e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. సాక్షాత్తు నారసింహుడే తన భక్తుడిని రక్షించుకుంటాడు. కానీ, రాజ్యంలో మాత్రం అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ భయం!

“వైశాఖ శుక్ల పక్షేతు చతుర్దశాం సమాచరేత్‌
మజ్జన్మ సంభవం, పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్‌”
“వైశాఖ శుక్ల చతుర్దశినాడు నేను ఈ నరహింహావతారంలో ఆవిర్భవించాను. నా జయంతి వ్రతాన్ని ఆచరించిన వారికి పాపాలన్నీ నశించి, పుణ్యం చేత మంచి జరుగుతుంది” అని సాక్షాత్తూ శ్రీ నరసింహ స్వామివారే ప్రహ్లాదునికి చెప్పారని ‘నృసింహపురాణం’లో ప్రకటితమైంది.
మహారాణివారు ఈ వ్రతం చేస్తే బాగుంటుందని, వారి కుటుంబానికి, రాజ్యానికి ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయని ఒక అదృశ్య సందేశం రామభట్టు మనసును తాకుతున్నది. ఏం చేయాలి?
నమ్మకం ఉండీ, పరిస్థితులు అనుకూలించక ‘నృసింహ జయంతి’ వ్రతం చేయకపోతే, దైవానుగ్రహం వల్ల ఆ స్థితిని అధిగమించవచ్చు.
కానీ, నమ్మకం కుదరలేదని రాణీవారు స్పష్టంగా చెప్పాక, తను మాత్రం ఏం చేయగలడు?
రామభట్టు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. చుట్టు ముడుతున్న కష్టాలను, హింస పెడుతున్న రోగాలను, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మనోవ్యాధులను, గ్రహపీడలనూ తొలగించుకోవడానికి జీవితాన్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా గడపడానికి.. నారసింహుడిస్తున్న అత్యద్భుత అవకాశం.. నారసింహ జయంతి వ్రతం!
రాణీగారు కాదన్నారు. ప్రభువులవారు ఎప్పుడొస్తారో తెలియదు. అసలు ఈ రాజకుటుంబం పడుతున్న కష్టాలకు అంతం ఎప్పుడు?
స్వామి అనుగ్రహం ఎప్పుడు?
ఎవరు చెప్పాలి దీనికి సమాధానం?
రామభట్టు అయోమయ స్థితిలో ఉన్నాడు.
ఆ సమయంలో..
విద్యాపతి దగ్గర్నించి పిలుపొచ్చింది. ఉన్నపళంగా రమ్మని!
విద్యాపతి సమక్షంలో ఉన్నాడు మరుక్షణం.
“కవిగారూ.. నన్ను అత్యవసరంగా రమ్మని పిలిచారట. కారణం తెలుసుకోవచ్చునా?”
విద్యాపతి ఆగ్రహంతో ఉన్నాడు. రామభట్టును చూస్తూనే ఒంటికాలిమీద లేచాడు.
“ఏం పెద్దమనిషివయ్యా నువ్వు? లేనిపోని కలలు, కథలు చెప్పి ప్రభువులవారిని అడవులకు పంపించావ్‌. వ్రతమో.. పూజో.. ఏదో చెప్పి రాణీవారిని విసిగిస్తున్నావ్‌. అర్థం పర్థం లేని మూఢ విశ్వాసాలను ముందుకు తెచ్చి, మమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతున్నావ్‌. నీ సంగతి తెలియక, మహారాణివారు నీకు నిర్బంధం నుంచి స్వేచ్ఛ కల్పించారు. పోనీ, అంతటితో వెళ్లిపోకుండా అవకాశం లేనిచోట పూజలు, వ్రతాలు చేయాలని చెప్తున్నావ్‌. సరే, నువ్వీ పనులు ఉద్దేశ పూర్వకంగా చేయలేదని మేము నమ్ముతున్నాం. కనుక, నీ తల తీసేయకుండా వదిలేస్తున్నాం. నీకు కేటాయించిన స్వయంపాకం అంటే బియ్యం, ఉప్పులు, పప్పులు, వంట దినుసులు రద్దు చేస్తున్నాం. వెళ్లిపో!”
