e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home కథలు ఋణం

ఋణం

ఋణం

“ఏమండీ.. ఇవ్వాళ కత్తికి పదును పెట్టిస్తానన్నారు. మర్చిపోకండి. రాత్రి దానితోనే పనసకాయ కొట్టాలి” అన్నది వర్ధనమ్మ వంటింట్లోంచి.
“ఆ.. గుర్తుంది. బయటికెళ్లేటప్పుడు పట్టుకెళ్తాను” అన్నారు వెంకటరమణ మాస్టారు.
ఐదు నిమిషాలు గడిచాక, కత్తిని సంచిలో పెట్టుకొని కమ్మరి రంగయ్య దగ్గరకు బయల్దేరారు మాస్టారు. రేపు మాస్టారు తండ్రిగారి తద్దినం. ఇంటిపక్కనుండే మల్లయ్య నిన్ననే పనసకాయ, అరటికాయలు, అరటి ఆకులు ఇచ్చి వెళ్లాడు.
ఇంట్లో పనులుంటాయని ఇవ్వాళ్ల, రేపు సెలవు పెట్టారు మాస్టారు.
మాస్టారు వెళ్లేసరికి కొలిమి నిప్పులో ఇనుపముక్కను కాలుస్తున్నాడు రంగయ్య. తన కొడుకు సుధాకర్‌ కొలిమి చక్రాన్ని తిప్పుతున్నాడు. చక్రం తిరుగుతుంటే బ్లోయర్‌ద్వారా గాలి పొయ్యిలోకి వెళ్లి నిప్పుల్ని కణకణ మండిస్తోంది. మాస్టార్ని కూర్చోమని సైగ చేశాడు రంగయ్య. తన సంచిని కింద పెట్టి ముక్కాలు పీటమీద కూర్చున్నారు మాస్టారు. నిప్పుల్లో బాగా కాలిన ఇనుపముక్కను పట్టుకారుతో బయటకు తీసి, ఇనుప దిమ్మమీద పెట్టాడు రంగయ్య. తన కొడుక్కేసి చూసి ‘రా’ అన్నట్టు తలూపాడు. వెంటనే సుధాకర్‌ బలమైన పెద్ద సుత్తి తీసుకొని, ఎర్రగా కాలిన ఇనుపముక్క మీద బలంగా కొట్టాడు. అతను వేసిన ప్రతి దెబ్బతోపాటు రంగయ్యకూడా తన కుడిచేతిలోని సుత్తితో ఆ కాలిన ఇనుపముక్కను తనకు కావాల్సిన విధంగా కొట్టాడు.
మూడు నిమిషాలు గడిచాక ఇనుపముక్కను పట్టుకారుతో అటూఇటూ తిప్పి చూసి సంతృప్తి చెందాడు రంగయ్య. వెంటనే దాన్ని పక్కనున్న నీళ్ల గిన్నెలో ముంచడంతో సరసరమని శబ్ద వచ్చింది.
అప్పుడు మాస్టారు కేసి తిరిగి, “ఏంటి మాస్టారు ఇలా వచ్చారు” అని అడిగాడు రంగయ్య.
మాస్టారు సంచిలోంచి కత్తి తీసి “దీనికి పదును పెట్టాలి” అంటూ రంగయ్య కిచ్చారు.
సుధాకర్‌వైపు తిరిగి “ఈ రోజు బడికి వెళ్లలేదా?” అని మళ్లీ అడిగారు.
సుధాకర్‌ ఏమీ మాట్లాడలేదు.
మాస్టారిచ్చిన కత్తికి ఆకురాయితో పదును పెడుతూ, “నేనే మానెయ్యమన్నానండీ. నాకు పనిలో సాయం చేయమన్నాను” అన్నాడు రంగయ్య.
మాస్టారు ఆశ్చర్యపోయారు రంగయ్య
మాటలకు.
“గతంలో నేను వచ్చినప్పుడు మీ అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడని చెప్పావు. ఈయేడు పదో తరగతిలో ఉండాల్సిన వాడిని ఇలా స్కూల్‌ మాన్పించడం ఏం బాగా లేదు రంగయ్యా” అన్నారు.
“ఏం చెయ్యమంటారు మాస్టారు? మా ఆవిడ ఉన్నప్పుడు నాకు పనిలో సాయం చేసేది. నిరుడు అది పోయాకా ఒంటరివాణ్ని అయ్యాను. పనిలో సాయానికి ఎవరినైనా రమ్మంటే ‘రోజుకు రెండు వందలిస్తావా?’ అని అడుగుతున్నారు. నాదే అంతంత మాత్రం సంపాదన. అంత డబ్బిచ్చి మనిషిని పెట్టుకోలేక నా కొడుకునే చదువు మాన్పించి పనిలో పెట్టుకున్నా. మరి మేమిద్దరం బతకాలి కదా మాస్టారూ! నాకు వేరే ఏ పనీ రాదు. కూలీ పనికి వెళ్లే బలం కూడా లేదు. దివ్యాంగుడ్ని కదా!” అన్నాడు రంగయ్య బాధగా.
‘నిజమే! రంగయ్యకు పోలియోతో ఒక కాలు సన్నగా ఉంటుంది. కూర్చొనే పనులు చేయగలడు. సుధాకర్‌ బాగా చదువుతాడు. కానీ, తండ్రికోసం గ్రహణం పట్టిన సూర్యుడిలా ఉండిపోయాడు. దీనికి ఏదో పరిష్కారం చూడాలి’ అని మనసులోనే నిశ్చయించుకొన్నారు మాస్టారు.
“సుధాకర్‌.. నీకు చదువుకోవాలని ఉందా?” అని మళ్లీ ఆయనే అడిగారు.
ఆనందంగా తలూపాడు సుధాకర్‌.
రంగయ్య వద్దన్నా వినకుండా ఇరవై రూపాయలు అతని చేతిలో పెట్టారు మాస్టారు.
“సుధాకర్‌.. నువ్వు పదో తరగతి పరీక్షలకు ప్రైవేట్‌గా హాజరవుదువు గానీ. పగలు మీ నాన్నకు సాయం చెయ్యి. రాత్రి మా ఇంటికి వచ్చి చదువుకో. పుస్తకాలు నేను కొనిస్తాను. ఫీజుల సంగతి నేనే చూస్తాను” అని భరోసా ఇచ్చి ఇంటికి బయల్దేరారు మాస్టారు.
మర్నాడు తన ఇంట్లో తద్దినం హడావుడి అయ్యాక, సాయంత్రం పుస్తకాల దుకాణానికి వెళ్లి పదో తరగతి పుస్తకాలు, నోట్స్‌ పుస్తకాలు కొన్నారు మాస్టారు.

