, ఇంటికి వోయింది జయమ్మ.
కుర్చీల కూసోని ‘పిల్లలు రమ్మంటున్నరు, ఎట్లనో ఏమో?’ అనుకుంట, మల్ల కుట్టుమిషను తొక్కుడు షురుజేసింది.
ఇగ అట్లిట్ల జేశి పది రోజులల్ల కుట్టాల్సిన బట్టలన్నీ కుట్టిచ్చింది. రేపు పండుగనంగ ముందురోజు బిడ్డకాడికి పోనీకే బస్సెక్కింది. కండక్టర్కి పైసలిచ్చి మైబునార్‌ (మహబూబ్‌నగర్‌)కు టిక్కెట్టు తీస్కొని, సీటుల కూసుంది జయమ్మ.
“ఏం జయమ్మా.. బిడ్డతానికి వోతున్నవా?” అడిగిండు అదే ఊర్ల ఉండే కిష్టయ్య.
“అవ్వన్నా! రమ్మనే.. మల్ల పోకుంటే పిల్లలు బుగులు వడ్తరు. అందుకే ఇగ వోతుండ” అని చెప్పింది జయమ్మ.
బస్సు కదిలి ముందుకు వోతుంటే కిటికీ పక్కకు కూసోని బయిటికి సూస్తున్న జయమ్మకు ఆమె గత జ్ఞాపకాలు యాది కొచ్చినయ్‌. ఇప్పుడే కాదు, ప్రతీ ఏడాదీ వచ్చే దసరా పండుగకు జయమ్మ జీవితంల గా పండుగ మిగిల్చిన చేదు గుళికల్లాంటి యాదులన్నీ పీడకలలై వేధిస్తుంటయి. దసరా పండుగంటే ఊర్ల అందరికీ సంబురాలు తెచ్చి పెట్టేది. కానీ, జయమ్మకు గతంల గా దినము తగిలిన ఎదురు దెబ్బనే గుండెల గునపం లెక్క గుచ్చుతుంటది.

జయమ్మ అమ్మనాయినోల్లది పాలమూరు జిల్లాల గోపులాపుర్‌ అనే చిన్న పల్లె. ఇద్దరు ఆడివిల్లలు, ఇద్దరు మొగపిల్లల ఎనకసిరి ఆఖరున పుట్టింది జయమ్మ. ఇంట్ల అందరికంటే చిన్నది, అన్నిట్ల హుషారుగుంటది. ఏ పని జెప్పినా శిట్టశిట్ట జేసి పెడతది. ఎర్రగ బుర్రగ లేకున్నా చామనఛాయ రంగుల ఉండి, మంచికళ మొకం ఆమెది. అదే జిల్లాకు చెందిన రామాపురంల కెల్లి పెద్దింటి సంబంధమొస్తే పదిహేనేండ్లకే ఆమెకు పెండ్లి జేసిన్రు జయమ్మ అమ్మ నాయిన రామచంద్రయ్య, కనకమ్మ. ఆ కాలంలనే ఊర్ల పెద్ద బంగ్లా, పెద్ద బట్టల దుకునం ఉండేది జయమ్మ అత్తగారోళ్లకు. నలుగురు ఆడివిల్లల ఎనక ఒక్కడే కొడుకాయే. వొచ్చే కోడల్ని కూతురు లెక్క జూస్కుంటమంటే ఇగ తమ బిడ్డ బంగ్లాల రాణి లెక్క బతుకుతదనుకున్నరు ఆలుమగలు. అనుకున్నట్లే ఆ ఇంటికి పెద్ద కోడలైనా, చిన్న కోడలైనా అన్నీ జయమ్మనే. కానీ, అత్త గంగమ్మ పెత్తనం ముంగట కోడలు కోడలు స్థానంలనే ఉండిపోయింది. గంగమ్మ భర్త మూడేండ్ల కిందనే జర సుస్తయ్యి కాలం జేసిండు. అంతకు మునుపే ఆడివిల్లలు నలుగురికీ పెండ్లిల్లు జేసింది. యాపారం, ఆస్తుల విషయాలన్నీ కొడుకు నర్సింహులే చూస్కుంటడు.
ఇగ పెండ్లయిన కొన్ని నెలలు మంచిగనే ఉన్న నర్సింహులు, గా తర్వాత ఒక్క దినం గూడ పెండ్లాంతోని సరిగ మాట్లాడిందే లేదు. కొన్నిసార్లయితే కనీసం ఆమె మొకం గిట్ల సూడకుండనే బయిటికి పోయ్యేది. ఎప్పుడో పొద్దున్నే “దుకునం కాడికి వోతున్నా” అని చెప్పి పోయి, మల్ల మాపటికి చీకటి వడ్డాక వొచ్చేటోడు. ‘దుకునం కాడ పని ఎక్వుంటదేమో’ అనుకున్నది జయమ్మ. పొద్దస్తమానం ఇంట్ల పనులన్నీ చేస్కొని పెనిమిటి కొరకు ఎదురు జూస్కుంట ఉండేది.