రామభట్టు నిర్వికారంగా విద్యాపతిని చూస్తూ ఒకడుగు వెనకకు వేశాడు.
“నీ ఊరు చేరడానికి నీకు రెండు రోజులు పడుతుంది. నిరాహారంగా నీ గ్రామానికి నడక సాగించు. అప్పుడుగానీ ప్రభువులవారి పరిస్థితి, మనఃస్థితి నీకర్థం కావు.. వెళ్లు” గద్దించి పలికాడు విద్యాపతి.
అందుకు సమాధానంగా చిరునవ్వు.
అది చూసి కోపం అవధులు దాటింది విద్యాపతికి..
“ఏమిటీ అవిధేయత? ఎందుకు
నవ్వుతున్నావ్‌?”
“మన్నించండి. రెండు రోజులు నన్ను ఆహారం లేకుండా ఉండమని శిక్ష విధించారు. అది నాకు వరం. నేను కోరుకున్నది కూడా అదే! ఈరోజు త్రయోదశి. రేపు చతుర్దశి. దేవాధిదేవుడు శ్రీ నారసింహుడి జయంతి. ఎలాగూ నేను ఉపవాస దీక్షలో ఉండాలి, వెళ్తాను. నారసింహ జయంతి వ్రతం ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఎవరి గురించి ఎవరు ఈ వ్రతం చేసినా ఫలితం ఆ ఇద్దరికీ వస్తుంది. అంటే, వ్రతం మనది. ఫలం అందరిదీ! సెలవిప్పించండి” ఆ మాట అంటూ రెండు చేతులూ జోడించి, అక్కణ్నించి బయల్దేరాడు రామభట్టు.

ఉగ్రంవీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యు మృత్యు నమామ్యహం!
ఒక్కొక్క అక్షరమూ స్పష్టంగా, పరమభక్తితో పలుకుతున్నాడు త్రిభువనుడు.
ఆ కొండపైన ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈనాడే నరసింహ జయంతి శుభ పర్వదినం!
అపూర్వమైన నారసింహ జయంతి వ్రతకథను వైష్ణవ నామాల వృద్ధుడు త్రిభువనమల్లుడికి వివరంగా తెలియజెప్పాడు.
“నాయనా! త్రిభువనమల్ల చక్రవర్తీ! నీ సంకల్పం అద్వితీయం. తిరుగులేనిది. శ్రీనారసింహుడి వ్రతం చేయడానికి వారు, వీరు అని భేదం లేదు. అన్ని వర్గాలవారు ఆనందంగా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు”
“ఈ వ్రత విధానం ఏమిటి?” భక్తితో అడిగాడు త్రిభువనుడు.
శ్రీనరసింహస్వామిని మనసారా స్మరించి, భక్తితో వ్రత విధానాన్ని వివరించాడు ఆ భాగవతోత్తముడు.

నైమిశారణ్యంలో ఋషులందరూ శౌనక మహర్షివారి నాయకత్వంలో సూతమహామునిని ప్రార్థించారు.
“మహామునీశ్వరా! మీకు శతసహస్ర ప్రణామాలు. కలికాలంలో అనేక బాధలు, కష్టాలు, ఉత్పాతాలు ఏర్పడి, మనుషులందరికీ మనఃశ్శాంతి లేకుండా చేస్తాయి కదా! వాటినుండి మానవజాతి ఎలా ఉపశమనం పొందగలదు? ఏ వ్రతం చేస్తే మనుషులు సుఖసంతోషాలతో ఉండగలరు?”
ముక్తకంఠంతో వారు అడిగిన ప్రశ్నలకు సూత మహాముని చిరునవ్వుతో సమాధానాలను వివరించారు.