సుధాకర్‌కు కబురు చేసి వాటిని అందించారు.
“సుధాకర్‌.. విద్య మనిషికి మూడో కన్ను. మీ నాన్న కాలంలో సమాజ పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా ఉంది. మనిషి ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే ఉన్నత విద్య నేర్వాలి. నువ్వు ఎంతవరకు చదువుకుంటే, అంతదాకా నేను చదివిస్తాను. నా పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాల్లో ఉన్నారు. అందుకని, నువ్వు మొహమాట పడాల్సిన పని లేదు. చదువుమీదే దృష్టి పెట్టు” అన్నారు మాస్టారు.
ఆయన మాటలు సుధాకర్‌లో నూతనోత్సాహాన్ని నింపాయి. మాస్టారు ఎమ్మెస్సీ, బీఈడీ చేశారు. హిందీ తప్ప అన్ని సబ్జెక్టులనూ సుధాకర్‌కు బోధించేవారు. ప్రతి ఆదివారం పక్కవీధిలో ఉన్న హిందీ పండిట్‌ నరసింహం గారి దగ్గర హిందీ నేర్చుకునేవాడు సుధాకర్‌.
ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు మాస్టారింటికి వచ్చి రాత్రి తొమ్మిది గంటల వరకూ చదువుకొనేవాడు సుధాకర్‌. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మాత్రం పూర్తిగా మాస్టారింట్లోనే ఉండి చాలా శ్రద్ధగా చదువుకున్నాడు. రోజూ తెల్లవారు జామున మాస్టారు అతన్ని నిద్ర లేపి చదివించారు. మాస్టారి భార్య వర్ధనమ్మగారు కూడా సుధాకర్‌ను ఎంతో ఆదరంగా చూశారు.
మాష్టారు ఆశించిన మేరకు సుధాకర్‌ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు. ఆ తర్వాత ఇంటర్‌మీడియట్‌, డిగ్రీకూడా ప్రైవేట్‌గానే చదివి పాసయ్యాడు.