ఇట్లనే కొన్ని నెలలు గడిచిపోయినయి. రాను రాను నర్సింహులు జయమ్మకు ఒక అపరిచితుడు లెక్కనే అయిపోయిండు. చీకటి వడ్డాక వొచ్చేది, ఆ తర్వాత వారానికొకనాడు ఇంటికొచ్చి పోతుండేటోడు. ‘ఎందుకట్ల’ అంటాని పెనిమిటిని అడగడానికే అవకాశం లేదు, అత్తను అడిగే ధైర్నం లేదు. ఊర్లనేమో ‘నర్సింహులు ఊరికి కొత్తగొచ్చిన అంజనమ్మతోని ఉంటున్నడు’ అని అప్పుడప్పుడు పుకార్లు ఇనిపియ్యవట్టే. అంజనమ్మ జర సదువుకున్నామే. ఊర్ల పిల్లలకు టూషన్లు జెప్తుంటది. ఓనాడు అంజనమ్మ బట్టలు కొననీకే నర్సింహులు దుకునంకి వొచ్చింది. అట్ల పరిచయమయ్యి చిన్నగ ప్రేమగా మారి, ఇగ నర్సింహులు ఆమె తాననే ఉండుకమయ్యింది. కాని జయమ్మకు పెనిమిటి మీదున్న నమ్మకం ,చుట్టుపక్కలోల్ల చెప్పుడు మాటలమీద లేదు. అందుకే, ఆమె మనసు వాళ్లు మోసుకొచ్చే పుకార్లను అంగీకరించలేకపోయింది.

ఇగ గా ఏడాది ‘దసర పండుగ దగ్గర వడవట్టే’ అంటాని బిడ్డను, అల్లుడిని పండుగకు రమ్మని పిలువనీకే జయమ్మ నాయన రామచంద్రయ్య రామాపురంకి వొచ్చిండు. తండ్రిని జూడంగనే పుట్టెడు దుఃఖం పొంగుకొచ్చింది జయమ్మకు.
“బుగులు వట్టినవా జయమ్మ.. అట్ల ఏడ్వవడ్తివి!” అన్నడు రామచంద్రయ్య.
మనసులున్న బాధలు జెప్పి తండ్రిని పర్శాన్‌ జేయుడు ఇష్టం లేక, “అవ్వు నాయిన! చాన దినాలకు సూశ్న గద నిన్ను అందుకే..” అన్నది చీర కొంగుతోని కండ్లు తూడ్సుకుంట.
“ఏడ్వకు బిడ్డా! ఆడివిల్లలకు తప్పవు ఇయన్ని. వారం రోజులల్ల నవరాత్రులు షురువయితయి గద! నీవు, అల్లుడు రెండ్రోజుల మునుపే వొచ్చి పండుగైనాక వోవాలే సూడు బిడ్డ. నేను అల్లుడికి గుడంగ జెప్త” అన్నడు రామచంద్రయ్య, బిడ్డను చూసిన సంతోషంల తడిసిన కండ్లతోని.
జయమ్మ ఒకసారి అత్త మొకం సూశి, మల్ల తండ్రికెల్లి సూశి-
“అయినకు ఈలుగాదేమో నాయిన! చాన పనుంటుంది దుకునంల. ఇగ పండుగ పూట అంటే ఇంగింత పని ఎక్వుంటది” అన్నది చిన్నగ.
“అట్లనా! దుకునం కాడ పనోళ్లున్నరు గద? లేకుంటే నేను ఆడికే వొయి అల్లుడిని కలిషి జెప్తలే అయితే!”
“వొద్దు నాయిన! నేనే చెప్పి జూస్తలే! నీకు మల్ల బస్సుకు ఆల్శమైతది”
“నీ ఇష్టమైతే! ఇగో మీయమ్మ నీ కొరకు ముర్కులు, గరిజెలు జేశి పంపింది” అనుకుంట చేతిలున్న సంచి జయమ్మ కిచ్చిండు.
ఎనకసిరి గంగమ్మతోని జరసేపు మాట్లాడి-
“ఇగ నేను వొయ్యోస్త బిడ్డ!” అని జయమ్మకు జెప్పి ఊరికి బయలుదేరిండు.
తండ్రి వోతుంటే పుట్టింటోళ్లు యాదికొచ్చి చాన దుఃఖమొచ్చింది జయమ్మకు.