“దుష్టగ్రహపీడల నుండి, విషవాయువులద్వారా వ్యాప్తి చెందే సూక్ష్మక్రిమి కీటక జనిత తీవ్రవ్యాధుల నుండి, మనలను శ్రీనారసింహుడొక్కడే తన అమేయ కృపాకటాక్షాలతో అనుగ్రహించగలడు. స్వామివారు తానే స్వయంగా ప్రహ్లాదునికి ఈ వ్రత విధానాన్ని అనుగ్రహించాడు. ఆ క్రమం ఇదీ..
వైశాఖశుక్ల చతుర్దశినాడు ప్రదోష కాలంలో శ్రీ నరసింహావతారం ఆవిర్భవించింది. మహా పుణ్యకరమైన రోజు.. ముందురోజు ఒంటిపూట భోజనం చేయాలి. రాత్రి స్వామివారి నామస్మరణ చేస్తూ, చాలా కొద్ది మొత్తంలో తిలలు (నువ్వులు) తినాలి. స్వామికి ఆరగింపు చేసిన పాలను తాగాలి. మిత్రులతో, కుటుంబసభ్యులతో కలిసి దీపం వెలిగించి, ప్రహ్లాదుని కథ చెప్పుకోవాలి. ప్రహ్లాదుని కాపాడిన శ్రీలక్ష్మీ నరసింహుని నామస్మరణ చేస్తూ భజనలు చేయాలి.
మరునాడు అంటే వైశాఖశుక్ల చతుర్దశినాడు ఉదయం ‘ఓం నమో నారసింహాయ’ దివ్యమంత్రాన్ని నూట పదహారు సార్లు మనసులో అనుకోవాలి. తరువాత భార్యాభర్తలు, పిల్లలు, ఇంట్లో ఉండే పెద్దవారితో కలిసి శ్రీనరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించాలి. స్వామివారికి శక్తికొద్దీ కానుకలు సమర్పించాలి. ఒక పదకొండు కాసులైనా సరే, స్వామికి హృదయపూర్వకంగా సమర్పించి, ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి.
ఆ రోజునుండి తొమ్మిది రోజుల దీక్ష తీసుకోవాలి. దీక్ష నియమాలు స్వామివారి అనుగ్రహాన్ని పొందే విధంగా నియమనిష్ఠలతో పాటించాలి. ఆ సంవత్సరం దీక్షకు పరిస్థితులు అనుకూలించనివారు స్వామికి నమస్కారం చేసి, ప్రదక్షిణలు చేసి ‘వచ్చే యేడాది దీక్ష తీసుకొనే అదృష్టం ప్రసాదించు స్వామీ’ అని మొక్కుకోవాలి.
దీక్ష నియమాలు ఇవి..
(1) స్వామివారి మాల ధరించాలి
(నరసింహ స్వామివారి బొమ్మతో..)
(2) ధరించే వస్త్రంలో స్వామి చిత్రపటం ఉంచుకోవాలి.
(3) శాకాహారం మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూట పసుపు కలిపిన పాలు తాగాలి.
(4) ఉదయం తెల్లవారు జామునే లేచి, స్నానం చేసి, స్వామివారి విగ్రహం కానీ, చిత్రపటం కానీ పూజామందిరంలో స్థాపించుకొని దీపారాధన చేయాలి.
(5) దీక్ష చేసినన్ని రోజులు రోజుకొకరికి భోజనం పెట్టాలి. లేదా ఏదో ఒకరోజు తొమ్మిది మందికి శక్తికొద్దీ ‘స్వయం పాకం’ దానం చేయాలి. (బియ్యం, పప్పులు, బెల్లం, నూనె వంటివి)
(6) బాల ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహావతారం దాల్చిన స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి బాలలకు విద్యాదానం చేయాలి. శక్తికొద్దీ విద్యార్థులకు గ్రంథాలు, కలాలు కొనడానికి, గురుదక్షిణ చెల్లించడంలో సహాయం చేయాలి.