“డిగ్రీ పూర్తి చేశావు. ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు?” అడిగారు మాస్టారు.
“యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాయాలనుకుంటున్నాను సార్‌..” వినయంగా అన్నాడు సుధాకర్‌.
అతని మాటలకు చిన్నగా నవ్వి,
“గుడ్‌. మంచి ఆలోచన. దానికి చాలా కృషి చేయాలి. ముందుగా నువ్వు ఏదైనా కాలేజీలో చేరి పీజీ చెయ్యి. నీకు లోకం తీరు తెలుస్తుంది. సమాజం పట్ల మరింత అవగాహన పెరుగుతుంది” సలహా ఇచ్చారాయన.
“ఇప్పటికే మీమీద నేను చాలా భారం మోపాను. కాలేజీలో పీజీ చదువంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇన్నాళ్లూ నాన్నకు సాయం చేస్తూ వచ్చాను. నేను వెళ్లిపోతే నాన్న పరిస్థితి ఎలా?” సందిగ్ధంగా ఆగిపోయాడు సుధాకర్‌.
అతని మొహంలో విచార మేఘాలు కమ్ముకున్నాయి.
అది చూసిన మాష్టారు ఆప్యాయంగా సుధాకర్‌ భుజం మీద చెయ్యి వేశారు. ఆయన స్పర్శ అతనిలో వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చినట్టయ్యింది.
“చూడు సుధాకర్‌.. మీ నాన్నకు దివ్యాంగుల పింఛన్‌ వస్తున్నది. తెల్లరేషన్‌ కార్డుతో తక్కువ ధరకు బియ్యం వస్తాయి. శివాలయం వీధి సెంటర్‌లో చిన్న బడ్డీకొట్టు అమ్మకానికొచ్చింది. మొన్ననే కొన్నాను. ఆ కొట్టులో మీ నాన్న కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూజా సామగ్రి అమ్ముకోవచ్చు. పెద్దగా శ్రమ పడాల్సిన పని ఉండదు. వ్యాపారానికి కావాల్సిన డబ్బులు నేనిస్తా. నువ్వు మీ నాన్నకోసం బెంగ పెట్టుకోకు. మీ నాన్నను నేను కని పెట్టుకొని చూస్తాను. సరేనా?” అంటూ భరోసా ఇచ్చారు.
‘మాస్టారు నా కోసం, నా తండ్రి భవిష్యత్తు కోసం ఎంత పకడ్బందీగా ఆలోచిస్తున్నారో కదా..’ అన్న భావన రాగానే సుధాకర్‌ కండ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే మాస్టారు పాదాలకు నమస్కరించి దుఃఖించసాగాడు సుధాకర్‌. మాస్టారు అతని భుజాలు పట్టుకొని పైకి లేపారు.
“మాస్టారూ.. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేను..” అన్నాడు సుధాకర్‌ సజలనయనాలతో.
“నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నదే నా కోరిక. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివితేనే ఉన్నత ఉద్యోగాలు వస్తాయన్న భ్రమను నువ్వు పటాపంచలు చేయాలి. గ్రామాల్లోకూడా విద్యారత్నాలున్నాయని నువ్వు నిరూపించాలి” ఉద్వేగంగా అన్నారు మాస్టారు.
“తప్పకుండా విజయం సాధించి మీ పేరు నిలబెడతాను..” స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పాడు సుధాకర్‌.