సూస్తుండగనే వారం ఎల్లిపాయే. నవరాత్రులు షురువయినయి.
‘పండుగ దినాలల్లనన్న పెనిమిటి ఇంటికొస్తడేమో’ అని కొండంత ఆశతోని ఎదురు చూసింది జయమ్మ, కానీ, లాభం లేకపాయే.
ఇగ ఊర్ల ఆడివిల్లలందరు ఎర్రమన్ను తీస్కపోయి అమ్మవారి గుడిల ఏడు మేడెల గౌరమ్మను తయారు జేసిన్రు. తర్వాత గౌరమ్మ ముంగటనే మట్టితోని జేసిన గుండప్ప (గణపతి)ని గుడంగ వెట్టిన్రు. పొలాలల్ల కెల్లి గాసగాండ్లతోని తెప్పిచ్చిన తంగేడుపూలు గౌరమ్మకు, గుండప్పకు సుట్టూ పేర్చి అలంకరణ జేసిన్రు. అందరిండ్లల్లకెల్లి అమ్మవారికి బచ్చాలు, పాశం, బెల్లమన్నం, శెనిగె గుగ్గిళ్లు.. ఇట్ల రకరకాల నైవేద్యాలు చేసుకొచ్చి పెట్టిన్రు. కన్నెపిల్లలు పట్టు లంగాలు, వోణీలు, పెళ్లయినోళ్లు పట్టుశీరలు గట్టి కుచ్చుల జడలేస్కొని కాళ్లకు, శేతులకు మైదాకు వెట్టుకొని గౌరమ్మకు పాటలు వాడుతుంటే.. సూడనీకే అందరు దేవతల్లెక్క గొట్టవట్టిన్రు. పూజయిన ఎనకసిరి ఆడోళ్లంత పసుపుల జరంత సున్నం గలిపి తయారుజేసిన సెంద్రంతోని చేతులమీద శిన్న శిన్న ముగ్గులేసుకుంటున్నరు.
“అగా.. పండ్గపూట మైదాకే వెట్కున్లేవానే! ఏంటికీ?” అంటాని జయమ్మను అడిగింది వోల్ల ఇంటి ముంగటుండే చిట్టెమ్మ.
అట్ల అడగంగనే పెనిమిటి యాదికొచ్చి జయమ్మ మనసు కలికలయి ఏం జెప్పకుండ గప్పుగుంది.
ఇగ ముత్తయిదువులు ఒకర్కొకరు తాంబూలాలు ఇచ్చుకొనుడు షురుజేస్తుండంగనే అంజనమ్మ గుడంగ గుడి కాడికొచ్చింది.
‘ఈమెనే అంజనమ్మంటే!’ అంటాని ఆడున్న ఇద్దరు ఆడోళ్లు గుసగుసగా అనుకుంటుంటే, ఆమెను సూశేటాలకు జయమ్మకు పానం కశిబిషయి ఇగ ఆడ ఉండబుద్దిగాలే. కానీ, పసుపు కుంకుమ తీస్కోకుండ పోవొద్దని బలంతంగ పానం బిగవట్కోనుంది.
ఇగ తొమ్మిది రోజులు దినాము గుడిల అమ్మవారికి అలంకరణలు, గౌరమ్మకు, గుండప్పకు పూజలు ఘనంగ జేసిన్రు. దినాము ఊరంత ఒక కుటుంబం లెక్కనే కలిషి పండుగ జేస్కుంటుంటే జయమ్మకు మంచిగన్పిస్తుండే. జరంతసేపు మనసులున్న బాధను పక్కన వెడ్తుండే.
ఇట్ల తొమ్మిది రోజులు గడిచి పోయినయి. పదో రోజు దసర పండుగ. గా దినం ఇగ గుడికి వోయి అమ్మవారి దర్శనం గిట్ల జేస్కొచ్చినాక ఒకరింటికి ఒకరు వోయి సంతోషంగ జమ్మి వెట్టి బంగారం (జమ్మి ఆకు) ఇచ్చి పుచ్చుకుంటుంటే ఊరంత చాన కళకళగున్నది.
“జయమ్మా! గీ ఇంట్ల మనకు తెల్షినోళ్లున్నరు వాళ్లకు గుడ జమ్మి వెట్టొద్దం పా!” అంటాని తోల్కవోయింది గంగమ్మ.
“అట్లెగే” అని అత్త ఎంబడి వోయింది జయమ్మ.