(7) నవ నారసింహుల అనుగ్రహం కోరి మనం చేస్తున్న ఈ దీక్ష అతిపవిత్రమైంది. దీక్ష మొదటిరోజు మనకు విద్య నేర్పిన గురువులకు, కన్న తల్లిదండ్రులకు నూతన వస్ర్తాలు బహూకరించి, పాద నమస్కారం చేయాలి. అది వీలుకాని పక్షంలో ఏదైనా ఫలాన్ని వారి చేతుల్లో ఉంచి, పాద ప్రణామం చేయాలి. దీక్ష ఆఖరిరోజు తనకు ధర్మపత్నిని అనుగ్రహించిన, ‘కన్యాదానం’ చేసిన అత్తామామలకు నూతన వస్ర్తాలు కానీ, ఫలపుష్పాదులు కానీ సమర్పించి, ఆశీస్సులు అందుకోవాలి.
(8) దీక్ష తీసుకున్న రోజునుండి తొమ్మిదో రోజు లోపల, వైద్యం చేయించుకుంటున్న వ్యక్తులకు ఫలాలు కానీ, ఔషధం కానీ సమకూర్చాలి.
(9) తొమ్మిదో రోజున కొండపై వెలసి, యాదర్శిని అనుగ్రహించిన యాదాద్రిస్వామిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలి.
ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వారు అన్ని కష్టనష్టాల నుంచి బయటపడి సుఖ సంతోషాలను పొందగలరు.
ఈ వ్రత నియమాల మాలను ధరించే ప్రతి భక్తుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తాడు. వారు ఏ వర్గమైనా, ఏ కులవృత్తిని పాటించేవారైనా, పేదలైనా, ధనికులైనా, విద్యాధికులైనా, విద్యార్థులైనా, వివాహితులైనా, అవివాహితులైనా.. అందరూ ఈ దీక్షకు అర్హులే. స్వామివారి అనుగ్రహానికి పాత్రులే!
ఇక నారసింహ జయంతి రోజున అంటే, దీక్ష ప్రారంభం రోజున పూజాస్థలాన్ని ఆవుపేడతో అలికి శుద్ధి చేసి అష్టదళ పద్మం పెట్టి కలశ స్థాపన చేయాలి. ఎనిమిది రేకులున్న పువ్వును ముగ్గుతో వేసుకోవాలి. కలశంలో స్వచ్ఛమైన నీటిని నింపి, శ్రీనారసింహ స్వామివారి చిన్న విగ్రహాన్ని దానిలో ఉంచాలి. బంగారం, వెండి, రాగితో చేసిన విగ్రహం లేదా చిన్న రాయిని తులసి ఆకుల నీటితో కడిగి కుంకుమతో నామం దిద్ది పూజ చేయవచ్చు.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి స్ర్తోత్రాలు చదివి, ప్రసాదం పంచి పెట్టాలి. వ్రతం పూర్తి చేసిన తర్వాత, శక్తికొద్దీ బంధుమిత్రులకు భోజనం పెట్టాలి. వ్రతాన్ని ఆచార్యుని సహాయంతో, ఆశీర్వాదంతో సత్సంకల్పంతో నిర్వహించాలి.

సూత మహాముని చెప్పిన విధానాన్ని ఆధునిక కాలానికి అన్వయించుకొని, భాగవతోత్తముడైన వృద్ధుడు.. త్రిభువనుడికి బోధించాడు.
ఈ ‘నరసింహ జయంతి’ వ్రతం గురించి వింటేనే ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది.
“మహానుభావా! మీరు తెలిపిన ఈ వ్రత విధానం అద్భుతం. దీనిని నేను సతీసమేతంగా నిర్వహిస్తాను. తక్షణమే స్వామి దర్శనం చేసుకొని కోటకు బయలుదేరుతాను” ఉద్విగ్నంగా పలికాడు త్రిభువన మల్లుడు.