రెండేండ్లు గిర్రున తిరిగాయి.సుధాకర్‌ ఎంఏ పాలిటిక్స్‌తో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. రంగయ్యకూడా కొత్త వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు.
మాస్టారు స్నేహితుడి కొడుకు సూర్యతేజ విశాఖపట్నంలో సివిల్స్‌ పరీక్షలకు వెళ్లేవారికోసం కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టి, చాలా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు సుధాకర్‌ను తీసుకొని విశాఖపట్నం వెళ్లి, సూర్యతేజను కలిసి వాళ్ల ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు మాస్టారు. ఫీజులు అన్నీ మాస్టారు కట్టారు.
సుధాకర్‌ చాలా పట్టుదలతో చదివాడు. సూర్యతేజకూడా మాస్టారు చెప్పడం వల్ల అతనిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధించాడు. అందరి ఆశలూ ఫలించి, పరీక్షలు బాగా రాసి ఐపీఎస్‌కు సెలక్టయ్యాడు సుధాకర్‌.సుధాకర్‌ విజయానికి వెంకటరమణ మాస్టారు, రంగయ్యతోపాటు శివపురం ప్రజలంతా ఆనందించారు.శిక్షణ పూర్తయిన తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో ఏఎస్పీగా విధుల్లో చేరాడు సుధాకర్‌.

కాలచక్రంలో సంవత్సరాలు వేగంగా గడిచిపోతున్నాయి. మాస్టారి ఇద్దరు కొడకులూ పెండ్లిళ్లు చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. మాస్టారు ఉద్యోగ విరమణ రోజున మాత్రం వచ్చి వెళ్లారు. సుధాకర్‌కు శ్రీకాకుళం ఎస్పీగా ప్రమోషన్‌ వచ్చింది. తండ్రిని కూడా తనతోనే తీసుకెళ్లిపోయాడు సుధాకర్‌. రెండేండ్లు గడిచాయి.ఒకరోజు మాస్టారుగారి భార్య నిద్రలోనే ప్రాణాలు విడిచారు. విషయాన్ని కొడుకులిద్దరికీ ఫోన్‌ చేసి చెప్పారు మాస్టారు. కాసేపటికి పెద్ద కొడుకు ఫోన్‌ చేశాడు.
“ఇండియా రావడానికి విమాన టికెట్లు దొరకడం లేదు. కార్యక్రమాన్ని బంధువుల చేత చేయించండి. పదో రోజుకు నేనూ, తమ్ముడు వస్తాం” అని చెప్పాడు. ఆ మాటలతో మాస్టారుకు వాళ్లమీద విరక్తి కలిగింది.
తమ్ముడి కొడుకుతోనే తన భార్య అంత్యక్రియలు జరిపించారు మాస్టారు.
మాస్టారుగారి భార్య చనిపోయారన్న విషయాన్ని ఆయన స్నేహితుడు రామకృష్ణ చెప్పిన వెంటనే శివపురంలో వాలిపోయాడు సుధాకర్‌. పది రోజులు మాస్టారు దగ్గరే ఉన్నాడు. పదో రోజుకు మాస్టారు కొడుకులు అమెరికానుంచి వచ్చి, మూడు రోజులు కార్యక్రమాలు చేసి వెళ్లి పోయారు. వారి ప్రవర్తనకు రామకృష్ణ ఆశ్చర్యపోయాడు. భార్య చనిపోయిన తర్వాత మాస్టారు చాలా మూడీగా ఉంటున్నారు. వెనుకటి ఉత్సాహం తగ్గింది. ఒకరోజు బాత్రూమ్‌లో జారి పడిపోయారు. కుడికాలు ఫ్రాక్చరయ్యింది. రామకృష్ణ కుటుంబసభ్యులే మాస్టారు మంచిచెడ్డలు చూస్తున్నారు.

కాలం మరింత వేగంగా పరిగెడుతూనే ఉంది.మాస్టారుకు 70 ఏండ్లు వచ్చాయి. సుధాకర్‌కు డీఐజీగా ప్రమోషన్‌ వచ్చింది. రెండు నెలలకు ఒకసారి శివపురం వచ్చి మాస్టారును చూసి వెళ్తున్నాడు. ఒకరోజు మాస్టారు, రామకృష్ణ లోకాభిరామాయణం మాట్లాడుకున్నాక టాపిక్‌ పుణ్యక్షేత్రాలవైపు మళ్లింది.“రామకృష్ణ గారూ, మీరు కాశీ వెళ్ళారా?” అడిగారు మాస్టారు.
“లేదండి. మీరు..?”
“నేనూ వెళ్లలేదండీ.. ఎప్పుడూ ఏవో పనులతో సరిపోయేది. ఇప్పుడేమో హ్యాండ్‌ స్టిక్‌ సాయం లేనిదే నడవలేక పోతున్నాను. మా అబ్బాయిల సంగతి మీకు తెలుసుగా! డాలర్ల సంపాదన మీదున్న శ్రద్ధ కన్నతండ్రిమీద లేదు. జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లి, గంగలో స్నానం చేసి విశ్వనాథుడ్ని దర్శించాలంటారు. మా తమ్ముడు నడివయసులోనే చనిపోయాడు. మా నాన్నగారికి నేనైనా గయలో పిండప్రదానం చేయాలి. ఎప్పటికి ప్రాప్తమో? ఏమిటో?” ఆవేదనగా అన్నారు మాస్టారు.
ఓ గంట గడిచాక రామకృష్ణ తన ఇంటికి వెళ్లినా, మాస్టారు మాటలే ఆయన చెవిలో మారుమోగుతున్నాయి.
ఎప్పుడూ ధైర్యంగా ఉండే మాస్టారు ఈరోజు బేలగా మాట్లాడటం ఆయన్ని కలచి వేసింది.
తను హార్ట్‌ పేషెంట్‌. లేకపోతే తనే ఆయన్ని కాశీకి తీసుకుని వెళ్లేవాడు. ‘మరి ఇప్పుడు ఎలా?’ అనుకుంటూ చాలాసేపు ఆలోచించాడు రామకృష్ణ. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి, సుధాకర్‌కు ఫోన్‌ చేశారు.
“నమస్తే రామకృష్ణ గారు.. మా మాస్టారు కులాసాగా ఉన్నారా?” కంగారుగా అడిగాడు
సుధాకర్‌.
“ఆ.. మీ మాస్టారు బాగానే ఉన్నారు. నువ్వేమీ కంగారు పడకు. కానీ, నువ్వో పని చేయాలి. ఆయనకు కాశీ యాత్ర చేయాలని చాలా కోరికగా ఉంది. ఆయన నిన్ను అడగరు. చాలా అభిమానం గల మనిషి. నువ్వే పూనుకొని ఆయన్ని కాశీకి తీసుకెళ్లి, విశ్వనాథుడి దర్శనం చేయించు. ఒకరి తోడు లేకుండా ఆయన వెళ్లలేరు. నేను అశక్తుడ్ని. లేకపోతే నేనే తీసుకొని వెళ్లేవాడిని..” అన్నారు రామకృష్ణ బాధగా.
“మా గురువుగారికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితం ఆయన పెట్టిన భిక్షే. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆయన ఋణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. అటువంటిది ఇంత చిన్న పనిని ఆయనకోసం చేయలేనా? తప్పకుండా చేస్తాను. పది రోజులు సెలవు పెడతాను. ఆయన ఎక్కడికి తీసుకు వెళ్లమంటే అక్కడికి తీసుకెళ్తాను. మీరు నాకు మంచి ఉపకారం చేశారు రామకృష్ణగారు థాంక్స్‌..” అన్నాడు సుధాకర్‌.

నాలుగు రోజులయ్యాకా ఒక ఉదయం మాస్టారు ఇంటికి వచ్చాడు సుధాకర్‌. “మాస్టారూ.. నాకు ప్రమోషన్‌ వచ్చాక కాశీ వచ్చి విశ్వనాథుడ్ని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. మీరు కూడా వస్తే నాకు ఆనందంగా ఉంటుంది. మీరు కాదనరనే ధైర్యంతో రెండు ఫ్లయిట్‌ టికెట్లు కూడా తీసుకున్నాను..” వినయంగా అన్నాడు.
మాస్టారు పక్కనే ఉన్న రామకృష్ణ, “వెంకటరమణగారు.. మీకు మంచి అవకాశం వచ్చింది. సుధాకర్‌ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. కాదనకండి, కాశీకి వెళ్లి రండి” అని ధైర్యం చెప్పారు.
ఇద్దరి మాటల్నీ కాదనలేక పోయారు మాస్టారు. పైగా అది తన చిరకాల వాంఛ. అందుకే “సరే” అన్నారు.
వెంకటరమణగారి బ్యాగ్‌ సర్దుకోవడంలో రామకృష్ణ సాయం చేశారు. సుధాకర్‌ కారులోనే ఇద్దరూ విజయవాడ వెళ్లి, విమానంలో కాశీకి చేరుకున్నారు.
మాస్టారు కోరిక మేరకు ఆంధ్రాశ్రమంలో దిగారు. కిందనే రెండు ఏసీ రూములు తీసుకున్నాడు సుధాకర్‌.
మర్నాడు ఉదయాన్నే లేచి కేదార్‌ఘాట్‌కి వెళ్లి, గంగలో స్నానం చేశారు మాస్టారు, సుధాకర్‌. అక్కడి జిల్లా ఎస్పీకి సుధాకర్‌ చెప్పడంతో వారికి సాయంగా ఒక కానిస్టేబుల్‌ వచ్చాడు. వాళ్లిద్దరి బ్యాగులను కానిస్టేబుల్‌ పట్టుకున్నాడు. సుధాకర్‌ భుజం మీద చేయి వేసి, హ్యాండ్‌ స్టిక్‌ సాయంతో నడుచుకుంటూ వెళ్లి కేదారేశ్వరుడ్ని దర్శనం చేసుకున్నారు మాస్టారు.
తర్వాత రూముకొచ్చి కాఫీలు తాగాకా, పోలీసు వాహనంలో విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళారు. గుడికి సమీపంలో కారు ఆపి, మాస్టారును దైవదర్శనానికి తీసుకు వెళ్లాడు సుధాకర్‌. సెక్యూరిటీ సిబ్బందికూడా ఎంతో సహకరించి మాస్టారుకు ఏ ఇబ్బందీ లేకుండా విశ్వనాథుడి దర్శనం చేయించారు. తర్వాత కాలభైరవుడి గుడికి వెళ్లి, ఇద్దరూ స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం దశాశ్వమేథ్‌ ఘాట్‌వద్ద గంగాహారతికూడా చూసి వచ్చారు.
మర్నాడు మాస్టారును టాక్సీలో గయ తీసుకొని వెళ్లాడు సుధాకర్‌. మాస్టారుచేత వారి నాన్నగారికి, బంధువులకు పిండప్రదానం చేయించాడు పండా. మాస్టారును క్షణక్షణం కనిపెడుతూ, ఆయన పక్కనే నిలబడి ఉన్న సుధాకర్‌ను పండా హిందీలో మెచ్చుకున్నాడు.
“నాన్నగారికి చేదోడువాదోడుగా ఉంటూ ఆయన చిరకాల వాంఛని నెరవేర్చిన ఉత్తమమైన కొడుకువు నువ్వు” అని అన్నాడు పండా.
ఆ మాట వినగానే మాస్టారు మొహంలో సన్నని నవ్వు వికసించింది.
సుధాకర్‌ వెంటనే, “పండిట్‌ జీ..” అని చెప్పబోతే, మాస్టారు వద్దని వారించారు. పండా ఇంట్లో భోజనం చేసి, మళ్లీ కాశీకి వచ్చారు ఇద్దరూ. తమ గదికి వచ్చాక సుధాకర్‌ను పిలిచి, దగ్గర కూర్చో పెట్టుకున్నారు మాస్టారు.
“సుధాకర్‌.. నా చిరకాల కోరిక నీ వల్ల తీరింది. నీకు నేను చాలా ఋణపడి ఉన్నానయ్యా..” అన్నారు భావోద్వేగంగా.
“మాస్టారూ! పేదరికంలో ఉన్న నన్ను ఉన్నత స్థాయికి తీసుకు వచ్చిన గురువు, మార్గదర్శకులు మీరు. ఎన్ని జన్మలెత్తినా నేనే మీ ఋణం తీర్చుకోలేను సార్‌..” వినయంగా అన్నాడు సుధాకర్‌.
మర్నాడు ఉదయం మరలా కేదార్‌ఘాట్‌కి వెళ్లి గంగలో స్నానం చేశారు మాస్టారు, సుధాకర్‌.
పొడిబట్టలు కట్టుకొని సూర్యుడికి నమస్కారం చేశారు మాస్టారు. సుధాకర్‌ సాయంతో నెమ్మదిగా నడుస్తూ, అతని భుజం మీద తల వాల్చేసారు. సుధాకర్‌ కంగారుగా డాక్టర్‌ను తీసుకొని రమ్మని కానిస్టేబుల్‌ను ఆదేశించాడు.
యాత్రికుల సాయంతో మాస్టారును నెమ్మదిగా ఘాట్‌లోని చపటామీద పడుకోబెట్టాడు.
కాసేపటికి కానిస్టేబుల్‌ డాక్టర్‌ను తీసుకుని వచ్చాడు. డాక్టర్‌ మాస్టార్ని పరీక్షించి, చనిపోయారని చెప్పారు. ఆ మాట వినగానే సుధాకర్‌ చాలాసేపు దుఃఖించాడు. మాస్టారు పిల్లలకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఫోన్‌కోసం ఆయన చొక్కా జేబు వెతికితే ఒక ఉత్తరం కనిపించింది. అందులో..
‘చిరంజీవి సుధాకర్‌ను దీవించి వ్రాయునది. ఒకవేళ నేను అనుకోని పరిస్థితుల్లో కాశీలో మరణిస్తే, కొడుకుగా నువ్వే ఆ బాధ్యతను చేపట్టి, ఇక్కడే ఆ కార్యక్రమం పూర్తి చేయాలని కోరుతున్నాను. నా పిల్లలకోసం చూడవద్దు! ఇట్లు.. వెంకటరమణ.’
ఉత్తరం చదివిన సుధాకర్‌, మాస్టారువైపు రెప్పవేయకుండా చూడసాగాడు.
ఎందుకో అతనికి మాస్టారు అమ్మగారి పేరు గుర్తుకు వచ్చింది.
ఆమె పేరు.. గంగారత్నం!

ఎం.ఆర్‌.వి. సత్యనారాయణ మూర్తి
కవి, రచయిత, వ్యాఖ్యాత, నటుడు, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నారు ఎం.ఆర్‌.వి. సత్యనారాయణ మూర్తి. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. 1951 సెప్టెంబర్‌ 30న జన్మించారు. ఇప్పటివరకూ 250 కథలు, 300 కవితలు ప్రచురించారు. అక్షర భారతం, సమైక్య భారత్‌ పేరుతో రెండు నాటికలు రాశారు. 10 కథా, ఏడు కవితా సంపుటాలను వెలువరించారు. అనేక కవితలు ఆంగ్లం, ఉర్దూ, కన్నడంలోకి, పలు కథలు కన్నడంలోకి అనువాదమయ్యాయి. 30 కథలు, 30 ప్రసంగాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. 25 నాటికలకు గాత్రాన్నీ అందించారు. వీరు గాత్రధారణ చేసిన ‘అన్వేషణ’ ఆకాశవాణి నాటకం, జాతీయస్థాయిలో ‘తృతీయ బహుమతి’ని పొందింది. సాహిత్యసేవకు గౌరవంగా, 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ‘గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా పురస్కారం’ వరించింది. వివిధ సాహిత్య సంస్థలనుంచి 15 పురస్కాలు, మరెన్నో సన్మానాలు పొందారు. ‘రమ్య సాహితీ సమితి’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1986 నుండి అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి సంపాదకత్వంలో మరో 19 పుస్తకాలు ప్రచురితమైనాయి.

-ఎం.ఆర్‌.వి. సత్యనారాయణ మూర్తి, 98486 63735

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఋణం

ట్రెండింగ్‌

Advertisement