గదే టైంల ఆ ఇంటికి రెండిండ్లవతల ఇంట్లకెల్లి నర్సింహులు, అంజనమ్మ ముచ్చట వెట్టుకుంట, నగుకుంట బయిటి కొస్తుంటే, జయమ్మ సూశి కండ్లల్ల నీళ్లు వెట్టుకుంది. గంగమ్మకు గుడంగ గుండెల పిడుగు వడినట్లయింది. ఎంబటే ఆడికి వోయి కొడుకును నిలదీశింది.
“నేను అంజనమ్మను పెండ్లి జేస్కోవాలన్కుంటున్న” అన్నడు నర్సింహులు ఖచ్చితంగ.
ఇగ కొడుకు అన్నిటికి తెగించిండని అర్థమయ్యి, ఇప్పుడేమన్నా లాభం లేదని కోడలికి ధైర్నం జెప్పి ఇంటికి తోల్కవోయింది.
మరుసటి రోజు పదకొండో రోజయితది. జయమ్మ గా దినం పెండ్లయిన కొత్తల పెనిమిటి తెచ్చిన చిలకపచ్చ రంగు పట్టుచీర కట్టుకొని, కుచ్చుల జడేస్కొని, ‘కనీసం ఈ దినమన్న పెనిమిటి ఇంటికొచ్చి పోతడేమో..’ అని ఆశగ ఎదురు జూస్తుంది.
“యేమాయె జయమ్మ! అందరు వోతున్నరు గుడికాడికి పా జల్దీ!” అన్నది గంగమ్మ.
కోడలి పరిస్థితి ఎరుకున్నది గంగమ్మకు. కానీ, ‘ఇగ కొడుకు ఉన్నా లేనట్టే..’ అనుకుంది.
“వొస్తి అత్తమ్మ!” అని జెప్పుకుంట, పెనిమిటి కొరకు గుమ్మం దిక్కు జూస్కుంటనే పుట్నాల పొడి, బెల్లం కలిపి గురుగులు తయారు జేసింది. దాంట్లకు బొడ్డొత్తులు వెట్టి, నెయ్యి వోషి తాంబాలంల గుండ్రంగ వెట్టింది. ఇగ అవి వట్టుకొని చిన్నగ లేశి, గప్పుగ అత్త ఎంబడి గుడికి వోయింది. అమ్మవారికి అందరు తీస్కొచ్చిన గురుగులతోని పెద్ద హారతిచ్చి పాటలు వాడి, ఎనకసిరి పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకున్నరు. ఇగ దినాము గౌరమ్మకాడ వెట్టే పూలన్ని తీస్కపోయి గుడిలనే ఒక మూలకు వెట్టి, బరువు కొరకు దాంట్లమీద రాళ్లు వెట్టేటోళ్లు. గయి ఎండిపోయి తెప్పలాగ తయారయింది. పసుపుతోని గౌరమ్మను, గండప్పను చేసి, దొప్పలల్ల వెట్టి, బొట్లు వెట్టి, దీపాలు ముట్టిచ్చిన్రు. ఎండిపోయిన పూలతోని తయారైన తెప్పమీద ఇవన్ని వెట్టిన్రు. ఊర్ల పిల్లలు, పెద్దలు అందరు కలిసి మేడల గౌరమ్మ, గుండప్పతోసహా అన్నిటినీ గుడి కాడినుంచి కోలాటాలాడుకుంట, మంగళ వాయిద్యాలు వాయించుకుంట ఊరి బయట చెరువు కాడికి తీసుకపోయిన్రు. అన్నిటినీ చెరువుల ఇడిషి పెట్టిన్రు. ఒకపక్క చెరువుల గౌరమ్మను ఇడిషినాక నీళ్లల్ల తేలుకుంట తడుసుకుంట మునిగిపోతుంటే, జయమ్మకు పెనిమిటి యాదికొచ్చి గుండెలున్న బాధ కండ్లలకెల్లి ఉప్పొంగుకొచ్చింది.
తర్వాత చెరువు గట్టు కాడనే అందరు చెట్లకింద కూసోని, జోలి వెట్టుకుంట ఇంటికాడికెల్లి కట్టుకొచ్చుకున్న చిత్రన్నం, పిండొంటలు తింటుంటే జయమ్మకు, గంగమ్మకేమో నర్సింహులు యాదికొచ్చి గవేవి మింగుడు వడలేదు. ఇగ ఆడికెల్లి ఇంటికొచ్చినాక ఉలుకూ పలుకూ లేకుండ ఉన్న కోడల్ని సూస్తుంటే గంగమ్మకు మనసంత కలికలయింది.

-స్ఫూర్తి కందివనం, 9652745117

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ వారం కథ..చీకటి వెలుగులు
ఈ వారం కథ..చీకటి వెలుగులు
ఈ వారం కథ..చీకటి వెలుగులు

ట్రెండింగ్‌

Advertisement