“తప్పకుండా, నీ కోరిక నెరవేరుతుంది” అంటూ ఆ నామాల పెద్దాయన తన బొటనవేలితో త్రిభువనుడి నుదుట తిరునామం దిద్దాడు.
“ఓం నమో నారసింహా!” అంటూ కొండగుహలోకి వెళ్లాడు త్రిభువనుడు.
ఆయన అలా నడుచుకుంటూ గుహలోకి వెళ్తుండగా ఓంకార నాదం వినిపించింది.
‘ఏమిటీ అద్భుతం?’ అనుకుంటూ లోపలికి అడుగుపెట్టిన త్రిభువనుడు గుహలో కొలువైన పంచనారసింహుల దివ్యరూపాలను చూస్తూ మైమరిచిపోయాడు.
కనులముందు ఒక అపూర్వదృశ్యం సాక్షాత్కరించింది.
తప్తహాటక కేశాంత జ్వలత్పావకలోచన
వజ్రాధికన స్పర్శ దివ్యసింహ నమోస్తుతే!

అనంతపాలుడు, భువనగిరి సర్వసైన్యాధ్యక్షుడే అయినప్పటికీ యుద్ధ ప్రణాళికలన్నీ సార్వభౌముడు త్రిభువన మల్లుడే రచించేవాడు. కాకపోతే, ఎదుటివాడు ఎంత అరివీర భయంకరుడైనా, ఎదిరించి పోరాడి గెలిచే సత్తా ఉన్నవాడు అనంతపాలుడు.
‘ప్రభువులవారిని కలిసి, నారసింహుడి దర్శనం అయినా, కాకపోయినా ఆయనను తిరిగి కోటకు తీసుకువెళ్లి తీరాలి’ అనే దృఢ సంకల్పంతో వచ్చాడు ఈ కొండకు.
అయితే, అతడికి ఆదిలోనే హంసపాదు
ఎదురైంది.
అడవిలో కొద్దిగా ముందుకు వెళ్లాడో లేదో వేగుల దళం వెంటపడి ఆపింది. రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగే సమర్థవంతమైన రహస్య గూఢచారుల వ్యవస్థ ఏర్పాటు చేసి ఉన్నాడు త్రిభువనుడు.
ఆ వేగుల దళమే అనంతపాలున్ని ముందుకు పోకుండా ఆపింది.
“సైన్యాధ్యక్షా! ఒక ముఖ్య సమాచారం మీ దృష్టికి తీసుకొని రావాలని ఇలా వేగంగా వచ్చాము” వినయంగా అన్నాడు వేగుల దళనాయకుడు వీర గండడు.
“ఏమిటీ ఆ ముఖ్యమైన సమాచారం” తన మార్గానికి అడ్డం వచ్చినందుకు అసహనంతో అడిగాడు అనంతపాలుడు.
“మన శత్రురాజు విష్ణువర్ధనుడు దండయాత్రకు బయలుదేరాడు.
తుంగభద్రా తీరాన ఉన్న సరిహద్దు దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈరోజు ఉదయమే రక్షణ దళాన్ని సంహరించి, భువనగిరిని స్వాధీనం చేసుకోవడానికి సర్వ సైన్యాలతో బయలుదేరాడు..”
ఒక్కసారిగా పిడుగు పడినట్టు అయ్యింది.
అనంతపాలుడు క్షణకాలం నిర్విణ్ణుడయ్యాడు.
“ఈ విషయం రాణీవారికి తెలిసిందా?”
“లేదు.. ముందుగా మీకే తెలియపరుస్తున్నాం”
ఆ మాట పూర్తి కాకుండానే అనంతపాలుడు తన గుర్రాన్ని బలంగా ఓ చరుపు చరిచాడు.
అది పెద్దగా సకిలిస్తూ..
దుమ్ము రేపుకుంటూ కొండ దిగి పోయింది.

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement